Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ - second chief of rss guruji life

ద్వితీయ సర్ సంఘచాలక్ - పూ|| గురూజీ ఆద్య సర్ సంఘచాలక్ డా|| కేశవ బలిరాం హెడ్లేవార్ స్వర్గస్థులైన వెంటనే వారి కోరిక ప్రకారం శ్రీ మాధవస...

ద్వితీయ సర్ సంఘచాలక్ - పూ|| గురూజీ


ఆద్య సర్ సంఘచాలక్ డా|| కేశవ బలిరాం హెడ్లేవార్ స్వర్గస్థులైన వెంటనే వారి కోరిక ప్రకారం శ్రీ మాధవసదాశివ గోళ్వల్కర్ సర్ సంఘచాలక్ అయ్యారు. కాశీలో వారు అంతకుముందే గురూజీగా ప్రసిద్ధి కెక్కారు. శాలివాహనశకం 1827 మాఘబహుళ ఏకాదశీ సోమవారంనాడు గురూజీ జన్మించారు. ఆంగ్ల సంవత్సరం ప్రకారం అది 1906, ఫిబ్రవరి 19వ తేది జన్మించారు, గురూజీ తండ్రి పేరు సదాశివ, తల్లి పేరు లక్ష్మీబాయి.

తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవుచున్నందు వలన గురూజీ ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసము అనేక స్థలాలలో జరిగింది.నాగపూర్ నందలి హిస్లాప్ కళాశాలలో ఇంటర్ సైన్సు పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత విద్యాభ్యాసాన్ని కాశీ విశ్వవిద్యాలయంలో కొనసాగించారు. అక్కడ కూడ జంతుశాస్త్రంలో యమ్.యస్.సి. పట్టా 1928లో పుచ్చుకొన్నారు. కాశీ విశ్వవిద్యాలయం నందు జంతుశాస్త్ర ఆచార్యుని (ప్రొఫెసర్)గా 1930లోనియుక్తి అయ్యారు. అప్పటి నుండే విద్యార్థులు అందరూ వారిని ప్రేమతో గురూజీ అని పిలిచేవారు. ఆవిధంగా గురూజీ అనే పేరు అక్కడే వచ్చింది.

కాశీలో వున్నపుడే సంఘంతో దగ్గరి సంబంధం ఏర్పడినది. కాశీలోనే వారికి డాక్టర్జీతో పరిచయం ఏర్పడింది. ఆచార్యునిగా రెండు సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత నాగపూర్ తిరిగి వచ్చి న్యాయశాస్త్ర పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే న్యాయవాద వృత్తిని ఎప్పుడూ చేపట్టలేదు.ఈ సమయంలో వారు ఆధ్యాత్మికతవైపు ఆకర్షితులయ్యారు. నాగపూర్ లోని రామకృష్ణ మఠానికి వెళుతూ వుండేవారు. డాక్టర్జీతో కూడ దగ్గరి సంబంధం పెరుగుతూ వుండింది. చివరకు ఆధ్యాత్మిక ప్రభావం అధికమైనందు వలన బెంగాల్ లోని సారగాళీ ఆశ్రమానికి వెళ్ళారు. స్వామి వివేకానందతోపాటు శ్రీ రామకృష్ణ పరమహంసను సేవించిన స్వామి ఆఖండానంద ఈ సారగాధీ ఆశ్రమానికి ప్రముఖేగా వున్నారు. వారి నుండి గురూజీ సన్యాసదీక్ష స్వీకరించారు. స్వామి అఖండానందజీ స్వర్గస్థులైన తర్వాత గురూజీ నాగపూర్ తిరిగి వచ్చారు.

అప్పుడు డాక్టర్జీ వారితో సంబంధాన్ని పెంచుకున్నారు. 1938లో నాగపూర్లో జరిగిన సంఘ శిక్షా వర్గకు సర్వాధికారిగా శ్రీ గురూజీని నియమించారు. 1939లో వారికి సర్ కార్యవాహ బాధ్యతను అప్పగించారు. డాక్టర్జీ స్వర్గస్తులయిన తరువాత జూన్ 29, 1940లో శ్రీ గురూజీ సర్ సంఘచాలక్గా బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా ముప్ఫైమూడు సంవత్సరాలు శ్రీగురూజీ సర్సంఘచాలక్గా వున్నారు, వారు సర్ సంఘచాలక్గా వున్న సమయంలో 1948వ సంవత్సరంలో సంఘం చాలా కష్టాలకు గురైంది. మహాత్మాగాంధీ హత్యారోపణతో సంఘాన్ని నిషేధించిన సంవత్సరం అది. అయితే గురూజీ దృఢమైన, కుశల నేతృత్వం వలన సంఘం ఆ అగ్ని పరీక్ష నుండి క్షేమంగా బయటపడింది.

ఈ ముప్ఫైమూడు సంIIలలో సంఘం చాల విస్తరించింది. అన్ని జిల్లాలకు సంఘం వ్యాపించింది. సంఘకార్య ప్రభావము స్వాభావికంగా సమాజ జీవనంలోని అన్నిరంగాలలో కనబడటం ప్రారంభమైంది. విద్యార్థి పరిషత్, భారతీయ జనసంఘ్, భారతీయ మజ్జూర్ సంఘ్, వనవాసీ కళ్యాణ ఆశ్రమం, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు వీరి సమయంలోనే ప్రారంభించబడినాయి. విశ్వవిభాగ్ కు కూడ వీరి సమయంలోనే ఒక నిశ్చిత రూపం లభించింది.

గురూజీకి 1971 నుండి కేన్సర్ వ్యాధి సోకినదనే విషయం స్పష్టమైనది. ముంబయిలో వారికి చికిత్స జరిగింది. శస్త్ర చికిత్స తరువాత కొద్దికాలం విశ్రాంతి తీసుకుని మరలా దేశమంతటా పర్యటించారు. కాని 1973 మార్చిలో జరిగిన అఖిలభారత ప్రతినిధి సభ తరువాత వారి ఆరోగ్యం మరింత క్షీణించసాగినది. చివరకు 1973,జూన్ 5న నాగపూర్ లో గురూజీ స్వర్గస్థులయ్యారు.

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ ల గురించి లింకులు క్రింద ఇవ్వబడినవి


ఆర్ ఎస్ ఎస్ స్థాపకుడి జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ తృతియ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ నాల్గవ సర్ సంఘచాలక్ ప్రొ. రాజేంద్రసింహజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ఐదవ సర్ సంఘచాలక్ కు.సీ. సుదర్శన్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ప్రస్తుత సర్ సంఘచాలక్ మోహన్ రావు భాగవత్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. Megaminds 6 Whatsapp group is full, please let us an update on this.

    ReplyDelete