Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అజీర్ణం, గ్యాస్, మల బద్దకం నివారణ కోసం యోగా ఆసనాలు - june 21 yoga day asanas for gastric problems

శరీరంలో జీర్ణవ్యవస్థ అతి పొడవైన (నోరు నుండి మలద్వారం వరకు) వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఆహారం పూర్తిగా జీర్ణ ము   అ వ్వటానికి 3 నుండి 72 గంటల వర...

శరీరంలో జీర్ణవ్యవస్థ అతి పొడవైన (నోరు నుండి మలద్వారం వరకు) వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఆహారం పూర్తిగా జీర్ణము  వ్వటానికి 3 నుండి 72 గంటల వరకు పడుతుంది. శాఖాహారం అయినప్పటికి వేపుళ్ళు చేయటంవలన అది జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది.
జీర్ణం ప్రతిరోజు సరిగా కాకపోవటం వలన ‘అజీర్ణం చేసింది’ అంటారు. అజీర్ణాన్ని వెంటనే సరిచేయకపోవటం వలన జీర్ణం కాని పదార్థం నుండి వాయువు వెలువడుతుంది. దానినే గ్యాస్‌ అంటారు. ఈ గ్యాస్‌ దీర్ఘకాలం ఉంటే ఎసిడిటిగా మారుతుంది (ఎసిడిటి అంటే ఛాతి భాగంలో సూదులతో గుచ్చినట్లుగా మంట లేదా నొప్పులు). గ్యాస్‌ వలన పాటుగా ‘మలబద్ధకం’ కూడా వస్తుంది.
కారణాలు : 
ఆహారాన్ని సరిగా నమలకుండానే మ్రింగటం
ఆకలి అయినప్పుడు కాకుండా, ఆకలి లేనప్పుడు అతిగా తినటం
ఆహారం తినేటప్పుడు మంచినీళ్ళు ఎక్కువగా త్రాగటం
ఆందోళన, ఆవేశం, బాధ, దిగులు, చిరాకు, మనస్సు ఒత్తిడితో ఉన్నప్పుడు భోజనం చేయటం
పొట్టు లేని ఆహార పదార్థాలు తీసుకోవటం వలన (fiber less)
భోజన సమయంలో అతి చల్లని పానీయాలు (Cool drinks) తీసుకోవటం
జాగ్రత్తలు :
సాధారణ నియమాల తోటే చాలావరకు జీర్ణకోశ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
1.     ఏ ఆహారం అయినా బాగా నమిలి మింగాలి
2.     నీటిని భోజన సమయంలో కాకుండా, భోజనానికి 30 నిముషాల ముందు, తిన్న 1 గంట తరువాత తాగాలి.
3.     భోజనమంత్ర జపం చేసి, మనసును ప్రశాంతంగా ఉంచకొని ‘అన్నప్రసాదం’గా భావించి తినాలి
4.     భోజనం తరువాత వజ్రాసనం 5 నుండి 10 నిముషాలు చేయటం మంచిది.
5.     రోజువారీ ఆహారంలో (అల్లం, జీలకర్ర, శొంఠి, మిరియాలు, ఇంగువ, వాము, బెల్లం) వాడాలి.
6.     శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత ఉండేట్లు చూసుకోవాలి.
యోగచికిత్స :
1. సూక్ష్మ వ్యాయామం
2. సూర్య నమస్కారాలు
యోగాసనాలు :
వజ్రాసనం
ఇది కూర్చుని అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    కుడి కాలును మడిచి కుడి తొడ క్రింద ఉంచాలి. మడిమ వెనుకకు చూస్తుంది.
2.    ఎడమ కాలును కూడా మడిచి, ఎడమ తొడ క్రిందకు తేవాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళ మడిమలపై కూర్చుంటాము.
3.    రెండు చేతులు తొడలపై పెట్టాలి. ఈ స్థితిలో శరీరం నిటారుగా అవుతుంది.
4.    ఎడమకాలును ఎడమ తొడ కింద నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి.
5.    కుడికాలును కూడా కుడి తొడ నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి. విశ్రాంతి పొందాలి.
లాభాలు : వెన్నుముకను నిటారుగా చేయడం వలన బద్ధకం వదులుతుంది. మడిమలు, పిక్క కండరాలలో నొప్పులు తగ్గుతాయి. పాదాల కండరాలు వదులయి, పాదాలు వంగలేని స్థితి నివారణ అవుతుంది. తిన్న తరువాత కూడా వేసే ఏకైక ఆసనం వజ్రాసనం.
యోగముద్ర
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    పద్మాసనంలో కూర్చోవాలి.
2.    నడుము ముందుకు వంచి, రెండు చేతులు వీపు వెనక్కు పోనిచ్చి, ఎడమ చేత్తో కుడి మణికట్టును పట్టుకోవాలి.
3.    ఇంకా ముందుకు వంగి నుదురును నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. ఇది సంపూర్ణ స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండాలి.
4.    చేతులు తీసి, నడుము లేపి, 1 వ స్థితికి రావాలి.
5.    పద్మాసనం నుండి బయటికి వచ్చి, విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా మరోకాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : ఈ ఆసనంతో ఉదర వ్యాధులూ, వీర్య సంబంధ బలహీనతలూ తగ్గుతాయి. నరాలు శక్తిని పొందుతాయి.
పశ్చిమోత్తనాసం
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    శ్వాస పీలుస్తూ రెండు చేతులను చాపి పైకెత్తాలి. భుజాలు చెవులకు తాకుతాయి. నడుం నుండి పైభాగం పైకి నిటారుగా ఉంటుంది.
2.    శ్వాస వదులుతూ, చేతులతో సహా నడుం పైభాగం వంచుతూ పూర్తిగా చాచి ఉన్న కాళ్ళమీదకు కిందకు వంగాలి. చేతులు నేలకు సమాంతరంగా చాపాలి.
3.    చేతి వేళ్ళతో కాళ్ళ బొటన వేళ్ళని పట్టుకుని ఇంకాస్త ముందుకు వంగాలి. వీపును సాగదీయాలి. నుదురు మోకాళ్ళను తాకాలి. మోకాళ్ళు వంచరాదు. శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి.
4.    చేతులని విడిచి, చేతులతో సహా నడుం పైభాగాన్ని పెకెత్తి నిటారుగా రావాలి.
6.     శ్వాస వదులుతూ, చేతుల్ని కిందికి దించుతూ, స్థితిలోకి వచ్చి విశ్రాంతి పొందాలి.
లాభాలు : కాలేయం, జఠరగ్రంథి లకు శక్తి వస్తుంది. పొట్ట భాగం దృఢమవుతుంది. అజీర్ణం, మలబద్ధకం, పుంసత్వ సమస్యలు, మొలలు నివారణ అవుతాయి. సుషుప్తావస్థలోని ఆధ్యాత్మిక శక్తులు మేల్కొంటాయి.
సూచన : రక్తపోటు, నడుంనొప్పి స్పాండిలైటిస్‌ ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
మత్స్యాసన్‌
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    పద్మాసనం భంగిమలో వలె రెండు కాళ్ళను ఒకదాని తొడలపైకి మరొక దానిని తేవాలి.
2.    ఆ స్థితిలో వెనక్కు వాలి నేలపై పడుకోవాలి.
3.    అరచేతులు నేలపై అదుముతూ, తల, ఛాతీ పైకి లేపాలి. ఈ స్థితిలో వెన్ను విల్లులా అవుతుంది.
4.    చేతులు నేలపై నుంచి తీసి చూపుడు వేళ్ళతో కాలిబొటన వ్రేళ్ళను కొక్కెంలా చుట్టి పట్టుకోవాలి. మోచేతులు నేలకు ఆని ఉంటాయి. శరీర బరువు మోచేతులపై పడుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5.    కాలి వేళ్ళను వదిలి, చేతులను నేలపై మోపి, వాటి ఆధారంగా ఛాతీని, తలను నేలకు దించాలి.
6.    వెనక్కు వాలి పడుకున్న స్థితి నుండి లేచి కూర్చోవాలి. కాళ్ళు పద్మాసన భంగిమలోనే ఉంటాయి.
7.    పద్మాసన భంగిమ నుండి కాళ్ళను విడదీసి, ముందుకు చాపి, విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా రెండవ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : మెదడుకు రక్తప్రసరణ జరిగి థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేస్తుంది. శరీరం, మనసు చాలా తేలికవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
సూచన : శరీరం బరువు వెన్ను, మెడపై కాకుండా మోచేతులపై ఉంచాలి. రక్తపోటు వున్నవారు ఈ ఆసనం చేయరాదు.
పవన ముక్తాసనం
స్థితి : వెల్లకిలా పడుకుని రెండు కాళ్ళు చాపాలి, రెండు పాదాలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    మోకాళ్ళు వంచి వాటిని చేతులతో చుట్టి పట్టుకొని శ్వాస వదిలి మోకాళ్ళతో పొట్టను నొక్కాలి.
2.    తల ఎత్తి గడ్డాన్ని మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయాలి.
3.    ఇదే స్థితిలో కుడి ప్రక్కకు, ఎడమ ప్రక్కకు దొర్లాలి. తర్వాత పూర్ణస్థితికి వచ్చి శ్వాస తీసుకోవాలి.
లాభాలు : పొట్టలో పేరుకున్న వాయువు, దుర్గంధం బయటికి వెళ్లిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. కాలేయానికి హృదయానికి శక్తి వస్తుంది.
ఉత్థాన పాదాసన్‌
స్థితి : వెల్లకిలా పడుకుని రెండు కాళ్ళు చాపాలి, రెండు పాదాలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.    రెండు కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా, నేలపై నుండి ఒక అడుగు ఎత్తులేపి ఆపాలి. కళ్ళు ముసుకుని ఉండాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండాలి.
2.    కొంతసేపటికి బొడ్డు కింద భాగం కండరాలు అలసిపోయి కాళ్ళ బరువును మోయలేక వదిలేస్తాయి. అప్పుడు కాళ్ళు దించి, విశ్రాంతి పొందాలి.
లాభాలు : పొట్టలోని కొవ్వు రుగుతుంది. పొట్ట పేగులు, కండరాలు బలపడతాయి.
భుజంగాసన్‌
 స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1.     రెండు చేతులనూ వంచి, అరచేతులను పక్కటెముకల పక్కన ఉంచాలి.
2.    నెమ్మదిగా తలను, ఛాతిని కొద్దిగా పైకిలేపి ఉంచాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.    ఛాతి, తలను కిందికి తెచ్చి, గడ్డాన్ని నేలకు ఆనించాలి.
4.    చేతుల్ని చాచి, స్థితికి రావాలి. కాళ్ళ మధ్య దూరం పెంచి విశ్రాంతి పొందాలి.
లాభాలు : మెడ కండరాలు, వెన్నునరాలు వదులయి, బలంగా అవుతాయి. మెడ, వీపు నొప్పి, జీర్ణవ్యాధులు, పొట్టలోని కొవ్వు తగ్గుతాయి.
సూచన : హెర్నియా, రక్తపోటు వున్నవారు ఈ ఆసనం వేయరాదు.
శలభాసన్‌
ఇది బోర్లా పడుకుని అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1.    బొటన వేళ్ళను లోపల ఉంచి, చేతి పిడికిళ్ళను మూసి పొత్తికడుపు కింద ఉంచాలి.
2.    శ్వాస తీస్తూ, మోకాళ్ళను వంచకుండా రెండు కాళ్ళను కలిపి నెమ్మదిగా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో నడుం పైభాగం నుండి తల వరకు నేలకు ఆనే ఉంటుంది. గడ్డం నేలకు ఆని ఉంటుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి.
3.    శ్వాస వదులుతూ, నెమ్మదిగా కాళ్ళను కిందికి దించాలి.
4.    చేతి పిడికిళ్ళు సడలించి, కాళ్ళ మధ్య దూరం పెంచి, విశ్రాంతి పొందాలి.
లాభాలు : వీపుకు, మెడ కండరాలకు, పిరుదులు, తుంటి, కడుపు, తొడలు, కాళ్ళు మరియు మూత్ర పిండాలకు శక్తి వస్తుంది. శరీరం తేలికయి, చురుగ్గా వుంటుంది. మనోనిగ్రహం పెరుగుతుంది.
సూచన : మూత్రవ్యాధులు, హెర్నియా లాంటివి ఉన్నవారు ఈ ఆసనం చేయరాదు.
ధనురాసన్‌
స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1.     మోకాళ్ళను వెనుకకు మడిచి, రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ స్థితిలో శరీరం వీపు వైపుగా వంగుతుంది.
2.     తలను, ఛాతీని పైకెత్తాలి. కాళ్ళను లాగి వెన్నెముక ధనుస్సు ఆకారంలో వంగునట్లుగా పైకెత్తి ఉంచాలి. చూపు పైకి ఉంటుంది. మోకాళ్ళు దూరం చేయరాదు. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.    నెమ్మదిగా తల, మెడ, ఛాతి ముందుకు తెచ్చి; చేతులు, కాళ్ళని వదిలాలి.
4.     కాళ్ళు, చేతులు చాపి, స్థితికి రావాలి. కాళ్ళ మధ్య దూరం పెంచి విశ్రాంతి పొందాలి.
లాభాలు : శరీరం, వెన్నెముక చురుగ్గా అవుతాయి. నడుం నొప్పి తగ్గుతుంది. పిరుదులు వదులవుతాయి. పొట్టలో కొవ్వు కరుగుతుంది. జీర్ణక్రియ పెరిగి, మధు మేహం తగ్గుతుంది.
సూచన : హెర్నియా లాంటి వ్యాధులున్నవారు, బలహీనంగా ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
శవాసన్‌ లేదా అమృతాసన్‌
మెత్తటి దుప్పటిపై వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని, కాళ్ళు, చేతులూ దూరంగా ఉంచి శవం మాదిరిగా ఉంచాలి. తలను ఒక పక్కకు వాలి ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలను శిథిలం (స్పర్శ లేని స్థితి) చేయాలి. దీర్ఘ శ్వాస, నిశ్వాసలు చేస్తూ ఉండాలి. నిద్ర పోకూడదు. ఈ ఆసనంలో 10 నుండి 30 నిముషాల వరకు ఉండవచ్చు. అన్ని ఆసనాలు చేసిన తరువాత చివరిలో ఈ ఆసనం వేయాలి.
లాభాలు : శవాసన్‌ లేదా అమృతాసన్‌ అని పిలిచే ఈ ఆసనంలో శరీరానికి, మనస్సుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు తేలికవుతాయి. మనస్సు తేలికవుతుంది. రక్తప్రసరణ, గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గుతుంది. అన్ని అవయవాలకు చక్కటి విశ్రాంతి లభించి, కొత్త శక్తిని సంతరించుకుంటాయి. వత్తిడితో వచ్చే అధిక రక్తపోటు, తలపోటు వంటివి ఉపశమిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరానికి అమృతం లభిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఈ ఆసనం వేసిన తరువాత అంత హాయిగా, తేలికగా ఉంటుంది. అందుకే దీనిని అమృతాసన్‌ అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని అన్ని వయసుల వారు, అందరూ చేయవచ్చు.
గమనిక : పైన సూచించిన అన్ని ఆసనాలు మొదటి రోజునే చేయరాదు. రెండు మూడు రోజులకు ఒక ఆసనం పెంచుకుంటూ పోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. జీవితాంతం చేస్తే ఉన్న వ్యాధులు నివారణ అవడమే కాక, వ్యాధులు రాని స్థితి కూడా పొందవచ్చు. కాబట్టి నిదానంగానే చేయాలి.
మరొక విషయం ఏంటంటే, వ్యాయామం ప్రారంభంలోనే ఈ యోగాసనాలు వేయరాదు. యోగాసనాలు చేయడానికి ముందుగా శరీరాన్ని సిద్ధం చేయాలి. అందుకు ముందుగా సూక్ష్మ వ్యాయామం, శిథిలీకరణ వ్యాయామం చేయాలి. కొన్ని సూర్యనమస్కారాలు కూడా చేయాలి. ఈ ప్రక్రియను ప్రతిరోజూ పాటించాల్సిందే.
ప్రాణాయామం
1. కపాల భాతి
2. భస్త్రిక
3. నాడీ శుద్ధి ప్రాణాయామం
4. భ్రామరి
ధ్యానం :
1. నాద అనుసంధాన
క్రియలు :
1. శంఖ ప్రక్షాళన
2. వమన ధౌతి


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment