GenZ యువత ఇప్పుడు దేశంలో ఎటువంటి కలలు కంటున్నారో తెలుసా? ఇది చదివితే తప్పనిసరిగా మీలోనూ మార్పు సహజంగా వస్తుంది...
అబ్దుల్ కలాం గారు కలలు కనండి వాటిని సాకారం చేయండి అన్నారు. బహుశా బెంగుళూరులో కపిల్ శర్మ కూడా ఒక కల కన్నారు, ఆ కల తనకోసం కనలేదు భూమాత కోసం కన్నారు, భూమాత తాపం, దాహం తీర్చాలనుకున్నారు, చివరకు చేసి చూపుతున్నారు, అదేంటో ఈ వ్యాసంలో చూద్దాం...
పూర్వం బెంగళూరును “సరస్సుల నగరం” అని పిలిచేవాళ్లు ఆపిలుపు దాదాపు అందరూ మరచిపోయారు. ఇప్పుడు బెంగుళూరు నగరం నీటి కొరతతో, వరదలతో, ఎండిపోయిన భూగర్భ జలాలతో పేలవంగా భూమాత తాపంతో విలవిలలాడుతోంది. మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. అప్పుడే ఒక ఆలోచన మొదలయ్యింది, ఓ సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రాయపూర్ నుంచి వచ్చిన కపిల్ శర్మ, ఆ నగరానికి మాత్రమే కాదు, దేశమంతటికీ కొత్త ఆశాకిరణం అయ్యారు. ఆయన చేసిన అధ్బుతంతో బెంగుళూరు కొంతైన నీటితో పచ్చదనం పెరుగడం మొదలయ్యింది.
2001లో ఇంజనీరింగ్ చదువుకోవడానికి బెంగళూరు వచ్చిన కపిల్ శర్మకు నగరం మొదటే తనకు బాగా నచ్చేసింది, ప్రేమలో పడేసింది. రోడ్లకిరువైపులా భారీ చెట్లు, చల్లని గాలులు… కానీ కొన్నేళ్లలోనే మెట్రో, రోడ్ల విస్తరణ పేరుతో రాత్రికిరాత్రి చెట్లు నరికేయడం చూసి ఆయన గుండె పగిలిపోయింది. “ఇలా అయితే బెంగళూరు కూడా సాధారణ సిమెంట్ జంగిల్ అవుతుంది” అని ఆయన భయపడ్డారు. ఆ భయమే 2007లో “సేట్రీస్ ఎన్విరాన్‌మెంటల్ ట్రస్ట్”గా మారింది.
ఒకే ఒక మొక్క నాటడంతో మొదలైన ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమం. గోల్డ్‌మన్ సాక్స్‌లో సీనియర్ టెక్ లీడ్‌గా పనిచేస్తూ, అమెరికాలో ఉంటూ కూడా కపిల్ ఈ కలను వదలలేదు. ఇప్పటివరకు 38 లక్షలకు పైగా చెట్లు నాటారు, 150కి పైగా మియావాకీ ( ఇది జపాన్ పదం: మియావాకీ అడవి అంటే చిన్న ప్రదేశంలో వేగంగా పెరిగే, గట్టిగా దట్టమైన, స్థానిక చెట్లతో తయారయ్యే అడవి. పట్టణాల్లోని ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్న అడవులు సృష్టించడానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నిక్‌ను వాడుతున్నారు. దీనిపై కూడా ఒక పెద్ద వ్యాసమే వ్రాయవచ్చు అంత సబ్జెక్ట్ వుంది.) అడవులు సృష్టించారు. ఇవి సాధారణ అటవీకరణ కంటే 10 రెట్లు వేగంగా పెరిగి, భూగర్భ జలాలను త్వరగా పెంచుతాయి.
2017 నుంచి నీటి సంరక్షణపై పూర్తి దృష్టి పెట్టిన సేట్రీస్ ఇప్పటివరకు 60కి పైగా సరస్సులు, 40 బావులు పునరుజ్జీవింపజేసింది. 2025లో మాత్రమే 29 సరస్సులు పూర్తి చేశారు. ప్రతి సరస్సును శుభ్రం చేసి, వెట్‌ల్యాండ్స్, సెడిమెంటేషన్ పాండ్స్, వాకింగ్ ట్రాక్స్, బయోడైవర్సిటీ పార్కులుగా మారుస్తున్నారు.
బెంగళూరులో చూడసంద్ర లేక్ (23 ఎకరాలు) ఒక ఉదాహరణ. మునుపు మురుగునీటి ఒడ్డుగా ఉండే ఈ సరస్సు ఇప్పుడు పక్షుల ఆవాసం, పిల్లల ఆటస్థలం, పెద్దలకు సరదాగా విశ్రాంతి లభించే ప్లేస్ గా మారింది. ఇలాంటి మార్పు దాదాపు 50 బిలియన్ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని తిరిగి ఇచ్చింది.
కపిల్ యొక్క అసలు మాయ ఆయన “త్రీ P ఫార్ములా”: ప్రాజెక్ట్-పీపుల్-పైసా. కార్పొరేట్ సంస్థలు (ఇన్ఫోసిస్, డెల్, బాష్, మెర్సిడెస్, అమెజాన్) సీఎస్ఆర్ నిధులు ఇస్తాయి. స్థానికులు నిర్వహణ చేస్తారు. సామాన్య ప్రజలకు ఈ పనిలో భాగస్వామ్యం చేస్యారు. ఈ ఫార్ములాతోనే బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు విస్తరణ జరిగింది.
హైదరాబాద్‌లోనూ సేట్రీస్ అతిపెద్ద కాంక్రీట్ జంగిల్ లోకి దిగింది. 2025లో కేవలం నాలుగు నెలల్లోనే రెండు పెద్ద సరస్సులు పునరుజ్జీవింపబడ్డాయి. కొత్తూరు ప్రాంతంలోని సాయి రెడ్డి లేక్, గోదుమకుంట లేక్ (19 ఎకరాలు). సాయి రెడ్డి లేక్ ఏప్రిల్ 2025లో పొడిభూమిగా ఉండగా, ఆగస్టుకల్లా 188 మిలియన్ లీటర్ల నీటియో నిండింది. రైతులకు సాగునీరం, గ్రామస్తులకు నీటి భద్రత, ఇది ఒక చిన్న అద్భుతం.
గోదుమకుంట లేక్ కూడా అదే కథ. ఎండిపోయిన భూమి నుంచి నిండు సరస్సుగా మారింది. ఈ రెండు సరస్సులూ హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజల జీవితాలను మార్చేశాయి. భూగర్భ జలాలు పైకి వచ్చాయి, పంటలు పచ్చగా ఎదిగాయి, పక్షులు తిరిగి వచ్చాయి. ఇది బెంగళూరు మాత్రమే కాదు, తెలంగాణలో కూడా సాధ్యమే అని కపిల్ నిరూపించారు.
2025 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ “మన్ కీ బాత్”లో కపిల్ శర్మను, సేట్రీస్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. “పౌరుల చొరవతో నడిచే ఈ ఉద్యమం దేశానికే ఆదర్శం” అని మోదీ అన్నారు. ఆ మాటలు కపిల్ బృందానికి కొత్త ఆడలు చిగురించాయి, మరింత వేగాన్ని పుంజుకునేట్లు చేశాయి.
ఈ ప్రయత్నాలతో దాదాపు 50 బిలియన్ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం తిరిగి వచ్చింది. వరదలు తగ్గాయి, భూగర్భ జలాలు పైకి వచ్చాయి, పక్షులు, జీవవైవిధ్యం తిరిగి వచ్చాయి. ఇప్పుడు 15 రాష్ట్రాల్లో సేట్రీస్ పనిచేస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్, పూణే, రాయపూర్ వరకు విస్తరించారు.
కపిల్ లక్ష్యాలు భారీవి: 2035 నాటికి 100 కోట్ల చెట్లు, 300 సరస్సులు, 100 బిలియన్ లీటర్ల నీటి నిల్వ. ఇప్పటికే లక్షల మంది వాలంటీర్లు, వందల కార్పొరేట్ సంస్థలు ఆయనతో కలిసి నడుస్తున్నాయి. “ప్లానెట్‌ను కాపాడటం ఒక్కడి పని కాదు, అందరూ కలిసి చేయాలి” అని ఆయన అంటారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల ద్వారా నడపబడుతున్న Youth For Seva సంస్థ కూడా గత దశాబ్ద కాలంగా బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ఇండోర్ లాంటి ప్రదేశాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సుమారు 20 చెరువులు పైన హైదరాబాద్ లో శుభ్రపరచడం జరిగింది. అలాగే వేలాది మంది ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు పంచపరివర్తనలో భాగమైన పర్యావరణం ని కాపాడటానికి దేశం మొత్తం లక్షలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ Awareness in Action గా మారిపోయారు.
కపిల్ శర్మ లాంటి ఒక సామాన్య ఇంజనీర్ ఒంటరిగా మొదలుపెట్టిన చొరవ ఇప్పుడు దేశమంతా ఆశాకిరణం అయింది. బెంగళూరు, హైదరాబాద్, ఇంకా ఎన్నో నగరాలు అన్నీ మళ్లీ పచ్చగా, నీళ్లతో మెరవబోతున్నాయి. ఒక్క మనిషి నమ్మకం, చిన్న చొరవ ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో! మీరూ ఒక మొక్క నాటండి. మనదేశంలో GenZ యువత దేశాన్ని అద్బుతంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందనడానికి ఇదోక ఉదాహరణ మాత్రమే... -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
MegaMinds Raja, SayTrees, Kapil Sharma, SayTrees NGO, Kapil Sharma environment, Kapil Sharma tree plantation, SayTrees plantation drive, Kapil Sharma sustainability, SayTrees India, Kapil Sharma CSR, SayTrees afforestation, Kapil Sharma charity, SayTrees urban forestry, Kapil Sharma green initiative, SayTrees volunteers, Kapil Sharma social work, SayTrees Bengaluru, Kapil Sharma climate action, SayTrees reforestation, Kapil Sharma NGO support, SayTrees campaign

