బ్రెజిల్ మెకానికల్ ఇంజనీర్ జోనాస్ మసెట్టి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసా?
మనకందరికి ప్రాల్ బ్రంటన్ గురించి మాత్రమే తెలుసు కానీ అలాంటి కోవకు చెందిన వారే ఈ తరం జోనాస్ మాసెట్టి కూడా ఈ రోజు వారి జీవితం ఎలా మారిందంటే యావత్ బ్రెజిల్ దేశాన్నే కదిలించే విధంగా వారు పనిచేస్తున్నారు. హిందూ ధర్మం యొక్క గొప్పతనం విశ్వవ్యాప్తం అవుతుంది, అప్పుడెప్పుడో వేల ఏళ్ల క్రితం కాదు, మారలా భారత్ విశ్వగురువుగా ఎలా మారుతుందో ఈ వ్యాసం లో చూద్దాం... ఆర్దికంగా మనం ఒకటో స్థానంలో ఉన్నా లేదా పదో స్థానంలో ఉన్నా మనం ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తేనే భారత్ విశ్వగురువవుతుంది. లేదంటే ప్రపంచమే నాశనమవుతుంది.
బ్రెజిల్‌లోని బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1980 జన్మించిన జోనాస్ మసెట్టి, 2003 లో మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical Engineering)లో డిగ్రీ పొంది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారి మనసు ఎప్పుడూ భౌతిక సౌఖ్యాలకు మాత్రమే పరిమితం కాలేదు. జీవితంలో నిజమైన అర్థం కోసం ఆరాటపడుతూ ఉండేది. 2000 సంవత్సరం ప్రారంభంలోనే భారతీయ తత్త్వశాస్త్రం వైపు ఆకర్షితులయ్యారు.
2004లో బ్రెజిల్‌లోనే ఒక భారతీయ గురువు ద్వారా వేదాంతంతో పరిచయమైంది. ఆ తర్వాత బ్రెజిల్‌కే చెందిన ప్రఖ్యాత విదుషీ (సంస్కృతం లో పండితురాలు) గ్లోరియా అరీరా (Gloria Arieira) శిష్యరికంలో చేరి, లోతైన అధ్యయనం చేశారు. ఆమె ద్వారానే అద్వైత వేదాంతం యొక్క సూక్ష్మాలు అర్ధం చేసుకున్నారు.
2010లో భారతదేశానికి వచ్చి, కోయంబత్తూరులోని అర్ష విద్యా గురుకులంలో పూజ్య స్వామి దయానంద సరస్వతి పాదాల చెంత దీర్ఘకాలం సంస్కృతం, ఉపనిషత్తులు, భగవద్గీత అభ్యసించారు. సంప్రదాయబద్ధంగా గురుకుల విద్యను అందుకుని, అద్వైత సిద్ధాంతంలో ప్రావీణ్యం సాధించారు. ఆ గురుకులంలోనే అతనికి “విశ్వనాథ్” అనే ఆధ్యాత్మిక నామకరణం జరిగింది.
భారతదేశంలో గడిపిన కొద్ది సంవత్సరాల్లోనే జోనాస్ ఆధ్యాత్మికంగా మారిపోయారు. ఎప్పుడూ చెప్పులు ధరించకుండా, రుద్రాక్ష మాల, పట్టు ధోవతి ధరించి, సన్యాసి వలే జీవించారు. జొనాస్ విశ్వనాథ్ ను ఈ రూపంలోనే అందరూ గుర్తిస్తున్నారు.
భారత్ నుంచి తిరిగి బ్రెజిల్‌కు వెళ్లిన తర్వాత, పెట్టీలోనే “విశ్వ విద్యా గురుకులం” (Vishva Vidya Gurukulam) స్థాపించారు. పోర్చుగీసు భాషలో భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ వాసిష్ఠం బోధిస్తూ లక్షలాది మంది దక్షిణ అమెరికన్లను వేదాంత మార్గంలోకి తీసుకొచ్చారు.
వారి యూట్యూబ్ ఛానెల్ “Vedanta com Jonas Masetti”కు మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పోర్చుగీసు భాషలో ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల Spanish America ( స్పానిష్ భాష దేశాలు: లాటిన్ అమెరికా లోని 19 దేశాలు, బ్రెజిల్ మినహా) మొత్తంలోనూ వేదాంతం వ్యాప్తి చెందింది. ఒక బ్రెజిలియన్ ద్వారా సంస్కృత శ్లోకాలు పలుకుతూ గీతోపదేశం జరగడం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
2024 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో G20 సదస్సుకు వెళ్లినప్పుడు, జోనాస్ మసెట్టి (ఆచార్య విశ్వనాథ్)ను వ్యక్తిగతంగా కలిసారు. అక్కడ జోనాస్ బృందం సంస్కృతంలో రామాయణ ప్రదర్శన ఇచ్చింది. మోడీ జీ దీనిని చూసి “భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు” అని ఎంతో ప్రశంసించారు. అంతకు ముందు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా మోడీ జీ జోనాస్ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి, బ్రెజిల్‌లో భగవద్గీత, వేదాంతం వ్యాప్తి చేస్తునందుకు అభినందించారు. ఈ రెండు సంఘటనలు జోనాస్ జీవితంలో మరచిపోలేని మైలురాళ్లు.
ఆ తరువాత 2025లో భారత ప్రభుత్వం అతని కృషిని గుర్తించి, సాహిత్యం-విద్యా రంగంలో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకునేందుకు కూడా అతను చెప్పులు ధరించకుండానే రాష్ట్రపతి భవనానికి వెళ్లి అవార్డు అందుకున్నారు. ఆ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, కానీ అతని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు (తెలుగు వాళ్లు, వీళ్లకు రాజమౌళి, బోయపాటి, సుకుమార్ లేదా ఈ సినిమా హీరోలు అందుకునేదే కావాలి.).
జోనాస్ మసెట్టి భార్య బ్రెజిలియన్ మహిళ, ఆమె అసలు పేరు డెనిస్ కానీ ఆధ్యాత్మికంగా “మీనాక్షి” పేరుగా మార్చుకుంది. వీరిద్దరూ మధురై మీనాక్షి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఒక కుమారుడు కూడా ఉన్నాడు, కుటుంబ జీవితం సంతోషంగా, వేదాంత మార్గంలోనే సాగుతోంది. 2025 పద్మశ్రీ అవార్డు సమయంలో ఆమె కూడా అతనితో పాటు భారత్‌కు వచ్చారు.
“భారత్ నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది” అని ఇంటర్వ్యూలలో జోనాస్ చెబుతారు. బ్రెజిల్‌లో జన్మించినప్పటికీ, తన హృదయం భారతీయమే అని, ఇక్కడి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని వారి సంకల్పం.
వారి విద్యార్థులలో ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, యువత అందరూ ఉన్నారు. ఆధునిక జీవనంలో ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి కోసం వేదాంత మార్గాన్ని సులభంగా, శాస్త్రీయంగా వివరిస్తాడు. “భగవద్గీత మనస్సైన్స్” అని వారు పిలుస్తారు.
బ్రెజిల్‌లోని వారి గురుకులం ఇప్పుడు పదుల సంఖ్యలో శాఖలుగా విస్తరించింది. పోర్చుగీసు భాషలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్ఠం అనువాదాలు, వ్యాఖ్యానాలు ప్రచురించారు. దాదాపు 50 గంటలకు పైగా పాఠాలు ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
జోనాస్ ఒక్కడే కాదు ఇప్పుడు బ్రెజిల్‌లో వందల మంది పోర్చుగీసు మాతృభాషగా ఉన్న వేదాంత ఉపాధ్యాయులు తయారయ్యారు. దక్షిణ అమెరికాలో హిందూ తత్త్వశాస్త్రం యొక్క అతి పెద్ద అంబాసిడర్‌గా వారు మారారు.
చెప్పులు ధరించకుండా, రుద్రాక్ష మాల, ధోవతి ఈ బాహ్య రూపం అనేది కేవలం ఫ్యాషన్ కాదు, భారతీయ సంస్కృతి పట్ల అతని అపారమైన ప్రేమ, గౌరవం యొక చిహ్నం. ఒక బ్రెజిలియన్ ద్వారా భారత జ్ఞానం ప్రపంచమంతా వ్యాపించడం, ఇది నిజమైన సాంస్కృతిక విజయం. జోనాస్ మసెట్టి జీవితం, సనాతన ధర్మం యొక్క సార్వత్వాన్ని, సార్వత్రికతను మరోసారి నిరూపించింది. భారత్ మరల విశ్వగురు స్థానానికి అతిచేరువలో ఉందనడానికి ఈ కథ ఒక ఉదాహరణ మాత్రమే, మనమంతా మన సంస్కృతి దగ్గరగా జీవిద్దాం... జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds

