రెండు జింకల నుంచి రెండు వేల జింకల కథ: తమిళనాడు రైతు గురుసామి నిర్మించిన అభయారణ్యం
తమిళనాడు తిరుప్పూర్ జిల్లా, అవినాశి తాలూకాలోని పుదుపాళయం గ్రామం అది, వందేళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో ఒక రైతు నిర్ణయం అడవుల పునరుద్ధరణకు, సాదు జంతువుల సంరక్షణకు, సమాజంలో ప్రకృతి పట్ల గౌరవానికి నాంది పలికింది. ఆ రైతు పేరు ఆర్. గురుసామి. ఆయన కథ ఒక “వ్యక్తి” ఏకాగ్రతతో, దయతో, నిబద్ధతతో, ప్రకృతి పై ప్రేమతో చేస్తే ప్రకృతి ఎలా రమణీయంగా మారుతుందో ప్రపంచానికి చూపించిన అరుదైన ఉదాహరణ ఈ కథ. కౌశిక నది పరివాహక ప్రాంతంలో 1996–98 మధ్య కాలంలో వచ్చిన భయంకర కరువు సమయంలో అడవుల్లో నీటి కొరత పెరగడంతో, రెండు–మూడు చిత్తల్ జింకలు గ్రామానికి వలస రావడం ఈ అద్భుత గాథకు పునాది అయింది.గురుసామి రైతుగా సాధారణ జీవితం గడిపేవాడు. తన 60 ఎకరాల వారసత్వ భూమిలో 15 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, క్యాష్ క్రాప్స్ సాగు చేయడం, మరో 45 ఎకరాల భూమిని మేకలు, ఆవులకు మేత కోసం ఉపయోగించడం ఆయన జీవన విధానం. కానీ ఒక రోజు ఉదయం గడ్డిపొలాల్లో తన మేకల మధ్య రెండు ఆడ చిత్తల్ జింకలు, ఒక మగ జింక కనబడడంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. చుట్టుపక్కల రైతులు పంటల నష్టం భయంతో వాటిని తరిమేసినా, కుక్కలను విడిచి తరిమేసినప్పటికీ… గురుసామి మాత్రం అవి “సాదు జీవాలని” వాటిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. “అవి వచ్చి ఇక్కడే మేత మేస్తుంటే ఎందుకు తరిమేయాలి?” అన్న ఆలోచనతో ఆయన చేసిన ఈ చిన్న నిర్ణయం తరువాతి 30 సంవత్సరాలలో మహాప్రకృతి ఉద్యమంగా మారింది.
ఆ చిన్న జింకల కుటుంబం ఆయన పొలంలో ఆశ్రయం పొందడం ఆ సమయంలో వాటికి మాత్రమే కాదు, మొత్తం ప్రాంతానికి వరమైంది. మృగాల లేమి, తగిన ఆహారం, శాంతియుత వాతావరణం ఉండడంతో జింకల సంఖ్య వేగంగా పెరిగింది. 2000ల ప్రారంభంలో ఇవి వందల్లోకి చేరాయి. 2021 నాటికి 1,800 దాటాయి. 2025కు వచ్చేసరికే ఈ సంఖ్య 2,000కు చేరినట్లు అటవీ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని పబ్లిక్ వన్యప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో చిత్తల్ జింకలు లేవు. కానీ ఒక రైతు భూమిలో ఇది సాధ్యమైందంటే గురుసామి చూపిన కరుణ, అంకితభావాన్ని అంచనా వేయవచ్చు.
జింకల రాకతో ఆయన వ్యవసాయం చేసే భూమిని 15 ఎకరాల నుంచి 10 ఎకరాలకు తగ్గించుకుని, మొత్తం 50 ఎకరాలను పూర్తిగా జింకల అభయారణ్యంగా మార్చాడు. ఈ భూమిలో ఆయన చెట్లను నాటాడు, సహజ పచ్చిక బయళ్ళను అలాగే ఉంచాడు, వేసవికాలంలో నీటిని నిల్వ చేయడానికి చిన్న మడుగులు తవ్వించాడు. భూగర్భ జలాలు తగ్గిపోయినప్పుడు అటవీ శాఖ ట్యాంకర్లతో నీరు పంపేలా చర్యలు తీసుకుంది. ఇలా వ్యవసాయ భూమి ఒక్కటీ, అడవి పూర్తిగా మరోటీ అనే స్పష్టమైన విభాగాల్లా కాకుండా, చిత్తల్ జింకలకు అనువైన సున్నితమైన జీవవైవిధ్య ప్రదేశంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది.
ఈ ప్రయాణంలో గురుసామి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. కరువుతో పచ్చి గడ్డి తగ్గినప్పుడు జింకలు పొరుగుపొలాల్లోకి వెళ్లి పంటలు పాడుచేయడం ప్రారంభించాయి. కొన్ని సందర్భాల్లో రైతులు కుక్కలను విడిచారు, వాటిని తరిమారు. రోడ్ల మీదికి రాగా ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ పరిస్థితులన్నీ గురుసామిని నిరుత్సాహపరచలేదు. అత్యంత ప్రమాదకరమైన సమస్య వేటగాళ్ల నుంచే వచ్చింది. 2008, 2010లో ఇద్దరు వేటగాళ్ల బృందాలను ఆయన, ఆయన స్నేహితుడు బాలసుందరం కలిసి పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటనల తర్వాత అటవీ శాఖ ఈ గ్రామాన్ని కీలక సంరక్షణ ప్రాంతంగా గుర్తించి 24×7 టహిళీలు, రాత్రి పహరాలు, పర్యవేక్షణ కెమెరాలు ఏర్పాటు చేసింది.
తిరుప్పూర్ నేచర్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రన్ మాటల్లో చెప్పాలంటే “గురుసామి పొలంలోకి వెళ్తే బండీపూర్ నేషనల్ పార్క్ గుర్తుకు వస్తుంది. చెట్ల మధ్య వందల కొద్దీ చిత్తల్ జింకలు సంచరిస్తూ కనిపిస్తాయి.” విద్యార్థులు, పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి గురుసామి కథను వింటూ, గుంపులుగుంపులుగా తిరిగే జింకలను చూసి ఆశ్చర్యంతో వెళ్తారు. ఇది ఒక రైతు చేతుల్లోనూ సంరక్షణ ఎలా సాధ్యమో నేర్పే “లైవింగ్ క్లాస్‌రూం” ఉదాహరణ.
అయితే జింకల పెరుగుదలతో కొత్త సమస్యలు కూడా వచ్చాయి. అధిక సంఖ్యలో ఉన్న జింకలు వేసవిలో నీటి కోసం పోటీ పడటం, గడ్డి సరిపోకపోవడం, వేడి ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి ఇబ్బందులు. దీనిపై తమిళనాడు అటవీ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. కొన్ని జింకలను సమీపంలోని అడవులకు, ముఖ్యంగా భరతపురం, అమరావతి రిజర్వ్ ప్రాంతాలకు, సురక్షితంగా తరలించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇవి చాలా సున్నితమైన జంతువులు కావడంతో, వాటిని తరలించే సమయంలో ఒత్తిడి, రాపిడి లేకుండా ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరం.
గురుసామి కథ మనకు చెప్పేది ఒకటే మనుషులు, జంతువులు కలిసి జీవించే అవకాశం ఎప్పుడూ ఉంది. అవసరం మాత్రం మన నిర్ణయం, దయ. ఆయన 50 ఎకరాల భూమిని జింకల కోసం వదిలేసి, వ్యవసాయ ఆదాయాన్ని తగ్గించుకున్నా, ఆయన ప్రపంచాన్ని గెలుచుకున్నాడు. గ్రామస్థులలో కూడా ఇప్పుడు అవగాహన పెరిగింది. పంటలు పాడైనప్పటికీ, ప్రకృతిని కాపాడాలనే భావన ఆ గ్రామంలో బలపడింది. ఈరోజు పుదుపాళయం గ్రామం దేశంలోని అత్యంత విజయవంతమైన community-led conservation నమూనాల్లో ఒకటిగా నిలిచింది.
ఒక వ్యక్తి తీసుకున్న చిన్న నిర్ణయం వేల ప్రాణాలను కాపాడగలదని గురుసామి గాథ బలంగా చెబుతోంది. గ్రామం, జిల్లా, రాష్ట్రం… చివరికి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ సాదుజీవులపై ఉన్న ప్రేమ కథ భారతదేశంలోని ప్రతి గ్రామానికి స్ఫూర్తి కావాలి. ఇలాంటి వ్యక్తులు మన పర్యావరణ సమతుల్యాన్ని కాపాడగలిగితే, భవిష్యత్తు తరాలకు పచ్చని లోకాన్ని అందించగలమనే నమ్మకం పెరుగుతుంది. గురుసామి లాంటి వ్యక్తులు ఉంటే ప్రకృతి సమతుల్యం కాపాడబడుతుందనడంలో సందేహం లేదు. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds.

