చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర - Chatrapati Shivaji Maharaj Biography in Telugu

megaminds
0
Chatrapati Shivaji Maharaj


చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర:

చత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.

రాయఘడ్‌లో ఛత్రపతి శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.

బాల్యం:
శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్భీ కులానికి చెందినవారు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది.

షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. చత్రపఠీ శివాజీ మహారాజ్ కి జయ్ (అరవింద్ నాగులా)

సామ్రాజ్య అంకురార్పణ :
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

సుల్తానులతో యుద్ధాలు:
పోరాడుతున్న శివాజీ 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.

ప్రతాప్‌ఘడ్ యుద్ధం:
ఆఫ్జల్ ఖాన్‌ను కత్తితో పొడుచుచున్న శివాజీ శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.

అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను, శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా, శివాజీ తన దగ్గరన్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీనరసింహ వలె చీల్చి చెందాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా, ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు.

శివాజీ ఉపయోగించినదిగా చెప్పబడుతున్న పిడిబాకు అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి మెరుపుదాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగయినా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థూన్ సైనికులను పంపించగా, శివాజీ సేన వేల సంఖ్యలో పస్థూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.

కొల్హాపూర్ యుద్ధం :
ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ ' అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు.తన మేన మామ షాయైస్త ఖాన్ ను శివాజీ పై యుద్ధానికి పంపాడు.

పవన్‌ఖిండ్ యుద్ధం:
రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్దంగా లేనని దయతలచవలసినదిగా సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు. అది తెలుసుకొన్ని సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే, శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోటవైపు పయనించసాగాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు.

కోటకు చేరుకొనేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలసి తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామని, శివాజీని తన అంగరక్షకులతో ఎలాగయినా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు.

300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్‌హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది.

మొఘలులతో యుద్దాలు:

షెహస్త ఖాన్ తో యుద్ధం :
1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్‌కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్‌లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.

ఎప్పటికయినా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమయిన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది.కాబట్టి, సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా, షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్‌ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించివేసాడు.

సూరత్ యుద్ధం:
1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు.

ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడయిన రాజా జై సింగ్‌ను శివాజీ పైకి పంపించాడు.రాజా జై సింగ్ గొప్ప రాజ నీతిజ్ఞుడు.రాజా జై సింగ్ అద్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి.తర్వాత రాయఘర్ ఆక్రమనకై సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజ జై సింగ్ తో సంధి కి దిగాడు .1665 లో శిబాజి రాజా జై సింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు .తర్వాత కూడా ను కూడా ఒక మొఘల్ సర్దార్‌గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్‌గా ఉండడానికి ఒప్పుకున్నాడు.

ఆగ్రా కుట్ర:
1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజి బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.

ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా, దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.

తప్పించుకున్న తర్వాత శివాజీ రాయఘర్ చేరుకున్నాడు.ఆ తర్వాత రెండు సంవత్సరముల వరకు శివాజీ మోఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర్ సంధికి కట్టుబడి ఉన్నాడు.మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీ ని రాజుగా గుర్తించాడు.కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచాలైనది.మొఘలు సైనాధిపతులు మహాబత్ ఖాన్,బహుదూర్ ఖాన్ మరియు దిలేవార్ ఖాన్ లు మూకుమ్మడిగా శివాజీ పై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు.శివాజీ తో యుద్దంలో వారు ఘోర పరాజయం పొందారు.శివాజీ జీవిత చరిత్ర లో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు.

అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీనుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.

సింహగఢ్ యుద్ధం:
శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా, పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్‌భాన్ రాథోడ్ అనే రాజపుతృడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించాడు.

తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు.

అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము ' అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్‌గా మార్చాడు

శివాజీ పట్టాభిషేకము:
జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీఅధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.

27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.

పరిపాలనా విధానం:
యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.

వ్యక్తిత్వం:
సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విదంగా గౌరవించబడ్డారు. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.

సైన్యం:
మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. గెరిల్లా యుద్ధ విధానం శివాజీతోనే మొదలయింది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్ఠమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.

కోటలు:
మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.

మతసామరస్యం :
శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు! శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్‌ కూడా ముస్లిమే! జై హింద్.  -ముడుపు యాదిరెడ్డి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



Hindu Samrajya Divas 2025, Shivaji Maharaj Coronation Day, RSS Hindu Samrajya Divas 2025, Shivaji Maharaj Legacy 2025, హిందూ సామ్రాజ్య దినోత్సవం, శివాజీ జీవిత చరిత్ర

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans  ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top