Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అయోధ్య అసలు కథ 5 రహస్యాలు - 5 Unknown Facts About Ayodhya in Telugu

1.అసటను వీడి ఇప్పటికి క్షేమంగా మిగిలినవాటినయినా సాధించుకుని సంరక్షించుకోగలమా? తండ్రి వైపునుంచి తైమూర్ లంగ్ తల్లి వైపున...1.అసటను వీడి ఇప్పటికి క్షేమంగా మిగిలినవాటినయినా సాధించుకుని సంరక్షించుకోగలమా?
తండ్రి వైపునుంచి తైమూర్ లంగ్ తల్లి వైపునుంచి చెంఘీజ్ ఖాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ ,క్రీ.శ1483లో ఫిబ్రవరి 23న ఉబ్జెకిస్థాన్లో ఉన్న ఫర్గనా లోయలోని అందెజాన్ పట్టణంలో మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగకి చెందిన ఫెర్గనా లోయ ప్రాంత పరిపాలకుడైన ఉమర్ సేహ్ మిర్జాకి జన్మించాడు.క్రీ.శ 1495లో తన పన్నెండవ యేటనే రాజ్యాధికారం చేపట్టి పేరుకి తగ్గట్టు సింహంలాగే పోరాడుతూ నిరంతర యుధ్ధాలతో విసుగెత్తి ఉన్న దశలో ఆలం ఖాన్,దౌలత్ ఖాన్ లోడీల ఆహ్వానంతో 1526లో ఇబ్రహీం లోడీ పాలిస్తున్న భరత ఖండంలోని డిల్లీ సామ్రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు.ఈ మొదటి పానిపట్టు యుధ్ధంలో సుల్తాను వైపు పోరాడుతున్న లక్షమంది సైన్యం బాబరు వైపు పోరాడుతున్న పన్నెండువేల మంది సైన్యం చేతిలో చిత్తుగా ఓడిపోయింది!తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు మరియు ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్.

1531లో మరణించే వరకూ నిరంతర యుధ్ధాల తోనే కాలం గడించిపోయింది.కేవలం పది సంవత్సరాలే బతికినా కట్టడాలను నిర్మించే సరదా ఉండటంతో ఇతని హయాంలో అనేకమైన కట్టడాలు నిర్మించబడినాయి..కట్టడాలు అంటే కొత్త రాజ్యాన్ని జయించిన యే ప్రభువైనా తన గెలుపుకు సూచనగా తను పాటించే మతానికి సంబంధించిన దేవాలయాలనే నిర్మిస్తాడు,అది సహజం! వాటిలో ఒకటి అయోధ్యలో మీర్ బక్వి అనే బాబరు సేనాని సయ్యద్ మూసా అనే అతని అధ్వర్యంలో నిర్మించిన ఒక మసీదు ఇన్ని శతాబ్దాలుగా హిందువులకి మనస్తాపాన్ని కలిగిస్తున్నది!

సర్వధర్మసమభావన గల హిందువులకి బాధ కలిగింది ముస్లిములు మసీదు కట్టుకున్నందుకు కాదు, అప్పటికే అక్కడ ఉన్న తమ దేవాలయాన్ని కూల్చి కట్టుకున్నందుకు! అప్పటి నుంచి ఇప్పటివరకూ యెక్కడినుంచి నెట్టివేయబడ్డాడో అక్కడ తమ రాంలాలాని మళ్ళీ చూసుకోవాలని తపించి పోతూ లక్ష మందికి పైగా ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారని చరిత్రకారులు నిర్ధారించారు. యెందుకు కూల్చడం, కొత్తగా కట్టుకోవచ్చును గదా అంటే, కాఫిర్ల ప్రార్ధనా స్థలాల్ని నిర్మూలించడం అల్లా తమకు అప్పగించిన పవిత్ర కర్తవ్యం అని వారు అనుకున్నారు కాబట్టి?ప్రపంచమంతటా యే ముసల్మాన్ వీరయోధుడు యే రాజ్యాన్ని ఆక్రమించినా మొదట చేసిన పని అక్కడ ఉన్న అన్యమతస్థుల దేవాలయాలన్నింటినీ నేలమట్టం చేసి ఆయా స్థలాల్లో మసీదుని నిర్మించటం! వారికది ఘనకార్యం గనక గొప్పగా చెప్పుకోవటమూ, అలా గొప్పగా చెప్పుకోవటం వల్ల చరిత్రలో సాక్ష్యాధారాలతో సహా ఆ విజయాలు నమోదై ఉన్నాయి! ఇటువైపున ఉన్న మనకి అయోధ్యతో అనుబంధం ఉంటుంది గానీ అటువైపున ఉన్నవారికి మాత్రం అది కాఫిర్ల దేవళం - అంతే!

ఈ రోజున పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపి నిర్ధారించినా యెవ్వరూ నమ్మడం లేదు గానీ కొందరు ముస్లిం మతానికి చెందిన చరిత్రకారులే అదీ అప్పటి వారే, బహుశా భవిష్యత్తులో వివాదాస్పదమవుందని తెలియని కాలం కాబట్టి చాలా నిజాయితీగా - అక్కడొక హిందూ దేవాలయం ఉండేదని వివరంగా వర్ణించారు! అక్బరు నామా మరియూ  ఐన్ - ఇ - అక్బరి అనే గ్రంధాలను రచించిన మొఘల్ ప్రభువుల కాలానికి చెందిన అబుల్ ఫజల్ అనే ప్రముఖ రచయిత అయోధ్య త్రేతాయుగానికి చెందిన అవతారపురుషుడూ మరియూ ఇక్ష్వాకువంశప్రభువూ ఐన రామచంద్రుని సామ్రాజ్యానికి రాజధాని అని పేర్కొన్నాడు.అప్పటి అవధ్ సంస్థానం హిందువులకు ప్రాచీనకాలం నుంచి యెంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఉండేదని కూడా వివరించాడు. అక్కడ శ్రీరాముని జన్మదినమైన రామనవమి ఉత్సవాలు యెంతో వైభవోపేతంగా జరిగేవని విశదీకరించాడు.

ఆధునిక చరిత్రకారులలో Will Durant అనే మహానుభావుడు అన్ని దేశాల లోని ప్రాచీన నాగరికతలని తులనాత్మకంగా అధ్యయనం చేసి "The history of civilizations" అనే పుస్తకం రాశాడు. అందులో మిగిలిన నాగరికతల గురించి యేమి చెప్పాడో తెలియదు గానీ భారతదేశం గురించి చెప్పాల్సి వచ్చేసరికి తులనాత్మకత యేమయిందో "భారతదేశం మీద తురుష్కులు సాగించిన దండయాత్రలు పరమ కిరాతకమైనవి - రక్తసిక్తమైనవి!అదొక విషాద గాధ! అక్కడ నిరూపితమైన నీతి ఒకటి ఉంది,ఒక స్వేచ్చాస్వాతంత్ర్యాలతో విలసిల్లే నాగరికత, ఆ నాగరికతలోని ప్రజలు అనుభవించిన శాంతి సౌభాగ్యాలు యే నిముషంలో నైనా బయటి నుంచి దాడి చేసే క్రూరుల వల్ల ఆనవాళ్ళు కూడా లేకుండా చెరిపివేయబడవచ్చు." అని సెంటిమెంటు కురిపించాడు! ఈ రోజున మనం చూసే భారతదేశాన్ని బట్టి అప్ప్పటి భారతదేశపు వైభవాన్ని మనం వూహించలేము అని కూడా అన్నాడు.భారతదేశపు చరిత్ర మరొక విషయాన్ని కూడా నిరూపించింది. ఇంతకన్నా తక్కువ దాడికే తనకన్నా తర్వాత పుట్టిన మెసపొటేమీన్ నాగరికత మరియూ మాయన్ నాగరికత వంటి ప్రాచీన నాగరికతలు అవశేషాలు కూడా మిగలనంతగా అంతరించిపోయినా కమ్యునిష్టు విమర్శకులు కూడా స్వయంచాలిత యంత్రం అని పొగిడిన ఈ దేశపు సనాతన ధర్మం మాత్రం అన్ని దాడుల్నీ తట్టుకు నిలబడి తనకి హాని చేసిన వారిని కూడా క్షమించి ఈ రోజున ఇస్లాం దర్మాన్ని పాటిస్తున్న వారికి కూడా స్నేహహస్తాన్ని అందిస్తున్నది!

అంతకు ముందు ఇక్కడ యుధ్ధాలు జరగలేదని యెవరూ అనటం లేదు, కానీ ఇక్కడి రాజులు కొన్ని నైతికసూత్రాలకి కట్టుబడి యుధ్ధాలు చేశారు. ఆయుధం పట్టని వారిని చంపగూడదు, స్త్రీ బాల వృధ్ధుల్ని హింసించ రాదు, గో బ్రాహ్మణుల్ని సంహరించ రాదు - వీటిని అందరూ నిక్కచ్చిగా ఆచరించటంతో యుధ్ధ సమయాల్లో కూడా ప్రజల కసలు యుధ్ధాలు జరుగుతున్నాయనేది తెలియనంత ప్రశాంతంగా జీవించే వాళ్ళు! కానీ అదేమి పైశాచికత్వమో - ఒక నగరం వారికి ఓడిపోయిందంటే భస్మీపటలం కావలసిందే, లేదా నేలమట్టమైపోవలసిదే?! అక్కడ రాజ్యం యేర్పరచాలనుకుంటే అక్కడి కాఫిర్ల సంస్కృతిని నిర్మూలించవలసిందే?! అలాంటి క్రూరమైన విధ్వంసానికి రామచంద్రుని సభాభవనం, సీతాదేవి వంటిల్లు లాంటివి కూల్చివేయబడినాయి. కాలగర్భంలో కలిసిపోయినవాటిని యెటూ తిరిగి పొందలేమనేది అందరూ ఒప్పుకుంటారు! అయితే అలసటను వీడి ఇప్పటికి క్షేమంగా మిగిలినవాటినయినా సాధించుకుని సంరక్షించుకోగలమా? భవిష్యత్తులో యెవరు సంప్రదించినా నిజమేమిటో నిర్ద్వందంగా తెలిసేటందుకు ఆనాడు జరిగినది జరిగినట్టు చెప్పిన చరిత్రకారు లందరికీ శిరసా ప్రణామం!

2.రామ్ లల్లా నిజంగానే లోపలికి నడిచొచ్చాడా?
క్రీ.శ 1949 డిసెంబర్ 22 గురువారం నాటి శుభోదయాన రాం లల్లా యెక్కడి నుంచయితే క్రీ.శ 1528లో పక్కకి నెట్టివేయబడ్డాడో అక్కడ ప్రత్యక్షమయ్యాడు! బిందేశ్వరి ప్రసాద్ అనే సాధువు అప్పటి తన అనుభవాన్ని ఇలా వివరించాడు: "మేమందరం ఆలయానికి దగ్గిర్లో విడిది చేసి ఉన్నాం ఆ రాత్రి. మాకందరికీ కలలో రాం లల్లా కనబడటంతో సుమారు తెల్లవారు ఝాము 3గంటల సమయంలో మేల్కొన్నాం. అప్పుడు ఆలయం కిటికీల నుంచి తొంగి చూస్తే రాం లల్లా కనబడుతున్నాడు తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళీ ప్రార్ధనలు చేసి పూజాభిషేకాలు నిర్వహించాము". నిజంగానే ముందరి యుగాల్లో వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులకు దర్శనమిచ్చి వారికి వరాలిచ్చినట్టు ఈ కలియుగంలో కూడా తన మహిమను చూపించాడా!

లేదు, రామభక్తులే చేశారు ఆ సాహసకార్యం - అయితే యేంటి? యెవరయినా నీ ఇంటిలో నుంచి నిన్ను తరిమేస్తే పోతే పోయింది లెమ్మని ఆ ఇంటితో అనుబంధాన్ని తెంచేసుకుని యేమీ జరగనట్టు ఉండిపోగలవా? అలాగే హిందువులు కూడా కొన్ని వందల శతాబ్దాల క్రితం ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును కట్టిన నాటినుంచీ నేటివరకూ యేనాడూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు! ప్రభువు అన్యమతస్థుడు, అధికార స్వభావం క్రూరమైనది  తొలినిప్పురవ్వ క్రీ.శ 1853లోనే రగిలింది! అప్పటి నుంచీ ఆపకుండా చేస్తున్న దశల వారీఎ పోరాటాలు ఫలించి క్రీ.శ 1855లో సీతా కి రసొయినీ రాం చబూత్రానీ స్వాధీనం చేసుకోగలిగారు. క్రీ.శ 1859లో అప్పటి ఆంగ్లేయ ప్రభువులు మందిరం యొక్క లోపలి భాగాన్ని ముస్లిములకీ బయటి భాగాన్ని హిందువులకీ పంచి మధ్యలో ఒక ఫెన్సింగ్ వేశారు.క్రీ.శ 1885లో మహంత్ రఘువర్ దాస్ అనే భక్తుడు రాం చబూత్ర పైన చత్రం నిర్మించుకోవటానికి అనుమతి కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. యెంత తపన ఉండి యేమి ప్రయోజనం? యెన్ని పోరాటాలు చేసినా కలిసిరాని పరిస్థితి! కూల్చినది అన్యమతస్థుల ప్రభుత్వం, తర్వాత వచ్చినదీ అన్యమతస్థుల ప్రభుత్వమే, స్వతంత్రం వచ్చినా అదికూడా విదేశీభావజాలప్రేరిత ప్రభుత్వమే - యెంత సుదీర్ఘకాలపు దురదృష్టం! ఈ రోజున కాస్తకే కూస్తకే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని విధ్వంసాలు సృష్టించడానికి కూడా వెనుకాడని వారు అన్ని శతాబ్దాల పాటు తమ గుండెల్లో నెలకొని ఉన్న దేవుడి కోసమైనా సరే సామరస్యంగా సాధించుకోవాలే తప్ప హింసకి దిగరాదని నిగ్రహంతో వ్యవహరిస్తున్న హిందువులని తమతో పోల్చుకుని చూస్తే తెలుస్తుంది ఈ దేశంలొ స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని ప్రతిపాదించిన సెక్యులరిజం ఇప్పటికీ యెందుకు బతికే ఉందో! అంతకన్నా గొప్పదయిన సర్వధర్మ సమభావననే నమ్మి ఆచరించి చూపించిన వారికి ఇది పెద్ద కష్టమా?

1949లోని అయోధ్య ఒక ప్రశాంతమైన నగరం. ఆలయాలూ,అతి సన్నని వీధులూ,స్వేచ్చగా సంచరించే గోమాతలూ, ప్రాచీనంగా కనబడే గోడలూ - చాలా అమాయకంగా ఉంటుంది, ఇప్పటికీ అలాగే ఉంది! హిందువులూ ముస్లిములూ - ఇరు మతాల వారూ సహజీవనం చేస్తున్నారు. కానీ, చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించేది అక్కడి వీధుల్లో సంచరిస్తున్న సాధువులు! అక్కడ ఉన్న రామ్ లల్లాను దర్శించుకోవడం కోసం దేశమంతటి నుంచీ కొందరు వస్తుంటారు పోతుంటారు,కొందరు అక్కడే ఆశ్రమాలు కట్టుకుని ఉంటుంటారు.అలాంటివారిలో అభిరాం దాస్ అనే సాదువు బయట ఉన్న రామ్ లల్లాను లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అసలితను రామ్ లల్లాను ఇదివరకు యెక్కడ వుండేవాడో అక్కడికి చేర్చే పవిత్ర సంకల్పంతోనే బీహారు నుంచి ఇంతకు పదిహేనేళ్ళ క్రితమే అయోధ్యకు చేరుకుని శిష్యుల్ని పెంచుకుంటూ మంచి అవకాశం కోసం యెదురు చూస్తున్నాడు. అప్పుడప్పుడూ రాముడు తనకు కలలో మందిరం లోపల దర్శనమిస్తున్నాడని చెప్తూ ఉండేవాడు. అతని శిష్యులు కూడా దానిని అందరికీ ప్రచారం చేస్తూ ఉండేవారు. ఒకసారి అతను ఇదే విషయాన్ని ఒకరోజు అయోధ్యకి సంబంధించిన వ్యవహారాల మీద అధికారం ఉన్న ఫైజాబాద్ మెజిస్ట్రేట్ దగ్గిర ప్రస్తావించాడు. రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే ఇచ్చాడన్నట్టు ఆయన, "భయ్యా,అది నా పాత కల! నీకిపుడొస్తున్నది,నాకు చాలా కాలం నుంచీ వస్తున్నది" అన్నాడు!

గురు దత్ సింగ్ అనే ఈ ఫైజాబాద్ మెజిస్త్రేట్ అలహాబాద్ గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుని అప్పటి కుంఫిణీ వారి కొలువులో చేరినా స్వదేశీయాభిమానాన్ని వొదులుకోకుండా బతికిన అతికొద్దిమందిలో ఒకరు.అప్పట్లో దొరల కొలువులో చేరిన వాళ్ళందరూ ప్రత్యేకంగా ఉండే దొరటోపీ తలమీద ధరించాలి.కానీ ఇతను మాత్రం తలపాగ మాత్రమే ధరించేవాడు.ఒకసారి పై అధికారి ముఖం మీదనే "నీవెందుకు టోపీ పెట్టుకోలేదు?" అనడిగితే "మీరెందుకు తలపాగ ధరించ లేదు!" అని యెదురు ప్రశ్నించాడు!అతని అధికార పరిధిలో శాంతిభద్రతలని కాపాడటం కూడా ఉండేది.ఇరు మతస్థులనీ సమానంగానే చూసేవాడు,తన అధికార బాధ్యతల విషయంలో యెంత నిర్మొహమాతంగా, నిష్పక్షపాతంగా ఉన్నప్పటికీ అతనికి ఒకటే బాధ - అప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్న ముస్లిములని బుజ్జగించే వ్యవహారం?!సంవత్సరాని కొకసారైనా అయోధ్యారాముణ్ణి దర్సిస్తాడు,కాలేజి రోజుల నుంచే రామభక్తుడు!వయసుతో పాటూ భక్తి పెరుగుతూ వచ్చి రాముణ్ణి మళ్ళీ మొదట్లో యెక్కడుండేవాడో అక్కడికి తీసుకెళ్ళాలని భావించే వాడు.ముస్లిములు మసీదును హిందువులకు అప్పగించడమే మంచి పరిస్కారం అనుకునేవాడు."నేను వాళ్లతో అంత ఉదారంగా ఉంటున్నా అటువైపు నుంచి సహకారం రాదేమిటి?" అని లోలోపల బాధపడేవాడు! 1940ల్లో ఇతనికి కే.కే నాయర్ అనే మరో ప్రభుత్వాధికారితో పరిచయ మయింది. ఇతను కేరళ ప్రాంతం వాడు. ఇద్దరి అభిప్రాయాలూ ఒక్కలాగే ఉండేవి. హిందూ మహా సభ ప్రభావం బలంగా వుండేది. ఇద్దరూ ఒకేసారి ఫైజాబాద్ నగరానికి బదిలీ అయ్యేందుకు అప్లికేషన్లు పెట్టారు. సింగ్ గారు 1948లో నగర మెజిస్ట్రేట్ గానూ అదే సమయంలో నాయర్ గారు జిల్లా మెజిస్ట్రేట్ గానూ ఫైజాబాద్ చేరుకున్నారు. అప్పటి అధికార పరిధుల ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ జిల్లాకి సంబంధైంచినంత వరకూ సర్వాధికారి! యెప్పుడయితే సాధువు గురు దత్ సింగ్ గార్ని కదిలించాడో వెంటనే నాయర్ గార్ని కూడా కలుపుకుని గురుదత్ గారి ఇంటిలోనే సమాలోచనలు చేశారు. 1949 అక్టోబర్ కల్లా మొత్తం ప్రణాళిక సిధ్ధమయ్యింది. వాళ్ళు అంత రహస్యంగా ప్రణాళికలు వెయ్యడానికీ ప్రతి చిన్న విషయాన్నీ నిర్దిష్టంగా ప్లాన్ చేసుకునీ యెక్కడా ఫెయిలవకూడదనీ అంత గట్టిగా అనుకోవడానికి కారణం అప్పటి ప్రధానమంత్రి. మసీదులో యెలాంటి గొడవ జరిగినా ప్రమాదవశాత్తూ హిందువైన అతనికి తీవ్రమైన కోపం వస్తుందని ఇద్దరికీ స్పష్టంగానే తెలుసు. అయినా సరే, రాజీనామా అయినా చెయ్యాలి గానీ లోపలికి చేర్చిన రామ్ లల్లాని తొలగించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ప్లాను ఇది:మసీదుకి ఉన్న గార్డులలో ఒకరు హిందువు. అతను సాయంకాలం ముందరి కాపలాదారు దగ్గిర తాళాలు తీసుకుని కాపలా మొదలు పెట్టి తన డ్యూటీ పూర్తి అయ్యాక రాత్రి కాపలా కొచ్చే గార్డుకి తాళాలు అప్పగించి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఈ తాళాల మార్పిడికి కొంచెం ముందుగా హిందూ గార్డు అభిరాం దాస్ బృందాన్ని లోపల్లికి వొదుల్తాడు. వాళ్ళు సుమారు యేడంగుళాల యెత్తు వుండి యెనిమిది లోహాలతో చేసిన బాలుడిలా కనిపించే రామ్ లల్లా విగ్రహాన్ని లోపలికి చేర్చి పూజలూ అవీ చేసి యెలా వెళ్ళారో అలానే వచ్చెయ్యాలి. ముస్లిం గార్డుని కూడా వశపర్చుకున్నారు. అతను యెవరెవరితో యేమేమి చెప్పాలి, కేసు యెలా ఫైల్ చెయ్యాలి అనే సమస్తం బోధపర్చారు - మహా సామ్రాజ్యాల్ని వశపర్చుకునే రాజనీతి దురంధరులు కూడా కేవలం భక్తి తప్ప మరేమీ లేని ఈ సామాన్యుల ముందు దిగదుడుపే గదా అనిపించే బ్రహ్మ దుర్భేద్యమైన ప్లాను వేశారు! అనుకున్న రోజున, అంటే డిసెంబర్ 22 1949 సాయంకాలం ముస్లిం గార్డ్ రాగానే హిందూ గార్డ్ తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ముందే నిర్ణయించబడిన సుముహూర్తం తెల్లవారు ఝాము 3 గంటలకు గంట మోగిస్తూ హారతి సమర్పించి ప్రార్ధనలు చేశారు. శతాబ్దాల నిరీక్షణ తర్వాత సమస్త భక్తజనావళి హృదయాలూ ఆనందామృతవర్షంలో తడిసేలా మందస్మిత వదనారవిందంతో రామ్ లల్లా తన స్వస్థానం చేరుకున్నాడు!

యెక్కడో ఒక మారుమూల జిల్లాలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా ఆనాడు ప్రజాస్వామ్యబధ్ధంగానే సంక్రమించినా అప్రతిహతమైన అధికారంతో వెలిగిపోతున్న ఒక దేశ ప్రధానికి కూడా భయపడకుండా అంత సాహసం చేసిన ఆ ఇద్దరు భక్తాగ్రగణ్యులైన రామదాసులకూ శిరసా ప్రణామం!

3.మూసిన తలుపులు తెరిచిన దెవరు?యెందుకు తెరిచారో మరి!
ప్రమాదవశాత్తూ హిందువైన స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని చాలా కంగారుగా ఆ రాష్ట్ర ముఖ్యమత్రి గోవింద వల్లభ పంత్ గారికి 1949 డిసెంబర్ 26న ఇచ్చిన టెలిగ్రాములో,"అయోధ్యలో జరిగిన పరిణామం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దగలరని ఆశిస్తున్నాను. ఇక్కడొక దుష్ట సాంప్రదాయం మొదలయ్యింది. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే మరిన్ని అనర్ధాలకి దారితీస్తుంది." అని యెంతో లౌకికావేఅశాన్ని ప్రదర్సించాడు. దేశ ప్రధాని వ్యక్తిగతంగా విగ్రహాలను అక్కడినుంచి తొలగించమని యెంత ఒత్తిడి పెట్టినా క్షేత్రస్థాయి అధికారులు అలా చెయ్యడం వల్ల అక్కడి శాంతిభద్రతలకి భంగం కలిగి పెద్దయెత్తున అల్లర్లు చెలరేగవచ్చునని గట్టిగా తిరస్కరించడంతో యెన్ని వారాలు గడిచినా తనచుట్టూ జరుగుతున్న జగన్నాటకాన్ని చూస్తున్న జగదభిరాముడు చిరునవ్వులు చిందిస్తూ అక్కడే వున్నాడు!

దేశ విభజన నాటి భీబత్సం అయోధ్యని మాత్రం తాకలేదు.అయోధ్య లోని చాలా ఆలయాల లోని విగ్రహాలు ముస్లిము కళాకారులు చెక్కినవే! అర్చకులు కూడా పూజాదికాలకు అవసరమైన సామగ్రిని ముస్లిం వ్యాపారుల నుంచే తీసుకుంటూ ఉంటారు. అంతకు ముందు నుంచీ అక్కడే కాదు దేశమంతటా ఉన్న హిందూ దేవాలయాలలో కొన్ని చోట్ల కొన్ని కైంకర్యాలను ముస్లిములతో చేయించడం వారూ సంతోషంగా వాటిని చెయ్యడం జరుగుతూనే ఉంది! అడిగే వారు అడిగే విధంగా అడిగితే ముస్లిములు కూడా సానుకూలంగానే స్పందించి ఉండే వారు!

1950లో అటు ముస్లిము న్యాయవాదులూ ఇటు హిందూ న్యాయవాదులూ కొన్ని దశాబ్దాల పాటూ పరిష్కారానికి నోచుకోని జటిలమైన కేసులతో న్యాయస్థానాల్ని ఆశ్రయించారు .రామ్ లల్లాని లోపలికి చేర్చడంలో ప్రముఖపాత్ర వహించిన ప్రభుత్వాధికారులిద్దరూ హిందూ మహా సభలో చేరారు. దత్ గారు తన కర్తవ్యం ఇక ముగిసిపోయిందని స్వచ్చందంగా రాజీనామా చేసి హిందూ మహా సభలో చెరి రాజకీయ జీవితాన్ని ప్రారంబించాడు. నాయర్ గారు కూడా 1952లో పదవీకాలం ముగిశాక తనూ అదేపని చేశాడు.

1981లో అయోధ్యకి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని మీనాక్షీపురం అనే ఒక అనామగంగా ఉండే గ్రామంలో ఒకరూ ఇద్దరూ కాదు 400 కుటుంబాలు ఒకేసారి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు! తమ నెవరూ బలబంతంగా మార్చలేదనీ హిందూమతంలో ఉన్న అస్పృశ్యత వల్ల అగ్రవర్ణాల నుంచి వివక్షని భరించలేక సమానత్వాన్ని కోరుకుని మాత్రమే మారిపోయామని వారు ఖండితంగా చెప్పడంతో హిందూ మతాధిపతులలో ఆలోచన మొదలయింది. సాధువులూ,మత ప్రచారకులూ అంతా మొదట వాళ్లలో వాళ్ళు చర్చించుకుని తర్వాత మొత్తం అందరూ కలిసి ఒక చోట కూర్చుని చర్చించుకోవడానికి 1984లో సుమారొక 500 మంది ఒక ధర్మ సంసద్ యేర్పాటు చేశారు. దానికి చొరవ చూపించింది 1960ల్లో స్థాపించబడిన విశ్వ హిందూ పరిషత్.దాని ఆర్గనైజరు అశోక్ సింఘాల్. వక్తలంతా మంచి విషయాలే మాట్లాడారు. లోపాల్ని అంగీకరించాలి, దురాచారాల్ని దునుమాడాలి, ప్రజలని నైతికంగా ఉన్నతుల్ని చెయ్యకపోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పారు. అవసరమైన మార్పులు తెచ్చి హిందూధర్మాన్ని మళ్ళీ గౌరప్రదంగా నిలబెట్టాలని కూడా ఆశించారు. కాని వక్తల్లో ఒకరు అలయాలు నిరాదరనకి గురవడం ప్రస్తావన తీసుకొచ్చి "చూడండి!అయోధ్యలో రాముడికి దీపాన్ని కూడా వెలిగించలేక పోతున్నం, దేశజనాభాలో 80% ఉన హిందువులకి యెంత అవమానం?" అనెయ్యడంతో ఆ సభ చేసిన ముఖ్యమైన తీర్మానాల్లోకి అయోధ్యలో రామాలయం నిర్మించడం మొదటి ప్రాధాన్యతని సంతరించుకునేసింది!

ధర్మ సంసద్ తర్వాత కొన్ని నెలలకి 1984 సెప్టెంబరు మాసాంతంలో బీహారు రాష్ట్రంలోని సీత నాగేటి చాలులో ఉద్భవించిందని చెప్పబడుతున్న సీతామర్హి నుంచి అశోక్ సింఘాల్ అధ్వర్యంలో మొదటి రధయాత్ర మొదలైంది. 12 రోజుల శోభాయమాన యాత్ర అనంతరం వారు అయోధ్యలోని సరయూ నదీతీరాన ఆగి ఆ నదీజలాన్ని దోసిట పట్టి రామాలయ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజున అక్కడ ప్రతిజ్ఞ చేసిన వారే 50,000 మంది కాగా దేశమంతటా మిగతా పుణ్యనదుల్లో ఇలాంటి ప్రతిజ్ఞలే చేశారు. ఆ భక్త్యావేశంలో మొదట అనుకున్న కేవలం దీపారాధన స్థానంలో "మేము శ్రీరాముడికి తన జన్మస్థానంలో ఆలయం నిర్మించేటందుకు మా సమస్తాన్నీ వొదులుంటాము" అనే మరింత గంభీరమైన ప్రతిజ్ఞగా మారింది! ఇంతటి స్పందనని వూహించని యాత్ర నిర్వాహకులకి తొలిసారిగా మారుమూల పల్లెల నుంచి కూడా భక్తులు కదిలిరావడం ఆశ్చర్యమనిపించింది - రాముడా మజాకా!?

ఆ మరుసటి రోజునే అప్పటి ప్రధాని తన అంగరక్షకుల చేతిలో హతమవడం వల్ల జరిగిన వరస పరిణామాలతో యాత్ర మధ్యలోనే ఆగిపోయింది. భారతదేసంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలవాటుగా పాటించే ప్రజాస్వామ్య బధ్ధమైన రాజరిక సాంప్రదాయం ప్రకారం మరణించిన ప్రధాని కుమారుదైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. సహజంగానే కొత్తదనాన్ని కోరుకుంటూ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ మొదట్లో కొంతకాలం ఆశాజనకంగా ఉన్న ఇతని ప్రభుత్వం తన మితిమీరిన ఆధునికతా వ్యామోహం వల్లనే సమస్యల పాలయ్యాడు. షా బానో అనే ఒక ముస్లిం మహిళ విడిపోయిన భర్త నుంచి మనోవర్తి కోరుతూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. 1985లో సుప్రీం కోర్టు ఆమె అభ్యర్ధన కనుకూలంగా తీర్పు ఇచ్చేసింది. ఆ తీర్పుని అత్యధ్భుతమైనదిగా అభివర్ణిస్తూ ఆయన మంత్రివర్గంలోని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పార్లమెంటులో ప్రసంగం చెయ్యడమూ ఈయన ప్రశంసించడమూ అతివేగంగా జరిగిపోయాయి. కానీ తెల్లారేసరికల్లా పార్టీ మొత్తం చచ్చింది గొర్రె అని నాలుకలు పీక్కున్నా లాభం లేనంత ఇబ్బందిలో పడిపోయింది!

తాము తీర్పు ఇవ్వాలసిన కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటం ముల్లాలకి కోపం తెప్పించగా అప్పటి దాకా ముస్లిములకి రక్షకుడిగా పోజులు కొడుతున్న కాంగ్రెసు పార్టీ దానిని సమర్ధించటం పుండు మీద కారం జల్లినట్టయి మిత్రులుగా ఉన్న ముస్లిం పార్టీలే సందు దొరికిందని కాంగ్రెసుని యేకిపారేస్తున్నారు. పార్టీలో మిగతావాళ్ళు గొడవకి కారణమైన వాళ్ళని తిడదామంటే గొడవలో ఇరుక్కున్నది సాక్షాత్తూ అధినేతయే - బంట్లు రాజుని తిట్టుటయా! కొండని తవ్వి యెలకని పట్టినట్టున్న దిక్కుమాలిన గత్తర నించి తప్పించుకోవటానికి సుప్రీం కోర్టు రూలింగుని యెందుకూ పనికిరానిదిగా చేసే చట్టాన్ని పార్లమేంటు ద్వారా చేద్దామనుకున్నాడు. దీంతో అప్పటికే కాంగ్రెసు మీద అతిగా ముస్లిముల్ని బుజ్జగిస్తున్నందుకు గుర్రుగా ఉన్న హిందువులు గొడవ మొదలు పెట్టారు. ఒక పిల్లిమొగ్గ, అందులో బ్యాలెన్సు తప్పి మరో పిల్లిమొగ్గ, అందులో బ్యాలేన్సు తప్పి మరో పిల్లిమొగ్గ ఇలా వెయ్యంగా వెయ్యంగా ఆఖర్లో అయోధ్యరాముడు గుర్తొచ్చాడు! సరిగ్గా ఇదే సమయానికి ఫైజాబాద్ కోర్తులో ఒక కేసు కొలిక్కొచ్చి నేడో రేపో తీర్పు ఇవ్వడాని కనుకూలంగా ఉండి జడ్జిగారికి వచ్చిన చిన్న సందేహం వల్ల దాని తాలూకా వ్యవహారం ప్రధాని సమ్ముఖానికి చేరింది!

ఉమేష్ చంద్ర పాండే అనే ఒక కుర్రలాయరు జనవరి 1986లో ఫైజాబాద్ కోర్టులో అయోధ్యలోని మసీదుకు వేసిన తాళం తెరిపించాలని కేసు వేశాడు. అంతకు మూడేళ్ళ క్రితం అతనొక పత్రికలో విలేఖరిగా పని చేస్తున్నప్పుడు అతని పత్రికాధిపతి అయోధ్యలో జరిగే రామనవమి సంబరాల గురించి ఒక మంచి ఆర్టికిల్ రాయమన్నాడు. సహజంగా ఇతరులెవరూ రాయని విశేషం కోసం అంగలార్చే జర్నలిష్టు బుర్రతో పరిశోధన చెయ్యగా అతనికొక తమాషా విషయం తెలిసింది. 1949లో అభిరాం దాస్ రామ్ లల్లాని లోపలికి చేర్చినప్పుడు జరిగిన గందరగోళంలో సందర్సకులని చెదరగొట్టి యెవరో తాళం వేసేశారు. తర్వాత కూడా కోర్టులు భక్తుల్ని అనుమతించకుండా పూజారులని మాత్రం పూజాదికాలు చేసి వస్తూ ఉండే యేర్పాట్లు చేసినాయి. ఇప్పుడు ఇతను పరిశోధించి చూస్తే తాళం వెయ్యమని గానీ భక్తులకి ప్రవేశం నిషేధించమని గానీ అధికారికమైన ఉత్తర్వులు యెక్కడా కనపడ లేదు! మొదటి నుంచీ విశ్వ హిందూ పరిషత్ వారు చెప్తూనే ఉన్నా ఇతని పరిశోధనతో అది నిర్ద్వందంగా బయటపడింది. దాంతో వెంటనే కేసు ఫైల్ చేసి ఒక కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాడు. అది రాజీవ్ గాంధీ కజిన్ అయిన అరుణ్ నెహ్రూ కంటబడింది. జడ్జి వైపు నుంచి కూడా శాంతిభద్రతలకి సంబంధించిన సందేహం ఉండటం గురించి కూడా తెలిసింది. తెర వెనక పైనించి కిందకి కదిలిన మంత్రాంగం వల్ల ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు అధికార్లు కోర్తులో హాజరై శాంతిణద్రతలకి హామీ ఇవ్వగా 1986 ఫిబ్రవరి 1న మసీదు కున్న తాళం తీసి భక్తులని యధెచ్చగా దర్సనానికి అనుమతించే చారిత్రాత్మమైన తీర్పు వెలువడింది!ఈ గేటు తాళం తీసే సంఘటన అందరికీ కుతూహలాన్ని కలిగించి అప్పటి వరకూ సాధువుల శంఖనాదాలకీ, కొందరు వ్యక్తులు చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలకీ, రామభక్తులైన లాయర్లు ఫైజాబాద్ కోర్టులో వేసే పిటిషన్లకీ పరిమితమైనది కాస్తా ప్రపంచం లోని ప్రతి హిందువుకీ అయోధ్యలో యేం జరుగుతున్నదో తెలిసి వారికి కూడా అయోధ్యలో రామాలయం కడితే బాగుండుననే కోరికని రగిలించింది. తన రాజకీయ మనుగడ కోసమే అయినా అప్పటివరకూ యెవరి దృష్టినీ అంతగా ఆకర్షించకుండా అనామకంగా ఉన్న అయోధ్యరాముణ్ణి ప్రపంచంలోని హిందువు లందరికీ చూపించి పరిచయం చేసిన శ్రీమాన్ రాజీవ్ గాంధీ గారికి శిరసా ప్రణామం!

4.పిల్లిమొగ్గల రాజకీయుల గొడవల్లో మసీదు అప్పుడే కూలినంత పనాయె!
1989కల్లా రాజీవ్ గాంధీ ప్రభ పూర్తిగా మసక బారి బోఫోర్సు కేసులో పీకలోతున కూరుకుపోయి ఉన్నాడు. అప్పటికి తన పదవీకాలం దాదాపు ముగుస్తుండటంతో రాబోయే యెన్నికల్లో తనని గెలిపించే బలమైన వ్యూహం కోసం వెదుకుతున్నాడు. అటువైపు అశోక్ సింఘాల్ చేసిన రధయాత్ర వూహించినదానికన్నా యెక్కువ విజయవంతమై శుభశకునాలు చూపించడంతో అప్పటికి 2 స్థానాలతోనే ఉన్న భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని తన యెజెండాలో చేర్చుకునేసింది! షాబానో విషయంలో తను యెంత దిగొచ్చినా ముస్లిములు తనకి సానుకూలంగా స్పందించకపోవడం వల్ల వ్యక్తిగతంగా విసుగెత్తి ఉండటం వల్లనూ కావచ్చు, బోఫోర్సు కేసు విషయం తనని అవినీతిపరుడు అని వేలెత్తి చూపడం వల్ల కలిగిన ఆందోళన ప్రభావమూ కావచ్చు ఇక రాముణ్ణే నమ్ముకుందామనుకుని అయోధ్య నుంచే ప్రచారం మొదలు పెట్టాడు.

తీరా అక్కడ "నేను రామరాజ్యం స్థాపిస్తాను" అని భాజపా వాళ్ళకి అడ్డంగా దొరికిపోయాడు!"ఈ అవినీతిపరుడు రామరాజ్యం స్థాపించడ మేమిటి? రామాలయం కట్టినా రామరాజ్యం స్థాపించినా అది మా వల్లనే అవుతుంది" అని వాళ్ళు రిటార్టు ఇవ్వడంతో పూర్తిగా నవ్వులపాలై అభాసుపాలయ్యాడు. తర్వాత మణిశంకర్ అయ్యర్ ఆ ప్రసంగం నేనే రాశాను గానీ ఆ మాట మాత్రం తను నోరు జారి వుండొచ్చునన్నాడట! కాలు జారినా తీసుకోగలం గానీ నోరు జారితే తీసుకోలేంగా!? దాంతో ఆగాడా,సరిగ్గా యెన్నికలు ముంచుకొస్తున్నాయనగా బూటాసింగుని పంపించి తమ తరపున ముందుగానే "శిలాన్యాస్" చెయ్యమని పంపించాడు. వెళ్ళీన వాళ్ళు మసీదుని పడగొట్టకుండా బయట కడితే ముస్లిములు కాదనరు, శిలాన్యాస్ చేసి ఆలయనిర్మాణం మొదలెట్టాము గనక హిందువులూ సంతోషిస్తారనే ధైర్యంతో గుడ్డిగా ఒకచోట చేసి వచ్చేశారు!తీరా వీళ్ళు శిలాన్యాసం చేసొచ్చిన స్థలం వివరం చూస్తే అది ముస్లిముల కబరస్థాన్, పైగా తగాదాలో ఉంది! దాంతో ముస్లిములకి మండి ఆ యెన్నికల్లో కాంగ్రెసుని సాఫు చేసేశారు. హిందూమతాన్ని కావిలించుకోవడం అలవాటు లేని పని కావడంతో యెడాపెడా దెబ్బలు తిన్నారు - గీతాచార్యుడు పరధర్మం భయావహ మన్నది ఇందుకే?! స్వతంత్రం వచ్చాక మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం యేర్పడింది విశ్వనాధ ప్రతాప్ సింగ్ ప్రధానిగా! 

రామాలయ నిర్మాణ సంకల్పంతో భాజపా బలం ఒక్కసారిగా 2 నుంచి 85కి పెరిగింది!ప్రభుత్వాన్ని యేర్పరచటానికి సహాయం చెయ్యడంతో భాజపాకి మరింత హుషారొచ్చింది.భాజపాకి చెందిన లాల్ కృష్ణ అద్వానీ 1990 సెప్టెంబర్ 25న తన అధ్వర్యంలో రెండవ రధయాత్రను ప్రారంభించాడు. సోమనాధ దేవాలయం నుంచి బయలుదేరి అక్టోబరు 30కల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్వర్యంలో జరుగుతున్న కరసేవలో పాల్గొనడానికి అయోధ్యని చేరుకోవాలని ప్లాను. గొప్ప ప్రభావశీలమైన వక్త గనుక రామాయణం గురించి ఉపన్యాసాలు ఇస్తూ రధయాత్రని చాలా ఆకర్షణీయంగా చేశాడు. అసలు కిటుకు రాముడు ప్రజల్ని కన్నబిడ్డల్లాగ పరిపాలించమని చెప్పే ధర్మాన్ని రాజకీయనాయకులు పాటిస్తే ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లుతారు!వారు "అది మాత్రం అడుగవద్దు" అన్నట్టు ఉండటం వల్లనే ఈ గొడవలు వస్తున్నాయి. ప్రజలకి నీతులు చెప్పడానికే తప్ప అది తన బుర్రకి యేమాత్రం యెక్కించుకోలేదు ఈ దేశపు రాజకీయ నాయకులు, అది ప్రజల ఖర్మ!

అద్వానీ రధయాత్ర అయోధ్య చేరితే మసీదు కూలడం ఖాయమని అందరికీ తెలిసిపోయింది! దానితో యాత్రకి ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఆందోళనా పెరిగింది. యాత్ర చివరిదశలో ఉత్కంఠ గూడా పెరిగింది. రధయాత్ర మార్గంలోని రాష్ట్రాల ప్రభుత్వాధికారులకి తమ అధికార నిర్వహణ కత్తిమీదసాములాగ మారింది. రధయాత్ర మార్గంలో ప్రత్యక్షంగా హింస జరగకపోయినా పుకార్ల వల్ల కొన్ని చోట్ల పరోక్షంగా హింస చెలరేగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ యెక్కడ మతకల్లోలాలు జరిగినా అవి అప్పటి వరకూ ప్రశాంతంగా బతుకుతున్న అక్కడి ప్రజలు హఠాత్తుగా రెచ్చిపోయి ఇకరినొకరు చంపుకునేటంతగా ఒక్కసారి రెచ్చిపోయారనే ఆధారాలు లేవు! అలాంటి ప్రతి సంఘటన వెనకా హిందువుల్నీ ముస్లిముల్నీ కలవనివ్వగూడదనే ఒక వ్యూహం ఉంటుంది! పరిస్థితిని చక్కదిద్దడానికి వీపీ సింగు గారు స్వామినాథన్ కమిటీ వేశారు. అయోధ్య సమస్యకి అప్పటికీ ఇప్పటికీ ఉన్న మెలిక హిందువులకి గల క్షేత్రప్రాశస్త్యం పట్ల ఉన్న గట్ట్టి పట్టుదల,ముస్లిములకి ఒకదానికి వంగితే అన్నింత్లోనూ వంచుతారు గాబట్టి ఒప్పుకోకూడదనే మంకుపట్టు! కాబట్టి అప్పటి మేధావులు వారి సమాలోచనలలో రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సమస్యని పరిష్కరించడం తప్ప ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడం అసాధ్యమని తేలిపోయింది!ప్లాను:మసీదు చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ప్రభుత్వం సేకరించి విశ్వ హిందూ పరిషత్ వారికి అప్పగించటం,బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం అట్టే పెట్టుకుని సుప్రీం కోర్టుకు విచారణ నిమిత్తం అప్పగించడం మంచిదబి నిర్ణయించారు!అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిన మొదట్లోనే జిల్లానీ గారు ప్రధానిని వ్యక్తిగతంగా కలిసి తమ అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా ఆర్డినెన్సు ద్వారా అయోధ్య సమస్యని పరిష్కరించడాన్ని వ్యతిరేకించాడు.ఆఖరుకి అప్పటి ప్రధాని చెయ్యగలిగింది మొదట ఒక ఆర్డినెన్సు చెయ్యటం,మరొక ఆర్దినెన్సుతో దాన్ని క్యాన్సిల్ చెయ్యటం!ఈ పిల్లిమొగ్గలతో అప్పటి కేంద్రప్రభుత్వాన్ని భాజపా వ్యతిరేకించటం,ఆ విభేదాల ప్రభావంతో బీహారు దాకా చేరిన అద్వానీ గారిని అరెస్టు చెయ్యటంతో రధయాత్ర ఆగిపోయింది!

అక్కడ అయోధ్యలో పరిస్థితి కూడా మరింత సంక్లిష్టంగా తయారయి కూర్చుంది!కరసేవకుల్నినియంత్రించడానికి సెక్యూరిటీ యెక్కువ చేశారు.అయినా లాభం లేకపోయింది - అనర్ధం జరగనే జరిగింది!యెలాగోలా తప్పించుకుని లోపలికి వెళ్ళిన కొందరు మసీదుని కూల్చడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు మరోదారి లేక కాల్పులు జరపాలి వచ్చింది.కొందరు కరసేవకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.రామాలయ నిర్మాణం ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవడమే తప్ప యే హిందువూ ఒక్క ముస్లిముని కూడా చంపలేదు!అయినా ముస్లిములు జాలితోనైనా రామాలయ నిర్మాణానికి సానుకూలంగా ప్రతిస్పందించడం లేదు,యెంతకాలమీ కఠినత్వం చూపిస్తారు? రధయాత్ర సమయంలో జరిగిన అల్లర్లలో ప్రాణాలు పోగొట్టుకున్న ముస్లిములకూ కరసేవ సందర్భంగా జరిగిన కాల్పులలో మరణించిన కరసేవకులకూ పేరుపేరునా శిరసా ప్రణామం!

5.అయోమయం ప్రభుత్వాల నిర్వాకంతో మసీదు కూలిపోయింది!
రధయాత్రని నిలుపు చేసి కరసేవని ఆపేసిన కారణంగా భాజపా వీపీ సింగు పీక నొక్కేసింది.అవిశ్వాస తీర్మానంలో సభ విశ్వాసం పొందలేక వీపీ సింగ్ దిగిపోతే ఈసారి కాంగ్రెసు రంగంలోకి దిగి తనకి తోలుబొమ్మలా ఉపయోగపడే చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని యేర్పాటు చేసింది!ఈయన అవడానికి మంచి పార్లమెంటేరియనే గానీ యెంత గొప్పవాడి కయినా వేపకాయంత వెర్రి ఉంటుందన్నట్టు యెప్పటికయినా ప్రధాని అవ్వాలనే దురద ఒకటి తొలుస్తూ ఉండేది - కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు అదిప్పుడు తీరింది!అయోధ్య సమస్యని పరిష్కరించాలనుకున్న వాళ్ళందరిలోకి కాస్త తెలివైన పధ్ధతి ఫాలో అయింది ఇతనే!సుబోధ్ కాంత్ సహాయ్ నేత్ర్త్వంలో 8 మంది హిందువులు,8 మంది ముస్లిములు,రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఒక కమిటీ వేశాడు.రెండువైపులా దస్త్రాలు,మ్యాపులూ,కోర్టు తీర్పులూ లాంటి సామగ్రితో సిధ్ధం అయ్యారు - ఇప్పటివరకూ ఉర్రూతలూపిన సెంటిమెంటు స్థానంలోకి అసలు మసీదుని గుడిని కూల్చి కట్టారా అనే విచికిత్స వచ్చి చేరింది - కొంచెం మెరుగే!ఈలోపు రాజీవ్ గాంధీని యే పురుగు కుట్టిందో మామీద నిఘా పేట్టింది చంద్రశేఖర్ ప్రభుత్వం అని హడావిడి చేసి మద్దతు ఉపసంహరించుకోవడంతో దేశం యెన్నికలకి సిధ్ధమయింది.ఈ యెన్నికల ప్రచారం లోనే 1991 మే 21న శ్రీలంక తమిళ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో హతమై పోయాడు!ఆ సానుభూతి పనిచేసి కాంగ్రెసు మంచి మెజారిటీతో గెల్చి కాంగ్రెసులో నెహ్రూ కుటుంబానికి సంబంధించని తొలి వ్యక్తి పి.వి.నరసింహా రావు ప్రధాని అయ్యాడు.అయోధ్య యే రాష్త్రంలో అయితే ఉందో ఆ ఉత్తర ప్రదేశ్ మాత్రం భాజపా హస్తగతమయింది!

రాష్ట్రప్రభుత్వం రామాలయ నిర్మాణానికి అనుకూలమే గాబట్టి సాధువులు 1992 జులైలో రామభక్తు లందరికీ రామాలయ నిర్మాణానికి ఆహ్వానాలు పంపారు!అప్పటికే ప్రభుత్వం మసీదు చుట్టుపక్కల భూమిని స్వాధీనం చేసుకుని ఉన్నది!ఇదివరకు ఆగిపోయిన కరసేవ స్థానంలో ఈసారి యేకంగా రామాలయ నిర్మాణానికే సిధ్ధమై పోయారు.ప్రధానమంత్రి కలగజేసుకుని సాధువులతో మాట్లాడి మూడు నెలలు ఆగమంటే వాళ్ళు కూడా మూడు నెలలే కదా అని సరే నన్నారు.అక్టోబరులో గతప్రభుత్వం కొంత ఆశావహంగా కనిపించిన పనినే మళ్ళీ ఆ సుబోధ్ కాంత్ సహాయ్ ఆధ్వర్యంలో మొదలు పెట్టమన్నాడు.కానీ గడువు ముగిసిపోగానే విశ్వ హిందూ పరిషత్ మళ్ళీ పని మొదలెట్టటానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వచ్చాయి.బతికితే రామభక్తి సామ్రాజ్యం చస్తే వైకుంఠం అనేటట్టున్న వాళ్ళని దేంతో భయపెట్టగలరు?దేంతో కొనగలరు?వాళ్ళంతే,యెవ్వరి మాటా వినరు!ఇటువైపు నుంచి ముస్లిములు కూడా వాళ్ళ ప్రయత్నాల్ని ఆపకుండా ఈ చర్చల్ని కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.మళ్ళీ కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేయించగలిగారు - అదే 1992 డిసెంబర్ 6!

నవంబరు నుంచే భక్తుల సంఖ్య పెరుగుతూ కదలికలు అనుమాస్పదంగా ఉండటంతో భాజపా అగ్రనాయకులైన అద్వానీ వాజపేయిలతో ప్రధానమంత్రి సమవేశ మయ్యాడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కూడా హాజరయ్యాడు. చర్చల్లో అగ్ర నాయకు లిద్దరూ మసీదుకు యేమీ జరగనివ్వం అని వాగ్దానం చేశారు. మొదట్లో రాష్త్రపతి పాలన పెట్టవచ్చుననే ఊహాగానాలూ వచ్చాయి. కానీ అది శాంతిభద్రతలు మరీ దిగజారిన పక్షంలోనే అటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే సాంకేతిక కారణం వల్ల ప్రధానమంత్రి అందుకు సుముఖత వ్యక్తం చెయలేదు. ముందుగానే అతిగా స్పందించకుండా పరిస్థితి తీవ్రతని బట్టి నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానమంత్రి అభిప్రాయం. యెందుకంటే పంజాబులో స్వర్ణ దేవాలయం మీద అప్పటి ప్రధాని చేసిన సైనిక చర్య ప్రభావం అతనికి తెలుసు గనక!ఆనాటి సైనిక చర్య అప్పటి ప్రధాని ఇదే రాజనీతిజ్ఞుడు సలహాదారుడుగా ఉండి వద్దన్నా వినకుండా చేసిన భీబత్సమయిన పని తను చెయ్యగూడదని కూడా అనుకుని ఉండవచ్చు! ఇంటిలిజెన్స్ కూడా ప్రమాదకరమిన సంకేతాలు ఉన్నట్టు ధృవీకరించ లేదు. అక్కడ యేం చెయ్యదలుచుకున్నారు అన్నదాని మీద హిందువుల వైపు నుంచి రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి! కొందరు రామాలయం నిర్మించడానికి వీలుగా మసీదుని వేరే చోటికి తరలిస్తామని చెప్తే కొందరు కరసేవ అంటే చీపుళ్ళతో శుబ్రం చెయ్యడం మాత్రమే అని నిర్వచనాలు చెప్తుండే వాళ్ళు - మొదట్లో కూల్చివెయ్యడం వాళ్ళ మాటల్లో రాలేదు! అక్కడికీ ముస్లిం ప్రతింధులు ప్రధానిని,"ఒకవేళ వాళ్ళు నిజంగానే మసీదుని కూల్చితే మీరు చెయ్యగలిగిందేమిటి?" అనడిగితే,"మీరు భారతదేశ ప్రధానితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి! భారత సైన్యాలు 24 గంటల్లోగా పొరుగు దేశాల్ని కూడా చేరగలవు, అయోధ్యని చేరుకోలేవా?" అన్నాడు ధీమాగా!

అతని ధైర్యాన్ని పటాపంచలు చేస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రజల నుంచి రామాలయ నిర్మాణానికి అనుకూలమైన తీర్పుతో అధికారంలోకి వచ్చిన కల్యాణ్ సింగ్ అతనికి సహకరించకపోవడంతో ఆ ఒక్కరోజులోనే సుమారు 460 సమత్సరాల తర్వాత ఒక ప్రాచీన కట్టడం నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది! మొదటి కరసేవ నాడు చెయ్యాలనుకుని చెయ్యలేని వారు ఈసారి మరింత పట్టుదలతో పరిశ్రమించి తమ చిరకాల వాంచని నెరవేర్చుకున్నారు! ఆ తరువాత సంవత్సరం పాటు యెన్నో మతపరమయిన విద్వేషాలకు సంబంధించిన అల్లర్లతో దేశమంతా అట్టుడికిపోయింది! ఇవన్నీ నిజంగానే భారతీయ ముస్లిము సమాజమంతటికీ రామాలయ నిర్మాణం పట్ల ఉన్న వ్యతిరేకతకి నిదర్శనమా? అవకాశం దొరికినప్పుడల్లా దేశాన్ని అభాసుపాలు చెయ్యడానికి చూస్తున్న విదెశీశక్తుల విషప్రచార ఫలితమా! ఓ గొప్ప విషయం ఏమిటంటే అయోధ్య స్వాభిమాన పోరాటంలో ఏ ఒక్క ముస్లిం కూడా ప్రాణాలు పోగొట్టుకోలేదు అలాగే ముస్లిం లపై ఎక్కడా హిందువులు దాడి చేయలేదు, కాబట్టి సచ్చా ముసలమాన్ ఎవరూ అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించడు. వాడుక భాషలో అందరూ మసీదు అని పిలవడం వలన ఇక్కడ మసీదుగా సంభోదించడం జరిగింది, కానీ అది ఒక కట్టడం మాత్రమే ఎందుకంటే ముస్లిం లు దానిని మసీదుగా నిరూపించలేకపోయారు. -హరిబాబు సూరనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. హరి బాబు గారు చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete