Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనది Give and Forgive సంస్కృతి - About Guru purnima in telugu

భారతీయతలో గురువుకి గొప్ప స్థానం ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా గురువును కొలుస్తారు. వేల సంవత్సరాల క్రితమే కృష్ణద్వైప...


భారతీయతలో గురువుకి గొప్ప స్థానం ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా గురువును కొలుస్తారు. వేల సంవత్సరాల క్రితమే కృష్ణద్వైపాయనుడు లేదా వేదవ్యాసుడు వేదరాశిని విభజించి నాలుగు వేదాలను, అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, భాగవతాన్ని మనకు అందించాడు. వేదవ్యాసుని జన్మదినాన్ని గురు పౌర్ణమిగా నిర్వహించడం మన సమాజంలో భాగమైంది.

ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితులలోనైనా గురువు అనుగ్రహం కారణంగానే సుఖాలను గానీ, శాంతిని గానీ పొందుతుంటాడు. దేశానికి ఎలాంటి జెండా ఉండాలన్న చర్చ వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెస్‌ 1931‌లో పతాక రూపకల్పనకు సంఘాన్ని ఏర్పాటు చేసింది. అందులో సర్దార్‌ ‌పటేల్‌, ‌నెహ్రూ, మౌలానా వంటి నాయకులు ఉన్నారు. ఈ సంఘం దీర్ఘచతురస్రా కారంగా ఉండి, ఒకే రంగుతో కాషాయధ్వజాన్ని, దానిలో నీలి రంగు చరఖా గుర్తుతో జాతీయ జెండాను సూచించింది. ఆ సంఘంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారు లేరు. కాబట్టి అది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ధ్వజం కాదు.

కాషాయ ధ్వజం మన చరిత్ర, మన పరంపరకు గుర్తు. సిక్కుల పదవ గురువు గురు గోవిందసింహ గురుగ్రంథ సాహెబ్‌ను రచిస్తూ ‘గురుగ్రంథ సాహెబ్‌’ ‌తన తదనంతరం గురువు అని నిర్ణయించారు. కారణం గురుగ్రంథ సాహెబ్‌లో భారత పరంపరలోని గొప్పతనం ఉంది. అంటే తన తదనంతరం వ్యక్తి గురువుగా ఉండరు అని నిర్దేశించారు. ఈ రోజు ప్రపంచం నలుమూలల ఉన్న లక్షలాది సిక్కులకు గురువాణి రూపంలో ఆ గ్రంథం మార్గదర్శనం చేస్తున్నది. ఇది తత్త్వరూపమేగాని వ్యక్తికాదు. అలాగే ఏకలవ్యుని ఉదాహరణ. నేరుగా కాకుండా గురువు బొమ్మ పెట్టుకొని విలువిద్య అభ్యసించాడు. కనుక శ్రద్ధ ఉన్నప్పుడు గురువు మార్గదర్శనం తప్పక లభిస్తుంది. ఆంగ్లంలో టీచర్ అంటే ఉపాధ్యాయుడు, లెక్చరర్ అంటే ఉపన్యాసకుడు, ప్రొఫెసర్ అంటే ఆచార్యుడు కాని గురువు కి ఆంగ్లంలో సరైన పదమే లేదు. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘాన్ని ప్రారంభించాక డాక్టర్జీ మన సంస్కృతికి ప్రతీక, త్యాగానికి గుర్తుగా, వేల సంవత్సరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన కాషాయధ్వజాన్ని మనకు గురువుగా అందించారు.

ఆ రోజుల్లో (1927 సంవత్సరంలో) డాక్టర్జీ స్వయంగా తనే గురువుని అని ప్రకటించుకొని ఉంటే వ్యతిరేకించేవారు ఎవరూ లేరు. కానీ డాక్టర్జీ అలా చెప్పుకోలేదు. ‘సమాజంలో ఒక సంఘటన’ కాకుండా, సమాజం మొత్తాన్ని సంఘటితం చేయడానికి ఆవిర్భవించినది సంఘం. సంఘం ఒక ఉదాత్త శాశ్వత లక్ష్యం కోసం పనిచేస్తుంది. అందుకే ఈ సమాజం మొత్తానికి మార్గదర్శనం చేయగల భగవాధ్వజాన్ని డాక్టర్జీ సంఘానికి గురువుగా అందించారు.

సమర్పణ అంటే…. ఎందుకు?

దధీచి మహర్షి తన తపోశక్తితో దేహాన్ని చాలించి వృత్తాసుర సంహారం కోసం దేవతల సేనా నాయకుడైన దేవేంద్రుడికి తన వెన్నెముకని సమర్పించాడు. ఆ వెన్నెముకను వజ్రాయుధంగా మలచిన దేవేంద్రుడు రాక్షస సంహారం పూర్తి చేశాడు. ధర్మ సంరక్షణకు ప్రాణాలర్పించిన దధీచి మనకి ఆదర్శప్రాయుడు.

లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంపై కొలువై ఉంటుందని పురాణాలు చెబుతాయి. శరీరానికి కావలసిన రక్తం హృదయం ద్వారానే సరఫరా అవుతుంది. ప్రతిరోజు కూడా ఇంత రక్తం అన్ని అవయవాలకు అందజేస్తున్నాను, కొద్దిసేపు నావద్ద ఉంచుకోవాలని హృదయమనుకుంటే ఏమవుతుంది? కానీ హృదయం అలా అనుకోదు. కొద్దిసేపు కూడా తన వద్ద రక్తాన్ని ఉంచుకోకుండా కొట్టుకుంటున్నంత కాలం అదే వేగంతో ప్రతీ అవయవానికీ అందిస్తూ ఉంటుంది. ప్రతీ అవయవం పనిచేయడానికి, హృదయం పని చేయడానికి కూడా రక్తం అవసరం. తనకి ఎంత కావాలో అంతే ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని గుండె శరీరానికి పంపినట్లు మనం ఉండాలి. సంపాదించాలి. గౌరవంగా బ్రతకడానికి కావలసినంత ఉంచుకొని మిగిలింది సమాజానికి, ధర్మ కార్యాలకు అందించాలి. అందుకే లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలవాసిని అయింది. త్యాగంతోనే అమృతత్వం.

‘న ప్రజయా, న కర్మణా, న ధనేన
త్యాగేనైకే అమృతత్వ మానశుః’


అని కైవల్యోపనిషత్తులో పేర్కొన్నారు. చేస్తున్న పనుల (కర్మల) వల్లగానీ, సంతానం వల్లగానీ, ధనం వల్లగానీ అమరత్వం లభించదు. కేవలం త్యాగం వల్లనే సిద్ధిస్తుందని అర్థం. ఇది హైందవ సిద్ధాంతం. ‘పరోపకారార్ధంమిదం శరీరం’ అనే జీవిత పరమార్థం భారతీయ సంస్కృతికి, త్యాగభావనకు అద్దం పడుతుంది. విశ్వగురు స్థానం పొందే క్షమత ఈ మట్టికి ఉంది. అయితే ఆచరించే వారిని తయారు చేయాలి. పరాక్రమంతో, త్యాగబుద్ధితో ఇది సాధ్యం. పరాక్రమం ఎందుకు? ధర్మస్థాపనకు! త్యాగం ఎందుకు? ఇది నాది కాదని భావన కలిగించేందుకు. మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం ఇది. ఇతర జీవరాసులకు మనుషులకు తేడా ఇదే. లఘు అంటే చిన్నది. గురు అంటే పెద్దది. సెంటర్‌ ఆఫ్‌ ‌గ్రావిటీని గురుత్వాకర్షణ శక్తి అంటారు. అలాంటి సెంటర్‌ ఆఫ్‌ ‌గ్రావిటీని భారత్‌ ‌పునఃస్థాపన చేయాలి.

ధర్మమే ఆధారంగా ఉన్న మన దేశంలో ఈ త్యాగ భావన కుటుంబం నుండే వికసించింది. కుటుంబ పెద్ద తనకన్నా కుటుంబంలోని అందరి అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యమిస్తాడు. ఇదే సమాజానికి వర్తింపచేయడం మనకు అలవాటయింది. సమాజ పరమేశ్వరుని ముందర నేను చిన్న వాడిని. సమాజమనే విరాట్‌ ‌పురుషునిలో నేనొక అవయవ స్వరూపాన్ని. కనుక మనల్ని పోషిస్తున్న సమాజం ముందు నా అవసరాలు చిన్నవి, సమాజం అవసరాలు పెద్దవి అని సమర్పణ గావించాలి. అందువల్ల అహంకార విముక్తి అవుతుంది. భారతీయుల ఆలోచన Give and Forgive ఈ విధంగా ఉంటే పాశ్చాత్యుల ఆలోచన Get and Forget లా ఉంటుంది. కాబట్టి మనది ఇచ్చే సంస్కృతే గానీ లాక్కునే సంస్కృతి కాదు.

జీవనేయావదా దానం – స్యాత్‌ ‌ప్రదానం తతోధికం
ఇత్యేకం ప్రార్థనా స్మాకం – భగవన్‌ ‌పరిపూర్యతే.


సమాజం శాశ్వతం. నేను అశాశ్వతం. కనుక నేను పొందిన దానికన్నా అధికంగా సమాజానికి తిరిగి ఇవ్వాలి. ‘ఓ భగవంతుడా! నా ఈ ప్రార్థనను మన్నింపుము’ అనేది అనాది కాలంగా మన ప్రార్థన.

ప్రపంచంలోని ఇతర దేశాలు, ఇతర సిద్ధాంతాలు ఎలా బతకాలో నేర్పితే హిందుత్వం మాత్రం ఎందుకు బతకాలో నేర్పింది.

రాజస్తాన్‌కు చెందిన బామాషా అనే వ్యాపారి దేశదేశాలు తిరిగి వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించాడు. తిరిగి వచ్చాక దేశంలో అక్బర్‌ అరాచకాలతో హిందువులు పడుతున్న కష్టాలను గమనించి అక్బర్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్న రాణా ప్రతాప్‌ ‌వద్దకు వెళ్లి తాను సంపాదించిన మొత్తం సమర్పించాడు. సుమారు 450 సంవత్సరాల తర్వాత కూడా బామాషాను ‘తాను సంపాదించినందుకు కాదు, సంపాదించినది ఉన్నత లక్ష్యం కోసం సమర్పించినందుకు’ ఈ సమాజం గుర్తుంచుకుంటుంది. సమాజానికి మహిళల సాధికారత చాలా ముఖ్యం. మహిళా సాధికారత కోసం 2014లో రాజస్తాన్‌ ‌ప్రభుత్వం బామాషా యోజన ప్రారంభించింది.

సంఘం – సమర్పణ

సంఘ ఆరు ఉత్సవాల్లో ఒకటి గురుపూజ. ఆషాఢ పౌర్ణమికి చేస్తాం. సంఘం నాది, సంఘం మనది అనే భావనతో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు స్వయంగా ఉత్సవంలో పాల్గొని ధ్వజానికి ప్రణామం చేసి, పూజ చేసి సమర్పణ చేస్తారు. ఇది విరాళం కాదు. నిధి సేకరణ కార్యక్రమం కాదు. మెంబర్‌ ‌షిప్‌ ‌కాదు. భక్తిశ్రద్ధలతో సమాజానికి సమర్పించుకునే సమర్పణ ఇది. సంఘం తన కోసం ఏ రోజూ విరాళాలు సేకరించలేదు, సేకరించదు. సేవా కార్యక్రమాల కోసం, సేవా ప్రకల్పాల కోసం, విద్యా సంస్థల నిర్వహణ కోసం ప్రజలే విరాళాలు ఇచ్చి భాగస్వాములై నిర్వహించే విధంగా సంఘం ప్రోత్సహిస్తుంది.

స్వయం సమృద్ధి సాధించే దిశలోనే డాక్టర్జీ సంఘాన్ని గురించి ఆలోచన చేశారు. సంఘం కోసం సమయం ఇచ్చే ప్రతివ్యక్తి కూడా ఈ పని నాది అనే భావనతోనే సమర్పణ చేస్తాడు. గురుదక్షిణ ఇచ్చేటప్పుడు తమ పేరు, ప్రచారం, పుణ్యం ఏమీ ఆశించకుండా సమర్పణ చేస్తున్నారు. కాబట్టి సంఘంలో గురుదక్షిణ భక్తి శ్రద్ధలతో, సమర్పణ భావంతో చేస్తాం. ఎక్కడ ఉన్నా గురుదక్షిణ నా బాధ్యత అనే భావంతో స్వయంగా వెళ్లి వినమ్ర భావంతో భగవాధ్వజం ముందు సమర్పణ చేస్తాం.

సంఘం కోసం ప్రతిరోజూ ఒక గంట సమయం ఇవ్వాలి. అదేవిధంగా మన సంపాదనలో కొంత శాతాన్ని సంఘానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక దేవాలయానికి ఒక పాఠశాలకు ఒక ఆసుపత్రికి డబ్బులు ఇవ్వవచ్చు. అయితే ఎంతటి భవంతి కట్టినా, దానిని నిర్వహించే చక్కటి వ్యక్తి లేనప్పుడు అది వృధా. అలాంటి సమాజ హితాన్ని ఆలోచన చేసి సమాజ కార్యాన్ని స్వంత కార్యంగా భావించి పని చేసే లక్షలాది మంది స్వయంసేవకులను తయారుచేసే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ శాఖ చాలా కీలకమైనటు వంటిది, ముఖ్యమైనది.

సంఘం వ్యక్తి కేంద్రం కాదు. వ్యక్తి ఆధారం. డాక్టర్జీ స్వర్గస్తులైనప్పుడు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ఈస్‌ ‌ద షాడో ఆఫ్‌ ‌డాక్టర్‌ ‌హెడ్గేవార్‌’ అని బయటి వారు అనుకున్నారు. అంటే డాక్టర్జీ తర్వాత సంఘం కనుమరగవుతుందని భావించారు. డాక్టర్జీ గొప్పదనం ఏమిటంటే సంఘాన్ని వారి నీడగా వారు పెంచలేదు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం స్థాపన జరిగిన 99 సంవత్సరాల కాలంలో సంఘం మూడు నిషేధాలను ఎదుర్కొని వాటిని నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా పెరుగుతూనే ఉంది.

ఆరుగురు సర్‌ ‌సంఘచాలకులు మారిన తర్వాత కూడా సంఘం ఒక్కటిగానే ఉంటూ, పెరుగుతూనే ఉంది. సంఘం నాది అని భావించి సంఘం కోరిన విధంగా జీవించే కోట్లాది కుటుంబాలు వారి హృదయాలలో సంఘం పట్ల వారికి ఉన్న అచంచల విశ్వాసం భక్తి శ్రద్ధలే దీనికి ఆధారం.

సమాజ సంఘటనా కార్యం అన్నిటికంటే శ్రేష్ఠమైనది. కాబట్టి దానిని సాధించడంలో 99 సంవత్సరాలుగా సాధన చేస్తున్న సంస్థలో ఒక బాధ్యత తీసుకోవాలి. దానికి తగినట్టుగా పనిచేసి ‘రాబోయే కొద్ది సంవత్సరాలలో భారత దేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్లడంలో నా జీవితాన్ని కూడా భాగస్వామ్యం చేస్తాను’ అని సంకల్పించుకోవడం నేటి ఆవశ్యకత.  శ్రీరాం భరత్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య సహక్షేత్ర ప్రచారక్. (ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక).

No comments