SocialReformers

SocialReformers
సమాజ సమరసతకు పాటుపడిన మహనీయులు
అయోతిదాస్: పద్దెనిమిదవ శతాబ్దాంతంలో వచ్చిన కులనిర్మూలన ఉద్యమాల్లో గొప్ప కృషి చేసిన వ్యక్తి. కులం వల్ల మనిషి పతనం చెందుతాడని మన అభివృద్ధికి కులం గొడ్డలి పెట్టు లాంటిదని నమ్మిన సంస్కర్త. తమినాళడు ప్రాంతంలో బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశాడు.
అయ్యంకాళి: 1863-1941 మధ్యలో జీవించిన అయ్యంకాళి ట్రావెన్ కూర్ మహారాజుకు వ్యతిరేకంగా నీళ్లమీద దుంగలు, కట్టెలు వేసి మొదటి వ్యవసాయ కార్మిక సమ్మె చేసిన వ్యక్తి గా చరిత్రకు ఎక్కినాడు. దళిత ఉద్యమాలను ధీరత్వంతో నడిపిన మహా నాయకుడు. నిరక్షరాస్యుడైన అయ్యంకాళి కేరళలో ఆలయప్రవేశం చేయించడంలో ప్రసిద్ధ ఉద్యమకారుడిగా పేరుపొందాడు.
జి.యస్.బి. సరస్వతి: 1878 లో చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని 'మల్లవరం'లో నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 'గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి'ని జి.యస్.బి. సరస్వతిగా పిలుస్తారు. ఆలయన పూర్వనామం రామకృష్ణయ్య. తర్వాత సన్యాసం తీసుకొని నెల్లూరులో ఆశ్రమం స్థాపించి స్త్రీ, శూద్రులకు వేదాధికారం ఉందని నిరూపించారు. ఆయన రాసిన ' జయార్ధ ప్రకాశిక'లో అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఈయన రచించిన 'పంచముల చరిత్రము' కూడా ప్రసిద్ధమైంది. రెడ్డి, కమ్మ, బలిజ కులస్థులతో పాటు శూద్రులందరికీ వేదాధికారం ఉందని ఉద్యమం నడిపారు.
తుక్డోజి మహారాజ్: 20వ శతాబ్దిలో మరాఠీ ప్రాంతంలో జన్మించిన ఆధ్యాత్మిక కవి. తుకారాం, నామదేవ్, ఏక్ నాథ్ లాగానే కులాన్ని నమ్మకుండా దేవుణ్ణి నమ్మినవాడు. మరాఠీలో గొప్ప సాహిత్యం సృష్టించాడు. స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడు. అలాగే ఎన్నో సామాజిక ఉద్యమాలు నడిపాడు.
పండిత్ లేఖారాం: ఆర్య సమాజం లో ప్రముఖమైన నాయకుడు. ఆర్య సమాజం ధర్మవీర్ పండిత్ లేఖారాం పేరుతో పుస్తకం విడుదల చేసింది. మిర్జాపూర్ లో సనాతనపండితులతో వాదోపవాదం చేసి శూద్రునికి ఉపనయనం చేయించిన సాహసికుడు. అలాంటి గొప్ప వ్యక్తి ని ఓ ముస్లిం మతోన్మాది హత్య చేశాడు.
దాసగణు మహారాజు: షిరిడీసాయి ప్రముఖ భక్తులు. జన్మరీత్యా బ్రాహ్మణ కులానికి చెందిన దాసగణు కుల వ్యవస్థ పై నిర్దాక్షిణ్యమైన దాడి చేస్తూ రాసిన ఈ మాటలు కుల వ్యతిరేక పోరాటంలో షిరిడీసాయి స్ఫూర్తికి అద్దం పడతాయి.
"బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి పుట్టారట! ఇదేం చోద్యం? ముఖం నుడే ఉత్పత్తి అయ్యారని వారనుకుంటే వారు సూక్ష్మరోగ క్రిములతో 'సమానులు కారా? ఎందుకుంటే సూక్ష్మజీవులే అలా ముక్కు చీమిడినుండి, నోటి
గళ్ల నుండి బహిర్గతమవుడానికి వీలవుతుంది. అటువంటివారికి అసలు ఎందుకు 'నమస్కరించాలి? తోకపురుగు ఎప్పటికైనా సింహం అవుతుందా? దానికి ఎప్పుడైనా 'దైవత్వం సంభవిస్తుందా?... (విజయవిహారం, ఏప్రిల్ 2001
పుట. 16)
ఉన్నవ లక్ష్మీనారాయణ: మాలపల్లి (1922) అనే ప్రసిద్ధ నవల రచయిత. తెలుగు సాహిత్యం లో దళితుల జీవితాన్ని కళ్లకు కట్టిన నవల. 4 డిసెంబరు 1877 లో గుంటూరు జిల్లా 'తుములూరు పాడు' లో జన్మించారు హరిజనుల సమస్యలు చదువరుల్లో వ్యాప్తి చెందడానికి ఈ నవల ఉపయోగపడింది.
అరిగే రామస్వామి: 20 వ శతాబ్దానికి తెలంగాణ సామాజిక ఉద్యమకారుల్లో ప్రముఖులు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. 1895 లో హైదరాబాద్ కుమ్మరిగూడ లో జన్మించారు. 1925 లో కవాడిగూడ లో దళిత కన్యను దేవదాసీగా మారుస్తుంటే వెళ్లి అడ్డుకొని, కొంతకాలం తర్వాత ఆమెకు వివాహం జరిపించారు. అంబేద్కర్ మతం మారుతానంటే వద్దని చెప్పడానికి బొంబాయి వెళ్ళి ఆయనతో చర్చించారు.
బి.ఎస్. వెంకట్రావు: హైదరాబాద్ అంబేద్కర్ గా పేరొందిన వెంకట్రావు భాగ్యరెడ్డి వర్మ తో కలిసి సామాజిక సంస్కరణలు పని చేశారు. తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమ స్ఫూర్తి గా నిలిచాడు. హైదరాబాదు
'బంగారు బస్తీ' లో జన్మించారు. డిప్రెస్స్డ్ క్లాస్ అసోసియేషన్ నాయకునిగా పనిచేశారు. బోయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయం వీరి కార్యస్థానం.
గురజాడ అప్పారావు: లోకమందున యెంచి చూడగ మంచి చెడ్డలు రెండు కులములు. మంచియన్నది మాల అయితే నే మాలనే యగుదున్ అని చెప్పిన కవి. కులతత్వం, చాందస మనస్తత్వం నిరసించాడు.
గుఱ్ఱం జాషువా: కవికోకిలగా పేరొందిన గుఱ్ఱం జాషువా 'గబ్బిలం' పేరుతో గొప్ప ఖండకావ్యం రచించాడు. 28 సెప్టెంబర్ 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. గొప్ప దేశభక్తుడైన జాషువా ఎనోన రచనలు చేశారు.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపురే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళాభళయన్నవారె, నీ
దే కులమన్న ప్రశ్నవెలయించి చివాలుని లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గున్
అని బాధపడ్డాడు. ఆయన రచనాశక్తే అతణ్ణి గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది.
భోయి భీమన్న: 1911 సెప్టెంబర్ 9న తూ.గో. జిల్లా మామిడికుదురులో జన్మించారు. దళిత కవిగా ప్రసిద్ధి చెందిన ఈయన హిందుత్వవాది. భీమన్న రాసిన 'పాలేరు' నాటకం దళితుల జీవన స్థితిగతులను తెల్పుతుంది. కృణ్వంతో విశ్వమార్యం ప్రపంచ మానవులంతా ఆర్యులు కావాలనే పిలుపును ఇచ్చాడు.
కుసుమ ధర్మన్న: దళిత కవి గా తెలుగు ప్రాంతంలో పేరొందిన ఈయన దళితుల సమస్యల్ని తన రచనల్లో చక్కగా చిత్రీకరించారు.
కోమటి వెంకన్న: ప.గో. జిల్లా పాలకొల్లు గ్రామంలో 1764లో వైశ్యకులంలో జన్మించాడు. సంస్కృతం, వేదం అభ్యసించిన ఈ వైశ్యుడు తన కొడుకు తానే ఉపనయనం చేశాడు. ఇది సహించని పురోహితవర్గం గొడవపడి కోర్టుకెక్కారు. ఆఖరుకు ఇది లండన్ ఏవికాన్సిల్ దాకా వెళ్లింది. అలా జ్ఞానం కోసం పోరాడిన చరిత్ర కోమటి వెంకన్నది.
జాయా కారాజాలింగు: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈయన కులనిర్మూలనకు కృషి చేసినటు తెలుస్తుంది. ఇతనిపై అధ్యయనం జరగాల్సి ఉంది.
స్వామి కేశవానంద: ఢాకాలో నివసించిన 'జాట్' కులస్థుడు. 'మరుభూమి సేవాకార్య' అనే ఇతని పుస్తకం లోతైన పరిశోధన గా కనిపిస్తుంది. బాల్య వివాహాలు, అస్పృశ్యత నివారణ అంధవిశ్వాసాల నిర్మూలన, మద్యనిషేధం, నైతికజీవనం. ఇవన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించిన గొప్ప వ్యక్తి. 1917 ఆగష్టులో సాంగ్రియాలో 'గ్రామోత్తక విద్యాపీఠం' పేరుతో బాలికల పాఠశాల స్థాపించాడు.
గోపాల్ గణేష్ అగార్కర్: సతారా జిల్లా గెంబణ గ్రామంలో 14 జూలై 1856 లో జన్మించాడు. 1880-81లో తిలక్ స్థాపించిన కేసరి పత్రిక ప్రథమ సంపాదకుడు. ఈ యన బ్రాహ్మణ కులంలో జన్మించిన సామాజిక సంస్కర్త, సుధాకర్ అనే పుస్తకంలో ఈయన అస్పృశ్యతా నివారణ, కులతత్వనిరనన, వితంతు పునర్వివాహాలు ప్రతిపాదించాడు. ' పుట్కేనషీల్' అనేది ఈయన జీవితచరిత్ర.
సహోదరన్ అయ్యప్పన్: 21 ఆగస్టు 1889 లో కేరళలో ఎజువా కులంలో జన్మించాడు. నారాయణ గురు సిద్ధాంతాలను బయటి ప్రపంచానికి తెలిపినవాళ్లలో ప్రముఖుడు. సామాజిక సంస్కర్త ఆలోచనాపరుడు, పాత్రికేయుడు, రాజకీయవేత్త. ఇన్ని పాత్రల్లో తన భాగస్వామ్యం నెరపి కులతత్త్వానికి, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేసాడు.
డా|| పద్మనాభన్ పలుపు: 2 నవంబర్ 1863 లో త్రివేంద్రం దగ్గర గల 'పెట్టా'లో జన్మించాడు. ఈయన సంపన్నమైన 'జువా' కుటుంబం లో జన్మించాడు. నారాయణగురు శిష్యుల్లో ప్రముఖుడు. గురువు సిద్దాంతాలు బయటి ప్రపంచానికి తెలిపిన సంస్కర్త. నారాయణ గురు చేస్తున్న ఉద్యమాన్ని స్వామి వివేకానందను కలిసి వివరించాడు. నారాయణగురు స్థాపించిన శ్రీ నారాయణ ధర్మపరిపాలనయోగం సంస్థకు ప్రథమ అధ్యక్షుడు.
కుమారన్ ఆసన్: 12 ఏప్రిల్ 1873 లో ఎజువా కులంలో జన్మించాడు. మహాకవిగా మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బిరుదు పొందిన ఈయన గొప్ప కవి. తత్వవేత్త గా పేరొందిన ఆసన్ నారాయణగురు శిష్యుల్లో ప్రముఖులు. కులతత్త్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ సామాజిక న్యాయం కావాలని ఆశించారు.
వేమూరి రాంజీరావు: 1891 లో సాంప్రదాయిక వైదిక కుటుంబం లో జన్మించిన రాంజీరావు చిన్ననాడే దళిత ఆళ్వారు నందనారును బాగా అధ్యయనం చేసి దళితుల అభ్యున్నతికి పాటుపడ్డాడు. 1929లో మచిలీపట్టణంలో హరిజన బాలికల కోసం 'అరుంధతీ ఆశ్రమం' పేరుతో వసతిగృహం స్థాపించాడు. దళిత జనోద్ధరణకు జీవన పర్యంతం పనిచేసిన మహోన్నతుడు.
చిట్టంపి స్వామిగళ్: నంబూద్రి బ్రాహ్మణుల బిడ్డగా 1853-1924 మధ్య కేరళలో జీవించిన హైందవ స్వామీజీ మాత్రమే గాక సంఘ సంస్కర్త కూడా. నారాయణగురు మార్గదర్శకత్వంలో పనిచేసిన స్వామిగళ్ కులభేదాలను తొలగించడానికి ప్రయత్నించాడు. వేదాధికారం నిరూపణము' అనే పుస్తకం ఆయన సామాజిక దృక్పథాన్ని తెలియజేస్తుంది. అనేక గ్రంథాలు స్వామి రచించినటుగా తెలుస్తుంది.
పండిట్ కురుప్పన్: 24 మే 1885లో జన్మించిన కురుప్పన్ కేరళలో గొప్ప సంఘసంస్కర్తగా పేరు పొందాడు. మత్స్యకారుల కులంలో జన్మించిన కవి, నాటక కర్త, రచయితగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశాడు. మత్స్యకారుల జీవితాల్లో అక్షరాస్యత, సామాజిక న్యాయం ఆకాంక్షించి, వారికి సామాజిక న్యాయం జరిగేవరకు పోరాటం చేశాను.
మన్నత్తు పద్మనాభన్ పిళై: కేరళలో నాయర్ల సామాజిక అభ్యున్నతికి పాటుపడ్డ ఈయన 1878-1970 మధ్య జీవించాడు. ప్రసిద్ధమైన వెక్కం సత్యాగ్రహంలో గురువారం ఆలయ ప్రదేశ ఉద్యమంలో చురుగ్గా పనిచేశాడు. 1914లో 'నాయరః సర్వీస్ సొసైటీ' స్థాపించాడు. ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలతో పాటు సంఘ సంస్కరణ చేశాడు. కులవ్యవస్థను తీవ్రంగా నిరసించాడు.
సురవరం ప్రతాపరెడ్డి: బ్రాహ్మణుల, మాలలనొక్క విధంబు జూచి న జనుడే మనిషి అని ఓ పద్యంలో చెప్తాడు ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల పాడు లో జన్మించి గోలకొండ పత్రిక ను నడిపిన గొప్ప రచయిత. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ
విశేషములు ప్రముఖమైనవి. సామాజిక సంస్కరణలు తన ద్వారా, ఇతర రచనల ద్వారా అందించాడు. 1930 ప్రాంతంలో జి.యస్. బి.సరస్వతి రాసిన 'పంచమి చరితము' ను ముద్రించాడు.
కందుకూరి వీరేశలింగం: తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న సాహిత్య వేత్త. ఆనాటి బ్రహ్మ సమాజం ఇతర సంస్థల ప్రేరణతో బాల్యవివాహాల రద్దు, వితంతు పునర్వివాహాలు వంటి సంఘసంస్కరణలు చేపట్టారు.
రఘుపతి వేంకటరత్నం నాయుడు: 1 అక్టోబర్ 1862లో మచిలీపట్టణంలో జన్మించారు. "బ్రహ్మసమాజం' ప్రేరణతో సంస్కారవాదిగా పేరుపొందాడు. బహుదేవతారాధన, విగ్రహారాధన వద్దని 'ఏకేశ్వరారాధన' ప్రతిపాదించాడు. కులతత్వాన్ని, అస్పృశ్యతను నిరసించాడు.
పండిట్ నరేంద్ర జి: 1907-1976 మధ్య జీవించాడు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఆర్య సమాజం పక్షాన పోరాటం చేశాడు. 1935లోజరిగిన హరిజన యాత్ర ప్రేరణతో 1935లో కాచిగూడలో హరిజన బాలురకు వసతిగృహం స్థాపించాడు.
వెంకట్రావు నామాజీ: 1933 లో మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట లో జన్మించారు. 1946-48 నారాయణ పేట లో ధూల్ పేట లో 'మోచీ' కులస్తులు కోసం పాఠశాల నిర్వహించారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఠక్కర్ పాపా: 1869-1951 మధ్యలో జీవించిన ఠక్కర్ పాపా మహారాష్ట్ర కులనిర్మూలన ఉద్యమంలో ప్రముఖులు. పాకీ పని వారికోసం తన ఉద్యోగాన్ని వదలి సేవ చేసిన మహనీయుడు. గిరిజనులకోనం 'బిల్ సేవా మండల్' స్థాపించిన గాంధేయవాది.
పి.యం. దేవర్: తమిళనాడులో ప్రసిద్ధులైన రాజకీయ సామాజిక వేత్త 1908-1963 మధ్య జీవించిన ఈ గాంధేయవాది పి ముత్తురామలింగం దేవర్ 'క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్'ను రద్దు చేయించారు. అంటరానితనం సహించని సంస్కర్త. దళితులకు మధుర మీనాక్షీ ఆలయ ప్రవేశం చేయించాడు.
గంగాపురం హనుమచ్ఛర్మ: శర్మగారు 1925లో మహబూబ్ నగర్ జిల్లా వేపూర్‌లో జన్మించారు. 1960లో కల్వకుర్తిలో ప్రారంభిచబడ్డ హరిజన్ హాస్టల్ కు ఎంతో సేవలందించారు. వెనుకబడిన, నిమ్నకులాల విద్యార్థులను ఎందరినో తన ఇంట్లో ఉంచుకొని చదివించారు. హరిజనుల ఇంట్లో పెళ్లిళ్లు, సత్యనారాయణ వ్రతాలు శర్మగారు
స్వయంగా చేసేవారు. వారు రచించిన 'దుందుభి' కావ్యం రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం పొందింది. 15 ఆగస్టు 1996 నాడు వారు దేహత్యాగం చేశారు.

వెన్నెలకంటి రాఘవయ్య: నెల్లూరు జిల్లా సింగంపేటలో 1897 జూన్ 4న జన్మించిన రాఘవయ్య జీవితం మొత్తం దళిత, ఎరుకల, యానాది, లంబాడీ జాతుల అభివృద్ధికే వెచ్చించారు.
ఏనుగు పట్టాభిరామిరెడ్డి: 17 జూన్, 1903లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించిన పట్టాభి రామిరెడ్డి జీవితమంతా దళిత సేవకే అంకితం చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా తీరిక సమయమంతా నిమ్నవర్గాలకు వెచ్చించారు. ఆయన చేయూత నందించిన ఎందరో ఈనాడు నాయకులుగా, మేధావులుగా, అధికారులుగా స్థిరపడ్డారు.
ఆదినారాయణయ్య: సనాతన బ్రాహ్మణ కులంలో పుట్టి దళితుల అభివృద్ధికి పాటుపడిన నెల్లూరు జిల్లాకు
చెందిన మహనీయుడు.

గోపరాజు రామచంద్రరావు: 1902 నవంబర్ 15న జన్మించి గోరా గా ప్రసిద్ధుడైన నాస్తికోద్యమాన్ని, హరిజనోద్యమాన్ని ఏకకాలంలో నడిపించాడు. బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన ఈయన దళితజాతికి ఎంతో సేవ చేశారు.
వేముల కూర్మయ్య: 10 సెప్టెంబర్ 1903లో గుంటూరు జిల్లా మల్లవరంలో జన్మించారు. కూర్మయ్య హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించడంలో సుప్రసిద్దులు.
పాండురంగ శాస్త్రి అథవాలే: 1 19 అక్టోబర్ 1920లో మహారాష్ట్రలోని 'రోహా'లో జన్మించారు. ఈయన స్థాపించిన “స్వాధ్యాయ' సంస్థ ప్రపంచ స్థాయిలో పనిచేస్తుంది. శాస్త్రిగారిని 'దాదాజీ' అని పిలుస్తారు. దాదాజీ మత్స్య కారులెందరినో తన సంస్థ ద్వారా ఆకర్షించి వారిని గొప్ప గీతాధ్యయనపరులుగా చేశాడు. తత్వవేత్త గా, ఆధ్యాత్మిక వేత్త గా ప్రసిద్ధి పొందిన ఈయన 25 అక్టోబర్ 2003లో దేహత్యాగం చేశాడు.
మంగిపూడి వేంకటశర్మ: దళితుల పక్షాన గొప్ప సాహిత్యం సృజించిన మహనీయుడు. ఆయన రచించిన
'నిరుద్ద భారతము' చాలా గొప్ప కావ్యం. దానిపైనే ప్రత్యేక అధ్యయనం చేయవచ్చు. మచ్చుక్కి అందులోని ఓ పద్యం
మాలమాదిగలు మనవంటి మనుజులే
వారి ప్రాణము మన ప్రాణమొకటె
సర్వాయవములు సర్వేంద్రియములను
సర్వమానవులకు సమము గాదె
నీరమాహారము నిద్రయు మనకును
వారికి గూడ నావశ్యకములె
వారల దేహంబువలె మన దేహంబు
రక్తమాంసాదుల రాశియగును
మోదఖేదాలు సుఖదుఃఖములను మరియు
బుణ్యపాపాలుఁ గలిమిలేములును సరులె
ఉభయులకు హెచ్చులొచ్చు లేమున్నవింక?
మనసు మౌర్భనంబుననసి క్రమఱదుగాక!

గురు ఘసిదాస్: 18 వ శతాబ్దంలో 'గిరోడ్'కు చెందిన ఘసిదాస్ గొప్ప ఆధ్యాత్మికవేత్తగా నీ గాక సంస్కర్త. 'సత్నాంపంథ్'కు మూలకారకుడు. కులతత్త్వాన్ని అంగీకరించని సత్నాంపంథ్ ఏకేశ్వరారాధనను ప్రోత్సహిస్తుంది. అచల సిద్ధాంతంలాగా గ్రామీణ ప్రాంతంలో ఈ గురువు ప్రభావం ఉంది.
సుందర దాస్: 1650 తర్వాత జీవించిన సుందర్ దాస్ హిందీ. సాహిత్యం లో గొప్ప పేరు పొందాడు. కులనిర్మూలనకు తీవ్ర ప్రయత్నం చేశాడు.
పండిత గోపదేవ శాస్త్రి: ఆర్య సమాజ సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా అనుసరించిన మహా పండితుడు. ఈమధ్య కాలంలో గొప్ప వేదపాండిత్యం, శాస్త్రపాండిత్యం గల జ్ఞాని గోపదేవ్ అని చెప్పే ఆశ్చర్యపడి అవసరం లేదు. క్రీ.శ. 1896 లో తెనాలి తాలూకా కూచిపూడి లో జన్మించి సికింద్రాబాదులో 'ఆర్యసమాజం' స్థాపించడంలో ప్రముఖులు. వారు సత్యార్ధ ప్రకాశిక ని అనువదించారు. ఋగ్వేదాది భాష్యభూమిక, నిరుక్తము, ఋగ్వేద భాష్య భాస్కరము I,II,II వైదిక వినతి I,II, వైదిక దినచర్య, న్యాయవైశేషిక, సాంఖ్య, యోగ, వేదాంత దర్శనములు, దశోపనిషత్తులకు వివరణ మొదలైన 60 గ్రంథాలు రచించారు. ఆర్య సమాజాన్ని ఆధారం చేసుకొని 'కుల నిర్మూలనకు' పాటు వద్ద మహనీయుడు. ఆయన 1960 ప్రాంతంలో రచించిన, అపశూద్రాధికరణము శంకరభగవత్పాదము పుస్తకం సంచలనం రేపింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పొందిన గోపదేవ్ గొప్ప దార్శనికుడు.
తిరువల్లువర్: తమిళంలో ప్రసిద్ధ కవి. మొదటి శతాబ్దానికి చెందిన ఈ కవి కులాన్ని వ్యతిరేకించాడు. బ్రాహ్మణుడికి దళిత స్త్రీ జన్మించారని కొందరు, చేనేతపని చేసే కులస్థుడని మరికొందరు పేర్కొన్నారు. ఇటీవలనే కన్యాకుమారి దగ్గర ఈయనది అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు. తమిళ వేదం అని చెప్పబడే 'తిరుక్కురళ్' రచించాడు.
మహాకవి దాసు శ్రీరాములు: 1846 లో జన్మించిన ఈయన కవి, సంస్కర్త. అనేక రచనలు చేసిన ఈయన సంస్కృతంలో గొప్ప పండితుడు. వైదికులైన పురోహితులు లౌకికుల ఇండ్లకు రానందుకు 'పతిత సంసర్తి
ప్రాయశ్చిత్తం' అనే వ్యాసాలను రాసి వారితో వాదించారు. వైశ్యులకు వేదోక్త కర్మలను ఆచరించే అర్హత ఉందని శ్రీరాములు గారు వాదించారు. 'వైశ్యధర్మదీపిక'ను రచించారు. 1908లో శ్రీరాములు గారు మరణించారు.
టి.వి. నారాయణ: 1925 లో హైదరాబాద్ జన్మించిన టి. నారాయణ ఆర్య సమాజం లో పనిచేస్తున్న దళితనేత. వారి తండ్రి తక్కెళ్ల వెంకయ్య గారి వల్ల ఆర్య సమాజం పరిచయం అయింది. ఆర్య సమాజం మరియు అనేక సామాజిక ఉద్యమాల్లో వారు ఇప్పటికీ పనిచేస్తున్నారు.
గమనిక: పై సంస్కర్తలు క్లుప్తంగా పరిచయం చేయడం జరిగింది, ఇంకా అనేకమంది సమాజంలో సమరసత కోసం పనిచేస్తున్నారు. -డాక్టర్ పి భాస్కర యోగి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia10


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top