శ్రీ అరిగె రామస్వామి జీవితం - about arige ramaswamy in telugu


శ్రీ అరిగె రామస్వామి

హైదరాబాద్ లో కుమ్మరిగూడకు చెందిన అరిగె రామస్వామీ 20వ శతాబ్దం ప్రారంభంనుండి షెడ్యూలు కులాల సమగ్ర అభివృద్ధి కోసం కృషిచేసిన మొదటితరం వ్యక్తులలో ప్రముఖులు. వీరు సామాజిక విప్లవకారులు. సామాన్య పేదకుటుంబంలో 1895లో జన్మించారు. తన పట్టుదల కారణంగా ఎన్నో సమాజహిత కార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా నిలిచాడు. రైల్వే విభాగంలో ఆఫీసుబాయ్ గా వారి జీవితం ప్రారంభమైంది.
రైల్వేవిభాగంలో వివిధ శాఖలలో పనిచేసి చివరికి టికెట్ చెక్కర్ వరకుపనిచేశాడు.1912లో అచలతత్త్వాన్ని బోధించే మందిపెల్ల హనుమంతరావును గురువుగా స్వీకరించాడు. వారి ఆధ్యాత్మిక ప్రభావం వీరిపై పడింది. రామస్వామి హిందూధార్మిక సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసాడు. గురువుగారి సలహాతో 1912లో సునీతి బాల సమాజం ను ప్రారంభించి ఆ సంస్థద్వారా సామాజిక సంస్కరణా కార్యక్రమాలు చేపట్టాడు.
1925సం||లో కవాడిగూడలో దళిత (మాదిగ) కన్యను దేవదాసీగా మారుస్తున్న విషయం తెలుసుకుని, అక్కడకు వెళ్ళి వారితో ఘర్షణపడి ఆమెను తన రక్షణలోనే కొద్దికాలం ఉంచుకుని తర్వాత కొంత కాలానికి ఆమెకు ఒక(మాల) యువకునితో వివాహం చేయించాడు. 1 జూన్ 1931న అరుంధతీయ మహాసభ ను రామస్వామి ప్రారంభించాడు. 1927, 1929లలో ఆదిహిందూ మహసభలకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.భార్య లలితాదేవి కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.రామస్వామి ఆంధ్రమహాసభ కార్యక్రమాలలో మొదటినుండీ చురుగ్గా పాల్గొనేవాడు.
ఆ కార్యవర్గంలో ఎస్.సి. సభ్యులుగా వీరొక్కరే ఉన్నారు. వీరి ప్రయత్నాలవల్ల సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మెదక్ లో జరిగిన మహాసభల్లో దళితుల అభివృద్ధి కొరకు విద్య, ఉపాధి, రాజకీయరంగాల్లో రిజర్వేషన్లను కల్పించాలని తీర్మానించారు. 1934లో ఆదిహిందూభవన్ లోజరిగిన ఎస్.సి. కార్యకర్తల సమావేశంలో ఎక్కువ మంది అరిగె రామస్వామిని సమర్ధించడంతో నిజాం ప్రభుత్వం రామస్వామిని కౌన్సిలర్గా నామినేట్ చేసింది. 23 జూన్ 1944లో Independent Scheduled Castes Federation కు అరిగె రామస్వామి అధ్యక్షులుగా ఎన్నికైనాడు.
1946-48కాలంలో రజాకార్లు రామస్వామి ఇంటిపై మూడుసార్లు దాడిచేసారు. ముషీరాబాద్లో వారి టెంబర్ డిపో దగ్ధం చేయబడింది. మార్కెట్ వీధిలోని వారి చెప్పుల దుకాణం దోపిడి చేయబడింది. అయినా ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కొంటూ తన పనిని కొనసాగించాడు. ఎవరికీ వెరవని మనస్తత్వం వారిది.
హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన తరువాత ఏర్పడిన తాత్కాలిక పార్లమెంటుకుఅరిగె రామస్వామి సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 నుండి 72 వరకు, 15సం||లు ఎం.ఎల్.ఏగా ఉన్నాడు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మూడు సంవత్సరాలు రామస్వామి మంత్రిగా పని చేసాడు. ఏ పదవిలో ఉన్నా నిజాయితీపరుడుగా, సమర్థుడుగా పేరు తెచ్చుకున్న ప్రజానాయకుడు అరిగె రామస్వామి,1973 సం||లో తనువు చాలించాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments