Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నారదుడు కలహప్రియుడా? - about narada muni in telugu - MEGAMINDS

నారదుడు కలహప్రియుడా? నారద మహర్షి మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోక ...



నారదుడు కలహప్రియుడా? నారద మహర్షి మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలిపేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నిరంతరం ధర్మరక్షణ కోసం తపించే హరిభక్తుడు. మంచికీ-చెడులకు జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే.

నారద మహర్షి ఎంతో మంది సాత్వికులకు ఆయన మోక్షమార్గాన్ని చూపించారు. ధర్మానికి, ఆధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్రపోషించేవాడు. అయితే కొంతమంది మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను "కలహభోజనుడు"గా, "కలహప్రియుడు"గా అభివర్ణించారు.

ఈ లోకం తీరే అంత...! నిజం మాట్లాడేవారికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారేమో... యదార్థవాది లోకవిరోధి. ఈ లోకంలోను, పురాణ కథల్లోను ధర్మ పరాయణులకు ఎప్పుడు కష్టాల్లో. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవారంటే అదో చిన్నచూపు. వారిని లోకవిరోధులుగానే భావిస్తారు. అనేక కష్టాలకు గురిచేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కోసం నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, దానవ, మానవులకు సందర్భానుసారంగా ఆయన కర్తవ్యబోధ చేసేవాడు. అయితే కొంతమంది రచయితలు మాత్రం ఒకరికి ఇంకొకరికి మధ్య కలహాన్ని సృష్టించే వ్యక్తిగా ప్రచారం చేశారు. నారదుడిది ఒకే ఉద్దేశ్యం... ధర్మ ప్రతిష్ఠాపన.

"నార " అనగా మానవజాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ద అనగా ఇచ్చేవాడనే అర్థం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు. భగవంతుడైన శ్రీహరిని కీర్తించడం ఆయనకు ఎంతో ఇష్టం. తంత్రీవాద్యం, "వీణ"ను కూడా కనిపెట్టింది నారదుడేనని చెబుతారు. ఆయన వీణ పేరు "మహతి".

దక్ష ప్రజాపతి కుమారులకు " హర్యశ్వస్" అని పేరు. ఒక రోజు వారిని పిలిచిన దక్షప్రజాపతి బ్రహ్మచర్య దీక్షను పాటించాలని, తద్వారా అనంతమైన శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పొందాలని... తర్వాత వివాహమాడి సంతోషంగా ఉండాలని హితబోధ చేశాడు. తండ్రి చెప్పిన మాటల ప్రకారమే వారు హిమాలయాలకు వెళ్లారు. నారాయణ సరస్సు వద్ద బ్రహ్మచర్యదీక్షను పాటిస్తూ ధ్యానంలో ఉండగా నారదుడు వారి వద్దకు వచ్చాడు. సంసార జీవితం అంతా దుఃఖమే. వివాహం చేసుకుని సంసార జీవితం అనుభవించేకంటే సర్వసంగ పరిత్యాగులు కండి. మోక్షకాములు కండి. దేవున్ని నిరంతరం ధ్యానించండి అని చెప్పాడు. ఈ మాటలు దక్షుని పుత్రులపై బాగా పనిచేశాయి. తాము వివాహం చేసుకోమని, ఆజన్మాంతం బ్రహ్మచారులుగానే ఉంటామని శపథం చేశారు. దీనికంతటికి నారదుడే కారణమని తెలిసి దక్షుడు కోపోద్రిక్తుడయ్యాడు. నిరంతర సంచారిగా లోకాలన్నీ తిరుగుతూ ఉండమని నారదుడిని శపించాడు. దక్షుడి శాపంతో నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ అందర్ని కలుస్తూ ధర్మరక్షణ కోసం తనవంతు పాత్రను పోషించాడు.

ఆయన అన్ని లోకాలలో ఆ పరమాత్ముని కీర్తిస్తూ, ధర్మ ప్రచారం చేస్తూ, ఎందరో భక్తులను తయారు చేసారు. దృవుడు, ప్రహ్లాదుడు, సతీ సావిత్రి వంటి మహా భక్తులను తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అనిర్వచనీయమైనది. ధృవుడికి సంబంధించిన కథలోను మహర్షి నారదుడు కనిపిస్తాడు. ఉత్తానపాద మహారాజుకు ఇద్దరు భార్యలు, వారిలో ఒకరు సునీతి, ఆమె కుమారుడు ధృవుడు, రెండవ భార్య సురుచి ఆమె కుమారుడు ఉత్తముడు. ఒక రోజు సురుచి నువ్వు రాజు కావడానికి అనర్హుడివి అని నిందిస్తుంది. విష్ణువును మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ల వయస్సులోనే అడవి బాటపట పడతాడు. ధృవుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధృవుడు తన తపస్సు ద్వారా శ్రీమహా విష్ణువును మెప్పిస్తాడు.

భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతంలోనూ మనకు నాదరముని దర్శనం ఇస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు ఒకసారి అతడు మంథర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా, ఇంద్రుడు... అతని భార్యను చెరపడతాడు. వెంటనే అక్కడికి వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశ్యపుని భార్యను తన ఆశ్రమానికి నారదుడు తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతోపాటు శ్రీమన్నారాయుడి లీలను బోధించేవాడు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలతోనే ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణు భక్తడయ్యాడు.

సావిత్రి కథలోనూ మనకు మహర్షి నారదుడు కనిపిస్తాడు. మద్రరాజు అశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగుతుంది. నారదుడు వచ్చి సత్యవంతుడు చాలా బుద్దిమంతుడని..అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగుతుందని నారదుడు సావిత్రికి చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం...ఆమె తన పతిభక్తితో యమధర్మరాజును మెప్పించి తన భర్త ప్రాణాలను సావిత్రి తిరిగి కాపాడుకుంటుంది.

వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్ర్తాలలో సైతం ఆయన నిష్ణాతుడు. నారదుని "నారద శిక్ష" అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద పురాణం, పంచరాత్రులు, మొదలైన కూడా నారదునికి సంబంధించినవే. అలాగే నారద భక్తి సూత్రాలు అనే ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచించాడు. ఇందులో భక్తి మార్గము దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించాడు. ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై నారద మహర్షి తనదైన పాత్రను పోషించాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments