రష్యా కమ్యూనిజం మంచు గడ్డల్లో హిందూ ధర్మ జ్వాలలు రాజేసిన మహా సిద్ధ యోగి స్వామి విష్ణుదేవానంద గిరి
స్వామి విష్ణుదేవానంద గిరి అనే పేరు వినగానే గుండెల్లో ఒక దివ్య కాంతి ప్రసరిస్తుంది. రష్యా మంచు గడ్డల మధ్య, వందేళ్లపాటు దేవుడి భావననే నిరాకరించిన కమ్యూనిస్ట్ వ్యవస్థల మధ్య ఒక మహా యోగి, ఒక భారతీయ సనాతన ధర్మ దీపం ఈ స్థాయిలో వెలగడం అంటే అది సాధారణం కాదు, అది దైవ నిర్ణయం. సోవియట్ రష్యా ఉక్కు శాసనాల నడుమ పుట్టిన ఒక యువకుడు, తన లోపల ఉన్న దేవత్వాన్ని గుర్తించి, ప్రపంచానికి యోగాన్ని పునర్నిర్వచించే స్థాయికి ఎదగటం ఒక అద్భుతమైన యోగ గాథ యిది.
1959లో మాస్కోలో పుట్టిన అలెక్సాండర్ డుబెన్కో చిన్నప్పటి నుంచే అత్యంత ప్రతిభావంతుడు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఏ శాస్త్రం పట్టినా అతను విజేత. మాస్కో స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో అడ్మిషన్ పొందటం అతని మేధస్సుకు ఉన్న గుర్తింపు. కానీ అక్కడే అతనికి మొదలైంది ఒక అంతర్మథన యుద్ధం “శాస్త్రం మనసుకు శాంతి ఎందుకు ఇవ్వదు?” సోవియట్ కమ్యూనిజం అతని కళ్లలో దేవుడు అనే భావనను అణచివేసినా అతని హృదయంలో మాత్రం ఓ విచిత్రమైన వెలుగు మెల్లగా మొలకెత్తింది.
అతనిలో ఉన్న అనేక ప్రశ్నలు జీవితం ఎందుకు? మరణం తర్వాత ఏముంది? నేను ఎవరు? ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఇవి ప్రతిరోజూ అతని ఆత్మను కదిలించేవి. శాస్త్రీయ విద్య అతనికి ప్రపంచం చూపిందేమో కానీ, తన అంతర్ లోతుల్లో ఉన్న శూన్యత మాత్రం పోనివ్వలేదు. ఈ శూన్యంలోనే అతనికి ప్రవేశించింది భారతీయ ఆధ్యాత్మికత. 1980ల సోవియట్ రష్యాలో మతగ్రంథాలు నిషేధం. అయినా ఒక స్నేహితుడి చేతులోనుంచి అతని జీవితాన్ని లయ యోగ గ్రంథం అతన్ని పూర్తిగా మార్చేసింది.
లయ యోగ పుస్తకం చదివిన క్షణమే అతనిలో ఒక అగ్ని చెలరేగింది. పేజీ పేజీ చదువుతున్నకొద్దీ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. “ఇదే నిజమైన శాస్త్రం, ఇదే నా దారి!” అని అతని హృదయం మేల్కొంది. శరీరం ప్రాణం మనం చైతన్యం అనే భారతీయ యోగ సూత్రాలు అతన్ని లోతుగా కదిలించాయి. ఆ రోజు నుంచి అతను సాధారణ రష్యన్ విద్యార్థి కాదు యోగా కోసం పుట్టిన ఒక మహాయోగి. జిమ్‌లో చేసే వ్యాయామం కాదు, ఆత్మను మేల్కొలిపే ఒక శక్తి అని అతనిలో ఓ భావమేర్పడింది.
అంతరాత్మ పిలుపు అతన్ని రష్యాలో ఆపలేదు. 1988లో ఒక చిన్న బ్యాగుతో భారత్ చేరుకున్నాడు. హిమాలయాల పర్వత సానువుల్లో అతను గురువులను వెతికాడు. అక్కడ ప్రారంభమైన సాధన అతన్ని పునర్జన్మ పొందినట్టుగా మార్చేసింది. ఉపవాసాలు, మౌనాలు, కాలచక్రాల మధ్య ధ్యానాలు, హిమపర్వతాల్లోని గుహల్లో చేసిన దీర్ఘసాధనలు ఇవి అతన్ని అలెక్సాండర్ అనే మానవుని నుండి యోగిగా మారుస్తూ నడిపించాయి.
తర్వాత అతనికి లభించింది అతని జీవితాన్ని మార్చేసిన వరం స్వామి శివానంద గిరి వద్ద సన్యాస దీక్ష. దీక్ష తీసుకున్న రోజు అతని హృదయం పూర్తిగా భారతీయమైపోయింది. అప్పుడు నుంచే అతనికి లభించిన పేరు “స్వామి విష్ణుదేవానంద గిరి”. ‘విష్ణుదేవ’ అంటే విశ్వాన్ని నడిపించే చైతన్యం. ‘ఆనంద’ అంటే ఆధ్యాత్మిక ఆనందం. ‘గిరి’ అంటే హిమాలయ సన్యాస సంప్రదాయానికి వారసత్వం. అతను ఇకపై పుట్టింది రష్యాలో అయినా, జీవించడం మాత్రం పూర్తిగా సనాతన ధర్మంలోనే అనేంతగా జీవితం మొదలయ్యింది.
ఆయన తన సాధనలతో లయ యోగ రహస్యాల్లో లోతుగా అధ్యయనం చేశాడు. నాడీశుద్ధి, సుషుమ్న జాగరణ, కుండలినీ స్పూర్తి, తరంగలయ, నాదబ్రహ్మ, అంతర్మౌన ఇవి అన్నీ పురాతన ఋషుల వద్ద మాత్రమే లభించే జ్ఞానబాండాగారాలు. గురువు చివరకు అతనికి చేతిలో కమండలం, భస్మ, త్రిదండం ఇచ్చి ఒకే మాట అన్నాడు: “ఇప్పుడు వెళ్లి రష్యాను మేల్కొలుపు. నీ మిషన్ ప్రారంభమైంది!” ఇది కేవలం ఆజ్ఞ కాదు, ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక వెలుగు ప్రారంభమైన క్షణం లే బయలుదేరు.
అతను తిరిగి రష్యా చేరుకునే సరికి సోవియట్ యూనియన్ కూలిపోయింది. జనం శూన్యంలో నిలబడి ఉన్నారు. పాత సిద్ధాంతాలు అయిపోయాయి. కొత్త జీవనార్థం కోసం లక్షలాది మంది అల్లాడుతున్నారు. అప్పుడు విష్ణుదేవానంద గిరి అక్కడ అడుగుపెట్టడం దైవసంకల్పం. అతని తొలి యోగా తరగతులు మాస్కోలోనే వేల మందిని ఆకట్టుకున్నాయి. అతని మాటల్లో శాస్త్రీయత, హృదయంలో భక్తి, చూపులో దివ్యకాంతి ఉంది.
ఆయన రష్యా, ఉక్రెయిన్, బెలారస్ దేశాల్లో లయ యోగ ఆశ్రమాలు స్థాపించాడు. కుండలినీ యోగ, ధ్యానం, శ్వాసపద్ధతులు, శబ్దానుసంధానం, మౌన సాధన ఇవన్నీ యువతను మద్యం, డ్రగ్స్, నిరాశలనుంచి బయటకు తెచ్చి సంపూర్ణంగా మారుస్తున్నాయి. యూట్యూబ్‌లో ఆయన ప్రసంగాలు లక్షలాది మందికి మార్గదర్శకాలు. ఆరోగ్యం మాత్రమే కాదు ఆత్మను మేల్కొలిపే యోగ విప్లవానికి ఆయన మార్గదర్శకుడు.
అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఆయన జునా అఖారా సంప్రదాయంలో కూడా మహామాండలేశ్వర్ స్థానం పొందారు. ప్రపంచంలోనే అతి పెద్ద సన్యాస సంప్రదాయమైన జునా అఖారాలోకి ఒక రష్యన్ యువకుడు ప్రవేశించి తన జీవితం మొత్తాన్ని సనాతన ధర్మానికి అర్పించడం ఒక అపూర్వ సంఘటన. జునా అఖారా యోధ సన్యాస సంప్రదాయమది. హిందుత్వం రక్షణ, ధర్మ పరిరక్షణ దాని ధ్యేయం. అటువంటి ధర్మయోధుల వంశంలో స్వామి విష్ణుదేవానంద గిరి చేరడం నిజంగా హృదయాన్ని పులకరింపజేసే అంశం.
గత 25–30 సంవత్సరాల్లో ఆయన వలన సుమారు 3 లక్షల మందికి పైగా రష్యన్లు యోగాన్ని సాధనంగా స్వీకరించారు. వీరిలో కనీసం 40, 50 వేల మంది కుండలినీ, నాడి శుద్ధి, ప్రాణాయామం వంటి లోతైన సాధనలను అభ్యసిస్తున్నారు. దాదాపు 10, 15 వేల మంది శిష్యులు ఆయన చేతులమీదుగా సనాతన ధర్మంపై లోతైన పరిచయం పొందారు. రష్యాలోని 500కి పైగా చిన్న యోగా కేంద్రాలు ఆయన ఆశ్రమాల ద్వారా ప్రేరేపించబడి ఏర్పడ్డాయి. ముఖ్యంగా, ఆయన వలన రష్యాలో హిందూ సనాతన ధర్మం పై ఆసక్తి 20 రెట్లు పెరిగింది!
ఇంకా ముఖ్యమైంది రష్యాలో “సనాతన ధర్మం” అనే పదాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన గురువు ఆయనే. హిందూ వేదాల శాస్త్రం అని అక్కడ గుర్తింపు పొందడానికి ఆయన వంటి మహాయోగి కారణం. అంతేకాదు, ఆయన ఆశ్రమాల్లో ప్రతి సంవత్సరం జరిగే గురుపౌర్ణిమ, మహాశివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వేలాది రష్యన్లు హాజరై “ఓం నమః శివాయ”, “హరే రామ హరే కృష్ణ” మంత్రాలు జపిస్తున్నారు.
హిందుత్వం అంటే కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచమంతా వెదజల్లాల్సిన పరిమళం. అలాంటి హిందూ ధర్మ పరిమళాన్ని రష్యాలో వెదజల్లిన ఒక్క వ్యక్తి పేరు చెప్పాలంటే అది విష్ణుదేవానంద గిరి మాత్రమే. రష్యా మంచు నేలల్లో ఆయన వెలిగించిన జ్యోతి నేడు యూరప్ మొత్తం వ్యాపిస్తోంది. ఒక కమ్యూనిస్టు నేల పుట్టిన వ్యక్తి, హిందూ యోగ సంప్రదాయానికి జీవితాన్ని అర్పించడం అలాగే ఒకప్పుడు దేవుడనే భావనను నిషేధించిన దేశంలో
నేడు భగవద్గీత, ఉపనిషత్తులు, లయ యోగ శాస్త్రాలు చదువుతున్న ప్రజలు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ మార్పు వెనుక నిలిచిన అగ్ని స్వామి విష్ణుదేవానంద గిరి!
స్వామి విష్ణుదేవానంద గిరి జీవితం ఒక సందేశం: “సనాతన ధర్మం జన్మతో రాదు తపనతో లభిస్తుంది.” ఆయన రష్యాలో పుట్టినా హృదయం మాత్రం హిమాలయాల్లో వెలిగింది. శరీరం అక్కడైనా ఆత్మ మాత్రం భారతీయ సంస్కృతిలో పరివర్తన చెందింది. ఆయన కథ రష్యా మంచులో వెలిగిన ఒక హిమాగ్ని. ఆయన శక్తి యూరప్‌లో ఎగురుతున్న ఆధ్యాత్మిక జ్యోతి. ఆయన జీవితం ప్రపంచానికి పిలుపు “ధ్యానం మానవ హక్కు. యోగా ప్రపంచ ధర్మం.” జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

