ఆస్ట్రేలియా నుండి ప్రపంచానికి శాస్త్రీయంగా హిందు ధర్మాన్ని తెలియజేస్తున్న ఆధ్యాత్మికతా సంపన్నుడు రామి సివన్...
పాశ్చాత్య ప్రపంచంలో పుట్టి సనాతన ధర్మం వైపు మళ్లిన అరుదైన ఋషి రామి సివన్: ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఒక యూదు బాలుడు తరువాత భారత వేద సంస్కృతికి అంకితమైన ఆధ్యాత్మిక గురువుగా మారాడంటే ఇది సాధారణ విషయం కాదు. రామి సివన్ అలాంటి అరుదైన ఋషులలో ఒకరు. ఆయన ముఖం చూస్తేనే లోపల ఎక్కడో గాయత్రీ మంత్రం శబ్దంలా ఒక శాంతి ఉట్టిపడుతుంది. ఆయన మాటల్లో శాస్త్రీయత, తత్వంలో వేదాంత ఘనం, వ్యక్తిత్వంలో అద్భుత శక్తి —all in one package అంటాం కదా అలా అన్నమాట.
యూదు కుటుంబంలో పుట్టినా మనశాంతి లేక ఆధ్యాత్మికత కోసం వెతుకులాడాడు: 1954లో ఆస్ట్రేలియా సిడ్నీలో ఒక సాధారణ యూదు కుటుంబంలో జన్మించిన రామి సివన్, చిన్నప్పటినుంచి హీబ్రూ భాష, యిడ్డిష్ సంస్కృతి, యూదిజం ధార్మిక విశ్వాసాల మధ్య పెరిగాడు. యూత్‌లో రబ్బీ (హిందూ ధర్మంలో ‘పండితుడు’ ఎలా ఉంటారో యూదు మతంలో అతనికే సమానార్దం రబ్బీ.) కావాలనే కలలు కనేవాడు. రబ్బినికల్ సెమినరీలో చదువుతుండగా ఒక అంతర్గత శూన్యత ఆయనను కలసివేసింది. “ఈ మార్గం నన్ను పూర్తి స్థాయిలో నిలుపట్లేదు” అనే భావన అతని మనసులో బలపడింది.
17 ఏళ్ల వయసులో జీవితాన్నే మార్చేసిన భగవద్గీత: అలాంటి సమయాన ఒక స్నేహితుడు ఇచ్చిన భగవద్గీత పుస్తకం ఆయన జీవితాన్ని పూర్తిగా తిరగరాసింది. 17 ఏళ్ల వయస్సులో గీతను చదువుతూనే ఆయన గుండెల్లో ఒక దివ్యమైన ప్రకంపన—“ఇదే నేను వెతుకుతున్న సత్యం!” ఆ క్షణం ఆయన జీవితం మారిపోయింది. యూద మత గ్రంథాలకంటే గీతలోని తత్వజ్ఞానం గొప్ప లోతు ఉందని ఆయన గ్రహించాడు.
పాశ్చాత్య దేశం నుండి భారత్ వైపు – సత్యాన్వేషకునిగా ప్రయాణం: అప్పటి నుండి రబ్బీ అవ్వాలనే లక్ష్యం వదిలిపెట్టి, ఆయన ఆధ్యాత్మిక గురువులను వెతుక్కుంటూ భారత్‌కి వచ్చాడు. హిమాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, యోగా ఆశ్రమాలు సందర్శిస్తూ తాను ఎవరన్నది తెలుసుకునే ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ దశలో ఆయనకు భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు కొత్త ప్రపంచాన్ని తెలిపాయి.
స్వామి దయానంద సరస్వతి పాదాల దగ్గర 10 ఏళ్ల సాధన: ప్రముఖ వేదాంతాచార్యుడు స్వామి దయానంద సరస్వతి (ఆర్ష విద్యా గురుకులం) శిష్యరికంలో ఆయన నిజమైన శిక్షణ ప్రారంభమైంది. 10 సంవత్సరాల పాటు వేదాంతం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, సంస్కృతం అన్నింటినీ పద్ధతిగా, శాస్త్రీయంగా అధ్యయనం చేశాడు. “శ్రవణ మనన నిదిధ్యాసనం” అనే నిజమైన జ్ఞాన మార్గం ఆయన జీవితంలో బలపడింది.
శ్రీ విద్యా ఉపాసనలో శ్రీ అమృతానందనాథ సరస్వతి ఇచ్చిన దివ్య మార్గం: మన దేశంలో అరుదైన శ్రీ విద్యా గురువుల్లో ఒకరైన శ్రీ అమృతానందనాథ సరస్వతి (దేవీపురం) వద్ద ఆయనకు శ్రీ విద్యా మంత్ర దీక్ష లభించింది. ఇది ఆయన అంతర్గత అనుభవాన్ని మరింత లోతైనదిగా చేసింది. జ్ఞానం భక్తి ఉపాసన ఈ మూడు ఆయనలో ఒకే ప్రవాహంగా మారాయి.
స్మార్త బ్రాహ్మణ దీక్షతో “శ్రీధరానంద సరస్వతి”గా రూపాంతరం: వేదాంతం, శ్రీ విద్యా మార్గాల్లో పూర్తి ప్రవేశం పొందిన తర్వాత ఆయన స్మార్త బ్రాహ్మణ దీక్ష తీసుకుని “శ్రీధరానంద సరస్వతి”గా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో పిలిచే పేరు రామి సివన్, భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన పేరు శ్రీధరానంద సరస్వతి.
ఆర్ష విద్యా ఆచార్యుడిగా ప్రపంచానికి వేదాంత బోధన: ఆయన గ్రహణశక్తి, శాస్త్రీయ దృక్పథం చూసిన స్వామి దయానంద సరస్వతి, ఆయనను ఆర్ష విద్యా గురుకులంలో ఆచార్యుడిగా నియమించారు. వేదాంతం అనే అతి లోతైన జ్ఞానాన్ని పాశ్చాత్యులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే అసాధారణ ప్రతిభ ఆయనకు ఉంది. సంక్లిష్ట శాస్త్రాలు కూడా ఆయన చేతుల్లో సరళంగా మారిపోయాయి.
ప్రపంచం కోసం “Sanatana Dharma Gurukulam (SDG)” స్థాపన: ఆయన నిర్మించిన సనాతన ధర్మ గురుకులం (SDG) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులతో నడుస్తోంది. వేదాంతం, యోగా, సంస్కృతం, శ్రీ విద్యా ఈ అన్ని కోర్సులు ఆయన రూపొందించిన పద్ధతుల్లోనే బోధించబడుతున్నాయి. 5,000 మందికి పైగా విద్యార్థులు ఆయన ఆన్‌లైన్ క్లాసుల ద్వారా సనాతన ధర్మాన్ని నేర్చుకుంటున్నారు.
1ఆస్ట్రేలియాలో ఆయన ప్రభావం హిందూ ధర్మానికి ఒక బ్రిడ్జ్: ఆస్ట్రేలియాలో హిందూ ధర్మ ప్రసారంలో రామి సివన్ పాత్ర అపారమైనది. అక్కడి హిందూ కమ్యూనిటీకే కాకుండా పాశ్చాత్యులకు కూడా సంస్కృతం, వేదాలు, ధ్యానం, యోగా పరిచయం చేశాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వ, విద్యా సంస్థలు, ధార్మిక సంఘాలు ఆయనను ఒక ప్రామాణిక వేదాంత గురువుగా గుర్తించాయి.
యూట్యూబ్, రిట్రీట్స్, వర్క్‌షాప్‌లతో ప్రపంచానికి నిరంతరం బోధన: యూట్యూబ్‌లో లక్షకు పైగా సబ్‌స్క్రైబర్లు, లక్షలాది వీక్షణలు ఇవి ఆయన ప్రభావానికి చిన్న ఉదాహరణలు మాత్రమే. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, భారత్ ఏ ఖండానికైనా వెళ్లినా వందల మంది ఆయన క్లాసులకు చేరుతారు. ఆయన చెప్పే వేదాంతం కఠిన శాస్త్రంలా కాకుండా జీవితం మార్చే మార్గదర్శకంలా ఉంటుంది.
రామి సివన్ సందేశం – “సనాతన ధర్మం మతం కాదు… ఇది జీవన విధానం”: రామి సివన్ జీవితం మనకు చెబుతున్న గొప్ప సందేశం సనాతన ధర్మం భారతీయులకే మాత్రమే కాదు; ఇది నిజాన్ని వెతికే ప్రతి మనిషి స్థావరం. వేద జ్ఞానం కేవలం ప్రార్థన కాదు, సైన్స్, సైకాలజీ, జీవన తత్వం—all in one. ఆయన జీవితమే ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ. జయ్ హిందురాష్ట్ర.-రాజశేఖర్ నన్నపనేని. MegaMinds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

