చికాగో రిచర్డ్ స్లావిన్ రాధానాథ్ స్వామిగా ఎందుకు? ఎలా మారాడు?
1950 డిసెంబర్ 7న అమెరికాలోని చికాగో పట్టణంలో ఒక సాధారణ యూదు కుటుంబంలో రిచర్డ్ స్లావిన్ జన్మించాడు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే తనలో ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడేది!. “జీవితం అంటే ఏమిటి? మనం ఎందుకు ఉన్నాం?” 3 ఏళ్ల వయస్సులో తల్లి మరణం, బాల్యంలో ఎదిగిన ఒంటరితనం అతని హృదయంలో ఆధ్యాత్మికత పట్ల విచిత్రమైన ఆకర్షణను పెంచాయి. హైస్కూల్ దాటిన తర్వాత కూడా ఆ ప్రశ్నలు అతన్ని వదల్లేదు. ఈ ప్రపంచంలో ఏదో లోతైన నిజం ఉందని, అది పుస్తకాల్లో కాదు, అనుభవంలోనే దొరుకుతుందని రిచర్డ్ స్లావిన్ నమ్మేవాడు.
1960లలో అమెరికాలో హిప్పీ ఉద్యమం ద్వారా తనలో చైతన్యం: 1960ల చివర్లో అమెరికాలో హిప్పీ సంస్కృతి బాగా పాపులర్. ప్రపంచం శాంతి కోసం, ప్రేమ కోసం కేకలేస్తున్న కాలం. రిచర్డ్ కూడా అలాంటి అస్థిరతల మధ్య పెరిగాడు. కాలేజీ చదువుతున్నా హృదయం అక్కడ లేదని గ్రహించి, 19 ఏళ్లకే చదువు వదిలి “ఆత్మ స్వరూపం” తెలుసుకోవడానికి బయలుదేరిపోయాడు. అమెరికా వీధుల్లో వీణ, గిటార్, ధ్యానం అతడు ఆధ్యాత్మికతకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. కానీ అసలు జవాబు అక్కడ లేదు. “సత్యం తూర్పున ఉండొచ్చు” అనే భావన అతన్ని యూరప్ వైపు లాగింది.
ప్రపంచాన్ని దాటిన యాత్ర 1969 నుండి 1971 వరకు ఎన్నో ప్రయాణాలు: కేవలం 19 సంవత్సరాల వయస్సులో హిచ్‌హైకింగ్ ద్వారా యూరప్, టర్కీ, ఇరాన్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మార్గంగా భారతదేశాన్ని చేరుకోవడం అంత సులువుకాదు. కఠినమైన వాతావరణం, యుద్ధభూములు, ఆకలి, రోగాలు… కానీ ఈ ప్రయాణమే అతన్ని పూర్తిగా మలిచింది. యుగోస్లావియాలో అరెస్టు, ఆఫ్గానిస్తాన్‌లో డిసెంటరీతో మరణమునకు అంచున, ఇరాన్‌లో యుద్ధ ప్రాంతం కానీ ఈ ప్రతి పరీక్ష అతనిలో “దివ్య శక్తి నడిపిస్తుంది” అన్న నమ్మకాన్ని బలపరచింది. తూర్పు వైపు సాగిన ప్రతి అడుగు అతన్ని కృష్ణభక్తికి మరింత దగ్గర చేసింది.
బృందావనంలో జరిగిన దివ్య కలయిక: 1971లో ముంబై చేరుకొని, అక్కడి నుండి బృందావనానికి ప్రయాణించిన రిచర్డ్ జీవితం పూర్తిగా మారిపోయింది. యమునా తీరం, రాధా కుండ్, బృందావనం లోని పుణ్యస్థలాలు అతని హృదయాన్ని ఆవహించాయి. అదే సమయంలో అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చిన సంఘటన శ్రీల ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదను మొదటిసారి చూడటం. ప్రభుపాద ముఖంలో కనిపించిన శాంతి, వాక్యాల్లో కనిపించిన జ్ఞానం, సేవలో కనిపించిన వినయం అతనికి “ఇదే నా మార్గం” అని స్పష్టంగా చెప్పినట్టు అనిపించింది.
ఇస్కాన్‌లో అప్పుడే ప్రవేశం, భక్తీ మార్గంలోకి ప్రయాణం: 1973లో ప్రభుపాద చేత దీక్ష పొంది అతడు “రాధానాథ్ దాస్” అయ్యాడు. పాశ్చాత్యదేశంలో పుట్టిన ఒక యువకుడు, వైష్ణవ సంస్కృతిలో ఇంతలా లీనమవడం అరుదు. బృందావనం లో కఠిన వ్రతాలు, సన్యాసుల సేవ, పాదయాత్రలు, అర్ధరాత్రి కీర్తన ఇవన్నీ అతని జీవితం పూర్తిగా మార్చాయి. 1982లో అతడు సన్యాసం తీసుకొని “రాధానాథ్ స్వామి” అన్న శాశ్వత ఆధ్యాత్మిక పేరును పొందాడు. ఇది అతని సేవా జీవితానికి ప్రారంభం మాత్రమే.
ఆధ్యాత్మిక నాయకుడిగా ఎదిగినా కష్టాలు: దివ్యమైన జీవితమంటే సులభమని ఎవరూ చెప్పలేదు. రాధానాథ్ స్వామి జీవితం కూడా పరీక్షలతో నిండింది. ఇస్కాన్‌లో జరిగిన అంతర్గత రాజకీయాలు, కీర్తనానంద స్వామి వివాదాల్లో 1988లో బయటపడటం, 1994లో తిరిగి చేరడం ఇవన్నీ అతని మనస్సును పరీక్షించాయి. ముంబై రాధా గోపీనాథ్ ఆలయ నిర్మాణంలో ల్యాండ్ డిస్ప్యూట్స్, స్థానిక వ్యతిరేకత, ఆర్థిక అవరోధాలు అన్నీ ఎదురయ్యాయి. కానీ అతను ఎప్పుడూ “ఇవి కృష్ణుని పరీక్షలు” అని భావించి, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.
ముంబైలో అద్భుత సేవా విప్లవం: రాధానాథ్ స్వామి నాయకత్వంలో ముంబై రాధా గోపీనాథ్ ఆలయం భక్తి–సేవా కేంద్రంగా మారింది. అన్నామృత ప్రాజెక్ట్ ద్వారా 2004 నుండి ఇప్పటి వరకు 1.2 కోట్ల పిల్లలకు రోజువారీ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఆకలి ఉన్న బిడ్డకు భోజనం పెట్టడం అతని భక్తి తత్వంలో ముఖ్య భాగం. భక్తివేదాంత హాస్పిటల్ 150 పడకలతో వేలాది పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంది. పేషెంట్స్‌తో మాట్లాడే అతని శైలిలో “సేవే ధర్మం” అన్న భావం స్పష్టంగా కనిపిస్తుంది.
గోవర్ధన్ ఎకో విలేజ్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న భారతీయ మోడల్ గ్రామం: ముంబై బయట ఉన్న వాడర్ గ్రామంలో స్థాపించిన గోవర్ధన్ ఎకో విలేజ్ ప్రపంచానికి సస్టైనబుల్ ఫార్మింగ్‌కు ఒక విజయవంతమైన ఉదాహరణ అయింది. పశువుల సంరక్షణ, వర్షజల సంరక్షణ, ఆర్గానిక్ ఫార్మింగ్, వేదవనాలు ఇవన్నీ కలిపి యునైటెడ్ నేషన్స్ కూడా ప్రశంసించిన మోడల్. ప్రపంచంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఆధ్యాత్మికత + సస్టైనబిలిటీ = భారతీయ దృష్టి అనే సూత్రాన్ని స్వామీజీ ప్రపంచానికి చూపించారు.
శిక్షణ విద్యా సంస్కరణలలో ఆయన పాత్ర: రాధానాథ్ స్వామి విద్యారంగంలో కూడా విశేష స్థానం సంపాదించారు. మాయాపూర్‌లోని బెంగాల్ భక్తివేదాంత అకాడమీ 12 సంవత్సరాల దీక్షిత వేదాంత కోర్సులు అందిస్తుంది. గురుకుల వ్యవస్థలో “డే-స్కూల్” మోడల్‌ని ప్రవేశపెట్టి ఆధ్యాత్మికత ఆధునిక విద్య అనుసంధానాన్ని బలపరిచారు. భక్తి వైభవ, భక్తి వేదాంత కోర్సుల ద్వారా వేలాది భక్తులు శాస్త్రపరమైన మార్గదర్శనం పొందుతున్నారు.
పాశ్చాత్య ప్రపంచంపై ప్రభావం: అమెరికాలో ఇస్కాన్ వ్యాప్తి 1970–2025 మధ్య 25% పెరిగింది. రాధానాథ్ స్వామి ప్రభావంతో అనేక యూత్ క్యాంపులు, యోగా రిట్రీట్స్, ధ్యానం, భక్తి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముంబై మోడల్ అయిన అన్నామృత ఎకో విలేజ్ మోడళ్లు అమెరికా, ఇటలీ, యూరప్‌లో అమలులోకి వచ్చాయి. పాశ్చాత్య భక్తులు 1 మిలియన్ సంఖ్యకు చేరుకోవడానికి రాధానాథ్ స్వామి సేవ పునాది అయింది.
రచయితగా ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు: ది జర్నీ హోమ్ (బృందావనానికి అతని ఆధ్యాత్మిక యాత్ర కథ) ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. తరువాతి పుస్తకాలు ది జర్నీ వితిన్, ఈవాల్వ్ ప్రపంచ యూత్‌కు భక్తి యోగాలో ఒక కొత్త దిశ చూపాయి. అతని యూట్యూబ్ లెక్చర్లు, కీర్తనాలు, ధ్యానం సెషన్లు లక్షలాది మందిని ప్రేరేపిస్తున్నాయి.
రాధానాథ్ స్వామి అతిపెద్ద భక్తి విప్లవం తెచ్చారు: చికాగోలో పుట్టిన ఒక యూదు బాలుడు, హిప్పీ సంస్కృతిలో తిరిగిన ఒక యువకుడు, బృందావనంలో నిలిచిన ఒక సాధకుడు ఇవన్నీ కలిపి రాధానాథ్ స్వామి అన్న ఆధ్యాత్మిక శిల్పాన్ని తయారు చేశాయి. ప్రపంచం ఏ మూలలో పుట్టినా, మనసు భగవంతుడిని ఎంచుకుంటే జీవితం ఎలా మారుతుందో ఆయన జీవితం చెబుతుంది.-రాజశేఖర్ నన్నపనేని. MegaMinds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

