Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

శ్రీ బిజోయ్ కుమార్ సిన్హా- అమానవీయమైన శిక్షలకు వెరవని వీరుడు - About bijoy kumar sinha in telugu - megaminds

1857లో భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత, ఆ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న విప్లవపోరాట యోధులను శిక్షించాలని బ్రిటిషర్లు నిర్ణయించారు. రాజక...1857లో భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత, ఆ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న విప్లవపోరాట యోధులను శిక్షించాలని బ్రిటిషర్లు నిర్ణయించారు. రాజకీయ ఖైదీలను అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. వీరిని అండమాన్ పంపడం ద్వారా దేశ ప్రజల్లో స్వరాజ్య కాంక్షకు, పోరాడాలన్న ఆలోచనకు అడ్డుకట్ట వేయవచ్చని బ్రిటీష్ పాలకులు పొరబడ్డారు.1858, మార్చి 10న 200 మంది ఖైదీల బృందాన్ని అండమాన్ జైలుకు పంపించారు. అప్పటినుంచే, కాలాపానీ జైలులో అమానవీయ, క్రూరమైన శిక్షలను అమలుచేయడం, స్వాతంత్ర్య సమరయోధులను చిత్రహింసలు పెట్టడం ప్రారంభమైంది. తర్వాత దశాబ్దాలపాటు ఆ జైలులో బ్రిటిష్ పాలకుల దుర్మార్గాలు కొనసాగాయి.

దేశంలో వలసపాలనను అంతమొందించే ప్రయత్నంలో భాగంగా విప్లవపంథాను ఎంచుకుని, బ్రిటిష్ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేసి, అండమాన్ సెల్యులార్ జైలులో కఠినాతికఠినమైన పరిస్థితులను అనుభవించిన కాన్పూర్‌కు చెందిన సాహసవంతుడైన సమరయోధుడు శ్రీ బిజోయ్ కుమార్ సిన్హా గురించి తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శ్రీ మర్కంద్ సిన్హా, శ్రీమతి శరత్ కుమారి సిన్హా దంపతులకు 1909లో బిజోయ్ కుమార్ సిన్హా జన్మించారు. ఆర్థికంగా ఉన్నతమైన, గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన ఆయన, తన చుట్టుపక్కనున్న సమాజం, పేదరికం, బ్రిటిషర్ల పాలనలో రోజురోజుకూ దిగజారిపోతున్న పరిస్థితులు ఆయన్నెంతగానో కలచివేశాయి. రోజూ వీటిని కళ్లారా చూస్తున్న సమయంలోనే ఆయనలో స్వరాజ్యం కోసం విప్లవ మార్గాన్ని అనుసరించాలనే ఆలోనలు మొలకెత్తాయి. మాతృభూమి దాస్యశృంఖలాలను తెంచేందుకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడకూడదు అనే భావన చిన్నతనంలోనే ఆయనలో వేళ్లూనుకుంది.

పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే, కాన్పూర్ ప్రాంతంలోని విప్లవ మార్గ స్వరాజ్య సమరయోధులతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు. కొంతకాలానికే ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’లో కీలకమైన వ్యక్తిగా మారారు. కాకోరీ కేసులో బిజోయ్ సోదరుడితో పాటు ఇతర విప్లవకారులను బ్రిటిషర్లు అరెస్టు చేశారు. ఈ సమయంలో విప్లవజ్యోతి ఆరకుండా, చైతన్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించే బాధ్యతను బిజోయ్ కుమార్, అతని తోటి విప్లవకారులు తీసుకున్నారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటీష్ వారికి అనుమానం రాకుండా సంస్థ కార్యకలాపాలను నిర్వహించాల్సిన బాధ్యతను బిజోయ్‌కు అప్పగించారు. ‘సంస్థకు సంబంధించిన కార్యక్రమాలను రహస్యంగా నిర్వహించే బాధ్యతను నాకు అప్పగించారు. ఇందులో భాగంగా ఒక్కో ప్రాంతానికి వెళ్లాను. రెండేళ్లపాటు జరిగిన ఈ ప్రయత్నం కారణంగా, ఎంతో మంది యువత స్వాతంత్రోద్యమంలో విప్లవ పంథాను ఎంచుకున్నారు. అయితే 1929లో ‘లాహోర్ కేసు’లో భగత్‌సింగ్, ఇతర మిత్రులతో పాటు అరెస్టయ్యి లాహోర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది’ అని బిజోయ్ తన ఆత్మకథలో రాసుకున్నారు.

లాహోర్‌ కేసులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు మరణశిక్షను విధించగా, బిజోయ్‌ సహా ఏడుగురికి జీవితఖైదును విధించారు. ఆ తర్వాతి కాలంలో బిజోయ్‌ను దేశంలోని వివిధ జైళ్లకు తిప్పారు. తర్వాత కొంత కాలానికి అండమాన్ జైలుకు పంపించారు. అయితే కాలాపానీ జైలు పేరెత్తితేనే, అక్కడి అమానవీయమైన శిక్షల గురించి తెలిసి ఖైదీలు భయపడిపోయేవారు. కానీ బిజోయ్ మాత్రం అండమాన్‌లో మరికొందరు స్వాతంత్ర్య పోరాటయోధులను కలుసుకోబోతున్నానని ఆనందించారు. అక్కడి పరిస్థితులపట్ల ఆయన ఏమాత్రం భయపడలేదు. జైలుకు వెళ్లగానే అక్కడి పరిస్థితులను మార్చాలంటూ జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

‘బ్రిటిష్ ప్రభుత్వం మమ్మల్ని దేశ బహిష్కారం చేయాలన్న లక్ష్యంతో పంపిస్తోంది. కానీ మేము మాత్రం దేశ స్వాతంత్ర్య పోరాట క్షేత్రానికి తీర్థయాత్ర ప్రారంభిస్తున్నాం. ఒక్కసారి పోర్టుబ్లెయిర్ జైలుకు వెళ్లగానే, అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న సోదరులతో కలిసి మేము కూడా ఉద్యమిస్తాం’ అని ఆయన, తన నిర్ణయాన్ని తెలియజేశారు. ‘జైలు గేటు వద్దకు చేరుకోగానే అక్కడున్న యురోపియన్ అధికారితో, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మా సోదరుల వద్దకు తీసుకెళ్లమని అడిగాం’ అని ఆత్మకథలో బిజోయ్ వెల్లడించారు.

జైలులో అత్యంత కఠినమైన, అమానవీయమైన పరిస్థితులను మార్చాలంటూ ఈ దీక్ష కొనసాగుతోంది. జైలు అధికారులు పరిస్థితుల మార్పుపై హామీ ఇవ్వడం వల్ల, 55 రోజులపాటు కొనసాగిన ఈ దీక్ష విరమించారు. ఈ దీక్ష సందర్భంగా భారతమాత ముద్దుబిడ్డలయిన మహబీర్ సింగ్, మోహన్ కిషోర్, మోహిత్ మోయిత్రా ఆత్మత్యాగం చేశారు.

జైలు వాతావరణ పరిస్థితులు అక్కడ ఉండేందుకు ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కావు. దీనికితోడు రాజకీయ ఖైదీలపట్ల జైలు అధికారులు కనబరిచే ప్రవర్తన మరింత దారుణంగా ఉండేది. నిర్ణీత సమయంలో అసాధ్యమైన పనులు చేయాలంటూ చిత్రహింసలు పెట్టడం, వాటిని పూర్తిచేయడంలో విఫలమైతే కఠినాతికఠినంగా శిక్షించడం చేసేవారు. చేతులు వెనక్కు కట్టి బేడీలు వేసి నిలబెట్టేవారు. కాళ్లకు, చేతులకు, మెడకు సంకెళ్లు వేసేవారు. జనపనార సంచీలతో బట్టలు కుట్టించి ఇచ్చేవారు. అక్కడి వాతావరణానికి వాటిని ధరించడం పెద్ద నరకంగా ఉండేది.

జైలులో ఉన్న భయంకరమైన పరిస్థితులు, పారిశుద్ధ్యం లేకపోవడం కారణంగా ఖైదీలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. క్షయ, కీళ్లవాతం, ఉబ్బసం, డయేరియా వంటి వ్యాధుల బారిన పడేవారు. అక్కడి శారీరక, మానసిక చిత్రహింసల కారణంగా కొందరు తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయేవారు. చాలామంది ఉన్మత్తులయ్యారు. మరికొందరు ప్రాణత్యాగం చేసుకున్నారు. ఇవి అంతకంతకూ పెరుగుతున్నందుకే జైలులో పరిస్థితులు మార్చాలంటూ పలువురు గొంతెత్తారు. జైలు అధికారులకు కొందరు ఖైదీలు లేఖలు కూడా రాశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

జైలు అధికారుల తీరుకు వ్యతిరేకంగా బిజోయ్, అతని స్నేహితులు, తోటి ఖైదీలు ఆమరణ దీక్షకు కూర్చున్నారు. దీనికి జైల్లో ఉన్న ఇతర ప్రముఖ రాజకీయ ఖైదీల నుంచి కూడా మద్దతు లభించింది. ఈ వార్త భారతదేశంలోని ఇతర ప్రముఖ నాయకులకు కూడా చేరింది. ఈ దీక్ష కారణంగా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో జైలు అధికారులు, ఈ దీక్షను ముగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పరిస్థితి విషమిస్తుండటంతో దీక్షను విరమించాలంటూ బంధువులు, మిత్రులు లేఖలు రాసేవారు. అయితే ఈ ఒత్తిడి ఎక్కువవుతుండటంతో 45 రోజుల తర్వాత ఈ దీక్షను విరమించాల్సి వచ్చింది. మహాత్మాగాంధీ, విశ్వగురువు రవీంద్రనాథ్ ఠాగూర్‌ల చొరవతో అందరు రాజకీయ ఖైదీలను ఈ జైలు నుంచి భారతదేశంలోని ఇతర జైళ్లకు తరలించారు. అండమాన్‌లో భారతీయ స్వాతంత్ర్య పోరాటయోధులు అనుభవించిన దారుణకష్టాలకు ముగింపు పలికారు.

మన విప్లవ మార్గ స్వరాజ్య సంగ్రామ యోధులు దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టేందుకు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు దురదృష్టవశాత్తూ మన పాఠ్యపుస్తకాల్లోనూ చోటు దక్కించుకో లేదు. ప్రతి భారతీయ భాషలోనూ వీరి త్యాగాలను తర్వాతి తరాలకు అందజేయాల్సిన ఆవశ్యకత ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments