సుభాష్ చంద్రబోస్ వందేమాతరంపై నెహ్రూ గారి కి వ్రాసిన లేఖ చూస్తే నేటికి అదే తలపిస్తుంది. చరిత్ర మనకు పాఠం చెబుతుంది “మనము దానినుండి నేర్చుకోకపోతే, అదే చరిత్ర మళ్లీ పునరావృతమవుతుంది.” నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1937లో చేసిన ఈ హెచ్చరిక నేటి భారత్‌లో అక్షరసత్యంగా నిలిచింది. ఆయన దృష్టి ఎంత దూరదృష్టి గలదో, నేటి పరిస్థితుల్లో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం.
1937 లో బోస్ లేఖ ఒక హెచ్చరిక: 1937 అక్టోబర్ 17న సుభాష్ చంద్రబోస్ గారు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖలో హిందూ–ముస్లిం ఐక్యత గురించి అత్యంత గంభీరమైన విశ్లేషణ చేశారు. ఆయన రాసిన మాటలు ఆ కాలం నాటి రాజకీయ, మతతత్వ వాతావరణాన్ని అచ్చంగా ప్రతిబింబిస్తున్నాయి.
“మతతత్వ ముస్లిములు ఎప్పటికప్పుడు ఏదో ఒక భూతాన్ని లేవనెత్తుతారు. కొన్నిసార్లు అది మసీదుల ముందు సంగీతం, మరికొన్నిసార్లు ఉద్యోగాల్లో అన్యాయం, ఇప్పుడు అది ‘వందేమాతరం’. వందేమాతరం అనే అంశం హఠాత్తుగా ప్రాముఖ్యత పొందింది, బహుశా కాంగ్రెస్ శాసనసభలో దానిని ఆలపించడం ద్వారా విజయాన్ని ప్రదర్శించడం కారణం కావచ్చు.” “జాతీయవాద ముస్లిముల ఆందోళనలకు నేను స్పందిస్తాను. కానీ మతతత్వవాదులు చేసే వాదనలతో రాజీ పడకూడదు. నేడు మీరు ‘వందేమాతరం’ విషయంలో వారికి లొంగిపోతే, రేపు వారు మరొక భూతాన్ని లేవనెత్తుతారు.” ఈ వాక్యాల్లో ఆయన స్పష్టంగా హెచ్చరించారు. మతతత్వం ముందు తలవంచడం అనేది జాతీయ ఐక్యతను బలహీనపరచే ప్రారంభం అవుతుంది.
బోస్ హెచ్చరికను విస్మరించిన నెహ్రూ: అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ గారు ఈ లేఖను పక్కన పెట్టి, ‘వందేమాతరం’ పాటలో మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించారు. ఇది బోస్ చెప్పినట్టుగానే మతతత్వ ఒత్తిడికి లొంగిపోవడమే. మరియు, ఆయన ఊహించినట్లుగానే, ఈ రాజీ తర్వాత కేవలం మూడు సంవత్సరాలకే పాకిస్తాన్ డిమాండ్ లేవనెత్తబడింది. రాజీ ఎప్పుడూ తాత్కాలిక సమాధానం మాత్రమే, కానీ భవిష్యత్తులో మరింత ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది.
నేటి పరిస్థితుల్లో బోస్ చెప్పింది వాస్తవంగా మారింది: నేడు కూడా ఇస్లామిస్టులు ‘వందేమాతరం’ అనే పదంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పాటపై దాడి కాదు. భారత జాతీయవాద భావజాలంపై ప్రత్యక్ష దాడి. దేశభక్తి భావనను మతపరమైన కోణంలో చూడటం, విభజన విత్తనాలను చల్లడం ఇవన్నీ అదే పాత మతతత్వ పద్ధతులే. బోస్ చెప్పినట్లుగా, ఒకసారి రాజీ పడితే మరుసటి రోజు మరో “భూతం” లేవనెత్తబడుతుంది.
వందేమాతరం భారతీయ ఆత్మ: మతతత్వ శక్తులు ఎంత దుష్ప్రచారం చేసినా, వందేమాతరం భారతదేశానికి శక్తి, స్ఫూర్తి, ఐక్యత యొక్క ప్రతీక. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ప్రముఖ జాతీయవాద ముస్లిం నేత, ఈ గీతాన్ని విని గాఢంగా మురిసిపోయారు. మహమ్మద్ అలీ జిన్నా కూడా 1937కు ముందు కాంగ్రెస్ సమావేశాల్లో ఈ గీతం ఆలపించినప్పుడు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
గదర్ విప్లవకారుల సాక్ష్యం 1914: అమెరికాలో 1914లో ప్రచురితమైన ‘గదర్’ పత్రికలో రెండు వైపులా, పైభాగంలో ఉర్దూ లిపిలో “వందేమాతరం” అని రాసి ఉండటం చారిత్రక సాక్ష్యం. అది ఒక మతానికి చెందని, భారత విప్లవస్ఫూర్తిని ఏకం చేసిన జాతీయ గీతమని స్పష్టంగా చూపిస్తుంది.
నేతాజీ దూరదృష్టి నేటికీ మనకు మార్గదర్శకమే. మతతత్వ ఒత్తిడికి లొంగకుండా, జాతీయ స్ఫూర్తిని కాపాడటం. అదే ఆయన సందేశం. ‘వందేమాతరం’ కేవలం ఒక గీతం కాదు అది భారత ఆత్మకు నినాదం, దేశభక్తి తో ఒళ్లుపులకరించే రణనినాదం, స్వాతంత్ర్య పోరాటం యొక్క ప్రతిధ్వని... వందేమాతరం! జై హింద్! -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds


