అవిస్మరణీయుడు అస్ఫాఖుల్లా ఖాన్ -వడ్డి విజయసారథి - MegaMinds

0


మన భారత స్వాతంత్ర్య సమరంలో మహోత్సాహంంతో పాల్గొని తన జీవితాన్ని పూజాకుసుమంగా  సమర్పించిన నవయువకులలో అవిస్మరణీయుడు అస్ఫాఖుల్లా ఖాన్. అతని గురించి తెలుసుకోవటం మనకెంతో స్ఫూర్తినీయగలదు.

1924-27 మధ్య ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటన లలో ప్రముఖ పాత్రవహించిన యువకుల బృందం హిందూస్థాన్ ప్రజాతంత్ర సేన.దీని నాయకుడు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆయన వ్యక్తిగత జీవితం ఉత్తమ మైనది. అనన్య నిష్ఠగల ఆరాధకుడు ఆర్యకుమార సభ ద్వారా లభించిన గురువు  స్వామి సోమదేవ నుండి ధార్మిక విషయాల నభ్యసించాడు. గురువు మరణానంతరం రాజకీయాల్లో ప్రవేశించాడు. లఖనవ్ కాంగ్రెసు మహాసభలకు హాజరై లోకమాన్య తిలక్ సందేశాన్ని శ్రద్ధగా విన్నాడు.

రామ్ ప్రసాద్ స్త్రీ లందరినీ జగన్మాతృస్వరూపులుగా దర్శించే నైష్ఠిక బ్రహ్మచారి. ఎన్నో దేశభక్తిగీతాలను రచించాడు. అరవిందుని యోగసాధన గ్రంథాన్ని, ఇతర రచయితల గ్రంథాలనూ అనువదించిన సాహిత్యకారుడు. ఆయన స్నేహితులైన అస్ఫాఖుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరీ,చంద్రశేఖర ఆజాద్ లు హిందూస్థాన్ ప్రజాతంత్ర యువసేనలో చేరారు.

దేశంలోని ప్రజలను మేల్కొల్పడానికి 1924లో రంగూన్ నుండి పెషావర్ వరకు దేశమంతటా ఒక రోజున ఒకకరపత్రాన్ని వెదజల్లారు. ఒక నూతన తార ప్రభవించడానికి ముందు కొంత కల్లోలం అనివార్య మౌతుందనే వాక్యంతో ఆ కరపత్రం ఆరంభమైంది. భారతదేశపు ప్రాచీన ఋషులు, వీరయోధులూ తమకు స్ఫూర్తిప్రదాతలని, వారి అడుగుజాడలలో పయనిస్తూ స్వాతంత్ర్యం సంపాదిస్తామని దానిలో పేర్కొనబడింది. దానిని గమనించిన ప్రభుత్వం నెత్తిన పిడుగు పడినట్లయింది.

ఈకరపత్రం ముద్రణకు, ప్రచారానికీ ఎంతో డబ్బు ఖర్చయ్యింది. కొంత అప్పుచేయవలసి వచ్చింది. ఆ ఇబ్బందులనుండి బైటపడడానికి ధనసేకరణ మార్గాల నన్వేషించవలసి వచ్చింది. విప్లవకారులు తమ ఇండ్లనుండి అందుబాటులో ఉన్నధనాన్ని తెచ్చారు. కాని ఉద్యమ అవసరాలకు అది ఏమాత్రం సరిపోదు. అందరూ కలసి బాగా ఆలోచించిన తర్వాత రైలులో తీసుకుపోతున్న ప్రభుత్వధనాన్ని  దోచుకోవటమే మంచిదనే నిర్ధారణకు వచ్చారు. తాము ఈ పనిచేసినట్లయితే ఆంగ్ల సామ్రాజ్యాన్ని ఒక కుదుపు కుదిపినట్లవు తుందనీ భావించారు.

బిస్మిల్ తనతోపాటు  తొమ్మిది మందిని ఎంపిక చేశాడు. వారు ఎంచుకున్న స్థలం కాకోరీ. లఖనవ్ నుండి ఎనిమిదిమైళ్ల దూరంలో ఉంది. రైలుస్టేషన్ కి అటూఇటూ, రైల్వే లైనుకు రెండువైపులా  దట్టంగా అలుముకున్న చెట్లు, చీమలపొదలూ ఉన్నాయి. ఒకసారివెళ్లి ఆ స్థలమంతా పరిశీలించివచ్చారు.

1925 ఆగస్టు 9 మధ్యాహ్నానికి వారు సిద్ధమైనారు. మొదట శచీంద్ర బక్షీ, అస్ఫాఖ్, రాజేంద్రులు పెద్దమనుషుల్లా దుస్తులుధరించి  రెండవ తరగతి టిక్కెట్లు తీసుకొని విడివిడిగా రైలుకోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు. మిగిలినవారూ టిక్కెట్లు తీసుకొని అక్కడక్కడా నిలబడ్డారు. షాజహాన్ పురం వైపు నుండి కూతవేసుకొంటూ రైలువచ్చింది. శచీంద్ర,అస్ఫాఖ్,రాజేంద్ర లు రెండోతరగతి పెట్టెలో ఎక్కారు. మిగిలినవారు మూడో తరగతి పెట్టెల్లో ఎక్కారు.

రైలుకూతవేసుకొంటూ సిగ్నల్ పోస్టువరకుముందుకు సాగింది. ఒకడు పెద్దగొంతుతో అరుస్తున్నాడు. "నా నగలపెట్టెఏదీ? కనబడటం లేదే?" మిగిలిన ఇద్దరూ "అరరె,అది కాకోరీలో ఉండి పోయింది" అంటూ  అపాయాన్ని సూచిస్తూ రైలును ఆపే గొలుసు లాగారు. బండి ఆగటమే ఆలస్యంగా ఆ ముగ్గురూ బయటకు దూకారు.అప్పటికి వేర్వేరు పెట్టెలనుండి ఇతర విప్లవకారులుకూడా క్రిందకు దూకారు. గార్డుపెట్టెవైపు మెరుపులా పరుగెత్తారు. ఐదారు మంది యువకులు చేతిలో పిస్తోళ్లు పట్టుకొని, గాలిలో ప్రేలుస్తూ, "ఎవరూ దిగకండి. ప్రయాణికుల కేమీ అపకారం జరగదు.ఎవరైనా క్రిందకు దిగితే ప్రమాదం తప్పదు. ఖబడ్దార్"అంటూ కేకలువేస్తూ రైలు పొడవునా నిలిచారు. వారు ఒళ్లంతా కళ్లు చేసుకొని ప్రయాణీకుల కదలికలను కనిపెట్టు తున్నారు. ప్రయాణీకులు వణికిపోతూ  ముడుచుకు కూర్చున్నారు. గార్డు పచ్చదీపం చూపించి బండిని బయలుదేరదీసేలోపు శచీంద్ర బక్షీ అతనిపై దూకి క్రింద పడవేశాడు. చంద్రశేఖర ఆజాద్ తన చేతిలో పిస్తోలుతో అక్కడే కాపలాకాస్తూ నిలబడ్డాడు.

గడగడ వణుకుతున్న గార్డు లేవలేదు. మరోప్రక్క మరోఇద్దరు డ్రయివరును, అతని సహాయకుడినీ క్రిందకు పడద్రోసి , వారిపై కన్నుంచి నిలిచారు. రాంప్రసాద్ బిస్మిల్, ఆజాద్, మరిఇద్దరు మెరుపుల్లాగా గార్డుపెట్టెలోకి ఎక్కి డబ్బుపెట్టెను ఎత్తి క్రిందపడవేశారు. పెట్టెకు బలమైన తాళం ఉంది. దానిని పగులగొట్టాలి. సుత్తి పైకెత్తి తాళంపై మోదటం మొదలుపెట్టారు. కాని అది లొంగటంలేదు.ఒక ప్రయాణీకుడు హఠాత్తుగా క్రిందకు దిగి పరుగెత్త బోయాడు. ఒక యువకుని చేతిలో పిస్తోలు ప్రేలింది. అతడు క్రింద పడ్డాడు.

ఇంతలోనే మరో విపత్తు. మరోరైలు అటువైపు వస్తున్నది. "భగవంతుడా! ఏమిపరీక్ష? ఆరైలు డ్రయివరుకు అనమానంవచ్చి రైలు ఆపితేఎలా?" విప్లవకారుల గుండె దడదడా కొట్టుకోనారంభించింది. తమ పనులు ఆపి,  రాతిబొమ్మల్లాగ ఊపిరిబిగబట్టి నిలిచారు. రైలువచ్చింది. దానివెలుగు అక్కడ ప్రసరించింది. ప్రయాణీకు లెవరూ కకలుపెట్టి దానిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ రైలు ముందుకు వెళ్లిపోయింది. తాళం ఊడిరావటం లేదని గమనించిన ఆస్ఫాఖ్ అక్కడికి చేరి తన చేతిలో పిస్తోలును మన్మథరావువైపు విసిరి, సుత్తి తన చేతిలోకి తీసుకున్నాడు....మొదటి దెబ్బకు తాళం వదులైంది. రెండవదెబ్బకు తాళం ఊడిపడింది.

విప్లవకారులు పాదరసంలా పనిచేశారు. డబ్బున్న తోలుసంచులను తమతమ తువ్వాళ్లలో కట్టుకున్నారు. ఈ పని అంతా పది పన్నెండు నిమిషాల్లో పూర్తయింది. చుట్టూఉన్న దట్టమైన అడవివైపుగావెళ్లి మాయమైనారు. త్రోవలోనే డబ్బును తోలుసంచులనుండి వేరే సంచులలోకి మార్చి,తోలుసంచులను నీరున్న సెలయేరువంకల్లో పారవేసి పరారీ అయ్యారు....సూర్యోదయ సమయానికి గోమతీతీరం చేరి,ప్రొద్దున్నే స్నానంచేయడానికివచ్చే జనంలో కలిసిపోయి, లఖనవ్ లో ప్రవేశించారు. తాము చేసిన ఘన కార్యానికి వారు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే ఆవిధంగా వారికి లభించినది ఐదువేల రూపాయలు మాత్రమే. ఒక ప్రయాణికుడు మరణించాడని తెలిసి బిస్మిల్ కి కోపంవచ్చింది.

రైలు నిలిపి ప్రభుత్వధనం దోచుకున్నారనే సమాచారం కొద్దిసేపట్లోనే అధికారులకు చేరింది.. క్షణాలలో పోలీసులకు ఆదేశాలువెళ్లాయి. అన్నిదిక్కులా గాలింపు ప్రారంభమైంది. గూఢచారి వలయం విస్తృతమైన వలవేసింది.సుమారు నలబై మంది ఆ వలలో చిక్కుకున్నారు...దోపిడీలో దొరికిన కొన్నినోట్లు షాజహాన్ పురంలో చలామణీ కావటం గమనించి పోలీసులు అక్కడ తమ ప్రయత్నాలు కేంద్రీకరించారు. కొద్దిరోజులలోనే ఒక తెల్లవారు జామున బిస్మిల్ ని, మరికొందరినీ పట్టుకున్నారు. ఒక మిత్రుని ద్రోహంకారణంగా అస్ఫాఖ్ డిల్లీలో దొరికి పోయాడు. దొరకకుండా ఉన్నవాడు ఆజాద్ ఒక్కడే.

విచారణ 18 నెలలపాటు జరిగింది. విప్లవవీరులను రక్షించుకొనడానికి గోవింద వల్లభ పంత్, సి.బి.గుప్త , మోహన్ లాల్ సక్సేనా వంటివారు న్యాయస్థానాలకు వచ్చారు. విప్లవకారులైతే తమ విడుదల గురించి ఆలోచించేవారేకాదు. సహజమైన ఉత్సాహంతో కుస్తీలు, వ్యాయామం, భజనలు, పాటలూ చతురోక్తులతో ఆనందంగా ఉండేవారు.

1927 ఏప్రియల్ 7న న్యాయస్థానం తీర్పుచెప్పింది. రామప్రసాద్ బిస్మిల్, అస్ఫాఖుల్లాఖాన్, ఠాకూర్ రోహన్ సింగ్, రాజేంద్రలాహిరీ(ఎం.ఏ పట్టభద్రుడు) -ఈనలుగురికీ ఉరిశిక్ష విధింపబడింది. వారందరూ ఈ మాట వింటూనే పరమానందంతో ఎగిరి గంతువేశారు. మన్మథనాథ్ గుప్తకు 14 సం.లు, జోగేశ్ చంద్ర చటర్జీ, ముకుందలాల్, రామకృష్ణ ఖత్రీ మొదలైనవారికి పదిసం.ల శిక్షలూ మిగిలినవారికి నానారకాల శిక్షలూ విధింపబడ్డాయి.

పండిత రామప్రసాద్ బిస్మిల్ ఉరితీయబడిన 1927 డిసెంబర్19 నాడే అతని పరమ ఆప్తమిత్రుడు అస్ఫాఖుల్లాఖాన్, రోషన్ సింగ్ కూడా లఖనవ్ లో ఉరితీయబడ్డారు. రాజేంద్ర లాహిరీని 17నే ఉరితీశారు. ఆ సందర్భంగా వారు పాడిన పాటలు స్వాతంత్ర్యోద్యమంలో ఆతర్వాతరోజులలోకూడా మార్మ్రోగుతూవచ్చాయి. -వడ్డి విజయసారథి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top