మీరు వక్త కావలనుకుంటున్నారా - how to overcome stage fear of public speaking in telugu

megaminds
14
వక్తృత్వకళ
బుసకొట్టే పాములకంటే, అగాధమైన జలరాశికంటే, అసలు చాపుకంటే కూడా... పదిమంది ముందు మాట్లాడటమే తమను మితంగా భయపెడుతుందని ఒప్పుకుంటారు చాలామంది. ఇటీవల అంటే సెప్టెంబర్ 11 ఘటన తర్వాత (WTO కూల్చివేత) 3 వేలమంది అమెరికన్లను మీరు మితంగా దీనికి భయపడతారు? అనడగ్గా ఎక్కువమంది నలుగురిని ఉద్దేశించి మాట్లాడమంటే అని జవాబిచ్చారు.
వేదికమీదికి వచ్చి మాట్లాడాలి అనే మాట చాలు... చాలామందిని భయకంపితుల్ని చేయడానికి! దీన్నే సభాపిరికితనం (Stage fear) అంటారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు టోపో ఫోబియా అని పిలుస్తారు, నలుగురిని ఉద్దేశించి మాట్లాడటాన్ని వక్తృత్వకళ అంటారు. వక్తృత్వం అంటే ఉపన్యసించడం, అదొక కళ. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
సభా పిరికితనం పోవడానికి ఎలా ప్రయత్నంచాలి
ఒక ప్రసంగానికి సిద్దపడటానికి ముందు తీసుకోవాల్సిన మొదటి చర్య సభాపిరికితనాన్ని నియంత్రించుకోవటం. దీనికి తేలికైన మార్గం సాధన, మొదటి కొన్ని వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు కొంత అధైర్యం వెన్నంటే ఉంటుంది. దాన్ని మీరు గమనించగలరు. కానీ మీ శ్రోతలు దాన్ని అరుదుగా గమనిస్తారు, మాట్లాడబోయే వ్యక్తి ఆసక్తికరంగా, ఉత్తేజకరంగా మాట్లాడతాడనీ, ఆ మాటల్లో సమాచారం ఉంటుందనీ, వినటంవల్ల ఆహ్లాదం కలుగుతుందనీ శ్రోతలు ఆశిస్తారు. ఈ విషయాన్ని మననం చేసుకుంటే సభాపిరికితనం బాధించదు.
శ్రోతలను చూసి భయపడేవారికి డేల్ కార్నెజి ఒక చిట్కా చెప్పారు. అదేమిటంటే శ్రోతలను మీ దగ్గర అప్పు తీసుకున్న వారిలా భావించండి. మీరిచ్చిన అప్పు తీర్చేగడువుని ఒక నెలరోజులు పెంచమని అడగడానికి వచ్చిన వారిగా వారిని ఊహించుకోండి. దానివల్ల మీరు వారిని చూస్తే భయం అనే మాట మరిచిపోతారు, అధైర్యపడటం గురించి అధైర్యపడకుండా ఉంటే చాలు.
ప్రసంగానికి ముందు
శ్రోతల ముందుకు వెళ్ళడానికి ముందు కుర్చీలో కూర్చొని మొదట దీర్ఘశ్వాస తీసుకోవాలి. తర్వాత తలను ముందుకు వెనక్కు క్రిందికి పైకి గుండ్రంగా తిప్పడంచేయాలి. దాంతో కండరాలు సాగి తేలికగా ఉండి, ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగతుంది, ప్రసంగాన్ని సమర్థవంతంగా తయారుచేసుకుంటే మాట్లాడటానికి సిద్ధమైనట్లు మీకే తెలుస్తుంది. వాజ్ పాయ్ లాంటివారు తాము ప్రసంగించవలసిన ప్రతిసారీ, ప్రసంగాన్నివ్రాసుకునేవారు. శ్రోతలు ఎవరు, వారేం చేస్తుంటారు, వారికి ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అనేది ముందే తెలుసుకోవాలి. ఆ మధ్య ఒక స్నేహితుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మాట్లాడమని కోరడం జరిగింది. ఆయన పురుషసింహులు కండి అనే అంశాన్ని ఎంపిక చేసుకుని,తయారై వెళ్ళాడు, వేదిక పైకి ఎక్కగానే శ్రోతలు ఎక్కువమంది అమ్మాయిలే ఉండటం గమనించారు. ఆ రోజు కార్యక్రమం ఎంత నీరసంగా గడిచి ఉంటుందో అర్థం చేసుకోండి.
వేదికపైకి వెళ్ళడం ఎలా
కంగారు పడకుండా, చిరునవ్వుతో వెళ్ళాలి. ప్రసంగంలో ఇంకా మొదటిమాట కూడా పలకకముందే మీపై శ్రోతలకు సదభిప్రాయం కలగజేసేది మీరు కనిపించే, ప్రవర్తించే విధానమే. వేదికపై సహజంగా నిలబడాలి. పాదాలు ఒక దానికొకటి కొంత దూరం ఉండేలా నిలబడాలి. ప్రసంగించేటపుడు చేతులు శరీరానికి రెండు పక్కలా క్రిందకు వ్రేలాడుతూ ఉండటమే సహజం. చేతుల్లో ఏ వస్తువులూ ఉండరాదు. మీ ముందు కూర్చున్న శ్రోతలు అమాయకులు కారనే విషయం మనసులో ఉంచుకోండి. వాళ్ళలో మేధావులు ఉండవచ్చు. మీ ప్రసంగం వింటున్నారంటే, వారు మీకొక అవకాశం ఇచ్చారన్న మాట.
ప్రసంగం ప్రారంభం ఎలా
శ్రోతలను సంబోధించే పద్ధతిలో నమ్రత ఉండాలి. చికాగోలో స్వామి వివేకానంద శ్రోతలను సంబోధించిన తీరును గుర్తుచేసుకోండి. ప్రసంగంలో తొలి పలుకులు, వినేవారిని ఆకట్టుకోవాలి. నేనొకసారి కాలేజీకి వెళ్ళి నపుడు ఇలా మొదలెడితే శ్రోతలు వినడానికి ఉత్సుకత చూపారు. నిజానికి ఇది చర్చిల్ టెక్నిక్. చెప్పే విషయం సమాచారంతో నిండి ఉండి ఆసక్తి కల్గించాలి. ప్రసంగ ప్రారంభంలో ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని వెల్లడించడం, కొటేషన్తో మొదలు పెట్టడం. దాంతో శ్రోతలతో మీకు స్నేహం ఏర్పడుతుంది. తర్వాత ఏం చెప్పదల్చుకున్నదీ ప్రస్తావించాలి, దాన్నే తార్కికంగా బలపరుస్తూ పోవాలి. మధ్యలో విషయం సొగసుగా, పొందికగా క్రమపద్ధతిలో చెబుతూ పోతే, వినేవారు నిజమే సుమా అనుకుంటారు.ప్రసంగ విషయాన్ని రెండు భాగాలుగా విభజించుకోవాలి.మొదటిది ప్రారంభవాక్యాలు ప్రధాన అంశానికి ద్వారంలా ఉండాలి, మొదట చెప్పిన అంశాల ప్రయోజనాన్ని ఈ దశలో తలకు వివరించాలి. రెండవ భాగంలో వాస్తవికాంశాలు, వాటిని నిరూపించే ఉదాహరణలూ ఉండాలి. ప్రసంగం మొత్తంమీద మీరు ఏం చెప్పదల్చుకున్నారో అది చెప్పే చోటిది. మీరు చెప్పే విషయాలకు ఆధారంగా గణాంకాలు, శ్లోకాలు, కొటేషను లాంటివి ఉదహరిస్తుంటే, శ్రోతలు వాటి ప్రాధాన్యతను అర్ధం చేసుకోగల్గుతారు. అయితే ఇదీ ఎక్కువగా ఉండరాదు.
ప్రసంగించే తీరు
ఉత్సాహం వెల్లి విరియాలి. మొక్కుబడిగా చెబుతున్నట్లుండరాదు. ప్రసంగం మొత్తం ఒకే స్థాయిలో కాకుండా, హెచ్చుతగ్గులుగా కంఠస్వరం ఉండాలి. ప్రసంగం ఎంత వేగంతో చెబుతున్నారో గమనించాలి. ఆకళింపు చేసుకునే వ్యవధిని కొనసాగించాలి. మాటల మధ్యలో వ్యవధి నివ్వడంవల్ల వక్తకు కాస్త ఊపిరితీసుకోవడానికి, శ్రోతలకు తాము విన్నదాన్ని అర్థంచేసుకుని, వక్త మనోభావాన్ని గ్రహించడానికి వీలు కల్గుతుంది. ఎవరికి వారు ప్రత్యేకంగా తమకే చెబుతున్నట్లు శ్రోతలకు అన్పించేలా మాట్లాడాలి. ప్రసంగంలోని ప్రతి మలుపులో ఒక చక్కటి వాస్తవికాంశాన్ని ఓ మంచి ఉదాహరణని జోడించండి. ఆ వాస్తవం మీ స్వానుభవమైనా కావచ్చు, ఏదైనా పుస్తకంలోనిదైనా కావచ్చు. కానీ అది క్లుప్తంగా, స్పష్టంగా, ప్రసంగానికి సంబంధించినదై ఉండాలి. మీ కళ్ళను ప్రేక్షకులున్న స్థానానికి ఎగువకానీ, మొదటి వరుసలోని వారి పాదరక్షలపై కానీ నిలపరాదు. ఆఖరి వరుసలోని వ్యక్తికేసి చూసి మాట్లాడటం మొదలెట్టండి. తర్వాత మీకు దగ్గరలోని వ్యక్తిని చూడండి. మాట్లాడే విషయాన్ని యాత్రికంగా కాక, ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. కించపరచేవి, నిరాశ కల్గించేవి అయిన వ్యాఖ్యలను చేయకూడదు.
ఊతపదాలు వాడరాదు. ఉదా|| అయితే... మరి... ఏదైతే ఉందో... అది...కాని... కాబట్టి... లాంటివి. ఇతరుల శైలిని అనుకరించరాదు. తేలికైన భాషను, వాడుక భాషను వాడాలి. అలాగని ఒక మాండలీకంలోనే మాట్లాడరాదు. అపసవ్యభాష వాడరాదు. అతిశయోక్తులు ఉండరాదు. అనవసర వ్యంగ్యం ఉండకూడదు. మనకు ఇచ్చిన ప్రసంగపు అంశాన్ని దాటిపోరాదు, ఒకసారి ఒక వక్తకు రాణా ప్రతాప్ కథ చెప్పమని కోరడం జరిగింది. ఆయన మొదలెట్టారు. కథలో చిత్తోడ్ కోటపై ఎగురుతున్న ఆకుపచ్చ చూసిన రాణా ప్రతాప్ అనే విషయం వచ్చిన తర్వాత ఆ వక్త తాను చెబుతున్న కథ మరచిపోయి, సింహగఢ్ కోటపై ఎగురుతన్న ఆకుపచ్చ జండాను చూసిన మాల్సరేను, ఆ తర్వాత ఆయన సింహగఢ్ కోటను జయించడం - కథను చెప్పేశాడు అంశాన్ని సాగదీయరాదు.
కానీ ప్రతి మాటలో ఉత్సాహం ఉండాలి. శ్రోతలది విలువైన సమయమని గుర్తించాలి. మనకు కేటాయించిన సమయం లోపలే మన ప్రసంగం ముగించాలి. వేదికను మనతోబాటు పంచుకునే ఇతర వ్యక్తుల సమయాన్ని మనం మింగేయరాదు. ప్రసంగానికి అంతరాయం కల్గించినవారితో వాదనకు దిగరాదు. ప్రసంగం ముగిశాక శ్రోతలకు తమ సమయం సద్వినియోగం అయినందనిపించాలి. అసందర్భంగా, అర్థరహితంగా ప్రసంగాన్ని మధ్యలో ఆపకూడదు. మీ ఉపన్యాసం నిశ్శబ్దం కంటే మెరుగ్గా ఉండాలి. అది సాధ్యం కాని పక్షంలో నిశ్శబ్దమే ఉత్తమం. ప్రసంగావకాశాలను పెంచుకుంటే మంచి వక్తగా మారగలము. జాన్ ఎఫ్. కెన్నడి మంచి వక్తకు ఉండాల్సిన లక్షణాలను 'P P P” గా వర్ణించాడు. అంటే మూడు Pలు. మొదటి P అంటే ప్రిపరేషన్, రెండవ అంటే P ప్రాక్టీస్, మూడవ P అంటే ప్రజంటేషన్. వీటిలో ఏది లోపించినా ప్రసంగం పట్టు తప్పుతుంది.
ముగింపు
వక్త చెప్పే తుది మాటలు శ్రోతల చెవుల్లో ప్రతిధ్వనించేంతగా, చిరకాలం గుర్తుండేలా ప్రభావవంతంగా ఉండాలి. మీ ప్రసంగాన్ని సమర్థవంతంగా ముగించడానికి మీరు చెప్పిన అంశాలను సారాంశంగా చెప్పవచ్చు. తొలి పలుకుల్లో ఉదహరించిన ఏదో ఒక చిట్కాను (కథకొటేషన్) ప్రయోగించవచ్చు. విషయాన్నిబట్టి కార్యాచరణకు అభ్యర్థన చేయటమూ మంచిదే. కవిత్వపు పాదాలతోనూ ముగించవచ్చు.
వక్తలలో రకాలు
1. Express Speaker - ఒత్తిడితో, సరిగా సంసిద్ధంకాక, హడావిడిగా, వేగంగా మాట్లాడేవాడు.
2. Statue Speaker - మాట్లాడటానికి ప్రారంభంలో ఎలా నిలబడ్డాడో, చివరివరకు అదే స్థితిలో ఉండేవాడు.
3. Series Speaker - తానేదో సంతాపసభలో ఉన్నట్లుగా, గంభీరంగా, నవ్వులేకుండా మాట్లాడేవాడు.
4. Book work Speaker- మాట్లాడటం మానేసి, వ్రాసుకొచ్చిన నోట్లను చదవటమే పనిగా పెట్టుకున్నవాడు.
5.Swinging Speaker- మాట్లాడే సమయంలో అటూ ఇటూ ఊగుతూ కన్పించేవాడు. చాలామంది ఒత్తిడి కారణంగా ఇలా చేస్తుంటారు.
6. Hungry Speaker- ఆకలితో ఉన్నట్లు ... చివరి మాటలను మింగేస్తూ మాట్లాడేవాడు.
7.Monotone Speaker-ఎలాంటి విషయమైనా గొంతులో హెచ్చుతగ్గులు లేకుండా ఒకే స్థాయిలో మాట్లాడేవాడు.
వక్తృత్వకళ అవసరంఏమిటి?
మనం చెప్పేది చక్కగా, ప్రభావంతంగా చెప్పటానికి, ఎదుటివారికి నచ్చజెప్పటానికి , మన వ్యతిరేకులు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి, స్నేహితులను పెంచుకోవటానికి.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నా నృతం బ్రూయాత్ ఏషధర్మః సనాతనః

అర్థం: సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. సత్యమైనప్పటికి అప్రియంగా పలకరాదు. ప్రియమైనప్పటికీ అసత్యం పలకరాదు. ఇదే మన సనాతన ధర్మం.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే
అర్థం: పరుల మనస్సును నొప్పించని విధంగా, సత్యమైనది, ప్రియమైనది, హితమైనది అగు వాక్యమును పలుకవలెను. మరియు స్వాధ్యాయము, అభ్యాసము - వీటిని వాజ్మయమైన తపస్సు అందురు.
వక్తకు వాగ్దాటి, వాక్చాతుర్యం, వాక్సంయమనం అనే వాటి మధ్య తారతమ్యం తెలిసి ఉండాలి, అధ్యయనం, అవగాహన, విశ్లేషణ, యోజన, ఉద్దేశ్యం, విషయం, సమయం,ఎదుటివారి స్థాయి ఇన్నింటిని వక్త సమన్వయం చేసుకున్నట్లయితే అదే వక్తృత్వ కళఅవుతుంది. ఆ వ్యక్తి మంచి వక్త అవుతాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

14 Comments
  1. వక్తగా రూపుదిద్దుకునుటకు చాలా ఉపయుక్తమైన బిందువులను ఏర్చి కూర్చారు.

    ReplyDelete
  2. సూపర్ గ్రూప్ సార్ చాలా నేర్చుకున్నా గ్రూప్ తోటి సమాజంలో ఉన్న భయాన్ని తీస్తున్న ఈ గ్రూప్

    ReplyDelete
  3. Excellent sir very inform as tive and intresting

    ReplyDelete
  4. వక్తకు ఉండవలసిన లక్షణాలు తెలియచేసారు.ధన్యవాదాలు

    ReplyDelete
  5. చాలా మంచి విషయాలు చెప్పారు

    ReplyDelete
Post a Comment
To Top