Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కార్బైడ్ వేసి పండించిన పండ్లు తినక తప్పదా?

పచ్చి మామిడికాయలను బంగారపువనె్నల మామిడి పండ్లుగా భ్రమింపచేసే రసాయన ప్రక్రియ మళ్లీ మొదలైపోయింది. వసంత ఋతువు- చైత్ర వైశాఖ మాసాలు- సహజ ప్రాకృ...

Image result for mango
పచ్చి మామిడికాయలను బంగారపువనె్నల మామిడి పండ్లుగా భ్రమింపచేసే రసాయన ప్రక్రియ మళ్లీ మొదలైపోయింది. వసంత ఋతువు- చైత్ర వైశాఖ మాసాలు- సహజ ప్రాకృతిక పరిమళాలకు నెలవు-అన్నది పాత కథ, పాత పడిపోయిన భారతీయత! వసంత ఋతువురసాయన విషాల వాసనల ‘కల్పతరువు’గా మారడం నడుస్తున్న కథ, కల్తీని పెంపొందిస్తున్న ప్రపంచీకరణ కథ! ఈ ‘రసాల ఫలం’- మామిడి పండు మాత్రమే కాదు, ఏ పండు కూడ సహజంగా పండిపోవడం లేదు, చెట్టున పండడం లేనే లేదు. కాయలను రసాయన విష ద్రావకాలలో ముంచడం వల్ల మాత్రమే మనకు పండ్లు లభిస్తాయన్నది వినూతన వాణిజ్య విశ్వాసం. ఈ విశ్వాసం ఇప్పుడు వ్యవసాయ రంగానికి కూడ విస్తరించింది! పసుపు పచ్చని రంగులతో, గోధుమ వనె్నలతో, కుంకుమ పువ్వు శోభలతో అత్యంత ఆకర్షణీయంగా దర్శనమిస్తున్న అరటి, ఆపిల్, కమలా, బత్తాయి వంటి పళ్లన్నీ విష రసాయనాలను వెదజల్లుతున్నాయన్నది నిరంతరం జరుగుతున్న ప్రచారం! వసంత ఋతువువచ్చేసరికి మామిడి కాయలు టన్నుల కొద్దీ, ట్రక్కుల కొద్దీ తరలివస్తున్నాయి. అందువల్ల విష రసాయనాల గురించి, ఈ రసాయనాలను వినియోగించి కాయలను ‘అకాల ఫలాలు’గా మార్చడం గురించి ప్రచారం మరింత హోరెత్తిపోతోంది. రసాయనాల విషాలను వాడడం నిత్య జీవనంలో ‘విలాసం’- ఫాషన్‌గా మారి పోయి ఉండడం ఆధునిక నాగరికత! అందువల్ల పండ్లను మాగపెట్టడానికి, కూరగాయలను తాజావని భ్రమింపచేయడానికి వివిధ రకాల విచిత్రమైన పేర్లున్న ‘రసాయన విషాల’ను ఉపయోగిస్తున్నారన్న ప్రచారం గురించి జనం పట్టించుకోవడం మానేశారు. కొనేయడం, తినేయడం అందువల్ల యథావిధిగా సాగిపోతోంది. ప్రభుత్వ యంత్రాంగం వారు- ఆహార భద్రతా విభాగం వారు, కల్తీ నిరోధక విభాగం వారు, ఇతర విభాగాల వారు- అప్పుడప్పుడు భాగ్యనగరంలోను, విజయవాడలోను, ఇతర పట్టణాలలోను పెద్దఎత్తున దాడులు జరుపుతున్నారు. దేశమంతటా ఇదే తీరు. ఇలా దాడులు జరిగినప్పుడు ‘ఎథిలిన్’ వంటి రసాయనాలు, కాన్సర్ వ్యాధిని కలిగించే ఇతర రసాయనాలు పెద్దఎత్తున పట్టుబడడం రెండు నెలలకోసారి, నాలుగు నెలలకోసారి పునరావృత్తం అవుతున్న ఆర్భాటం. కొంతమంది వ్యాపారులను నిర్బంధించడం, వారిపై అభియోగాలను నమోదు చేయడం, ఆ తరువాత ఈ అభియోగాల గురించి, నిందితుల గురించి సమాచారం లభించకపోవడం పాలనాప్రక్రియలో భాగం. దేశమంతటా ఇదే జరిగిపోతోంది! జనం విష రసాయన ప్రభావితమైన కూరగాయలను, పండ్లను భోంచేస్తూనే ఉన్నారు! ‘స్వచ్ఛ భారతం’ ఎలా అవతరించగలదు??
పండ్లను మాగబెట్టడానికై ‘ఎథిలిన్’ వంటి రసాయన పదార్థాలను, ద్రావకాలను, వాయువులను ఉపయోగించవచ్చునన్నది వ్యవస్థీకృతమైపోయింది. ప్రభుత్వాలు వీటి వాడకాన్ని అనుమతిస్తున్నాయి. అందువల్ల వ్యాపారులు మాత్రమే కాదు వ్యవసాయదారులు కూడ వీటిని వాడుతున్నారు. ఇలాంటి పదార్థాలలో ‘రసాయన సాంద్రత’- కెమికల్ కాన్‌సన్‌ట్రేషన్- అనుమతించినంత మేరకు మాత్రమే ఉండాలన్నది నిబంధన. అనుమతించిన పరిధిని వ్యాపారులు అతిక్రమించి ఈ రసాయనాల ‘సాంద్రత’ను పెంచుతున్నారట! అంతేకాక అనుమతించిన రసాయనాలతో అనుమతి లేని రసాయనాలను కలిపి కల్తీ చేస్తున్నారట! ‘ఎథిలిన్’ వంటి రసాయనాలను వాడడాన్ని అనుమతించడం ఎందుకు? ‘అనుమతి’ పరిధిని అతిక్రమించి వ్యాపారులు అక్రమాలకు పాల్పడడం ఎందుకు? ఎలాంటి రసాయనాలు కూడ వాడరాదని కాయలు సహజంగా పండ్లుగా మారే ప్రక్రియను మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వాలు ఎందుకని చట్టాలు చేయరాదు? అమలు జరుపరాదు?? ఎలాంటి రసాయనాలకు గురికాకుండానే వేల లక్షల ఏళ్లుగా కాయలు పండ్లయ్యాయి, వాటిని వ్యాపారులు అమ్మారు, వినియోగదారులు కొని తిన్నారు. గత కొన్ని దశాబ్దులుగా మాత్రమే రసాయనాలను, విషవాయువులను ఉపయోగించి కాయలను మాగబెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వికేంద్రీకృతమైన పంపిణీ వ్యవస్థ నశించిపోవడం, పంపిణీ క్రయవిక్రయాలు కేంద్రీకృతం కావడం. వ్యవసాయదారులు కృత్రిమ రసాయనాలు- ఎఱువులు, క్రిమిసంహారాలు- విరివిగా ఉపయోగించడం రెండవ ప్రధాన కారణం. ఆహార శుద్ధి- ఫుడ్ ప్రాసెసింగ్- పేరుతో నెలలకొద్దీ నిలువ ఉంచే ప్రక్రియలో విరివిగా రసాయన విషాలను వాడడానికి ప్రభుత్వాలు అనుమతిస్తుండడం మరో వైపరీత్యం!!
నాలుగైదు దశాబ్దుల క్రితం వరకు ప్రతి గ్రామంలోను దాదాపు అన్నిరకాల కూరగాయలు పండించేవారు, ప్రతి ఐదారు ‘పంచాయతీ’ గ్రామాలు కలసిన పరిధిలో అరటి, మామిడి, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, సపోటా వంటి పండ్ల తోటలు ఉండేవి. ఇవన్నీ కూడ ‘సంతల’ ద్వారాను, సంచార వర్తకం ద్వారాను ఎక్కడికక్కడ అమ్ముడుపోయేవి. ఉదయం తెంపిన కూరగాయలు సాయంత్రానికి అమ్ముడుపోయేవి, పండ్లు కూడ అంతే!! ఈ ‘వ్యవస్థ’లో కృత్రిమ రసాయనాలను వాడవలసిన అవసరం ఉండేది కాదు. సేంద్రియ పద్ధతుల ద్వారా పండిన ఈ కూరగాయలు, పండ్లు దూరప్రాంతాలకు ఎగుమతి అయ్యే సందర్భాలలో కూడ అవి కనీసం వారం రోజులు సహజంగానే కుళ్లిపోకుండా నిలువ ఉండేవి! ఈ రెండు వ్యవస్థలు మూలపడినాయి! కృత్రిమ రసాయనాలు వాడి పండించిన కూరగాయలు, పండ్లు ‘నిలువ’ ఉండడం లేదు. స్థానిక అవసరాలకు మించిన రీతిలో ఒకే పంటను వందల వేల ఎకరాలలో పండించడం మొదలైంది. ఉదాహరణకు ఒక గ్రామానికి చెందిన మొత్తం పొలంలో వంకాయలు పండిస్తున్నారు. మరో గ్రామమంతా టమోటాలు, ఇంకొక గ్రామం అంతా సొరకాయలు, వేరొక గ్రామం వారు బీరకాయలు. ఫలితంగా వీటికి స్థానిక గిరాకీ లేదు, ట్రక్కులలో వాగన్లలో దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందువల్ల కృత్రిమ తాజాదనం కోసం విష రసాయనాలను చల్లవలసి వస్తోంది..
ప్రతి గ్రామంలోను, నగరాల పట్టణాల శివారులలోని అన్నిరకాల కూరగాయలను, పండ్లను ‘పరిమిత’ విస్తీర్ణాలలో పండించే సంప్రదాయ వ్యవసాయం పునరుద్ధరణ జరిగినట్టయితే, ‘నిలువ ఉంచడానికై’ పరిమిత పరిమాణంలో రసాయనాలను వాడవలసిన అవసరమే రాదు. దశాబ్దుల తరబడి నిర్మూలనకు గురైన సంప్రదాయ వ్యవసాయం, స్థానిక స్వయం సమృద్ధి మళ్లీ వికసించడానికి మరిన్ని దశాబ్దులు పట్టవచ్చు. వేల ఏళ్లపాటు గ్రామీణ, కుటీర పరిశ్రమలలో పరిమిత పరిమాణంలో ‘ఆహార శుద్ధి’ కూడ జరగడం చరిత్ర. తాండ్ర, ఆవకాయలు, పచ్చళ్లు, తేనె, అప్పడాలు, ఒరుగులు, మరమరాలు, అటుకులు, పుట్నాలు వంటి వందల పదార్థాలు రసాయన విష స్పర్శ లేకుండా తయారైన పద్ధతులు భారతీయతలో భాగం. భారతీయతను ‘ప్రపంచీకరణ’ భగ్నం చేస్తుండడం విష రసాయనాల వ్యాప్తిని మరింత తీవ్రతరం చేస్తున్న విపరిణామం. ‘మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు’ల ఏర్పాటుతో రసాయనాల కల్తీ మరింతగా విస్తరిస్తోంది. గ్రామీణ కుటీర పరిశ్రమల ద్వారా రసాయనాలు లేకుండా ‘సంప్రదాయ ఆహార శుద్ధి’ని ఎందుకు పునరుద్ధరించరాదు?.

No comments