Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జమ్మూ కశ్మీర్‌లో యాత్రికులపై రాళ్ళ దాడులు ఆగవా?

యాత్రికులు రాళ్లదెబ్బలకు గురికావడం వర్తమాన ఘట్టం! జమ్మూ కశ్మీర్‌లో కురుస్తున్న ‘రాళ్లవాన’కు జనం అలవాటై పోయారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల...

Image result for kashmir terrorism
యాత్రికులు రాళ్లదెబ్బలకు గురికావడం వర్తమాన ఘట్టం! జమ్మూ కశ్మీర్‌లో కురుస్తున్న ‘రాళ్లవాన’కు జనం అలవాటై పోయారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ దుండగులు దశాబ్దుల తరబడి కశ్మీర్ రాజధాని శ్రీనగరం వీధులలోను, ‘లోయ’ ప్రాంతంలోని ఇతర పట్టణాలలోను ధైర్యంగా నిలబడి రాళ్లురువ్వుతుండడం ఏళ్లతరబడి ఆవిష్కృతవౌతున్న వికృత దృశ్యం. దుండగులు ఒకప్పుడు హిందువులను బీభత్సకాండకు బలి చేశారు. కశ్మీర్‌లోయ నుంచి హిందువులను పూర్తిగా నిర్మూలించిన జిహాదీలు, పాకిస్తాన్ తొత్తులు విశ్రమించలేదు. సైనికులకు, పోలీసులకు వ్యతిరేకంగా తమ బీభత్స వ్యూహాన్ని అమలు జరుపడం ఆరంభించారు. అందువల్ల ఏళ్లతరబడి వేలమంది ‘జిహాదీ’ మూకలు సైనికులపైన, పోలీసులపైన రాళ్లు రువ్వుతున్నారు. ఇలా రాళ్లను రువ్వడం- జమ్మూ కశ్మీర్‌ను మన దేశం నుండి విడగొట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగం. పాకిస్తాన్ దశాబ్దుల తరబడి అమలు జరుపుతున్న ఈ కుట్రలో చైనా కూడా భాగస్వామి కావడం సహజ సిద్ధమైన విపరిణామం. అందువల్ల ‘రాళ్లవాన’ ఆగడం లేదు. సైనికుల పైన, పోలీసులపైన ముష్కర జిహాదీ మూకలు రాళ్లు రువ్వుతున్న సమయంలో జనజీవనం స్తంభించిపోతోంది. రాళ్లు తమ మీద పడతాయన్న భయంతో జనం ఇళ్లలోనే ఉండిపోతున్నారు. సాహసించి ధైర్యంగా బయటికి వచ్చిన వారు గాయపడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సైనికులు ఈ పాకిస్తాన్ అనుకూల మూకలను చెదరగొట్టడానికి, బెదర గొట్టడానికి వీలులేదు. రాళ్ల దెబ్బలు తమకు తగులకుండా సైనికులు కర్రలతోను, ఉక్కు తీగెలతోను తయారైన కవచం -షీల్డ్- అడ్డుపెట్టుకొని గంటల తరబడి నిలబడి ఉండడం కశ్మీర్ లోయలో కనబడుతున్న విచిత్ర దృశ్యాలు. ఒక్కొక్కసారి ఈ కవచాలు పగిలిపోయి రాళ్లు సైనికుల ముఖాలకు, తలలకు తగిలి రక్తం చిందుతోంది. అయినప్పటికీ సైనికులు సహనం వహించి తీరవలసిందే! రాళ్ల దెబ్బలు తినడానికి, గాయపడి చికిత్స పొందడానికి మన సైనికులు అలవాటుపడిపోయారు. రోజూ జరిగిపోతున్న ఈ ‘రాళ్లు విసరడం’ గురించి ప్రభుత్వాలు కూడా స్పందించడం మానేశాయి. రోజూ కురిసే ‘రాళ్లవాన’కు గొడుగులు పట్టడం దండుగ మరి! ప్రచార మాధ్యమాల వారు సైతం సైనికులపై కురుస్తున్న ‘రాళ్లవాన’ వార్తలను ప్రసారం చేయడం, ప్రచురించడం దాదాపు మానుకున్నారు..
పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న ఉగ్రమూకలు, జిహాదీ తోడేళ్లు కొత్తకొత్త చోట్ల దూకడం ఆరంభించాయి. సైనికులపై రాళ్లు రువ్వడం వల్ల తమ ‘పథకం’ విజయవంతం కావడం లేదు. మన దేశం నుండి జమ్మూ కశ్మీర్‌ను విడగొట్టడం ఈ ‘పథకం’. అందువల్ల పాకిస్తాన్ తొత్తులు మరింత ముందుకు దూసుకొస్తున్నారు. కొత్త ఎత్తుగడను అమలు చేయడం ఆరంభించారు. యాత్రికులపై రాళ్లు రువ్వడం ఈ కొత్త ఎత్తుగడ. దేశ విదేశాల నుంచి కశ్మీర్ లోయ ప్రాంతపు కమనీయ దృశ్యాలను చూడడానికి వచ్చిన యాత్రికులు-టూరిస్టులు-పై ఆదివారం రాత్రి ‘రాళ్లవాన’ కురిసింది. దుండగులు జరిపిన రాళ్లదాడిలో నలుగురు యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారట! ‘దాల్’ సరస్సును సందర్శించడానికి రెండు బస్సులలో వెళ్లిన యాత్రికులపై ఆదివారం రాత్రి దుండగులు రాళ్లు విసిరి బస్సులను ధ్వంసం చేశారు. ఈ యాత్రికులందరూ ఇండోనేషియాకు చెందినవారు. అదే సమయంలో శ్రీనగర్ విమానాశ్రయం వద్ద ఒక వాహనంపై దుండగులు రాళ్లు విసిరారు. ఫలితంగా వాహనంలో పయనిస్తుండిన ఇద్దరు మహిళలకు తలలపై గాయాలయ్యాయి. ఈ మహిళలు ‘ఐక్య అరబ్ రాజ్యాల’- ‘యుఏఈ’- రాజధాని అబూదాబీకి చెందిన వారట. పుల్వారా జిల్లాలోని ‘అవన్తిపుర’ వద్ద వందమంది దుండగులు రాళ్లురువ్వి మరో బస్సు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఇద్దరు యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులోని యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఇలా కశ్మీర్‌ను సందర్శించడానికై వస్తున్న యాత్రికులపై రాళ్లురువ్వి గాయపరచడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్‌కు వెళ్లి వచ్చేవారి సంఖ్య తగ్గిపోవాలన్నది ‘జిహాదీ’ల పథకం. ‘ప్రాణభయం ఏర్పడడం వల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు కశ్మీర్ సందర్శనకు వెళ్లడం మానుకుంటారు. ఇలా కశ్మీర్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో రాకపోకల సంబంధాలు తెగిపోవడంవల్ల, దేశం నుంచి కశ్మీర్‌ను విడగొట్టే కుట్రకు మరింత బలం చేకూరగలదు’. ఇది జిహాదీల లక్ష్యం, వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ లక్ష్యం. వారిని సంరక్షిస్తున్న ‘హురియత్’ వంటి దేశద్రోహపు ముఠాల లక్ష్యం!
ఈ దేశద్రోహపు పన్నాగాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన కొన్ని ప్రాంతీయ రాజకీయ పక్షాల వారు సమర్ధిస్తుండడం దశాబ్దుల వైపరీత్యం! ‘నేషనల్ కాన్ఫరెన్స్’ -ఎన్‌సి-కి చెందిన షేక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఉమర్ అబ్దుల్లా ‘్భరత రాజ్యాంగం’ పట్ల కొన్ని సందర్భాలలో విధేయతను ప్రకటించారు. మరి కొన్ని సందర్భాలలో దేశ వ్యతిరేక ప్రకటనలు చేశారు. ఈ ‘ద్వంద్వ వైఖరి’ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ‘పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ’-పిడిపి-ని సైతం ఆవహించి ఉండడం నడుస్తున్న చరిత్ర! అధికారం చెలాయించిన సమయంలో కొంత దేశభక్తిని అభినయిస్తున్న రెండు పార్టీలు అధికారం కోల్పోయి ఉన్న సమయంలో పాకిస్తాన్‌ను బలపరచడం, పాకిస్తాన్ అనుకూల విధానాలను ప్రచ్ఛన్నంగా, ప్రత్యక్షంగా ఆవిష్కరించడం దశాబ్దుల వైపరీత్యం. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు చెందిన మహమ్మద్ అక్బర్ లోనే అనే ప్రచ్ఛన్న బీభత్సకారుడు శాసనసభ్యుడిగా చెలామణి అవుతున్నాడు. ఫిబ్రవరి ఏడవ తేదీన ఇతగాడు జమ్మూ కశ్మీర్ శాసనసభలో ‘పాకిస్తాన్ వర్ధిల్లాలి.. పాకిస్తాన్ వర్ధిల్లాలి’- అని నినాదాలు చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ఈ దేశద్రోహికి వ్యతిరేకంగా చర్య తీసుకున్న దాఖలా లేదు. ‘నేషనల్ కాన్ఫరెన్స్’ నుంచి ఇతగాడిని బహిష్కరించిన సమాచారం లేదు. భారతీయ జనతాపార్టీతో జట్టుకట్టి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని ‘పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ’- పిడిపి- వారు ‘జమ్మూ కశ్మీర్‌కు స్వయం పాలన’ అన్న తమ దేశద్రోహ విధానాన్ని విడనాడినట్టు సాక్ష్యం లేదు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించని ‘హురియత్’ వంటి జిహాదీ ముఠాల వారు ప్రత్యక్ష విద్రోహాలు, ఆమోదించినట్టు అభినయిస్తున్న రాళ్లురువ్వే వారి పట్ల సహానుభూతి కలిగి ఉన్న ‘పిడిపి’ని, ‘నేషనల్ కాన్ఫరెన్స్’ను ఏ పేరుతో పిలవాలి!
రాళ్లు రువ్వే వారిని అరెస్టు చేయడం, కొన్నాళ్లు సుఖకరమైన జైళ్లలో ఉంచి వారిని మేపడం, తరువాత అభియోగాలను రద్దుచేసి వారిని విడుదల చేయడం, వారికి ఉపాధిని, ఉద్యోగాలను కల్పించడం.. ఇదీ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు పదిహేను ఏళ్లుగా నిర్వహిస్తున్న ఏకైక కార్యక్రమం. అందువల్ల ‘రాళ్ల దుండగులు’ ఇప్పుడు మరింత తెగబడి పర్యాటకులపై రాళ్లను రువ్వుతున్నారు. ఆదివారం రాత్రి యాత్రికులపై దాడులు జరిగిన తరువాత దేశ విదేశాలలోని వందల కొలదీ యాత్రికులు తమ కశ్మీర్ సందర్శనాన్ని రద్దు చేసుకున్నారట! కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైన చర్యలకు పూనుకోవాలి! రాళ్లు రువ్విన వారిని నిర్బంధించి శిక్షించడానికి న్యాయ ప్రక్రియను చేపట్టాలి. ‘అధీనరేఖ’ గుండా రాకపోకలను, వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధించాలి.

No comments