Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పెట్రోలు, డీజిల్ నూనెల ధరలు పెరగడానికి అసలుకారణం

పెట్రోలు, డీజిల్ నూనెల ధరలు భగ్గుమని పైకెగసి భగభగలాడుతుండడానికి కారణం మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి...

పెట్రోలు, డీజిల్ నూనెల ధరలు భగ్గుమని పైకెగసి భగభగలాడుతుండడానికి కారణం మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి ‘అంతర్జాతీయ అనుసంధాన’ విధానాన్ని మోదీ ప్రధాన మంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో అమలు జరుపుతుండడం. మన్‌మోహన్ ప్రభుత్వం దేశీయ ఇంధనం విపణిని ‘అంతర్జాతీయ విపణి’తో అనుసంధానం చేయడానికి పూర్వం కూడ పెట్రోలు, డీజిల్ నూనెలు ధరలు పెరిగాయి. కానీ ఈ పెరుగుదల ‘అంతర్గత ద్రవ్యోల్బణం’ ప్రాతిపదికగా కొద్దికొద్దిగా ప్రగతి సాధించింది. ‘పెట్రోలియం’ రంగం పాక్షికంగా అంతర్జాతీయ విపణిలో అనుసంధానమైన వెంటనే ఈ ధరలు దాదాపు ప్రతి నెలలోను పెరగడం ఆరంభమైంది. మన్‌మోహన్ ప్రభుత్వం తొలగిన తరువాత, 2014 మే 26న మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడ 2014 సెప్టెంబర్ వరకు ‘పెట్రోలు’ ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరగడం ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ-ప్రభావం. ప్రభుత్వాలు వస్తువుల, సేవల ధరలను నియంత్రించక పోవడం- నియంత్రించ లేకపోవడం- ‘మార్కెట్ ఎకానమీ’ వౌలిక లక్షణం! ఏ దేశంలోనైనా ఏ ప్రభుత్వమైనా ధరలను నియంత్రించడానికి పూనుకున్నట్టయితే ఆ దేశం ‘స్వేచ్ఛా విపణి’ హోదా కోల్పోతుంది. ‘ఏ దేశం అయినా..’ అన్న మాటలు, ‘నియంత్రణ సూత్రం’ సంపన్న దేశాలకు వర్తించవు. మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలకు మాత్రమే వర్తిస్తుండడం ‘ప్రపంచీకరణ’లోని ఆచరణాత్మకమైన వాస్తవం. ‘సిద్ధాంతం’ అన్ని దేశాలకు సమానంగా వర్తించడం కేవలం సిద్ధాంతం. సిద్ధాంతాన్ని కొన్ని దేశాలు ఆచరించకపోవడం అంతర్జాతీయ వాస్తవం. అందువల్ల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ‘లభ్యత-గిరాకీ’ - సప్లయ్ అండ్ డిమాండ్- ప్రాతిపదిక నిర్దేశిస్తున్న ధరలను ప్రవర్ధమాన దేశాల ప్రభుత్వాలు మాత్రమే నియంత్రించలేవు. సంపన్న దేశాలు ధారాళంగా నియంత్రించగలవు. అమెరికా,చైనాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న దిగుమతి సుంకాల యుద్ధం ఇందుకు సరికొత్త నిదర్శనం!
అంతర్జాతీయ అనుసంధానం రద్దుకానంత కాలం మన దేశంలో పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం చూస్తూనే ఉంటుంది. 2014 సెప్టెంబర్‌లో ‘లీటర్’ పెట్రోలు ధర డెబ్బయి ఆరు రూపాయలకు చేరింది. ఆ తరువాత కొంచెం కొంచెంగా తగ్గడం ‘ప్రపంచీకరణ’ మారీచ మృగం ప్రదర్శిస్తున్న బంగారపు విన్యాసాలలో భాగం. అంతర్జాతీయ అనుసంధానంతో ధరలు తగ్గుతాయన్న భ్రాంతిని కల్పించడం ఈ విన్యాసాలలో భాగం.. బంగారం ధరల వలె పెట్రోలియం ధరలు కూడ ప్రతిరోజు అంతర్జాతీయ లభ్యత, గిరాకీ ప్రాతిపదికగా నిర్ధారితం కావడం ఆదర్శవంతమైన ‘స్వేచ్ఛావిపణి’ స్వభావం! అలాంటి ‘సముత్కర్ష’ స్వేచ్ఛావిపణి అన్ని దేశాలలోను వ్యవస్థీకృతం కావడం ప్రపంచీకరణ లక్ష్యం. ‘బాధ్యతలకు సంబంధించి’ అన్ని దేశాలంటే- ప్రవర్ధమాన దేశాలు మాత్రమే. ప్రయోజనాలకు సంబంధించి ‘అన్ని దేశాలంటే’ కేవలం అమెరికా, చైనా వంటి సంపన్న దేశాలు. ‘అంతర్జాతీయ హితం’ అని అంటే సంపన్న దేశాల ప్రయోజనం అన్నది ‘స్వేచ్ఛావిపణి’ నిర్ధారించిన నిజం. ఇంకా సూక్ష్మంగా, కచ్చితంగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా చెప్పాలంటే, ‘అంతర్జాతీయ హితమంటే సంపన్న దేశాలకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ల ప్రయోజనం మాత్రమే’. అందువల్ల పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర డెబ్బయి నాలుగు రూపాయలకు చేరడం, డీజిల్ ధర లీటర్ అరవై ఐదు రూపాయలకు చేరడం ‘మార్కెట్ ఎకానమీ’ మాయాజాలంలో భాగం.
ధరల నియంత్రణలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదన్నది పదే పదే వినబడుతున్న స్పష్టీకరణ. నియంత్రించినట్టయితే ‘స్వేచ్ఛావిపణి’ హోదాను కోల్పోవలసి వస్తుంది. ‘స్వేచ్చావిపణి’ హోదాను కోల్పోయినట్టయితే మన దేశానికి విదేశాల నుంచి పెట్టుబడులు రావన్నది కేంద్ర ప్రభుత్వం భయం, రాష్ట్ర ప్రభుత్వాల భయం! పన్ను తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం, డీజిల్ నూనెల ధరలను తగ్గించవచ్చు. కానీ అలా చేసినట్టయితే పెట్రోలియం ధరలను నియంత్రిస్తోందన్న చెడ్డపేరు అంతర్జాతీయ వ్యవస్థలో మన ప్రభుత్వానికి వస్తుంది. అందువల్ల మన ‘మార్కెట్ ఎకానమీ’ హోదాకు భంగం వాటిల్లుతుంది. ‘మీ పరపతి స్థాయి- సావరిన్ రేటింగ్- పడిపోయింది’అని ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటి పరపతి నిర్ణాయక అంతర్జాతీయ ఆర్థిక స్వచ్ఛంద సంస్థలు మన ప్రభుత్వాన్ని బెదిరిస్తాయి. ఇలా బెదిరింపులకు గురైన దేశాలలో సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ పెట్టుబడులు పెట్టబోవన్నది జరుగుతున్న ప్రచారం. స్వచ్ఛంద సంస్థలుగా చెలామణి అవుతున్న ఈ ‘పరపతి నిర్ణాయక సంస్థలు’ నిజానికి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- మల్టీ నేషనల్ కంపెనీస్- కు దళారీలు. సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ నిధులతో ఈ ‘దళారీ’-పరపతి- సంస్థలు అధ్యయనాలను, పరిశోధనలను చేస్తున్నట్టు అభినయిస్తున్నాయి. చైనా, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల ప్రభుత్వాలు నిరంతరం తమ దేశాలలో ధరలను నియంత్రిస్తున్నాయి. కానీ ఆ దేశాలకు ‘మార్కెట్ ఎకానమీ’ హోదాను ప్రపంచ వాణిజ్య సంస్థ తొలగించలేదు. చైనా ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డబ్ల్యూటీవో- నిబంధనలను తుంగలో తొక్కి దిగుమతులపై సుంకాలను పెంచుతోంది. ప్రస్తుతం అమెరికా వస్తువులపై చైనా, చైనా దిగుమతులపై అమెరికా దిగుమతి సుంకాలను భయంకరంగా పెంచాయి. ఈ ‘సుంకాల’ యుద్ధం ‘సంకుచిత’- ప్రొటక్షనిస్ట్- ఆర్థిక విధానంలో భాగం. ఇలా ‘సంకుచిత జాతీయ’ ఆర్థిక విధానాలను అమలు చేయడం అంతర్జాతీయ సమష్టి హితానికి భంగకరమన్నది ప్రపంచీకరణ స్ఫూర్తి!
మన దేశం వంటి ప్రవర్థమాన దేశాలు మాత్రమే ఈ ప్రపంచీకరణ స్ఫూర్తిని చిత్తశుద్ధితో పెంపొందిస్తున్నాయి. ఇలా పెంపొందించడం వల్లనే విదేశీయ వాణిజ్యంలో మనకు భారీ లోటు ఏర్పడింది. అయినప్పటికీ మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్‌కు అంతర్జాతీయంగా గొప్ప ఆర్థికవేత్త అన్న మంచి పేరు వచ్చింది. ఈ మంచి పేరును నిలబెట్టుకొనడానికై ఆయన ‘సంకుచిత జాతీయ’- ప్రొటక్షనిస్ట్- విధానాల జోలికి వెళ్లలేదు. అందువల్ల చైనా వస్తువులు మన దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ఆర్థిక ‘సంకుచిత జాతీయ విధానం’ భౌతిక బీభత్సకాండకు సమానమైన అంతర్జాతీయ ప్రమాదమని జనవరిలో ‘దావోస్’ లో జరిగిన ‘ప్రపంచ ఆర్థిక మండలి’ సమావేశంలో మోదీ చెప్పి రావడం ‘మన్‌మోహనీయ’ విధానం కొనసాగుతోందనడానికి మరో నిదర్శనం. ఇలా చిత్తశుద్ధితో మనం అంతర్జాతీయ హితాన్ని కోరుతున్నాము, అందువల్ల పెట్రోలియం ధరలు మాత్రమే కాదు అన్ని వస్తువుల ధరలూ కూడ అంతర్జాతీయ అక్రమ వాణిజ్య శక్తుల నియంత్రణకు గురై ఉన్నాయి. అమెరికా, చైనాలు మాత్రం ‘సంకుచిత జాతీయ’ ఆర్థిక విధానాలు పాటించవచ్చు! ఇదీ ‘అంతర్జాతీయ అనుసంధానం’. గుదిబండ వలె మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలను పీడిస్తున్న శాపం!
- హెబ్బార్ నాగేశ్వరరావు.

No comments