భారత్, యూరప్‌లోని నాలుగు దేశాలతో చిన్నవే కానీ అత్యంత సంపన్న దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచ్టెన్ష్టైన్ చారిత్రాత్మక వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (TEPA) పై సంతకం చేసింది. ఈ ఒప్పందం కుదరడానికి సుమారు 16 సంవత్సరాలు పట్టింది. 2008 లో మొదటి సారి చర్చలు జరిగాయి తరువాత 16 పాటు 21 సార్లు చర్చలు జరిగి 1-October-2025 న ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఇంతకాలం ఎందుకు పట్టిందంటే, రెండు వైపుల తమదేశ ఆర్థిక విధానాలకు నష్టం వాటిల్లకుండా రక్షణ, పెట్టుబడుల హామీలు, మార్కెట్ వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. చివరకు ఒక పరిష్కారం లభించి ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.
EFTA అంటే ఏమిటి?: EFTA అంటే European Free Trade Association. ఇది యూరోపియన్ యూనియన్‌లో లేని, అత్యంత అభివృద్ధి చెందిన నాలుగు దేశాల ఆర్థిక సమూహం. వీటిలో ముఖ్యంగా స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే లగ్జరీ వస్తువులు, బ్యాంకింగ్, ప్రిసిషన్ టెక్నాలజీకి ప్రసిద్ధి. నార్వే ఎనర్జీ రిజర్వ్స్, ఐస్లాండ్ ఫిషరీస్, లిచ్టెన్ష్టైన్ ఫైనాన్స్ రంగాల్లో శక్తివంతమైనవిగా పేరుగాంచాయి. ఈ దేశాల జీడీపీ పర్ క్యాపిటా ప్రపంచంలోనే టాప్‌లో ఉంటుంది. అంటే, వీరి మార్కెట్ కు మార్గం లభించడం అంటే ప్రతిష్ట, అవకాశాలు రెండూ లభించినట్లే.
ఒప్పందంలో ఏముంది? ఎందుకంత ప్రాముఖ్యత?
ఇండస్ట్రియల్ వస్తువులపై సుంకాల తగ్గింపు: స్విస్ గడియారాలు, చాక్లెట్లు, ప్రిసిషన్ పరికరాలు, యంత్రాల దిగుమతులు చవక అవుతాయి.
భారత ఎగుమతులకు యూరప్ మార్కెట్ యాక్సెస్: ఔషధాలు (ఫార్మా), కెమికల్స్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు యూరప్ బ్లాక్‌లోకి సులువుగా అమ్ముకోవచ్చు.
భారీ పెట్టుబడి హామీ: వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని ఈ దేశాలు హామీ ఇచ్చాయి. ఇప్పటివరకు భారత్ పొందిన అతిపెద్ద FDI హామీలలో ఇది ఒకటి.
భారత్ పొందబోయే లాభాలు: ఫార్మా, కెమికల్స్, టెక్స్‌టైల్స్ ఎగుమతులకు బూస్ట్. తయారీ, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. లగ్జరీ వస్తువులు స్విస్ గడియారాలు, చాక్లెట్లు, ప్రిసిషన్ పరికరాలు చవక అవుతాయి. ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు వస్తే నేరుగా 10 లక్షలకుపైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా.
దేనికి మినహాయింపు ఇచ్చారు?: డెయిరీ, బొగ్గు, బంగారం, సోయా వంటి సున్నిత రంగాలను మినహాయించారు. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు ఎక్కువగా ఈ ఒప్పందంలో లేవు. దేశీయ రైతులు, చిన్న పరిశ్రమలు దెబ్బతినకుండా ఈ రక్షణలు ఇవ్వబడ్డాయి.
ఇది ఎందుకు అంత ముఖ్యమైన ఒప్పందం: ఇది యూరప్ బ్లాక్‌తో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి వాణిజ్య ఒప్పందం. భారత్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో సమాన స్థాయిలో చర్చలు జరిపి, డీల్ కుదుర్చుకోగలదని నిరూపించింది. ఈ విజయంతో EU, UKతో జరుగుతున్న FTA చర్చల్లో భారత్ స్థాయి బలపడుతుంది. గ్లోబల్ ట్రేడ్ డిప్లమసీలో భారత్ ఒక శక్తిగా ఎదుగుతున్నదని ఈ ఒప్పందం సూచిస్తోంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు, సవాళ్లు: $100 బిలియన్ పెట్టుబడి నిజంగా వస్తుందా? లేక పేపర్ మీదే మిగిలిపోతుందా? భారత MSMEలు స్విస్ ప్రిసిషన్, యూరోపియన్ టెక్ కంపెనీలతో పోటీ పడగలవా? ఒప్పందం అమలు వేగం, వివాద పరిష్కార వ్యవస్థలు బలంగా లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు.
EFTA ఒప్పందం భారత్ గ్లోబల్ ట్రేడ్ పాలసీలో ఒక చారిత్రాత్మక విజయం. ఇది సక్రమంగా అమలు చేస్తే, యూరప్ మార్కెట్లకు కొత్త తలుపులు తెరచి, భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ను తీసుకురాగలదు. అంతేకాదు, ఈ ఒప్పందం ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు వాణిజ్య పరంగా తలుపులు తెరిచే ఉంచాం అనే సంకేతాన్ని పంపుతుంది. -రాజశేఖర్ నన్నపనేని, Mega Minds