స్వాతంత్ర్యం రాకముందు పరిస్థితి: 1947లో బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో, జమ్మూ కాశ్మీర్ ఒక రాజప్రభుత్వం గా ఉంది. మహారాజా హరి సింగ్ ప్రారంభంలో భారత్‌గానీ, పాకిస్తాన్‌గానీ కాకుండా స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ అంతర్గత అశాంతి, తెగల దాడులు, పక్కదేశాల కుట్రలతో పరిస్థితి క్లిష్టంగా మారింది.
1947 తెగల దాడులు తరువాత విలీనం: 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ మద్దతుతో తెగల దళాలు జమ్మూ-కాశ్మీర్‌పై దాడి చేశాయి. దాంతో మహారాజా హరి సింగ్ భారత్ సహాయం కోరాడు. భారత ప్రభుత్వం సహాయం చేయడానికి ఒక షరతు పెట్టింది. రాష్ట్రం భారత్‌లో విలీనం కావాలి. ఫలితంగా మహారాజా ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్పై సంతకం చేశాడు. ఇది భారత సార్వభౌమ హక్కుకు చట్టబద్ధ పునాది అయింది. అనంతరం మొదటి ఇండో-పాక్ యుద్ధం ప్రారంభమైంది.
ఐక్యరాజ్యసమితి జోక్యం: 1948లో యుద్ధం విషయమై మన నెహ్రూ గారికి ఉచ్చాగక భారత్, పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి దగ్గరకు వెళ్లాయి. UN సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ 47లో మూడు దశలు సూచించబడ్డాయి. ముందుగా పాకిస్తాన్ ఆక్రమణ దళాలు వెనక్కి వెళ్లాలి. తరువాత భారత్ తన సైనికులను తగ్గించాలి. చివరగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కానీ పాకిస్తాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఈ ప్రణాళిక విఫలమైంది.
ఆజాద్ కాశ్మీర్ మరియు గిల్గిట్-బాల్టిస్తాన్: 1949లో యుద్ధం ముగిసిన తర్వాత జమ్మూ-కాశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది. భారత పరిపాలనలోని భాగం జమ్మూ, కాశ్మీర్ లోయ, లడఖ్. పాకిస్తాన్ ఆక్రమించిన భాగం ముజఫ్ఫరాబాద్, భిమ్బర్, పూంచ్, గిల్గిట్-బాల్టిస్తాన్. పాకిస్తాన్ ఆ ప్రాంతంలో “ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ (Azad J&K)” అనే ఒక నామమాత్ర ప్రభుత్వం ఏర్పరచింది. గిల్గిట్-బాల్టిస్తాన్ మాత్రం వేరే పరిపాలనా మోడల్‌లో నడుస్తూ, ప్రత్యేక వ్యూహాత్మక స్థానం పొందింది.
1963లో శాక్స్గామ్ ఒప్పందం: 1963లో పాకిస్తాన్, చైనాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని శాక్స్గామ్ వాలీ ని చైనాకు అప్పగించింది. ఇది చట్టవిరుద్ధమైనప్పటికీ, చైనా-పాకిస్తాన్ సంబంధాలకు పునాది వేసింది. ఈ సంఘటన కాశ్మీర్ వివాదాన్ని మరింత క్లిష్టతరం చేసింది.
1972 సిమ్లా ఒప్పందం: 1971లో ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయి, బంగ్లాదేశ్ వేరు అయింది. అనంతరం 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1948లో ఏర్పడిన సీస్ఫైర్ లైన్‌ను “లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC)”గా గుర్తించారు. భవిష్యత్తులో సమస్యను కేవలం ద్విపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
1989 తరువాత ఉగ్రవాదం: 1989 నుంచి పాకిస్తాన్ ప్రోత్సాహంతో అనేక ఉగ్రవాద గ్రూపులు PoJK ప్రాంతం నుంచి భారత భూభాగంలోకి చొరబడ్డాయి. వేలాది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీరీ పండిట్‌లపై దాడులు జరిగి, పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. ఉగ్రవాదం కారణంగా ప్రాంతం అస్థిరతలో మునిగిపోయింది.
గిల్గిట్-బాల్టిస్తాన్ 2019 తర్వాత: PoJKలో గిల్గిట్ బాల్టిస్తాన్ వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. 2015లో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ఈ ప్రాంతం గుండా వెళ్లడంతో ప్రాధాన్యం పెరిగింది. 2019 ఆగస్టు 5న భారత్ ఆర్టికల్ 370 రద్దు చేసి, జమ్మూ-కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. భారత్ కొత్త మ్యాప్ విడుదల చేసి, PoJK కూడా తన భూభాగమని స్పష్టంగా గుర్తించింది.
PoJKలో ప్రస్తుత పరిస్థితి - నిరసనలకు ప్రధాన కారణాలు
విద్యుత్ సమస్యలు, అధిక బిల్లులు: ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువైనా, స్థానిక ప్రజలకు మాత్రం తరచూ లోడ్ షెడింగ్, తక్కువ వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయి. మంగ్లా డ్యామ్, నీళం–జీలం వంటి ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, ఆ కరెంటు పాకిస్తాన్ మెయిన్లాండ్‌కి పంపి, PoJK ప్రజలకు మాత్రం అధిక ధరల బిల్లులు వేస్తున్నారు.
ద్రవ్యోల్బణం, జీవన ఖర్చులు పెరగడం: గోధుమలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సబ్సిడీలు తగ్గించబడటం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.పెన్షనర్లు తమ పెన్షన్లు పెరగలేదని, ఖర్చులు మోయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దారుణమైన మౌలిక సదుపాయాలు: రహదారులు దయనీయ స్థితిలో ఉన్నాయి (ఉదాహరణ: బఘ్ జిల్లాలోని సుధన్ ఘాలి రోడ్). ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలకు తగిన నిధులు కేటాయించడం జరగడం లేదు.
రాజకీయ ప్రతినిధిత్వం, అవినీతి: స్థానిక ప్రజల వాణి వినిపించకపోవడం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. ఎక్కువ నిర్ణయాలు ఇస్లామాబాద్‌లో తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. శరణార్థుల కోసం కేటాయించిన రిజర్వ్ సీట్లు స్థానిక ప్రతినిధిత్వాన్ని వక్రీకరిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. అవినీతి, పోలీస్ హింస, బ్యూరోక్రసీ నిర్లక్ష్యం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
సంస్కరణలు, పారదర్శకత కోసం డిమాండ్లు: విద్యుత్ ధరలు తగ్గించడం, సబ్సిడీలను పునరుద్ధరించడం, ఉచిత/మంచి వైద్య, విద్యా సదుపాయాలు కల్పించడం, స్థానిక చట్టాలను సవరించడం, ప్రభుత్వ అధికారుల ప్రత్యేక సౌకర్యాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఈ అసంతృప్తి ఇప్పుడు పెద్ద స్థాయి ఆందోళనలుగా మారింది. షట్టర్‌డౌన్, వీల్ జామ్ హర్టాల్స్‌కి స్థానిక యాక్షన్ కమిటీలు పిలుపునిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి ఇంటర్నెట్ నిలిపివేయడం, పోలీసులు, భద్రతా బలగాలను మోహరించడం వలన పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
ఈ PoJK GenZ పౌరులు “మా వనరులు మాకే రావాలి, మాకు న్యాయం కావాలి” అని డిమాండ్ చేస్తున్నారే కానీ మేము భారత్ తో కలుస్తాము అనడం లేదు. రాజ్ నాథ్ సింగ్ గారు వారు ఒక్కమాట మేము భారత్ తో కలుస్తాము అంటే సాయంత్రానికి కలిపేస్తాం అని కూడా చెప్పే ఉన్నారు.
అంతర్జాతీయ కోణం: అంతర్జాతీయ చట్టపరంగా PoJK ఎల్లప్పుడూ భారతదేశ భూ భాగమే. UN రిజల్యూషన్‌లలో కూడా పాకిస్తాన్ ఆక్రమణ చట్టబద్ధంగా గుర్తించబడలేదు. కానీ చైనా జోక్యం వల్ల ఈ సమస్య మరింత క్లిష్టమైంది.
PoJK సమస్య కేవలం భూభాగ వివాదం కాదు, అది ప్రజల హక్కులు, స్వయం నిర్ణయం, అంతర్జాతీయ శాంతి సంబంధిత అంశాలతో కూడుకున్నది. భారత్ తరఫున PoJK ఎల్లప్పుడూ తన అంతర్భాగమని స్పష్టంగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ సమస్య పరిష్కారం ద్విపాక్షిక చర్చలు, ప్రజల హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ మద్దతు, PoJK ప్రజలు భారత్ తో మేము కలుస్తాము అన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds