గురువారం (18-09-2025) సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ తమ మైత్రిని వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒకరిపై దాడి అంటే ఇద్దరిపై దాడిగా పరిగణిస్తామని ప్రకటించారు. ఖతర్ దోహాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి అనంతరం క్షేత్ర స్థాయి ఉద్రిక్తతల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం గురించి అందరూ గొప్పగా వ్రాస్తూ తమ తమ అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నారు, ఈ ఒప్పందం ఒకటే సూచిస్తుంది, పాకిస్తాన్ ను ఇప్పటి వరకు అమెరికా, చైనాలే వాడుకున్నాయి ఇక నుండి సౌదీ కుడా వాడనుంది.
సౌదీ అమెరికా పై ఆధారపడకుండా గేమ్ చెంజర్ గా పాకిస్తాన్ ని ఎన్నుకుంది అంటూ మరో కథనం, పాకిస్తాన్ నే దిక్కులేక ఆసిఫ్ మునీర్ అమెరికా దగ్గర మోకాళ్ళ పై నిలబడ్డాడు, ఇప్పుడు పాక్ సౌదీకి రక్షణ గా ఎలా ఉండగలదు అమెరికా కంటే, కేవలం ఇది మానవ వనరుల్ని పాక్ సౌదీకి అమ్ముకోవడం మాత్రమే అని మనం గుర్తించాలి..
హమాస్ నాయకులలో కొందరిని చంపిన ఇజ్రాయెల్ పై పగతీర్చుకోవడానికి అరబ్ రాజధానుల అంతటా ఉత్సాహాన్ని రేకెత్తించిందని. అణు ఆయుధాలు కలిగిన పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ రక్షణకు అధికారికంగా అనుసంధానమైందని, గల్ఫ్ మరియు దక్షిణాసియా వ్యూహాత్మక సమీకరణాలను పునర్నిర్మిస్తోందని. భారత్ లో ఉన్న తుకుడే గ్యాంగ్ కలలు కంటున్నారు.
పెట్రోల్ అమ్ముకునే దేశాలు ఒకప్పటి వలే కాకుండా మత చాందసం నుండి బయటకొచ్చాయనే చెప్పాలి, అరబ్ ఇస్లాం ఒకప్పుడు తమ సామ్రాజ్యవాదాన్ని పెంచుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రపంచాన్ని నాశనం చేసింది కానీ ప్రస్తుతం అలా దాడులు చేయాలనుకోవడం లేదు, కేవలం వారి వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటుంది. అలాగే ఇజ్రాయెల్ తో సౌదీకి కొంత సఖ్యత ఉన్నప్పటికీ దోహా పై దాడి చేసినట్లుగా తమ పై కుడా దాడి చేస్తే ఎలా అనే ఆలోచనతో ఒప్పందం ఉండటం ఎంతో కొంత ఉపయోగంగా భావిస్తుంది. పాకిస్థాన్ తన అణ్వస్త్రాలను సౌదీతో పంచుకుంటే, అమెరికా ఆంక్షలు విధించవచ్చు. ఎందుకంటే ఈ అణ్వస్త్రాలు పాకిస్థాన్ సొంతం. అణువ్యాప్తి నిరోధక ఒప్పందాలకు (Nuclear Non-Proliferation Treaties) వ్యతిరేకంగా ఏ దేశం వ్యవహరించినా అమెరికా చర్యలు తీసుకుంటుంది.
భారతదేశానికి నష్టమా?: ఈ ఒప్పందం వలన భారత్ కి నష్టం చేకూరుతుందని సోరోస్ బ్యాచ్ దీర్గాలు తీస్తుంది, నిజంగా నష్టమా? భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే పోరాడుతుంది ,ఈ విషయం లో వెనక్కి తగ్గదు. సౌదీ కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని సమర్థించదు. గల్ఫ్ యుద్ధంలో పాకిస్థానీ సైనికులు సౌదీ కోసం పోరాడారు, కానీ భారత్-పాక్ యుద్ధంలో సౌదీ ఎప్పుడూ ఎటువంటి సహాయం చేయలేదు.ఈ ఒప్పందం సౌదీ భద్రత కోసం మాత్రమే అని మనం గమనించాలి.
మరియు భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరో కొద్ది నెలల్లో మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్–సౌదీ మధ్య వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలు మరింత బలంగా కొనసాగుతున్నాయి. అనేక భారతీయ కంపెనీలు, నిపుణులు సౌదీలో సేవలు అందిస్తున్నారు. ఇదే సమయంలో సౌదీ కూడా భారత్‌లో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్‌కు సౌదీ ఎంత అవసరమో, సౌదీకి భారత్ అంతే అవసరం. ఈ పరస్పర సహకారానికి గుర్తుగా సౌదీ తమ దేశ అత్యున్నత పురస్కారంతో భారత ప్రధాని మోదీని సత్కరించింది. ఇది పాకిస్థాన్ వ్యూహాత్మక అంచనాలను తలకిందులు చేస్తుంది, ఎందుకంటే మునుపటి వలే కాకుండా అరబ్ దేశాలు ఉగ్రవాదం వైపు నుండి వ్యాపారం వైపు మళ్ళాయి.
ఇస్లామిక్ లేదా అరబ్ నాటో సాధ్యమా?: సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం, చాలాకాలంగా కలగా ఉన్న “ఇస్లామిక్ లేదా అరబ్ నాటో” ఆలోచనకు మళ్లీ ప్రాణం పోసిందని కొంతమంది వ్యాఖ్యాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ దశాబ్దాలుగా సంక్షోభాల సమయంలో ఈ భావన పుట్టి, కొంతకాలం చర్చకు వస్తూ, ఆ తర్వాత మళ్లీ మసకబారడం సహజం అయిపోయింది.
తాజాగా దోహా సమావేశం కూడా అదే తరహా. పేరుకి 57 “సింహాలు” గర్జించిన అత్యవసర సదస్సు అనిపించినా, చూస్తుంటే అది ఒక కామెడీ సర్కస్‌లా కనిపించింది. ప్రతి దేశం ఇజ్రాయెల్‌పై మాటలతో గర్జించినా, ఆ ఉత్సాహం కాసేపే. 1948 నుంచి ఇదే స్క్రిప్ట్ పెద్ద పెద్ద హెచ్చరికలు, ఘాటైన శపథాలు, “ఈసారి భరించాం, వచ్చేసారి మాత్రం భరించం” అనే మాటల వర్షం. ఇదంతా చూస్తూ ఇజ్రాయెల్ సరదాగా ఎంజాయ్ చేస్తూనే ఉంది.
ముస్లిం దేశాల మధ్య ఉన్న విభేదాలు “ఇస్లామిక్ నాటో” సాధ్యాసాధ్యాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. సౌదీ వర్సెస్ ఇరాన్, ఖతర్ వర్సెస్ యూఏఈ, టర్కీ వర్సెస్ ఈజిప్ట్, పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘాన్ వంటి ఎప్పటికప్పుడు రగిలే గొడవలు ఏకతను దెబ్బతీస్తున్నాయి. “ఇస్లామిక్ నాటో” పిలుపులు తరచూ వినిపిస్తున్నా, అది ఇప్పుడు చిన్న దేశాల మధ్య ఒక వ్యాపారంలా మారిపోయింది.
గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న యుద్ధంలో తమదైన వాదనతో నిలుస్తోంది. అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఎవరూ ఇజ్రాయెల్‌పై బహిరంగంగా ఒకేసారి విరుచుకుపడటం లేదు, అందుకు కారణం ఇజ్రాయెల్ అంటే భయం. ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణ కొనసాగినంతకాలం ఈ రకమైన ఒప్పందాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ అదే తంతు, మనం ముందుగా అనుకున్నట్లే అమెరికా, చైనా లు పాకిస్తాన్ ను వాడుకున్నాయి, ఇప్పుడు సౌదీ వంతు, పాక్ అరబ్ దేశాల వలే మత ఛాందసాన్ని వదిలేసిన రోజే ఆ దేశ ప్రజలకు విముక్తి, అప్పటి వరకు మోకాళ్ళ దండ వేయాల్సిందే.. రాజశేఖర్ నన్నపనేని. MegaMinds.