అస్సాంలో సంచలనం రేపిన నూపుర్ బోరా భూకుంభకోణం కేసు:
అస్సాం రాష్ట్ర రాజకీయ–ప్రశాసన వ్యవస్థను కుదిపేసిన కేసుగా నూపుర్ బోరా అవినీతి భూకుంభకోణం ఆరోపణలు నిలిచాయి. 2019 బ్యాచ్ అస్సాం సివిల్ సర్వీసెస్ (ACS) అధికారిణి అయిన నూపుర్ బోరా (36, గోలాఘాట్) సెప్టెంబర్ 15, 2025న ముఖ్యమంత్రి స్పెషల్ విజిలెన్స్ సెల్ చేత అరెస్టు కావడం, రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీసింది. ఆమెపై అక్రమ భూమి బదిలీలు, అవినీతి, మరియు అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.
నూపుర్ బోరా గతంలో DIETలో లెక్చరర్‌గా పనిచేసి, 2019లో ACSలో చేరారు. బర్పేటా జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా (2019–2023) పనిచేసిన సమయంలోనే భూమి లావాదేవీలపై అనుమానాస్పద ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆమెపై ఆరు నెలలపాటు రహస్య నిఘా పెట్టారు. తాజాగా గోరోయిమారి రెవెన్యూ సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు విజిలెన్స్ అధికారులు దాడి చేసి కీలక ఆధారాలను సేకరించారు.
సెప్టెంబర్ 15న గువాహటి, బర్పేటా, గోలాఘాట్‌లోని ఆమె నివాసాలపై విస్తృత దాడులు జరిపి, ₹92 లక్షల నగదు, ₹2 కోట్ల విలువైన బంగారం–డైమండ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఆమె సహచరుడు, బర్పేటాలోని లాట్ మండల్ సురజిత్ దేకా ఇంటి నుంచి కూడా ₹10 లక్షలు స్వాధీనం చేశారు. బ్యాంక్ లాకర్లు సీజ్ చేసి ఇంకా విచారణ కొనసాగుతోంది. కేవలం 6 ఏళ్ల సర్వీసులో ఇంత విలాసవంతమైన ఆస్తులు కూడగట్టడం అనుమానాస్పదంగా మారింది.
ఈ కేసులో అత్యంత తీవ్రంగా ఉన్న ఆరోపణ భూమి బదిలీలదే. హిందూ యాజమాన్యానికి చెందిన, అలాగే వైష్ణవ సత్రాల భూములను “మియా” అని పిలువబడే బెంగాలీ మూలం ముస్లింలకు (రోహింగ్యాలకు) రిజిస్టర్ చేసినట్లు తేలింది. దీని ఫలితంగా బర్పేటా వంటి సున్నిత ప్రాంతాల్లో డెమోగ్రఫిక్ మార్పులు, భూమి హక్కుల లోపం, స్థానికులలో ఆందోళనలకు దారితీసింది.
కృషక్ ముక్తి సంగ్రామ సమితి (KMSS) నేత అఖిల్ గోగోయ్ ఆమెపై మరిన్ని ఆరోపణలు చేశారు. భూమి సేవల కోసం లంచం తీసుకున్నట్లు, పట్టా కోసం ₹1,500 నుండి రికార్డు మార్పు కోసం ₹2 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు. బర్పేటాలో బహుళ ఆస్తులను కూడా అక్రమంగా సురజిత్ దేకాతో కలసి కొనుగోలు చేసినట్లు బయటపడింది.
ఈ పరిణామాలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గారు స్పందిస్తూ, “నూపుర్ బోరా పై పూర్తి సాక్ష్యాలతోనే అరెస్ట్ జరిగింది. రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది” అన్నారు. ఇది విజిలెన్స్ సెల్ రిజిస్టర్ చేసిన 25వ కేసు కావడం గమనార్హం.
ఈ కేసు కేవలం ఒక అధికారిణి అవినీతి వరకు పరిమితం కాకుండా, అస్సాంలో భూమి భద్రత, మత–జనాభా సమతుల్యం, రాజకీయ వలసల ప్రభావం వంటి సున్నిత అంశాలను వెలుగులోకి తెచ్చింది. “రోహింగ్యాలు లేదా వలసదారులు ఎంతమేర భూమి సంపాదించారో?” అన్న అనుమానం ప్రజలలో పెరుగుతోంది. అస్సాంలాంటి రాష్ట్రంలో ఇవి బయటకు వచ్చినా, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి విషయాలు ఎప్పుడూ వెలుగులోకి రావు అనడం కూడా వాస్తవమే. ఈ భూ స్కాం అస్సాంలో ఒక ప్రత్యేక హెచ్చరిక కాదా? -పతంజలి వడ్లమూడి. MegaMinds.