కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీ. మూడో సంవత్సరంలో ఉన్న ఓ కుర్రాడు కాలేజీ ఎలక్షన్లో నిలుచున్న తన స్నేహితుడిని సపోర్ట్ చేశాడు. అతడు ఓడిపోయాడు. 'ఇంజినీరింగ్ కాలేజీ ఎలక్షన్స్లో గెలవడమంటే వూళ్ళో పొలం దున్నినంత సులభం కాదు బాబూ.. ఎవరో హేళన చేశారు. హేళన అతడిలో కసి, పట్టుదలా పెంచాయి. నాలుగో సంవత్సరంలో అతను కాలేజీకి జనరల్ సెక్రటరీగా ఎన్నికవడమే కాకుండా మొత్తం కాకినాడ పట్నంలోనే రాజకీయాల్ని శాసించే శక్తిగా తయారయ్యాడు..!
లాస్ ఏంజల్స్ వీధుల్లో నడుస్తున్నాడు ఒక కుర్రాడు, ఎక్కడన్నా చిన్న ఉద్యోగం దొరుకుంతుందేమోనని. ఫ్లెక్స్ట్రానిక్స్ అనే కంపెనీ బయట Help Wanted అన్న బోర్డు చదువుతుంటే ఎవరో లోనికి పిలిచారు. అక్కడంతా స్పానిష్ వాళ్ళే పనిచేస్తున్నారు. 'సోల్డరింగ్" వచ్చా అని అడిగితే, అతడు చెప్పిన ఇంగ్లీషు సమాధానాన్ని స్పానిష్ అనుకుని వెంటనే పనికి రమ్మని గంటకి నాలుగు డాలర్ల చొప్పున చేతిలో పెట్టారు..!
ఇన్ని అనుభవాలతో రాటుదేలిన వ్యక్తి ఒక మల్టీ బిలియన్ డాలర్ల అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ AMD హైదరాబాదు విభాగానికి పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనెవరో కాదు మన తెలుగు తేజం శ్రీ గుదె దశరథ రామాంజనేయులు గారు. సిలికాన్ వేలీలో అపజయమెరుగని సీరియల్ ఎంటర్ప్రెన్యూర్గా పేరుతెచ్చుకున్న శ్రీ గుదె దశరథ రామాంజనేయులు మితృలకి జి.డి.గా, జి.డి. ఆంజనేయులుగా, డి.ఆర్. గుదె గా సుపరిచితులు.
1993లో సిలికాన్ వేలీలో పసిఫిక్ సెమికండక్టర్ కంపెనీ మొదలు పెట్టిన వద్దనుండి ఒకదాని తర్వాత ఒకటిగా టెక్నాలజీ కంపెనీలని స్థాపించి వాటిని విజయపధంలో నడిపించి వేరే పెద్ద కంపెనీలకి అనుసంధానం చేశారు. జి.డి. గారు మొదలుపెట్టిన Pacific Semi Conductors & 5 Faraday Technologies & 5, Virtual IP అనే కంపెనీని Tera Burst Networks కంపెనీ, Cute Solutions అనే కంపెనీ ని ATI అనే ప్రఖ్యాత మల్టీమీడియా ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేసే అతిపెద్ద కంపెనీ కొన్నారు. దాన్ని ATI India గా మార్చి దానికి ఆయన్నే మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. అతికొద్ది కాలంలోనే జి.డి గారి సాంకేతిక నిర్వహణా సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆయన గురించి BBC లోనూ, Canadian Business Bureau లోనూ ప్రత్యేక వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఎ.టి.ఐ ని ఎ.ఎం.డి అనే సంస్థ కొన్నప్పుడు ఆ సంస్థ హైదరాబాదు డివిజన్ కి ఈయనే మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇదేగాక జి.డి.మైక్రో అనే మరో కంపెనీ వ్యవస్థాపకుడిగా, చైర్మన్ గా కూడా వున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఏకైక వి.ఎల్.ఎస్.ఐ శిక్షణా ప్రైవేటు యూనివర్సిటీ వేదా ఐ.ఐ.టి కూడా జి.డి గారి ఆలోచనలోంచి పుట్టిందే జె.ఎన్.టి.యు గుర్తింపు ఉన్న ఇలాంటి సంస్థ ఇదొక్కటే. ఇవే గాక హైదరాబాదులో సెమీకండక్టర్ ఇండస్ట్రీ స్థిరపడడంలో ఈయన ప్రముఖ పాత్ర వహించారు, వహిస్తున్నారు. ఇన్ని కంపెనీల నిర్వహణతో, ఆ సంస్థల కార్యక్రమాలతో బిజీగా వున్నా ఎప్పుడూ రిలాక్సింగ్గా కనిపించే జి.డి. గారి మొహంలో చిరునవ్వు తప్ప విసుగు, శ్రమ మచ్చుకైనా కనిపించవు. ప్రతిరోజూ తప్పని సరిగా ఒక్క సినిమా ఐనా చూస్తారు..! ఈ విలక్షణమైన విజేత విజయ రహస్యాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. వారి గురించి 2007 కౌముది మాసపత్రికలో వచ్చిన కథనాన్ని మీకు యథాతథంగా మెగమైండ్స్ ద్వారా అందిస్తున్నాము.
మట్టివాసనలో ఎదిగిన బాల్యం:
గుంటూరు జిల్లాలో గురజాల దగ్గర మాచవరం అనే పల్లెటూరు మా స్వగ్రామం. పల్లెటూరు అంటే మరీ కుగ్రామం కాదు బహుశా అప్పట్లో 5,000 మంది జనాభా వుండేవారనుకుంటాను. నాన్నగారి పేరు గుదె సైదయ్య అమ్మ పేరు సీతమ్మ నాన్న ఆ వూరికి మున్సబుగా పనిచేసేవారు. ఆరుగురుపిల్లల్లో నేను ఐదవ వాడిని. మాది మధ్య తరగతి కుటుంబం అని చెప్పుకోవచ్చు.
ఆ ఊళ్ళో బయటకి వెళ్ళి పై చదువులు చదివింది మా అన్నయ్య (బి.ఎస్సీ), మా అక్క (ఎం.బి.బి.ఎస్) మాత్రమే. నాకూ చిన్నప్పటినుంచీ చదువుమీద పెద్ద ఆసక్తి వుండేది కాదు. మా కుటుంబసభ్యులందరితో పాటే నేనూ ఎప్పుడూ పొలంలో అన్ని పనులు చేస్తుండే వాడిని. ఏడవ తరగతి వరకూ మా ఊళ్ళోనూ, ఆ పైన హైస్కూలు చదువు పక్క ఊళ్ళోనూ సాగింది. ఐతే హాయిగా పొలం పనులు చేసుకోవచ్చుకదా ఈ చదువు ఎందుకూ అనిపించేది. అస్సలు చదువుమీద ఆసక్తి ఉండేది కాదు. పైగా మాకు మాంచి పందెపుటెడ్లు ఉండేవి. ఎప్పుడూ అవే లోకంగా ఉండేవాడిని. ఎప్పుడెపుడు బడి ఒదిలిపెడతారా తొందరగా వెళ్ళి ఎడ్ల ఆలనా పాలనా చూద్దామా అని ఉరకలేస్తుండేవాడిని. హైస్కూలు వరకూ ఎప్పుడూ అత్తెసరు మార్కులతోనే పాసవుతుండేవాడిని..
ఇలాగైతే నా చదువుసాగడం అసంభవమని తెలుసుకున్న అమ్మ, నాన్నని బలవంతంగా ఒప్పించి పందెపుటెడ్లని అమ్మేసేలా చేసింది. ఇంక తప్పని సరిగా ఇంటర్మీడియట్ కోసం గుంటూరు వెళ్ళక తప్పింది కాదు. మొదటి సంవత్సరంలోకూడా అంతగా చదువు పికప్ చెయ్యలేకపోయాను. శెలవల్లో ఇంటికి వెళ్ళినపుడల్లా పొలం వెళ్ళి కూలీలతోబాటు అన్ని పనులూ చేస్తుండేవాడిని. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో మాత్రం చదువుమీద శ్రద్ద పెట్టాను. మొదటి ఐదు స్థానాల్లో నాదొకటి. అలానే స్పోర్ట్స్ లోకూడా. ముఖ్యంగా కబడ్డీ, వాలీబాల్ లో మంచి ప్రావీణ్యత సంపాదించుకున్నాను ఇక్కడే
కాకినాడ కాలేజీలో.. రాజకీయ రణరంగంలో:
తరువాత ఎంట్రన్స్ పరీక్షరాసి, మంచిరాంకు తెచ్చుకుని 1977లో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరాను. చిన్నప్పటినుంచీ ఏకసంతాగ్రాహినే ఏ విషయమైనా ఒక్క సారి వింటే ఇట్టే గుర్తుండి పోయేది. ఇంజినీరింగ్లో కూడా పదే పదే పుస్తకాలు చదవడం కంటే క్లాసులో విన్న పాఠాలూ లేదా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకునే టాపిక్స్ వినీ పరీక్షల్లో 80 శాతం పైగా మార్కులు తెచ్చుకుంటుండేవాడిని. లెక్చరర్లందరికీ, నేనంటే మంచి అభిప్రాయం వుండేది. మొదటి రెండేళ్ళు చదువులతో బిజీగా వుండేది.
మూడో సంవత్సరంలో ఉండగానే కాలేజీ పోలిటిక్స్ అర్థమవ సాగాయి. అలానే స్పోర్ట్స్ చురుకుగా పాల్గొనడం వల్ల కాలేజీలో చాల మందికి తొందరలోనే పరిచయమయ్యాను. మా క్లాస్మేట్ ఒకతన్ని ఎలక్షన్స్లో నిలబెడితే ఓడిపోయాడు. అందరూ నన్ను ఎగతాళి చేశారు. కాలేజీ ఎలక్షన్లంటే ఆషామాషీ కాదనీ, నన్ను ఆ ప్రయత్నాలు మానుకోమనీ హెచ్చరించారు. ఎవరైనా 'నువ్వాపని చెయ్యలేవు' అంటే దాన్ని సాధించితీరాలన్న పట్టుదల అప్పుడే వొచ్చిందనుకుంటాను. ఎలాగైనా నాలుగో సంవత్సరంలో కాలేజీకి జనరల్ సెక్రటరీ కావాలని నిర్ణయించుకుని సాధించాను. ఐతే ఒక్కసారి కాలేజీ జనరల్ సెక్రటరీ కాగానే ఇంక రాజకీయాల్లో పీకల లోతువరకూ మునిగిపోక తప్పలేదు. మా కార్యక్రమాలు కేవలం కాలేజీకి పరిమితంగాక కాకినాడ మున్సిపల్ ఎలక్షన్ వ్యవహారాల్లోకి కూడా వెళ్ళాల్సి వచ్చింది.
రాజకీయాలంటే తెలీనిదేముందీ.. కాలేజీ నుండీ నన్ను సస్పెండ్ చేశారు. కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాను. మళ్ళీ పరీక్షలు వ్రాయడానికి వీల్లేదని మరో అడ్డంకి.. మళ్ళీ కోర్టు జోక్యంతో ఆదీ సాధించాను. ఎలాగైతే 1982 లో విజయవంతంగా ఇంజనీరింగ్ డిగ్రీతో బయటికి వచ్చాను. పల్లెటూళ్ళో అందరితో కలిసి పనిచేయడం అన్న గుణమే కాలేజీలో లీడర్షిప్ని తొందరగా చేజిక్కించుకునే అవకాశం కలిపించిందని అనుకుంటాను..
22ఏళ్ళకే వ్యాపారంలో తొలి అడుగు:
డిగ్రీ చేతికి రాగానే ఉద్యోగం చేస్తే ఎ.పి.ఎస్.ఇ.బి లోనే చెయ్యాలి అనుకునే వాడిని. కానీ అప్పుడు ఎ.పి.ఎస్.ఇ.బిలో ఇంకా కొత్తవాళ్ళని తీసుకోవడంలేదు.
తరువాత రెండునెలలకే మరో ముగ్గురు మిత్రులతో కలిసి కాకినాడలోనే అమరావతి ఎలక్ట్రానిక్స్ అనే షాపు ప్రారంభించి ఇ.సి.టి.వి., కోణర్క్ టి.వి. అమ్మే వాళ్ళం. వాటితోబాటే కాలేజీ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్కి అవసరమైన ఎలక్ట్రానిక్స్ కిట్స్ కూడా అసెంబుల్ చేసి అమ్మేవాళ్ళం. మూడు నాలుగు నెలల్లోనే వ్యాపారం బాగా పుంజుకుంది... మరికొంతమంది మిత్రులు అప్పుడే విశాఖపట్నంలో నష్టాల్లో నడుస్తున్న అమరావతి ఎలక్ట్రోడ్స్ అనే వ్యాపారాన్ని సరిచేయడానికని నన్ను రమ్మని అడిగారు. సరే కాకినాడలో వ్యాపారం చూసుకునేందుకు మిగతావాళ్ళున్నారు కదా అని నేను విశాఖపట్నం వెళ్ళాను.
అక్కడకూడ అతికొద్ది కాలంలోనే ఆ వ్యాపారాన్నీ లాభాల బాటలో నడిపించగలిగాను. కానీ అక్కడ నన్నొక ఉద్యోగిగానే ఉంచదలచుకున్నారనీ,ఆ వ్యాపారంలో భాగస్వామిగా అంగీకరించలేరని తెలిసి చాలా అప్సెట్ అయ్యాను. నేను చేసిన శ్రమకి ఫలితం ఇది కాదనుకుని అక్కడ మానేశాను..
బొంబాయి జీవితం.. కొత్తరంగాల పరిచయం:
బొంబాయి ఐ.ఐ.టిలో కొంతమంది మిత్రులు వుంటే, వాళ్ళ వద్దకి వెళ్ళాను. అక్కడే వుండి ఎం.టెక్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఐతే ఇంతలో లోగడ ఇంజినీరింగ్ కాలేజీలో సహధ్యాయి, వెంకటనారాయణ అనీ, అతను కంప్యూటర్స్ రిపేర్ బిజినెస్లో వుంటే, ఇదీ కొత్త ఫీల్డే, నేర్చుకుంటే బావుంటుంద'ని అతని వద్దకి వెళ్ళేవాడిని బొంబాయిలోనే ఆ అనుభవం తరువాత బాగా ఉపయోగపడింది. మైక్రోప్రోసెసర్లు, చిప్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ ఇలాంటివన్నీ బాగా అర్థమయ్యాయి. కానీ అక్కడా ఎక్కువ రోజులు పనిచెయ్యలేక పోయాను. ఎవరైనా నా మీద బాస్ అధికారం చెలాయిస్తే అక్కడ పనిచెయ్య బుద్ధి అయ్యేది కాదు. ఉద్యోగమే చేసినా స్వతంత్రత ఉండాలి అనుకునే వాడిని. మళ్ళీ ఏం చెయ్యాలా అని ప్రయత్నాలు. అప్పుడే మత్గాన్ డాక్ అనే యుద్ధ నౌకానిర్మాణ సంస్థలో ఇంజినీర్ పొజిషన్లు ఉన్నాయని తెలిసి అప్లై చేసి, వ్రాత పరీక్ష పాసై ఇంటర్వ్యూకి వెళ్ళాను.
'ఏమి పనిచెయ్యగలవు అని అడిగారు..', 'కావాలంటే ఈ మొత్తం ఆపరేషన్స్ని మేనేజ్ చెయ్యగలను' అని కాస్త తలబిరుసు గానే సమాధానం చెప్పాను. ఏం అనుకున్నారో కానీ వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు. అతి కొద్ది నెలలలోనే 50-60 మంది వర్కర్ లను మేనేజ్ చేసే స్థాయికి వెళ్ళాను. అప్పట్లో అందులోని వర్కర్స్ అంతా శివసేన కి చెందిన వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళని మేనేజ్ చెయ్యడమంటే అంత సులభంకాదు. ఐతే కాలేజీ రాజకీయాల్లో రాటు దేలిన నాకు అదేమంత పెద్ద సమస్య అనిపించలేదు. వాళ్ళని హేండిల్ చెయ్యడంలో నా నేర్పుకి పై అధికారులంతా నన్ను మెచ్చుకుని నాకు పూర్తి స్వాతంత్రం ఇచ్చేవాళ్ళు.
మొత్తం వార్షిప్ నిర్మాణం ముగిశాక నేవీకి అప్పగించేప్పుడు మొత్తం ఇన్స్పెక్షన్కి నేనే ఇన్ఛార్జ్ ఉండేవాడిని. అక్కడే దాదాపు నాలుగేళ్ళు పైగా పనిచేశాను. ఈ అనుభవమే ఎంత రఫ్ కండిషన్స్లోనైనా విజయవతంగా పనిచెయ్యగలన్న విశ్వాసాన్ని మరింతపెంచింది. అక్కడ పనిచేసేప్పుడే బజాజ్ ఇన్సిట్యూట్లో కంప్యూటర్ సిస్టల్స్లోనూ, మేనేజ్మెంట్ లోనూ డిప్లమో కోర్సులు చేశాను.
వివాహం.. అమెరికా ప్రయాణం:
బొంబాయిలో వుండగానే నా మిత్రుడు డా. వీరయ్య చౌదరి ద్వారా తన మరదలి సంబంధం వచ్చింది. 1985లో విద్యతో నాకు పెళ్ళి జరిగింది. విద్య అప్పటికి అమెరికా గ్రీన్కార్డ్ హోల్డర్, వీసా ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక నేనూ 1987 లో అమెరికాకి ప్రయాణం కట్టాను. లాస్ యాంజాల్స్ లో విద్యా వాళ్ళింట్లోనే కాపురం. అమెరికాలో అడుగుపెట్టాక అసలు కథ ప్రారంభమైదనిపించింది.
అమెరికా రాగానే అంతా కొత్త ప్రపంచం. అప్పటి వరకూ కాకినాడా, బొంబాయిల్లోనే గడిపాను కాబట్టి తెలుగూ, తరువాత సరాసరి హిందీ మాట్లాడే వాడిని. అమెరికాకి వచ్చాక ఇంగ్లీషు మాట్లాడుతుంటే బయటివాళ్ళు 'స్పానిష్ రాదు' అనే వాళ్ళు. నేను మాట్లాడేది స్పానిష్ అనుకునేవాళ్ళు. నాకైతే నేను ఇంగ్లీషే మాట్లాడానుకదా అనిపించేది. ఎక్కడా ఉద్యోగం దొరికే ఛాయలు కనిపించలేదు. ఇండియాలో అంతమందిని సూపర్ వైజ్ చేసీ, అన్ని చోట్లా తలెత్తుకుని బతికినవాడిని ఇక్కడ ఇలా అవ్వాల్సి వచ్చిందేమిటా అని అనిపించేది.
ఒక రోజు అలానే వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే Flextronics అనే కంపెని కిటికీ అద్దాల మీద 'Help Wanted' అని వుంటే బయట నిల్చొని లోనికి చూడడం మొదలట్టాను. లోపల చాలా మంది సోల్డరింగ్ చేస్తూ కనిపించారు. ఎవరో లోపలనుంచీ వొచ్చి 'ఏమిటీ చూస్తున్నావ్? ఉద్యోగం కావాలా? అని అడిగారు. అలా అడగడం వింతగా అనిపించి ఔనన్నట్లు తలూపాను. లోపలికి పిలిచారు. లోపల అంతా స్పానిష్ మాట్లాడేవాళ్ళే పనిచేస్తున్నారు. మరి నా ఇంగ్లీషు అలానే అనిపించిందేమో.. 'సోల్డరింగ్ చేయగలవా?' అని అడిగి, వచ్చనగానే వెంటనే నా చేతికి సోల్డరింగ్ గన్ ఇచ్చారు రెండు గంటలు పనిచేయించుకుని గంటకి నాలుగు డాలర్ల చొప్పున చేతిలోపెట్టారు.!
ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే అంతా ఆశ్చర్యపోయారు. కొంతకాలం పరిశీలించాక నా ఇంగ్లీషులో సమస్య ఏమిటో తెలిసింది. పై వాళ్ళతో నెమ్మదిగా ఆగి ఆగి మాట్లాడ్డం మొదలుపెట్టాను. కాస్త నాకు ఇంగ్లీషు తెలుసని వాళ్ళకి అర్థంకాగానే కొంచెం డిగ్నిటీ పెరిగింది.
అక్కడ చేరిన కొద్ది రోజులకే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు టెస్ట్ చేసే కంప్యూటర్ చెడిపోయింది. బొంబాయిలో ఎప్పుడో నేర్చుకున్న కంప్యూటర్ రిపేరింగ్ ఆదుకుంది. నా సూపర్ వైజర్ వద్దకి వెళ్ళి నాకో అవకాశం ఇమ్మని అడిగాను. 'అది చాలా విలువైంది. నువ్వు రిపేర్ చెయ్యడమేమిటి?' అన్నాడు. చెయ్యగలనని ధీమాగా అనేసరికి కొన్ని ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ సమంజసంగా సమాధానాలు చెప్పేసరికి, నేను చేసే పనిమీద నాకు పూర్తి అవగాహన ఉందని నిర్ధారించుకుని సరేనన్నాడు. నాలుగైదు గంటలు కష్టపడి మొత్తానికి దాన్ని పనిచేయించగలిగాను. అప్పటి వరకూ సూపెర్వైజర్కి నాకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉందని తెలీదు. తరువాత నా గురించి తెలుసుకుని నన్ను రాత్రి షిఫ్ట్ కి ఇన్ఛార్జిని చేశారు. 150 మందిని మేనేజ్ చేసేవాడిని. ఇదంతా 4-5 నెలల్లో జరిగింది. ఎక్కడికి వెళ్ళినా లోగడ నేర్చుకున్నవి ఏదో రూపంలో ఉపయోగపడడం జరిగింది. రాత్రి పూట అక్కడ పనిచెయ్యడం, పగలు మరోచోట సి.ఎన్.సి మెషీన్ల ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం, పనిచేయడం జరిగింది. రోజూ సాయంకాలం 6 నుంచీ రాత్రి 10 వరకూ మాత్రమే ఇంట్లో ఉండేవాడిని. కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, ఎలాగైనా నా డిగ్రీకి తగినట్లు ఇంజీనీర్ ఉద్యోగం తెచ్చుకోవాలని పట్టుదలగా వుండేది. అపుడే 1987లో పెద్దబ్బాయి గంగాధర్ పుట్టాడు. విద్య పిల్లాడిని చూసుకుంటూ, స్కూలుకి వెళ్ళి చదుకోవడం మొదలుపెట్టింది.
సిలికాన్ వేలీలో తొలి ప్రయత్నాలు:
మా సమీప బంధువు ఒకాయన సిలికాన్ వేలీలో అప్పటికే ఒక సెమీకండక్టర్ కంపెనీని నడుపుతున్నారు. నాకూ ఆ రంగంలో అనుభవం తెచ్చుకోవాలని ఉందనగానే వెంటనే ఆయన అంగీకరించలేదు. 'నువ్వు ఇంతవరకూ చేసిన పనులేవీ నా కంపెనీలో పనికిరావు. నిన్ను ఎక్కడా వాడుకోలేను' అన్నారు. ఏదో ఒక హెల్పర్గానైనా పని ఇప్పించమని బ్రతిమాలుకుని ఎలాగైతే సిలికాన్ వేలీ వచ్చేశాను.
ఆ కంపెనీలో మైక్రో ప్రోసెసర్ చిప్సెట్స్ రీ-ఇంజినీరింగ్ చేసేవాళ్ళు. చిప్ ని ఓపెన్ చేసి, దాన్ని ఫోటో తీసి, దాన్నుంచీ లాజిక్ కనుక్కునే ప్రయత్నాలు చేసేవాళ్ళు. నా పనల్లా, ఫోటోలు తీసేప్పుడూ, వాటిని ప్రోసెస్ చేసేప్పుడూ వాళ్ళకి సహాయం చెయ్యడమే. ఇదంతా కొత్త ఫీల్డ్ కాబట్టి, నాకు అంతకంటే పెద్ద పనేమీ ఇవ్వలేదు. ఐతే సహజసిద్ధమైన కుతూహలంతో, మిగతా వాళ్ళూ కూడా ఏమి చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో పరిశీలిస్తూ వివరాలు తెలుసుకుంటూ ఉండేవాడిని. ఖాళీ సమయాల్లో మైక్రో ప్రోసెసర్స్ గురించి పుస్తకాలు చదువుతూ నాలెడ్జి పెంచుకునే ప్రయత్నాల్లో ఉండేవాడిని. నెమ్మది నెమ్మదిగా మిగతా పనులు కూడా చెయ్యగలనన్న నమ్మకం కలిగింది.
ఐతే ఈ ఉద్యోగమూ ఎక్కువకాలం నిలవలేదు. కంపెనీలోని ఆర్ధిక సమస్యల వల్ల మమ్మల్ని లేఆఫ్ చేశారు. పట్టుమని పదినెలలుకూడా గడవలేదు. మళ్ళీ రోడ్డున పడే పరిస్థితి. పోనీ జీతం వద్దు, ఊరికే పనిచేస్తానన్నా వినలేదు. కంపెనీ వదిలెయ్యక తప్పలేదు.
ఉద్యోగం కావాలి. అప్పటికే విద్యా, బాబు కూడా నాతో వున్నారు. ఉద్యోగం లేకుండా ఇల్లు గడవడం చాలా ఇబ్బంది. మొదటిసారిగా రెస్యూమె టైప్ చేసుకుని జాబ్ ఫెయిర్ అని కనిపిస్తే అక్కడికి వెళ్ళాను. SMOS అనే చిప్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ బూత్ వద్ద అదృష్టం తలుపు తట్టింది. అక్కడ కూర్చున్న Joseph Hong నా రెస్యుమే, ఇంజినీరింగ్ డిగ్రీ, వివిధ రంగాల్లో అనుభవమూ చూసి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకి వచ్చాడు. 'ఇదే మొదటిసారి రెస్యూమె తయారు చెయ్యడం కదా.. ఇవిగో ఇన్ని తప్పులున్నాయి.. వీటిని ఇలా సరిచెయ్యాలి..' అంటూ తనే వాటిని సరిదిద్ది తన వెంట ఆఫీసుకు తీసుకెళ్ళాడు.. ఎలాగైతే అందులో డిజైన్ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరాను. అక్కడే 1994 వరకూ అందులోనే పనిచేశాను (నాజీవితంలో ఎక్కువకాలం ఉద్యోగం చేసింది అక్కడే) Joseph Hong నేనంటే చాలా శ్రద్ధ తీసుకుని అడిగిన వివరాలన్నీ చెప్పేవాడు.
తరువాత నేను వివిధ కంపెనీలు ప్రారంభించి, విజయవంతంగా ముందుకి సాగడానికి కావలసిన పునాది అంతా ఈ SMOS అనుభవంవల్లనే సాధ్యపడింది. మైక్రోప్రోసెసర్ చిప్స్ గురించిన లోతుపాతులన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. 1993 చివరలోనే ఇక్కడ పనిచేస్తున్నప్పుడే పసిఫిక్ సెమీకండక్టర్స్ అనే కంపెనీని మొదలుపెట్టాను.
ఆకాశమేహద్దుగా విజయ పధంలోవిహారం:
1994లో ఉద్యోగంమానేసి పూర్తిగా సొంత కంపెనీని చూసుకోవడం ఆరంభించాను. మొదట్లో ముగ్గురు ఉద్యోగులు ఉండేవారు. మైక్రోప్రొసెసర్ చిప్స్ డిజైనింగ్ ని కస్టమర్ల వద్దనుంచీ తీసుకుని, చిప్స్ తయారు చేయించి కస్టమర్స్ కి ఇచ్చేవాళ్ళం. డిజైనింగ్ కి మాన్యుఫాక్చరింగ్ కీ మధ్యలో ఉన్న దశలన్నింటినీ మేము పూర్తి చేసేవాళ్ళమన్నమాట. వీటినే ASIC Services అని అంటారు.
మొదట్లో కంపెనీకి పెట్టుబడీ, ఆర్థిక వ్యవహారాలు చాలా కష్టంగానే ఉండేవి. విద్య ఉద్యోగం చేస్తూ కుటుంబపోషణ చూస్తుండేది. నేను కంపెనీ వృద్ధి గురించి ఎక్కవ సమయం శ్రమిస్తుండేవాడిని.
కొద్దినెలల్లోనే కంపెనీ వ్యాపారం బాగా పుంజుకుంది. 1995 చివరికి 8 మంది స్థాయికి చేరగానే దీన్ని ఫారాడే ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ కొనేసింది. 1996 లో వర్చ్యుల్ ఐ.పి అనే మరో కంపెనీని స్థాపించి, రకరకాల హార్డ్వేర్ ఉపభాగాలకి ఇన్స్టర్ఫేసెస్ డిజైన్ చేసి, తయారుచేయడం ప్రారంభించాము. 2002 చివరలో 150 మంది స్థాయికి ఎదిగాము. ఇండియాలో దీనికి రీసెర్చ్ సెంటర్ ని క్వాల్కోర్ అనే పేరుతో ప్రారంభించాను. 2002 డిసెంబర్లో ఈ కంపెనీని Terra Burst Networks అనే సంస్థ కొనుక్కుంది.
ఈ కంపెనీ ఉన్నప్పుడే మొబైల్ పరికరాలకి ఆడియోని అందించే చిప్స్, సాఫ్ట్వేర్ డిజైనింగ్ చేసేందుకు క్యూట్ సొల్యూషన్స్ అనే కంపెనీని హైదరాబాదులో మొదలుపెట్టి రెండు కంపెనీలనీ నడుపుతుండేవాడిని.
2003 నుంచీ క్యూట్ సొల్యూషన్స్ ని పూర్తిగా చూసుకుంటూ కొన్నాళ్ళు ఇండియాలో ఉందామని హైదరాబాదుకి ఫామిలీని షిఫ్ట్ చేశాను.
2005 ఫిబ్రవరిలో క్యూట్ సొల్యూషన్స్ని ఎ.టి.ఐ. కొని, ఎ.టి.ఐ.ఇండియాగా మార్చింది. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తుండగానే ఈ కంపెనీని ఎ.ఎమ్.డి కొనడంతో ఎ.ఎమ్.డి ఎం.డి గా పనిచేస్తున్నాను.
2004 సంవత్సరమే జి.డి మైక్రో (ప్రస్తుతం 150మంది ఉద్యోగులున్నారు) అనే మరో కంపెనీని ప్రారంభించి దానిలో వివిధ ఎలక్ట్రానిక్స్ పరికరాల్నీ అనుసంధానించి ఒకే పరికరంతో వాటినన్నింటినీ కంట్రోల్ చేసే ప్రయోగాలు చేస్తున్నాం. ఇదిగాక పది సంవత్సరాల క్రిందటే VEDA IIT అనే విద్యా సంస్థని ప్రారంభించాము. దీనిలో VLSI టెక్నాలజీ లో ఎమ్. ఎస్. డిగ్రీని, డిప్లొమో డిగ్రీనికూడా బోధిస్తున్నాం. దీనికి జె.ఎన్.టి.యు గుర్తింపు ఉంది. ఈ కోర్సు బోధిస్తున్న, యూనివర్సిటీ గుర్తింపు వున్న సంస్థ మాదొక్కటే.
భవిష్యత్తులోకి చూస్తూ..:
వేద.ఐ.ఐ.టిని మరింతగా అభివృద్ధి చేయాలి. అలానే ఎక్కువమందికి ఉపాధి కల్పించే అతిపెద్ద హార్డ్వేర్ కంపెనీని స్థాపించాలని ఉంది. కొత్తగా కంపెనీలు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకి సహాయ సహకారాలు అందించేందుకు కూడా ఏవైనా ప్రణాళికలు రూపొందించాలని వుంది.
ఎదురైన అనుభవాలు నేర్పిన పాఠాలు:
- ఉద్యోగం వెదుక్కోవడం కంటే ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నాలు చేయడంలో మన ప్రతిభ బయటపడుతుంది.
- ఏదైనా కొత్త కంపెనీ మొదలు పెట్టబోయేముందు ఆ రంగంలో కాలసినంత అనుభవం తెచ్చుకోవాలి.
- కంపెనీ మొదలుబెట్టబోయే ప్రోడక్ట్స్ స్థూలమైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ప్రతి చిన్న విషయం తెలీకపోయినా వివిధ దశల్లో ఏమి జరుగుతుందీ, ఏ విభాగం ప్రభావం ఎంత వుంటుందీ, ఎక్కడ ఏ సామర్థ్యాన్ని ఎలా వినియోగించుకోవాలీ. లాంటి విషయాల్లో మనకి పట్టు ఉండాలి. కంపెనీలో పనిచేసే టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగుల జాబ్ ప్రొఫైల్ గురించి పూర్తి అవగాహన తప్పని సరిగా ఉంటేనే కంపెనీని సమర్థవంతంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది.
- నేను స్థాపించిన కంపెనీల ప్రోడక్ట్స్ సంబంధించిన మౌలికమైన టెక్నికల్ ఆలోచన నాదే ఐనా, దాన్ని సవ్యంగా అమలుపరచింది మాత్రం నా తోటి ఉద్యోగులే. కంపెనీలో టీమ్ వర్క్ చాలా ముఖ్యం. అందరూ కలిసి, ఒకరినొకరు అర్థం చేసుకొని, అంతా కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసినప్పుడే విజయమనేది అతి తొందరగా దగ్గరకి వస్తుంది. ఈ విషయంలో నా ప్రతి కంపెనీలోనూ కీలకమైన పాత్ర వహించిన ప్రతి ఉద్యోగీ నా విజయానికి ముఖ్యకారణంగా పేర్కొంటాను.
- జీవితంలో ప్రొఫెషనల్ గానూ, పర్సనల్ గానూ ఎదురైన ఎవరినీ తక్కువగా చూడొద్దు. ప్రతి మనిషినుంచీ (మనకంటే పెద్దవారైనా, చిన్నవారైనా) నేర్చుకోదగింది అంతో ఇంతో ఉంటుంది.
- జీవితంలోని ఏ సంఘటననైనా ఒక అనుభవంగా భావించి, దాన్నుంచీ మంచైనా, చెడైనా ఒక పాఠం నేర్చుకోవాలి. అందులో ఏదైనా ఎప్పుడైనా ఉపయోగపడొచ్చు.
- ఎవరైనా సహాయం కావాలని అడిగితే ఎప్పుడూ లేదనకూడదు. మనకి సాధ్యమైనదైతే, మన సమయం కొంచెం ఖర్చైనా ఎదుటివారికి సహాయం చెయ్యడం మంచిది. అందరితోనూ స్నేహంగా వుండడం వల్ల పోయేదేమీలేదు. ఒకసారి స్నేహం చేశాక అంతస్థులగురించి ఆలోచించకూడదు.
- మగవాడి విజయంలో స్త్రీపాత్ర మరువలేనిది. నేను సాధించిన విజయాలన్నింటిలో నా భార్య విద్యకి అత్యంత ప్రముఖ స్థానం వుంది. నేను కొత్త కంపెనీ ప్రయోగాలతో సతమతమవుతున్నప్పుడు విద్యే ఉద్యోగం చేసుకుంటూ, ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేది.
- అన్నింటికీ మించి ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మనో ధైర్యాన్ని కోల్పోకూడదు.. అందరికీ నేను చెప్పేదదే ఎప్పుడైనా ఏంజరిగినా Stay Cool..
AMD, Dasaradha Gude, GD Ramanjaneyulu, GD AMD, Dasaradha Gude, Dasaradha Gude Entrepreneur, Dasaradha Gude Semiconductor, Dasaradha Gude India, Dasaradha Gude Leadership, Dasaradha Gude Hyderabad, Dasaradha Gude Investments, Dasaradha Gude Chip Design, Dasaradha Gude Startups, Dasaradha Gude Technology, Dasaradha Gude Innovation, Dasaradha Gude Global Vision, Dasaradha Gude Semiconductor Ecosystem, Dasaradha Gude Indian Semiconductor Mission, Dasaradha Gude AI & Chips, Dasaradha Gude Digital India, Dasaradha Gude Silicon Valley India
అద్భుతమైన వ్యాసం చక్కగా వివరించారు.. దశరధరామ్ గారి గురించి.
ReplyDeleteExcellent...Thank You for the Information
ReplyDelete