హిందూ యువ చైతన్య మహా పాదయాత్ర: దేవాలయాల పునరుజ్జీవనానికి నూతన శంఖారావం.
తిరుపతి జిల్లా తలకోన సిద్దేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభమైన హిందూ యువ చైతన్య మహా పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ జూలై 12న ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇప్పటికే రెండు వారాల మైలురాయిని దాటింది. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం రగిలించడం, గ్రామ దేవాలయాల పునరుద్ధరణపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ యాత్ర సాగుతోంది.
దేవాలయం – పల్లెల ఆత్మ
మన గ్రామ దేవాలయాలు కేవలం పూజలు, హారతులు జరిగే ప్రదేశాలే కావు. అవి మన సంస్కృతికి ప్రతిబింబం, సమాజానికి ఐక్యకేంద్రం. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో సాంస్కృతిక మూలాలను దెబ్బతీసే చర్యలు పెరుగుతున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ధర్మవ్యతిరేకులు ప్రవేశించడం ద్వారా విభజన వాదాలు నాటడం మూలాన గ్రామాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో దేవాలయాల ద్వారా సమాజంలో ధర్మస్ఫూర్తిని మేల్కొలపాలన్న సంకల్పంతో హిందూ యువ చైతన్య పాదయాత్ర ప్రథానమైన కారణం.
యువతలో ధర్మ చైతన్యం
వందల ఏళ్లుగా నిరాశలో మగ్గిన హిందూ సమాజం, గత పదేళ్లగా మళ్లీ స్ఫూర్తిని సంతరించుకుంటోంది. ఈ సమయంలో స్వామీజీ పాదయాత్ర మరింత ఉత్సాహాన్నిస్తుంది. యువతను ఆధారంగా చేసుకుని దేవాలయ కేంద్రంగా హిందూ ధర్మ చైతన్యానికి కమలానంద స్వామీజీ బాటలు వేస్తున్నారు. దేవాలయం కేవలం ఆరాధన స్థలం కాకుండా, సమాజ సమస్యలకు పరిష్కార కేంద్రమని ఈ యాత్ర మళ్ళీ గుర్తు చేస్తోంది.
పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
స్వామీజీ పాదయాత్రలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. మొక్కలను నాటడం, పచ్చదనం కాపాడటం, నీటి వనరులను సంరక్షించడం, గోవుల ప్రాముఖ్యతని వివరిస్తూ ఇవన్నీ ఆధ్యాత్మిక జీవనంలో భాగమని ఆయన స్పష్టం చేస్తున్నారు. భూమాతను కాపాడటం కోసం కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రేరేపిస్తున్నారు. ఇవన్నీ జరిగితే మన భవిష్యత్తు బావుంటుందని గ్రామస్తులకు చాటి చెబుతున్నారు.
భాష, సంస్కృతి పునరుద్ధరణ
పాదయాత్రలో తెలుగు, సంస్కృత భాషల ప్రాధాన్యం ప్రత్యేకంగా చర్చించబడుతోంది. భాషల పరిరక్షణ లేకపోతే సంస్కృతి నిలవదని స్వామీజీ హెచ్చరిస్తున్నారు. యువత తమ భాషపై గర్వపడుతూ, దాని అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక ఐక్యత – యాత్ర సారాంశం
దేవాలయ పునర్నిర్మాణం, సాంస్కృతిక విలువల పునరుద్ధరణ, కుటుంబాలలో విలువలు పెంచడం, గ్రామల్లోని కులాల మధ్య సద్భావనను తీసుకురావడం – ఇవన్నీ ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యాలు. ఉమ్మడి విలువలతో సమాజం బలపడుతుందని, గ్రామాలు సాంస్కృతిక కేంద్రాలుగా మళ్లీ వెలుగొందుతాయని స్వామీజీ హితవు పలికారు.
హిందూ యువ చైతన్య మహా పాదయాత్ర యువతలో భక్తిని, కర్తవ్యాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్పే మహత్తర కార్యక్రమం. దేవాలయాల పునరుజ్జీవనం ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేస్తోంది. “దేవాలయం మన ఆత్మ, ప్రాణస్వరూపం. దాన్ని కాపాడటం ప్రతి హిందువు బాధ్యత” ఈ యాత్ర సారాంశం.
మన సంస్కృతిని కాపాడదాం – దేవాలయాలను నిలబెట్టుదాం – హిందూ చైతన్యాన్ని పునరుద్ధరించుకుందాం. -రాజశేఖర్ నన్నపనేని.
జై శ్రీరామ్
ReplyDelete