తైవాన్ పై కాలు దువ్వుతున్న చైనా – టెక్ ప్రపంచం టెన్షన్‌లో!
తైవాన్, ప్రస్తుతానికి ఆసియా ఖండంలో అత్యంత ప్రజాస్వామ్య ధోరణిలో ఎదిగిన దేశంగా గుర్తింపు పొందింది. కానీ చైనా దీనిని ఇంకా తమ దేశంలో భాగంగానే భావించడం తైవాన్ కి ఇబ్బందిగా మారింది. ఇరు వైపులా ఒక భావోద్వేగ పూరిత యుద్ధ వాతావరణం కొనసాగడమే కాకుండా, చిరకాల శాంతి ఒప్పందం కూడా పరస్పరం కుదరకపోవడం అనేది ప్రధాన అంశం గా మారింది.
చైనా “వన్ చైనా పాలసీ” ప్రాతిపదికన తైవాన్‌ను తమ భూభాగంగా ప్రకటిస్తుంది. ఎక్కువ దేశాలు అధికారికంగా తైవాన్‌ను గుర్తించకుండానే సహాయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్‌కి పూర్తి స్థాయి ఐక్యరాజ్యసమితి సభ్యత్వం లేదు. తైవాన్ మాత్రం వేరు దేశంగా ప్రకటిస్తుంది. తైవాన్ విషయంలో స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేసిన అమెరికా తరచూ తైవాన్ కు సహాయకారిగా మారుతోంది. ఇది తైవాన్ భద్రత, చైనా ఆందోళనలకు ప్రధాన కారణం మరియు చైనాకు ఏమాత్రం మింగుడు పడని అంశం. దీని మూలాన ప్రపంచం టెక్ రంగంలో ఒక్కోసారి అనిశ్చితి ఏర్పడుతుంది.
తైవాన్ పై చైనా ఆలోచనా ధోరణి ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా తైవాన్ చుట్టూ చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తిరుగుతూ బెదిరింపుల ప్రదర్శన చేస్తున్నాయి. తైవాన్ కూడా తన ప్రధాన నగరాల్లో యుద్ధ వ్యాయామాలు (వార్ డ్రిల్స్) ముమ్మరంగా చేస్తూ ఆత్మరక్షణకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తోంది.
ఈ యుద్ధ వాతావరణాన్ని కేవలం రాజకీయంగా చూస్తే సరిపోదు. దీనివల్ల ప్రపంచ టెక్నాలజీ రంగం మీదే పెను విపత్తు పొంచి ఉందన్నదే అసలు చర్చ!
తైవాన్ లేకుండా టెక్నాలజీ మనుగడ సాగించగలదా?: ప్రపంచ టెక్ రంగం నిజంగా తైవాన్ మీదే ఆధారపడుతోంది. ఎందుకంటే తైవాన్ సెమీకండక్టర్ హబ్. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు, టెలికం పరికరాలు, మిలిటరీ డివైజులు ఇవన్నీ పనిచేయాలంటే చిప్ కావాలి. ఈ చిప్‌ల తయారీలో టైవాన్ వరల్డ్ నెంబర్ వన్.
TSMC (Taiwan Semiconductor Manufacturing Company) ప్రపంచానికి అత్యాధునిక మైక్రోచిప్స్ తయారీ సంస్థ. Apple, NVIDIA, AMD, Qualcomm లాంటి దిగ్గజ కంపెనీలు తైవాన్ తయారీపై పూర్తిగా ఆధారపడ్డాయి. తైవాన్ బ్రాండ్లు అయిన Acer, ASUS ప్రపంచ మార్కెట్లో మొదటి స్థానంలో ఉన్నాయి.
తైవాన్ మీద చైనా దాడి చేస్తే: తైవాన్ పై చైనా సైనిక చర్యకు దిగితే, దాని ప్రభావం అక్కడితో ఆగదు. ప్రపంచ టెక్ ఎకానమీ కుదేలవుతుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కార్ల తయారీ అస్తవ్యస్తం అవుతుంది. ఫ్యాక్టరీలు ఆగిపోతే, చిప్ షార్ట్ వల్ల గ్లోబల్ సప్లయ్ చైన్ ఢమాల్. ధరలు పెరిగిపోతాయి, కొత్త ఉత్పత్తుల విడుదల ఆలస్యం అవుతాయి.
మిలిటరీ టెక్నాలజీ నుంచి సామాన్య వినియోగదారుల ఫోన్ల వరకు అన్ని విభాగాలకూ దెబ్బ. కరోనా టైమ్‌లో తైవాన్ ప్రొడక్షన్ ఆగినపుడు ప్రపంచవ్యాప్తంగా కార్ల అసెంబుల్ కి కావలసిన పరికరాలు లేక తయారీ నిలిచిపోయింది. మరలా అదే పరిస్థితి యుద్ధం జరిగితే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది.
అమెరికా మరియు టెక్ ప్రపంచం ఎలా స్పందిస్తాయి?: తైవాన్ పై అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల పెట్టుబడులు భారీగా పెట్టాయి. అయినా చైనాకు బహిరంగంగా ఎదురెళ్లడంలో చాలా దేశాలు జంకుతున్నాయి. అమెరికా తైవాన్ రక్షణలోకి దిగుతుందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇదే సమయంలో, భారత్ సహా అనేక దేశాలు తైవాన్‌పై ఆధారపడుతున్న ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నాయంటే, పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే తైవాన్ పై దాడి టెక్నాలజీ ప్రపంచానికి హార్ట్ అటాక్ వంటిది.
ఒక చిన్న ద్వీపం అయినా — ప్రపంచంలోని టెక్ దిగ్గజాల హార్డ్ బీట్ ను నియంత్రించే శక్తి తైవాన్‌దే. తైవాన్ పట్ల చైనా దురాక్రమణ చర్యలకు పాల్పడితే, నేడు మన చేతిలో ఉన్న ఫోన్, రేపు రోడ్డుమీద పరుగులు తీసే కార్, అంతరిక్ష ప్రయోగాలు, డిఫెన్స్ టెక్నాలజీ — అన్నింటికీ ముప్పే. తైవాన్ చుట్టూ వార్డ్రిల్స్ ముమ్మరంగా జరుగుతుండటం చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి, తైవాన్ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. టెక్ ప్రపంచం మాత్రం దీనిపై భయాన్ని కలిగివుంది. యుద్ధం జరిగితే ప్రపంచ టెక్ మార్కెట్ కి భారీ పతనం తప్పదు. అందుకే… తైవాన్ భద్రత అంటే కేవలం ఒక దేశ రక్షణ కాదు, ప్రపంచ దేశాలు ఈ అంశం గురించి జాగృతం అవ్వాలి.
మనం స్వదేశీయంగా ప్రతి అంశం లోనూ ప్రగతి సాధించాలి. ఆత్మనిర్భరత వైపు ప్రయాణించాలి. -రాజశేఖర్ నన్నపనేని.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
#OpenAI #TaiwanCrisis #ChinaTaiwanTension #TSMC #SemiconductorShortage #GlobalTechCrisis #ChipWar #TechWorldWatchesTaiwan #DragonVsTech