భారతదేశ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్వాతంత్ర్య పోరాటంలో మైలురాయి అయోధ్య శ్రీ రామ జన్మభూమి పోరాటం

megaminds
0
భారతదేశ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్వాతంత్ర్య పోరాటంలో మైలురాయి అయోధ్య శ్రీ రామ జన్మభూమి పోరాటం
శ్రీరాముడు భారత రాజ్యాంగబద్ధమైన మరియు సాంస్కృతిక ప్రతీక: న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి. ప్రజలకు సీతారాములన్నా, రామాయణమన్నా మక్కువ ఎక్కువ. మనదేశం లోని ప్రతి గ్రామంలోనూ కనిపించే శ్రీరామాలయాలు, హనుమంతుని ఆలయాలే ఉదాహరణ. దేశంలో శ్రీరాముడి పేరు లేని కుటుంబం, శ్రీరాముడి పేరులేని గ్రామము ఉండకపోవచ్చును. ఇంతటి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న భారతప్రజలు సహజంగానే రామాయణాన్ని అనుసరించి తమ జీవితాన్ని ఆదర్శంగా గడుపుతున్నారు.

అందుకే స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి నూతన రాజ్యాంగం తయారు చేస్తున్న సమయంలో, రావణ వధానంతరం శ్రీలంకనుండి పుష్పక విమానంలో బయలుదేరి అయోధ్యకు వస్తున్న సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడి పురాణకాల సన్నివేశాన్ని చక్కగాచిత్రించి ఎక్కడైతే మౌలిక హక్కుల విషయము గురించి చెప్పబడిందో రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో ఈ చిత్రాన్ని ముద్రించారు.

వేరువేరు మతాలకు చెందిన, వేరువేరు భావాలు కలిగిన వ్యక్తులున్న రాజ్యాంగసభ ఏకగ్రీవంగా ఆమోదించి స్వీకరించింది. (ఈ అధ్యాయంలోనే వైదికకాలం నాటి గురుకులాలు, యుద్ధ మైదానంలో విషణ్ణ వదనంతో కూర్చున్న అర్జునుడికి ప్రేరణనిచ్చే శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి మన భారతీయ సంస్కృతిలో శ్రేష్ట వ్యక్తిత్వం కలిగిన పూజనీయుల చిత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు) ఇలా మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు రాజ్యాంగబద్ధమైన మహా పురుషుడిగా భారతజాతి స్వీకరించింది.

దీనినే.." హైకోర్టు లక్నోబెంచ్ న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి శ్రీరాముడు భారతరాజ్యాంగబద్ధమైన మరియు భారతసాంస్కృతిక ప్రతీక " అంటూ తనతీర్పులో ఉదహరించారు.

శ్రీరాముడు అయోధ్యలో జన్మించారు అయోధ్య పట్టణాన్నే రాజధానిగా చేసుకొని చాలాకాలం రాజ్యపాలన చేశారు. వారి ఆదర్శ పాలనా కాలాన్ని శ్రీరామరాజ్యం అన్నారు. శ్రీరాముని అనంతరం ఆయన పెద్ద కుమారుడు కుశుడు రాజయ్యారు శ్రీరాముడి పరిపాలనాకాలం యొక్క విశేషాలను తదనంతర కాలంలో ప్రచారం చేసి శ్రీరామరాజ్యాన్ని కొనసాగేలా సుపరిపాలన చేశారు ఆ కాలంలోనే శ్రీరామచంద్రుడు జన్మించిన చోట భవ్యమైన శ్రీరామమందిరం నిర్మాణం చేశారు మందిరానికి 10 వేల ఎకరాల భూమిని కేటాయించాడు, ఇలా యుగాలు గడిచిపోయాయి.

ఇప్పటి మన కలియుగం ప్రారంభమైంది , రాచరికపు వింత పోకడలు , అనాగరిక రాక్షస జాతులు మళ్లీ పెచ్చరిల్లాయి, ధర్మదేనువు ఒకే పాదంపై నిలిచి ఉన్న పరిస్థితి దాపురించింది, ప్రజలకు ప్రాణసంకటంగా పరిణమించింది. అయోధ్యలో శ్రీరామజన్మభూమి మందిరాన్ని బాబర్ అనే మంగోలియా నుండి వచ్చిన విదేశీ ముష్కరుడు తన సైన్యాధిపతి 'మీర్ భక్షి' చేత విధ్వంసం చేయించాడు. ధార్మిక క్రతువులు, గోపూజలు నిర్వహించే మనదేశ భూభాగాలు గోమాతల రక్తంతో సజ్జనుల హత్యలతో రక్తపుమడుగులయ్యాయి, ధర్మాన్ని బోధించే ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, ప్రజలకు విద్యాబుద్ధులనందించే గురుకులాలు కాల్చి బూడిద చేయబడ్డాయి. స్త్రీ మూర్తులు అవమానించబడ్డారు.., అఖండ భారతాన్ని ముక్కలు చేశారు. (ముక్కలైన భూభాగాన్నింటిలో ఇప్పటికీ ఇదే దారిద్ర్యం తాండవంచేస్తున్న స్థితిని చూడవచ్చు.)

దోపిడీలు దొంగతనాలు పెరిగిపోయాయి. చాలామంది స్వదేశీయులు, విదేశీయుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి స్వజాతి నియమాలు మరిచిపోయారు, మతం మారిపోయారు దీనితో మరింత విచ్చలవిడితనం పెరిగిపోయింది. పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం మంగోలియా నుండి వచ్చిన విదేశీ దురాక్రమణ దారుడైన బాబర్ ను ఎదిరించడం కోసం , అతన్ని మన దేశంనుండి తరిమేయడానికి, విధ్వంసం చేయబడిన అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరం పునర్నిర్మాణం చేయడం కోసం గొప్ప స్వాతంత్ర్య పోరాటం జరిగింది.

దేశంలోని అనేక ప్రాంతాల వారు వచ్చి పాల్గొన్న ఈ పోరాటం అనేక దశల్లో 76 సార్లు జరిగింది. ఈ పోరాటాలలో నాలుగు లక్షల మందికి పైగా వీరులు బలిదానమై నేల కొరిగారు.

చివరి దశ పోరాటం: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో భారతదేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించిన గుల్జారీలాల్ నందా గారు పాల్గొన్న సభలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా ఉన్న "దావూదయాళ్ ఖన్నా" గారు ప్రవేశపెట్టిన శ్రీరామజన్మభూమి మందిర విముక్తి తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ విషయాన్ని కేంద్రంలోనూ ఉత్తరప్రదేశ్లో నూ అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ పోకడను గ్రహించి పార్టీ సభ్యత్వానికి మరియు మంత్రి పదవికి రాజీనామా చేసారు, విశ్వహిందూ పరిషత్ తో కలిసి ధార్మిక స్థలాల విముక్తికోసం శ్రీరామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ప్రారంభించారు, అనంతరం మహంత్ అవైద్యనాథ్ అధ్యక్షులుగా దావూదయాళ్ ఖన్నా కార్యదర్శిగా "శ్రీరామజన్మభూమి న్యాస్" ప్రారంభించారు. అక్కడి నుండి ప్రారంభమైన చివరిదశ ఉద్యమం 1984 సం. నుండి విశ్వహిందూ పరిషత్ నేతృత్వం వహించింది. దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడి ఉద్యమం చేస్తూ వచ్చింది.

హిందూ - ముస్లింల చర్చలు: శ్రీరామజన్మభూమి పై ఉన్న అక్రమ కట్టడాన్ని తీసివేసి భవ్యమందిరం కట్టాలని ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ బూటాసింగ్ నేతృత్వంలో సామాజిక పెద్దల సమావేశం పేరుతో హిందూ మరియు ముస్లిం పెద్దల సమావేశం ఏర్పాటు చేయగా సయ్యద్ షాబుద్దీన్ అసమంజసపు వ్యవహారం, అసమంజసపు మాటలతో చర్చలు విఫలమైనాయి.

రెండవసారి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అలీమియా నవాదీ నేతృత్వంలో ముస్లిం సామాజిక నాయకులు మరియు హిందూ సమాజంలోని సాధువులు మరి కొందరు ప్రముఖులతో కూడిన బృందంతో జరిగిన చర్చలో బాబర్ కట్టడం అడుగున మందిరానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటే ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి అభ్యంతరంలేదని షాబుద్దీన్ ప్రకటించాడు, ఆ ప్రకటనను మిగిలినముస్లిం ప్రతినిధులు వ్యతిరేకించారు. ఇలా ఏ తర్కానికి నిలువని మాటలు మాట్లాడుతూ మాటిమాటికి తమ వాదనలను మారుస్తుండగా, ఒక సమయంలో ముస్లిం ప్రతినిధులు నమాజ్ చేయడానికి లేచి వెళ్లారు, తిరిగి వచ్చిన వారితో స్వామి సత్యమిత్రానంద మహారాజ్ నేను దానం తీసుకునేహక్కు ఉన్న సన్యాసిని, మీరు నమాజ్ చేసి వచ్చిన తర్వాత జకాత్ సమర్పించడం మీకు గొప్ప విషయం కనుక మిమ్మల్ని నేను శ్రీరామజన్మభూమిని దానం ఇవ్వవలసిందిగా జోలెపట్టి అడుగుతున్నాను అంటూ జోలెను పట్టగా ముస్లింలు నిరాకరించారు. ఇలా హిందూ ముస్లింల సద్భావన కొనసాగడం కోసం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి.

మూడవసారి 1990వ సం. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో విశ్వహిందూ పరిషత్ మరియు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల మధ్యన చర్చలు ప్రారంభమయ్యాయి రెండు పక్షాల వారు తమ సాక్ష్యాలను లిఖిత రూపంలో కేంద్ర హోంమంత్రికి ఇచ్చారు మరియు పరస్పరం అందజేసుకున్నారు.

ఒకరు ఇచ్చిన విషయాలపై మరొకరు అభ్యంతరాలను, జవాబులను తెలియజేసుకుంటూ చర్చించవలసిన బాబ్రీ మస్జిద్ ఆక్షన్ కమిటీ ప్రతినిధులు జనవరి 10వ తేదీ 1991 సం. నాటి సమావేశానికి గైర్హాజరుకాగా జనవరి 25 వ తేదీకి వాయిదా పడింది. ఈ సమావేశానికి కూడా బాబ్రీ మజీద్ యాక్షన్ కమిటీ ముస్లిం ప్రతినిధులు ఎవరు హాజరు కానందున మూడవసారి కూడా చర్చలు విఫలమయ్యాయి.

ప్రథమ కరసేవ: చర్చలకురాని ముస్లిం పెద్దల మొండివైఖరి గమనించి అంతకుముందే 1990వ సం. మే 24వ తేదీ పవిత్ర హరిద్వార్ లో సాధు మహాత్ముల మార్గదర్శనంలో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో రాబోయే అక్టోబర్ 30వ తేదీ "దేవోత్థాన ఏకాదశి" రోజు అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కొరకు కరసేవచేయడానికై నిర్ణయం జరిగింది. ఈ సందేశాన్ని గ్రామ గ్రామం వరకు తీసుకెళ్లడానికి సెప్టెంబర్ ఒకటో తేదీ నాడు అయోధ్యలో 'అరణి మంథనం' చేసి( చెక్కల రాపిడి వలన నిప్పును పుట్టించడం) వెలిగించిన దీపాలను శ్రీరామజ్యోతి అని పిలిచి లక్షలాది గ్రామాలకు తీసుకువెళ్లారు. 1990 అక్టోబర్ 18వ తేదీన జరిగిన దీపావళి పండుగ దీపాలన్నీ శ్రీరామజ్యోతులై వెలిగాయి, ఇంటింటికి జ్యోతులతోపాటు లక్షలాది మంది అయోధ్య రావలసిందిగా సందేశం కూడా చేరింది.

మరొకవైపు pseudo secularism తలకెక్కిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ ఎవరినీ ఉత్తరప్రదేశ్ లోకి అనుమతించబోనని అయోధ్యలో పక్షి కూడా ఎగరకుండా చూస్తానని ప్రకటనలు చేశాడు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులను ఆపివేయడానికి రోడ్లన్నింటిని మూసి వేశాడు, అనేక చోట్ల రోడ్లను త్రవ్వించాడు కూడా, అయోధ్యకి వెళ్లవలసిన రైళ్ళు బస్సులన్నింటిని రద్దు చేశాడు. 22వ తేదీ నుండి అన్ని దారులపైన ప్రతి 100 మీటర్లకు ఒక బ్యారికేడ్ చొప్పున నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేయగా అయోధ్య నగరం మొత్తం పోలీస్ స్టేషన్ గా మారింది.

దేవోత్థాన ఏకాదశి అక్టోబర్ 30వ తేదీ రానే వచ్చింది దేశం నలుమూలల నుండి అనేక ఆటంకాలు దాటి స్థానిక ప్రజలు స్వాగతం పలుకి, ఆదరించి భోజనం పెట్టి సద్దులు కట్టి పంపుతుండగా అడవులగుండా పొలాలగట్ల వెంబడి ప్రయాణిస్తూ వచ్చిన కరసేవకులు వానర సైన్యం మాదిరిగా అనుకున్న తేదీ అనుకున్న సమయానికి కరసేవ చేయడానికై అయోధ్య శ్రీరామజన్మభూమి మందిర స్థలం వైపు బయలుదేరారు. వారిని పోలీసు బలగాలు మరికొన్ని దుష్టశక్తులు ఆపే ప్రయత్నాలెన్ని చేసినా జన్మభూమి స్థలం చేరనే చేరారు. చూస్తుండగనే గుమ్మటాల పైకెక్కి కాషాయ ఝంఢాను ఎగురవేసారు బాబర్ కట్టించిన గుమ్మటాలు, గోడలను త్రవ్వి ప్రతీకాత్మకంగా కరసేవను నిర్వహించారు.

కరసేవ చేయడానికి వచ్చినవారు అయోధ్య లోనే ఉండి అనుకున్న పని మొత్తం చేసి వెళ్లడం కోసం నిరీక్షిస్తున్నారు మరుసటి రోజు నవంబర్ 1 వ తేదీ భజనలు కీర్తనలతో గడిచిపోయింది. కరసేవ చేయడం వలన అహంకారి ముఖ్యమంత్రి ములాయం సింగ్ తల తీసేసినట్లయిందేమో అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై తన పోలీసు బలగాలకు ఆజ్ఞ జారీ చేశాడు.., రెండవ తేదీ ఉదయం నుండే మరింత సాయుధ పోలీసు బలగాలు వచ్చి చేరుతున్నాయి ఇవేవీ గమనించని రామభక్తులు భజనలు కీర్తనలతో సత్యాగ్రహం చేస్తూ వీధుల్లో కూర్చున్నారు.

స్వాతంత్ర్య పోరాట సమయం జలియన్ వాలాబాగ్ లో నిరాయుధులను చంపిన ఆంగ్లేయ డయ్యర్ కన్నా మరింత అధమంగా ఆలోచించిన ములాయం నిరాయుధులైన భక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపండని ఆజ్ఞ జారీ చేశాడు.

ఆ ఘటనలో అనేక మంది ప్రాణాలు అర్పించారు వేలాది మంది గాయపడ్డారు. బెంగాల్ కలకత్తా నుండి వచ్చిన రామ్ కొఠారి, శరత్ కొఠారి సోదరులిద్దరినీ పట్టుకొని పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చి హత్యచేశారు. ఇలా సాధువులను సన్యాసులను సామాన్య ప్రజలను ఎంత మందిని హత్య చేశారో.., కొందరినైతే ఇసుక బస్తాలను కట్టి సరయూ నదిలో వేశారు, ఇళ్లల్లో దూరి హత్యలు చేశారు పోలీసులు జరిపిన కాల్పులలో తూటాల తగిలినవారి రక్తం అయోధ్య వీధుల్లో ధారలై ప్రవహించాయి. ఆనాటి కాల్పుల ఆనవాళ్ళు అయోధ్య వీధుల్లో ఇప్పటికీ కనబడతాయి. ఇలా నిరాయుధులైన సాధుజనుల హత్యలు చేసి రాక్షసుడయ్యాడు ములాయంసింగ్.

బలిదానమయిన కరసేవకుల అస్తికలను పూజించి యాత్రగా తీసుకెళ్లి నదులలో కలుపుతూ ఉండేవారు, ఈ అస్తికలశ యాత్రలలో కోట్లాది మంది రామభక్తులు పాల్గొన్నారు. ములాయం హత్యాకాండ పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది దేశం నలుమూలలా సత్యాగ్రహపు జ్వాలలు ఎగిశాయి.

1991 జనవరి 14వ తేదీ మాఘమేళ సందర్భంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో బలిదానమైన కరసేవకుల అస్థికలను సంపూర్ణంగా నిమజ్జనం చేసి మందిర నిర్మాణం పట్ల నిబద్ధులమై ఉన్నామని మరిన్ని బలిదానాలు చేయడానికి కూడా సిద్ధమేనని లక్షలాదిగా సాధువులు సన్యాసులు ప్రజలు ప్రతిజ్ఞలు తీసుకున్నారు.

(అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరంలో జనవరి 22వ తేదీన 'బాలరాముడి' ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో..)
~ఆకారపు కేశవరాజు. విశ్వహిందూ పరిషత్ చెన్నై క్షేత్ర సంఘటన కార్యదర్శి (కేరళ,తమిళనాడు,పాండిచ్చేరి రాష్ట్రాలు.)

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top