Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అయోధ్య రాముడి ఆలయం కోసం ప్రజలంతా ఒక్కటయ్యారు

అయోధ్య రాముడి ఆలయం కోసం ప్రజలంతా ఒక్కటయ్యారు: అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణం కోసం చివరిదశ ఉద్యమాన్ని 1984 సం. నుండి విశ్వహిందూ పరిష...


అయోధ్య రాముడి ఆలయం కోసం ప్రజలంతా ఒక్కటయ్యారు: అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణం కోసం చివరిదశ ఉద్యమాన్ని 1984 సం. నుండి విశ్వహిందూ పరిషత్ ఉద్యమ పగ్గాలను చేతబూని గత అపజయాలను పరిశీలించారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం వాళ్లు వెళ్లి అయోధ్యను విముక్తం చేసిన చరిత్రను చూసి పాఠం నేర్చుకుని ఆసేతు హిమాచలం ఒక్కసారిగా ఉద్యమించాలని అనేక కార్యక్రమాలు రచించి దేశ ప్రజలందరినీ ఒక్కతాటిపై తెచ్చి సాగించిన పోరాటం విజయపథాన సాగింది.

నిరంతర సంఘర్షణలు, ఒత్తిడులు ఉన్నప్పటికీ హిందూసమాజపు న్యాయమైన హక్కులకు, మనోభావాలకు న్యాయం జరగాలని దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడి అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చిన కారణంగా 79 సార్లు జరిగిన గత పోరాటాలలో అనేక విజయాలు మరెన్నో అపజయాల తర్వాత 80 వ సారి.... 492 సం.ల పోరాటానికి విజయం లభించింది... దీనికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు మనం తెలుసుకోవలసిందే.

ప్రపంచ చరిత్రలోనే పెద్ద సభ: 1990 అక్టోబర్ 30 మరియు నవంబర్ రెండవ తేదీన ములాయంసింగ్ జరిపించిన హత్యాకాండతో ఆగ్రహంతో ఉన్న హిందూ సమాజం ఏప్రిల్ 4వ తేదీ 1991 సంవత్సరం ఢిల్లీలో బోట్స్ క్లబ్ పరిసరాల్లో సాధువులు సన్యాసుల నాయకత్వంలో విశాలమైన సభ నిర్వహించడానికి నిర్ణయం అయింది.

చరిత్ర సృష్టించిన సభ, ఆ నాటి సంఘటనలు. విశ్వహిందూ పరిషత్ 1991 ఏప్రిల్ 4వ తేదీన ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంఖ్యలో ప్రజల్ని సమీకరించింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిలుచున్న మాకు ఆ రోజుల్లో కొత్తగా ఏర్పాటైన టెలివిజన్లలో బిబిసి న్యూస్ చూసే అవకాశం వచ్చింది. ఏప్రిల్ 4వ తేదీ నాటి వార్తల్లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమాన్ని గురించి వర్ణిస్తూ చెప్పిన విషయాలు నాకే కాదు భారత ప్రజలకెప్పటికీ గుర్తుంటాయి .

1) 25 లక్షలకు పైగా రామభక్తులైన హిందువులు పాల్గొనిఉంటారని చెబుతూ ఇది ప్రపంచంలోనే అతి పెద్దదయిన సమావేశమనీ, సభా దృశ్యాలను చూపిస్తూ వర్ణిస్తూ చెప్పారు.

2) సభకొచ్చిన 25 లక్షలకు పైగా ఉన్న రామభక్తులకు ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు భోజనం, వసతులు కల్పించారని.

3) అంతమంది పాల్గొన్న సభలో ఒక్క పోలీసు కనిపించలేదని.

4) లక్షలాదిగా వచ్చిన వారందరూ వేదికపై నుండి చెప్పే సూచనలను పాటిస్తూ క్రమశిక్షణతో కూర్చుండి పోయారని.

ఇక ఆనాటి సభా వేదిక సరిగ్గా ఢిల్లీ లోనే అతిపెద్దదైన బోట్స్ క్లబ్ మైదానంలో, (రాష్ట్రపతి భవనం ఎదురుగా ) ఏర్పాటు చేయగా, స్వామి నృత్య గోపాల్ దాస్ జీ , స్వామి రామానందాచార్యజీ, సాద్వి ఋతంభర, సాద్వి ఉమాభారతి వంటి అనేకమంది పూజ్య సాధుసంతులతో పాటు కీర్తిశేషులు పూజనీయ అశోక్ సింగల్ జి, అప్పటి సర్ కార్యవాహ కీర్తిశేషులు మాననీయ శేషాద్రిగారు వంటి అనేక మంది పెద్దలున్న ఆ వేదికపై రెండు వందల మందికి పైగా మహాత్ములు కూర్చుని ఉన్నారు. ఆ సభకు గుజరాత్ పంచఖండ్ పీఠాధిపతి శ్రీధర్మేంద్రజి మహరాజ్ అధ్యక్షత వహించారు.

రామభక్తులు సభాస్థలమే కాదు, మొత్తం ఢిల్లీ అంతా నిండిపోయి కిక్కిరిసి ఉన్నారు. సరిగ్గా అదే రోజు అయోధ్య శ్రీరామజన్మభూమిలో కరసేవకులపై రాక్షసంగా కాల్పులు జరిపి హత్యలు చేయించిన ములాయం సింగ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ విషయాన్ని ప్రకటించిన పూజ్య సాధ్వి ఋతంభర గారి ఉత్సాహకరమైన ఉపన్యాసం విని ఒక్కసారిగా జయ కారాలు చేస్తూ లేచి నిలబడిన లక్షల మంది ముందుకు నడవడం ప్రారంభించారు.

సభలో పాల్గొన్న వారు లేచి ముందుకు రావడం తొక్కిసలాటకు దారి తీసే అవకాశం ఉంది. దానిని ముందే గమనించిన సభా నిర్వాహకులు ధర్మేంద్రజి మహారాజ్ లేచి నిలబడి సాద్విఋతంభర గారి చేతిలోని మైకును తీసుకొని ,

"జో జో రామభక్త్ హై ఓ వహి బైట్ జాయియే". (ఎవరైతే రామభక్తులో వారంతా ఎక్కడి వారక్కడే కూర్చుండి పొండి.) అని చేసిన ఒక్క సూచనతో లేచి నిల్చున్న లక్షలమంది మరు నిమిషంలోనే క్రమశిక్షణతో కూర్చుండిపోయారు. ఇది నా కళ్ళతో చూసిన అద్భుతమైన ఘటన.

ఉత్సాహంతో వేలాది మంది బోట్స్ క్లబ్ మైదానంలో ఉన్న వందలాది పెద్దపెద్ద వృక్షాలపై ఎక్కి కూర్చున్నారు. సంఖ్య పెరిగి చెట్లు కొమ్మలు వంగి విరిగిపోయే పరిస్థితిని చూసి 'చెట్లపై హనుమంతుని వలె కూర్చున్న భక్తులారా మీరందరూ మరుక్షణమే దిగి కింద కూర్చోండి', ఈ సూచన కూడా మంత్రంవలె పనిచేసింది, సూచన తర్వాత మరెవరు చెట్టుపైన కనిపించలేదు.

ఇంత చక్కని మాస్ మేనేజ్మెంట్, మైక్ మేనేజ్మెంట్ దృశ్యాలు కండ్ల ముందు ఇప్పటికీ కదలాడుతున్నాయి. ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలోని ప్రజలు వండి ప్యాకెట్లుగా పంపిన లక్షలాది భోజన పొట్లాలు పాల్గొన్న వారందరి ఆకలితీర్చాయి. ప్రతివీధి మూలమలుపు దగ్గర ప్రతి 500 మీటర్లకు ఒక భోజనాల కౌంటర్ ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాలు మరియు దక్షిణాది నుండి సభలో పాల్గొనడానికి వచ్చి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో దిగిన వారికి Bharat scouts & guides కు చెందిన విశాలమైన మైదానము మరియు గుడారాలు కలిగిన ప్రదేశంలో వసతి ఏర్పాటు చేశారు.

ఢిల్లీ బోట్స్ క్లబ్ సభలో పెద్దల ఉపన్యాసాలు విని ప్రేరణ పొంది ఉత్సాహంతో తిరుగు ప్రయాణమై అయోధ్య,మథుర, కాశీ వంటి పుణ్యక్షేత్రాల ఆలయాలను దర్శించుకుని అక్కడి పురాతన మందిరాలను విధ్వంసం చేసి కట్టబడిన మసీదు వంటి కట్టడాలను చూసి రక్తం వేడెక్కగా, ఉబికివచ్చిన కన్నీరు 'రక్తకన్నీరుగా మారింది'. గుండెల్లో సంకల్ప శక్తిని నింపుకొని, ఆలయాలను మసీదులుగా మార్చిన వైనాన్ని కళ్ళారా చూసిన శ్రీరామభక్తులు కసితో తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మారింది: నిరాయుదులైన కరసేవకులను సత్యాగ్రహం చేస్తుండగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ములాయంసింగ్ ప్రభుత్వంపై ప్రజలకు ఏహ్యభావం కలిగింది, ఉత్తరప్రదేశ్లో పాలకులు మారారు రామభక్తుడైన కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అయోధ్య దర్శనానికి వచ్చే భక్తుల అవసర నిమిత్తం వారి కోరిక మేరకు 'కథాకుంజ్' (హరికథ భవనం) నిర్మాణం చేయడానికై, కోర్టు కేసులోఉన్న వివాదాస్పదమైన స్థలం వదిలి బాబర్ కట్టడానికి తూర్పున మరియు దక్షిణం దిశలో ఉన్న గతంలో చాలా సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 42 ఎకరాల భూమిని శ్రీరామజన్మభూమి న్యాస్ పేరిట పట్టా చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాక వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వమే హస్తగతం చేసుకుని సురక్షితంగా ఉంచింది.

విధ్వంసమైన ఆలయ శిథిలాలు దొరికాయి: జూన్ 18వ తేదీ 1992వ సం. ఎగుడు దిగుడుగాఉన్న భూమిని సమతలీకరణ చేయడం కోసం 12 ఫీట్ల వరకు తవ్వి సరి చేస్తుండగా ఆగ్నేయ దిశలో సుందరమైన పార్వతీ పరమేశ్వరుల ఖండిత మైన విగ్రహం, సూర్యుని పోలిన అర్థ కమలము, మందిర శిఖరము పై ఏర్పాటు చేసే ఆమలకము, విష్ణుమూర్తి విగ్రహాలు కళాఖండాలు ప్రాచీనమైన మందిరం యొక్క ఆనవాళ్లుగా పురాతత్వ శాఖ తవ్వకాలలో లభ్యమయి ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి.

సర్వదేవతానుష్టానం,పునాదులు తీయడం: జూలై 9 వ తేదీ 1992వ సంవత్సరం 60 రోజుల సర్వదేవ అనుష్ఠానం ప్రారంభమైంది. శిలాన్యాసము జరిగిన స్థలంలో నిర్మాణము చేయబోయే మందిర నిమిత్తం పునాదులు త్రవ్వేపనులు ప్రారంభించడం జరిగింది. ఈ పునాదులుగా 290 ఫీట్ల పొడవు 155 ఫీట్ల వెడల్పు, రెండు బై రెండు ఫీట్ల మందము కలిగిన మూడు అంచెల స్లాబులు వేయడం జరిగింది. భారత ప్రధాని నరసింహారావు గారు సాధు సంతులతో మాట్లాడి కోర్టు తీర్పు త్వరగా వచ్చే విధంగా ప్రయత్నిస్తానని మాట ఇచ్చి పనిని వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారు దీనితో సాధువులు సమ్మతించి నిర్మాణపు పనులు ఆపివేశారు.

శ్రీరామపాదుకా పూజ: శ్రీరాముడి వనవాస కాలంలో భరతుడు ఆయన పాదుకలను తీసుకువచ్చి శ్రీరాముడు లేని అయోధ్య నగరంలోకి ప్రవేశించలేనంటూ, సింహాసనంపై పాదుకల నుంచి శ్రీరాముడి పేరుతో రాజ్యం చేసిన స్థలంగా ఘనత కెక్కిన "నందిగ్రామ్" లో సెప్టెంబర్ 26వ తేదీ 1992 సం. శ్రీరామపాదుకా పూజ జరిపి ప్రతి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పాదుకలను తీసుకువెళ్లి పూజలు జరిపి శ్రీరామభక్తులు మందిర నిర్మాణం కోసం ప్రతిజ్ఞలు తీసుకోవడం జరిగింది.

ద్వితీయ కరసేవ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా హస్తగతం చేసుకున్న భూమిపై ముస్లింలు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టుకు వెళ్లారు.

అక్టోబర్ 30వ తేదీ 1992 నాడు సాధుసంతులు ఢిల్లీలో 'ఐదవ ధర్మసంసద్' ( రిలీజియన్ పార్లమెంట్) జరిపి పరిస్థితులను సమీక్షించారు ఈ సమావేశంలోనే డిసెంబర్ 6 వ తేదీన రెండవ కరసేవకై దేశం నలుమూలల నుండి రామ భక్తులను అయోధ్యకు ఆహ్వానించారు. నవంబర్ 4వ తేదీ నాటికి వాదనలు విన్న హైకోర్టు త్వరలోనే తీర్పునిస్తుందనే విశ్వాసంతో కరసేవలో పాల్గొనడం కోసం లక్షలాది మంది భక్తులు డిసెంబర్ 1వ,2వ తేదీ నాటికే అయోధ్య వచ్చి చేరుకున్నారు. హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు, డిసెంబర్ 4వ తేదీనాడు హైకోర్టువారు తాము డిసెంబర్ 11వ తేదీన తీర్పు వినిపిస్తామని ప్రకటించారు.

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో శుద్ధ ఏకాదశి తిథి నాడు గీతా జయంతి: బాబర్ కట్టడంతోపాటు, కుహనా సెక్యులరిజం కుప్పకూలింది. 1528 వ సంవత్సరం నుండి భారతదేశ అవమానాలకు చిహ్నంగా కళ్లెదురుగా కనబడుతున్న ఆక్రమణ కారుడి కట్టడం స్వాభిమానం ప్రియులకు తీరని అవమానంగా ఉంది స్వాతంత్ర్యానంతరం పాలకులు స్పందించిన తీరు కూడా ప్రజల మనసులు కలవరపెడుతున్నాయి భారత ప్రధానిగా పీవీ నరసింహారావు ఇచ్చిన మాటను కూడా నిలుపుకోలేకపోయారు. మరొకవైపు హైకోర్టు తీర్పు కావాలని తేదీని పొడిగించారు.

ముస్లింల సంతుష్టీకరణ తారాస్థాయికి చేరింది. బాబర్: అప్పటి మంగోలియా ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్, ఫెర్గనా లోయ లోని 'అందిజాన్' పట్టణంకి చెందిన దురాక్రమణదారుడు కొందరికి గొప్పవాడుగా కనబడుతున్నాడెందకనీ కరసేవకులు ఆగ్రహంగా ఉన్నారు.

గీతా జయంతి/ డిసెంబర్ 6వ తేదీ (మహాభారత సంగ్రామం ప్రారంభమైన రోజు): ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో శుద్ధ ఏకాదశి తిథి నాడు గీతా జయంతి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం ప్రారంభమైన రోజు 1992వ సం.లో డిసెంబర్ ఆరవ తేదీన వచ్చింది.

అయోధ్య లో సాధుసంతులు కరసేవకు ప్రతీకగా మందిర నిర్మాణం కోసం సరయు నదినుండి ఇసుకను తీసుకురమ్మని పిలుపునిస్తున్నారు. ఇసుకను తీసుకురావడానికి వేలాది మంది బారులుతీరి నిలబడ్డారు. కొందరు మట్టిని తీసి ఎగుడుదిగుడుగా ఉన్న గుంతలను పూడ్చి వేస్తున్నారు.

మరోవైపు దేశంలో జరుగుతున్న పరిణామాలు కోర్టులు, ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు గమనించిన కరసేవకులు ఇక సహించలేకపోయారు, ఆవేశపూరితులై అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తిరగబడ్డారు. భారతమాత నుదిటి కలంకంగా ఉన్న బాబర్ కట్టడాన్ని దేశం నలుమూలల నుండి అయోధ్యకు చేరుకున్న కరసేవకులు తమవెంట ఏ ఆయుధాలను తీసుకెళ్లక పోయినా కట్టడంచుట్టూ కంచెకొరకు ఏర్పాటుచేసిన ఇనుప గొట్టాలే ఆయుధాలుగా మారాయి, కోపోద్రిక్తులైన కొందరైతే పిడికిళ్ళతోనే గుమ్మటాలను కొడుతుండడం కనిపించింది ఏదేమైనప్పటికీ లక్షలాదిగా వచ్చిన కరసేవకులు మూడున్నర గంటలలోనే నేలమట్టం చేశారు, బాబర్ కట్టడంతో పాటే కుహనా సెక్యులరిజం కూడా కుప్పకూలిపోయింది.

గుమ్మటాల క్రింద ఉన్న బాలరాముడి విగ్రహాన్ని ముందే బయటికి తీసుకు వచ్చిన కరసేవకులు శ్రీరామజన్మభూమి స్థలంలోనే వెనువెంటనే గుడ్డతో వెదురు బొంగులతో చిన్న టెంట్ వేసి, నాలుగు వైపులా ఇటుకలు మట్టితో గోడలుకట్టి అప్పటికప్పుడు చిన్న మందిరాన్ని నిర్మించారు. బాలరాముడిని ప్రతిష్టించారు పూజలు అర్చనలు చేశారు, భజనలు చేశారు, కానుకలు సమర్పించారు. ఆనంద నాట్యాలు చేశారు.

ఆరోజు బాబర్ కట్టడాన్ని తొలగిస్తున్న సమయంలోనే మరొక విశేషం బయటపడింది 1154 సంవత్సరం నాటి సంస్కృతంలో చెక్కబడిన శిలాశాసనం బయటపడింది. అమూల్యమైన ఈ శిలాశాసనంలో "విష్ణుహరి యొక్క స్వర్ణ కలశముతో కూడుకున్న మందిరం యొక్క వర్ణన, అయోధ్య నగరం యొక్క వర్ణన, దశకంఠుడైన రావణాసురుని గర్వభంగపు వర్ణణ ఇందులో చెక్కబడి ఉన్నది. దీనితో భవ్యమైన ప్రాచీన అయోధ్యా శ్రీరామ జన్మభూమి మందిరం యొక్క ఆనవాళ్లు మరియు తగిన సాక్ష్యాలు దొరికినట్లయింది.

రాముడి దర్శనానికి మళ్లీ అనుమతి లభించింది: 8 వ తేదీ ఉదయం కేంద్ర బలగాలు అయోధ్యకు చేరుకుని అక్కడి ప్రాంతం అంతా స్వాధీనం చేసుకుని కర్ఫ్యూ విధించారు, కరసేవకులందరినీ అక్కడి నుండి పంపించివేశారు. హరిశంకర్ జైన్ అనే న్యాయవాది నిత్య పూజలు మరియు దర్శనం కోసం అనుమతి కోరుతూ కేసు వేయగా లక్నో బెంచ్ న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి గారు అనుమతిస్తూనే, దర్శనంకోసం వచ్చే హిందూ తీర్థయాత్రికులు తగినంత దూరంలో నిలబడి దర్శనం చేసుకోవడం కోసం, వర్షము, చలీ, ఎండల నుండి విగ్రహం యొక్క రక్షణ మరియు వివాదిత స్థలము చుట్టూగల భూమి, వాటితో పాటు పురాతన వస్తువుల యొక్క రక్షణ కూడా ప్రభుత్వమే వహించాలని తీర్పు చెప్పారు.

(అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరంలో జనవరి 22వ తేదీన 'బాలరాముడి' ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో..)
~ఆకారపు కేశవరాజు. విశ్వహిందూ పరిషత్ చెన్నై క్షేత్ర సంఘటన కార్యదర్శి (కేరళ,తమిళనాడు,పాండిచ్చేరి రాష్ట్రాలు.)

No comments