Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రాణి గైడెన్లు జీవిత విశేషాలు - About Rani Gaidinliu in Telugu - azadi ka amrut mahotsav

azadi ka amrut mahotsav రాణి గైడెన్లు భారత స్వాతంత్ర్య పోరాటంలో అఖండ భారతం నలు మూలల నుండి వేలాదిమంది నాయకులు పాల్గొన్నారు. స్త్రీ పురుష, జాత...

రాణి గైడెన్లు
azadi ka amrut mahotsav రాణి గైడెన్లు

భారత స్వాతంత్ర్య పోరాటంలో అఖండ భారతం నలు మూలల నుండి వేలాదిమంది నాయకులు పాల్గొన్నారు. స్త్రీ పురుష, జాతి మత బేధాలు లేకుండా జరిగిన ఈ పోరాటంలో ఈశాన్య భారతం నుండి ఇద్దరు మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు ఒకరు రోపుయిలియాని మరొకరు రాణి గైడెన్లు.

గైడెన్లు 1915 జనవరి 26వ తేదీన మణిపూర్ రాష్ట్రంలోని టామెంగాంగ్ జిల్లాలోని నుంగ్కావ్ లో రోంగ్మీ నాగా తెగకు సంబందించిన రోటియెన్లియు, లోథోనాంగ్‌ల దంపతులకు జన్మించింది. పర్వత ప్రాంతం కావడము మూలాన పాఠశాలలు లేకపోవడం వలన చదువుకోలేదు. చిన్నతనంలోనే అక్కడున్న పరిస్థితులు అనుభవ కారణంచేత ప్రజల బాధల గురించి తెలుసుకుంది ఎలాగైనా సరే జాతి పరిరక్షణ కోసం కృషి చేయాలని నిర్ణయించుకుంది.

13వ ఏటనే నాగజాతి నాయకుడు, గురువు ‘హైసావు జుడోనాంగో’ బోధనలు వీరిని ప్రభావితం చేశాయి. జుడోనాంగో ‘హెరాకా మత’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమ ఆశయం ‘నాగజాతి పునరుజ్జీవనం’, బ్రిటిష్ వారి పరిపాలనను అంతం చేసి నాగా జాతి వారి పాలనను తీసుకుని రావడమే వీరి ధ్యేయం. వీరి రోంగ్మీ తెగవారితో పాటు ఇతర జెమ్, యాంగ్‌మై, రోంగ్‌మై వంటి ఇతర జాతి ప్రజలు కూడా ఈ ‘హెరాకా ఉద్యమం’ వైపు చూపు సారించారు.

1931 ఆగష్టు నెలలో జుడోనాంగ్ మరణించారు. ఆయన వారసురాలిగా బాధ్యతలను స్వీకరించారు గైడెన్లు. గెరిల్లా దళ నాయకురాలయ్యారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాంప్రదాయక నాగా జాతి సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలని తన అనుచరులకు బోధించారు. వారిని జాగృత పరిచారు. మహత్ముని బోధనలను అనుసరించారు. బ్రిటిష్ పాలనాధికారులు ప్రజల మీద సామూహిక పన్నులను విధించారు. సహాయనిరాకణను పాటించాలని తన సైన్యానికి హితబోధ చేశారు. బ్రిటిష్ వారికి పన్నులు కట్టవద్దని ఆపించారు. గైడెన్లును ఇలా వదిలేస్తే చాల ప్రమాదమని, తమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని బ్రిటిష్ వారికి అర్థమయింది. నాటి బ్రిటీష్ (అస్సాం) గవర్నర్ పర్యవేక్షణలో డెప్యూటీ కమీషనర్ జె.పి.మిల్స్ వీరి మీదకు దండయాత్రను నడిపించారు. అస్సాం రైఫిల్స్ 3 మరియు 4వ బెటాలియన్లను గైడెన్లుకు వ్యతిరేకంగా పంపించారు.

ఈశాన్య భారతం పచ్చటి వృక్షాలకు నిలయం. కలపతోనే ఇళ్ళు, కోటలు నిర్మించేవారు. తమ పోరాటయోధుల కోసం కోటను కట్టుకుంటున్నారు ఉద్యమ కారులు. ఈ సమయంలోనే బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో దాడి జరిగింది. గైడెన్లు అక్కడి నుండి తప్పించుకున్నారు. వీరిని పట్టి తమకు అప్పగిస్తే 10 సంవత్సరాల పాటు ఆ ఊరికి పన్ను రద్దు చేస్తామని ఆశ చూపించారు. చివరకు ఒక దేశద్రోహి, జాతి ద్రోహి వీరి ఆచూకిని అందించారు. ‘కె’ నోమా గ్రామంలో గైడెన్లును అరెస్టు చేశారు. బ్రిటిష్ అధికారి కల్నల్ మెక్‌డోనాల్డ్ వీరిని జైలులో బంధించారు. 10 నెలల కాలం సుదీర్ఘంగా వీరిని విచారించారు. చివరకు జీవితఖైదును విధించారు – ఆ కర్కశ బ్రిటిష్ అధికారులు.

1933వ సంవత్సరం నుండి 14 సంవత్సరాల పాటు గౌహతి, షిల్లాంగ్, ఐజ్వాల్, తురా జైళ్ళలో శిక్షను అనుభవించారు. సుదీర్ఘకాలం జీవిత ఖైదీగా జైలు శిక్షను అనుభవించిన తొలి మరియు ఏకైక భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. జైలులో అనేక చిత్రహింసల పాలయ్యారు. 1937వ సంవత్సరంలో షిల్లాంగ్ జైలులో జవహర్‌లాల్ నెహ్రూ గైడెన్లును కలిసి మాట్లాడారు. నెహ్రూ వీరిని ‘కొండల రాణి’ అని ‘నాగాల రాణి గైడెన్లు’ అని గౌరవించారు. వీరిని జైలు నుండి విడుదల చేయిస్తానని మాట ఇచ్చారు కూడా. నెహ్రూ బ్రిటిష్ ప్రజాప్రతినిధి లేడీ ఆస్టరు గైడెన్లుని జైలు నుండి విడుదల చేయించమని ఉత్తరం వ్రాసి అభ్యర్థించారు. అయితే గైడెన్లు విడుదలయితే తమకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయని తెలియజేసి – ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు బ్రిటిష్ అధికారులు. 1946లో భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది. నెహ్రూ ఆదేశాల మేరకు గైడెన్లు జైలు నుండి విడుదలయ్యారు. వీరు ‘విమ్రాప్’ గ్రామంలో తమ్ముడితో కలిసి నివసించారు. తమ వారిని రక్షించుకోవడం కోసం 1960లో అజ్ఞాతవాసం లోకి వెళ్ళారు. 1966 వరకు తమ జాతి ప్రజల శ్రేయస్సు కోసం శాంతియుతంగా కృషి చేశారు.

అతి పిన్న వయసులోనే ఉద్యమ నేతగా మారిన ఒక స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సుధీర్ఘ కాలం జీవితఖైదీగా జైలులో మగ్గి, చిత్రహింసలను అనుభవించిన గొప్ప మహిళగా, కొండప్రాంతాల గెరిల్లా దళాలను పోరాట పథంలో నడిపిన గిరిజనోద్యమ నాయకురాలిగా వీరు భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డారు. 1972వ సంవత్సరంలో ‘తామ్రపత్ర గ్రహీత’, ‘వివేకానంద సేవా అవార్డు’ను అందుకున్నారు. 1981వ సంవత్సరంలో భారత ప్రభుత్వం వారి ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని పొందారు. 1993వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన ‘లాంగ్కాప్’ గ్రామంలో గైడెన్లు మరణించారు.

మణిపూర్, నాగాలాండ్ ప్రభుత్వాల అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మరణానంతరం ‘బిర్సాముండ పురస్కారం’ వీరిని వరించింది. 1996 సెప్టెంబర్ 12వ తేదీన 1 రూపాయ విలువతో వీరి స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. నాగాలాండ్ స్త్రీ అలంకరణతో రాణి గైడెన్లు శోభాయమానంగా కనిపిస్తారు. ఈశాన్య భారతానికి, భారత నారీమణులకు గుర్తింపునిచ్చి గౌరవించిన తపాలాశాఖ అభినందనీయం.

2 comments

  1. రాణి గైడెన్లు కు శత కోటి వందనములు🙏

    ReplyDelete
  2. Trillions of salutes to greatest freedom fighter RANI GAIDINLU

    ReplyDelete