Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దుర్గాభాయి దేశ్ ముఖ్ జీవిత విశేషాలు - About Durgabai Deshmukh in Telugu - azadi ka amrut mahotsav

దుర్గాభాయి దేశ్ ముఖ్ పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, ఒక సామాజిక కార్యకర్త. వీరి గురించి తెలుగువారందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ...

durgabai deshmukh


దుర్గాభాయి దేశ్ ముఖ్ పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, ఒక సామాజిక కార్యకర్త. వీరి గురించి తెలుగువారందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909 న కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించింది. పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించింది. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌లో), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.
 
దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు ఏ మాత్రం ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా ఇచ్చింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. చిన్నపిల్లలతో ప్రత్యేకించి ‘బాలికా హిందీ ప్రచార సభ’ను ఒక చిన్న కుటీరంలో తన 12వ ఏట ప్రారంభించింది. హిందీ నేర్చుకోవడంలో ఎందరికో ప్రేరణగా నిలిచింది, హిందీ నేర్చుకోవడం యొక్క ఆవశ్యకతను తెలుగువారికి తెలిపింది.

దుర్గాభాయి ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించింది. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. దుర్గాభాయి దేశముఖ్ రాజకీయ నాయకురాలు కూడా భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు ప్రణాళికా సంఘం సభ్యురాలు. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది.

1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (Central Social Welfare Board - సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. వీరి స్వీయచరిత్ర భాషించిన శిలలు అన్న పేరుతో వెలువడింది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్1971 నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా వచ్చింది. 1975 సంవత్సరంలో భారతప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరం భర్త సి.డి.దేశ్‌ముఖ్ కూడా పద్మ విభూషణ్ పొందారు.

భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది. దుర్గాబాయ్ జ్ఙాపకార్థం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో విగ్రహంను స్థాపించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది. చైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడ్డ దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా జీవించి ఉన్నారు.

ఆమె అనుభవాలతో ‘స్టోన్స్‌ దట్‌ స్పీక్‌’ పేరిట (‘మాట్లాడే రాళ్ళు’ అని) ఒక పుస్తకం రాసారు. ఆ పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ – ‘‘ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి కాలం విలువను అర్థ చేసుకోగలిగిన వ్యక్తి, ప్రణాళికా బద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తి.. ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభ కారకాలనూ, మోహ కారకాలనూ జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకు రాగలడేమో కానీ, కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకు రాలేవు. అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగ రాస్తారు’’–అన్నారు.

No comments