Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రుక్మిణీ లక్ష్మిపతి జీవిత విశేషాలు - About Rukmini Lakshmipathi in telugu - azadi ka amrut mahotsav

ఉప్పుసత్యాగ్రహ ఉద్యమ నేపథ్యంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో అరెస్టు అయిన మొదటి మహిళ రుక్మిణీ లక్ష్మిపతి. వివిధ చారిత్రక ఆధారాల ప్రకారం ఉప్పు సత్యా...

Rukmini Lakshmipathi


ఉప్పుసత్యాగ్రహ ఉద్యమ నేపథ్యంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో అరెస్టు అయిన మొదటి మహిళ రుక్మిణీ లక్ష్మిపతి. వివిధ చారిత్రక ఆధారాల ప్రకారం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన తొలి భారతీయ మహిళ కూడా ఆవిడే. అంతే కాదు ఆమె తన బంగారు ఆభరణాలన్నింటినీ హరిజన సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చేశారు.

1892 డిసెంబర్ 6న భూస్వాముల కుటుంబంలో జన్మించిన రుక్మిణి లక్ష్మీపతి స్వాతంత్ర్య భావాలు కలిగిన మహిళా మూర్తి. నాటి కొచ్చిన్ రాష్ట్ర దివాన్ ఆమె సంరక్షకుడు. మద్రాసులో ప్రసిద్ధి చెందిన ఉమెన్స్ క్రిష్టియన్ కళాశాల మొదటి గ్రాడ్యుయేట్ బృందంలో ఆమె కూడా ఒకరు. ప్రజల బాధలకు స్పందించే ఆమె అభిప్రాయాల కారణంగా ఉదారవాదిగా పేరు గాంచారు. భార్యను కోల్పోయిన డాక్టర్ ఆచంట లక్ష్మీ పతి అనే వైద్యుడిని కులాంతర వివాహం చేసుకున్నారు. తర్వాత ఆయన ఆయుర్వేదం, మరియు భారతీయ ఔషధ వ్యవస్థల మీద దృష్టి పెట్టారు.

1920వ దశకంలో మహాత్మా గాంధీ, శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి, శ్రీమతి సరోజిని నాయుడు వంటి ప్రముఖ నాయకుల ద్వారా ప్రభావితురాలైన ఆమె స్వరాజ్య పోరాటం మరియు స్వదేశీ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. నూలు వడికేందుకు యువతను ప్రేరేపించడమే గాక, వాడకాన్ని సైతం ప్రోత్సహించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేందుకు మహిళలను ప్రేరేపించారు. విద్య ద్వారా మహిళల సాధికారత సాధ్యమౌతుందని త్రికరణశుద్ధిగా నమ్మి, అందుకోసం అవిశ్రాంతంగా శ్రమించడమే గాక భారత స్త్రీ మండల్ మరియు ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ వంటి సంస్థల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె సామాజిక సంస్కరణలను ప్రోత్సహించడమే గాక, బాల్యవివాహాల వంటి సామాజిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

నాటి కాంగ్రెస్ సభ్యురాలిగా స్వరాజ్య ఉద్యమం దిశగా యువతను సమీకరించేందుకు యూత్ లీగ్ ఆఫ్ కాంగ్రెస్ ను ఆమె నిర్వహించారు. 1926లో పారిస్ లో ఓటు హక్కు మీద జరిగిన అంతర్జాతీయ మహిళ సమావేశానికి హాజరు అయ్యేందుకు కాంగ్రెస్ ఆమెను నియమించింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో శ్రీమతి రుక్మిణి కీలక పాత్ర పోషించారు. 1930 జనవరి 26న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రకటించిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఎగరేశారు. అదే సంవత్సరం శాసన ఉల్లంఘన ఉద్యమంలోనూ పాల్గొన్నారు.

ఉప్పు మీద బ్రిటీష్ ప్రభుత్వ విధించిన పన్నులను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ చారిత్రక ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. 1930 మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకూ దక్షిణ గుజరాత్ లోని నవసరి జిల్లాలోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి తీరం వరకూ 24 రోజుల పాటు దండి యాత్రను చేపట్టారు. దేశంలోని తీర ప్రాంతాల్లో పలుచోట్ల ఇదే తరహా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ లో, తిరుచ్చి నుంచి వేదారణ్యం వరకూ నలుగురు మహిళలు సహా ఎంపిక చేసిన 99 మంది సత్యాగ్రహిలతో కలిసి శ్రీ రాజాజీ యాత్రను నిర్వహించారు. ఆ సమయంలో ఎంపిక చేసిన మహిళల్లో శ్రీమతి రుక్మిణి కూడా ఒకరు. గాంధీజీ దండి యాత్రలో మహిళా సత్యాగ్రహులు లేరు. అంతే కాదు మరెక్కడా కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనలేదనే విషయాన్ని మనందరం గుర్తు పెట్టుకోవాలి.

ఈ యాత్రను అడ్డుకోవాలని బ్రిటీష్ పాలకులు నిశ్చయించుకున్నారు. యాత్రలో పాల్గొన్న వారి మీద స్థానిక కమిషనర్ లాఠీ చార్జ్ చేయించాలని అదేశించారు. ఇలాంటి వాటన్నింటికీ భయపడకుండా, ధైర్యంగా శ్రీమతి రుక్మిణి లక్ష్మీపతి ముందుకు సాగారు. ఆ సందర్భంలో ఇతర మహిళా సత్యాగ్రహులను రక్షించేందుకు లాఠీదెబ్బలు కూడా తిన్నారు.

సత్యాగ్రహులకు ఆహారాన్ని అందిస్తే కఠిన శిక్షలు తప్పవని ఆయా గ్రామాల ప్రజలను పాలకులు హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీమతి రుక్మిణి లక్ష్మీపతితో పాటు ఇతర సత్యాగ్రహులను వేదారణ్యంలో అరెస్టు చేశారు. అనంతరం ఆమె ఒక ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. అనంతరం 1937లో ఆమె మద్రాస్ శాసనసభ మొదటి మహిళా సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గానూ సేవలు అందించారు.

మహాత్మ గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని కూడా ప్రారంభించారు. దీని ప్రకారం ఆయన ఎంచుకున్న సత్యాగ్రాహి పట్టణంలోని ఒక ప్రముఖ ప్రదేశంలో నిలబడి బ్రిటీష్ పాలనను నిరసిస్తూ ఓ పంక్తిని చదవాలి. అరెస్టు చేసిన తర్వాత సత్యాగ్రాహి నేరాన్ని అంగీకరించాలి. అలా మద్రాసు కోసం ఎంపిక చేసిన 21 మంది సత్యాగ్రహుల్లో శ్రీమతి రుక్మిణి లక్ష్మీపతి ఒకరు. తర్వాత ఆమె అరెస్టు అయ్యారు. 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన తర్వాత ఆయన కేబినెట్ మొదటి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయుర్వేదం మరియు భారతీయ వైద్య విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో గణనీయమైన పాత్ర పోషించారు. ఆగస్ట్ 6, 1951అనారోగ్యంతో స్వర్గస్తురాలయ్యారు.

మన స్వరాజ్య పోరాటంలో భాగంగా దాదాపు ప్రతి నగరం మరియు పట్టణంలో వేలాది నిరసనలు జరిగాయి. ఆ నిరసనలకు నాయకత్వం వహించింది సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన సామాన్య ప్రజలే. దేశాన్ని విదేశీ పాలకుల కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు వారంతా ముందుకు వచ్చారు. అనుపమాన శౌర్య పరాక్రమాలు, దేశభక్తి, చిత్తశుద్ధితో భారత స్వరాజ్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన అలాంటి మహనీయుల గాథలను గుర్తుంచుకుని వారికి నివాళులు అర్పించాలి.

No comments