గురు పౌర్ణమి - గురుర్బ్రహ్మ శ్లోకం ఎలా వచ్చింది
గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
అయితే ఈ శ్లోకం ఎందులోది?
ఏ సందర్భంలోది?
ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా?
ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.
కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.
ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.
కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.
ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.
అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.
ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ అంకితం.... -తాడేపల్లి హనుమత్ ప్రసాద్
Guru Purnima (గురుపౌర్ణమి) (గురు పౌర్ణమి)
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
Guru Purnima Significance in Telugu, గురు పౌర్ణమి విశిష్టత, గురు పౌర్ణమి శుభాకాంక్షలు, Guru Purnima Telugu, Guru Purnima 2025 quotes Telugu, megaminds, గురు పౌర్ణమి 2025, Vyasa Purnima 2025, Ashada Purnima 2025
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.