గురు పౌర్ణమి ఎందుకు జరుపుకోవాలి - About Vyasa Purnima in Telugu
భారత దేశములో ఆషాడ పూర్ణిమ నుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు. పూర్వకాలములో శిష్యులు, గురువులు కూడా ఈ నాలుగు మాసములు వర్షాకాలము అయినందున, వ్యాధులు ప్రబలే కాలము అయినందున ఎలాంటి పర్యటనలు, దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు. అప్పుడు శిష్యులు గురువు దగ్గర విజ్ఞాన సముపార్జన చేసేవారు. ఈ జ్ఞానసముపార్జన లో మొదటి రోజు గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు. ఈ సంప్రదాయమే కాలక్రమేన "గురుపూర్ణిమ" గా మారినది అని చరిత్ర చెబుతోంది.
ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసుల వారు పుట్టిన రోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ అంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు'- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పదై ఉండాలి? ఆ విధంగా అని 'నిజమే!' అని నిరూపించుకొన్న కవివృషభుడు వేదవ్యాసుడు. ఆ ఇతిహాసం మహాభారతం. శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియజెబుతోంది.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.
వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలను అందించినవారే వ్యాసులవారు.
వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.
గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని, సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.
"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భారతీయ సంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.
గురు సందేశము: వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది
వ్యాసుని జన్మ వుత్తాంతము: వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్లు ఎన్నోమార్పులు చేసి చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది. పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు.
ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పడెస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు , వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు ని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది స్నానానికి అక్కడ కు వస్తాడు. పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు. ప్రతిరోజు వార, తిది, నక్షత్రాలను తన అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు. ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా..
ఆ నియమాలు: దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి, బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి, వదువు కన్య అయి ఉండాలి, వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి, లంక లో పెండ్లి జరగాలి, పిండోత్పత్తి ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి. ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి, బ్రహ్మసమానుడై ఉంటాడని అలోచిస్తూ నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి... తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన కలిగి చుట్టు చూడగా అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, ఆ రతి వెనక ఉన్న జన్మరహస్యాన్ని వివరిస్తాడు.
అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది ... అని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గడపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. నదిలో లంక ఉండనే ఉన్నది , బ్రాహ్మణునికై బ్రహ్మదేవుని రమ్మని కోరగా తన శక్తి స్వరూపాలతో పుట్టె బిడ్డకు (తన డిటో) తాను సహకరించే ప్రశ్నేలేదని ఖరాకండిగా చెప్పడంతో, నారదముని సహయము తో వివాహం జరిపించి ఆ మహత్తర కార్యానికి నాందిపలికేరు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
భారతంలో వ్యాసుని పాత్ర: వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరవాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరవాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
ఆ తరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరవాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరవాత లక్క ఇంటి దహనం తరవాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలదని సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరవాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు. -తాడేపల్లి హనుమత్ ప్రసాద్
Guru Purnima (గురుపౌర్ణమి) (గురు పౌర్ణమి)
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
Guru Purnima Significance in Telugu, గురు పౌర్ణమి విశిష్టత, గురు పౌర్ణమి శుభాకాంక్షలు, Guru Purnima Telugu, Guru Purnima 2025 quotes Telugu, megaminds, గురు పౌర్ణమి 2025, Vyasa Purnima 2025, Ashada Purnima 2025
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.
I feel proud to become a member of meghaminds, because our great indian history hidden by our great leaders, that is very unfortunate.
ReplyDelete