Page Nav

HIDE

Classic Header

{fbt_classic_header}

Top Ad

Popular Posts

Latest Posts

latest

దువ్వూరి సుబ్బమ్మ - మహిళా స్వాతంత్ర్య వీరాంగన - About Duvvuuri Subbamma in Telugu

మొట్ట మొదట 1920 లో గాంధీగారి పిలుపు రాగానే స్వాతంత్ర్య సమరములో కురికిన ప్రథమ ఆంధ్ర స్త్రీ దువ్వూరి సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు తూర్ప...

మొట్ట మొదట 1920 లో గాంధీగారి పిలుపు రాగానే స్వాతంత్ర్య సమరములో కురికిన ప్రథమ ఆంధ్ర స్త్రీ దువ్వూరి సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో 1880 సంవత్సరం నవంబరు నెలలో మధ్యతరగతి వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మల్లాది సుబ్బావధాని దంపతులకు జన్మించింది. ఈమె భర్త దువ్వూరి వెంకయ్య. ఈమెకు బాల్య వివాహం జరగడం, భర్తను చిన్నతనంలోనే కోల్పోయి బాల్య వితంతువు అయ్యింది.

భర్త మరణానంతరము ఆ రోజుల ఆచారమును బట్టి ఆమెకు కేశములు తీసివేసి తలకు ముసుగు కప్పినారు. కాని, సుబ్బమ్మ తనయొక్క వేషాన్ని గురించి సిగ్గు పడలేదు. ఆమెకు బాహ్య ఆలంకారాలపై ఆసక్తి చూపలేదు. వేదాంతురాలు, ఆధ్యాత్మికచింతగల వనిత. చక్కగా అన్ని గ్రంథములు చదువుకొన్నది. ఇటువంటి స్త్రీ స్వాతంత్ర్య రంగములోనికి ఉరకడం ఎంతో ఆశ్చర్యము. ఆమె ఎన్నో లాఠీ దెబ్బల కోర్చింది. జైలుకు పలుమార్లు వెళ్ళింది.

కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడింది. ఆమె వేదికమీద నిలబడి మాట్లాడినపుడు ఆమెను, ఆమె వేషమును చూచి నవ్వినవాడు ఒక్కడూ కనిపించడు. ఆమె అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే, ముగ్ధులై వినేవారు. ఆమె కంఠము ఎంత పెద్దదంటే ఈ రోజులలో వలె లౌడ్ స్పీకర్లు లేని కాలములో 5, 6 వేల మంది హాజరయిన మహాసభలో అందరికీ వినిపించేటట్లు అందరికి నచ్చచెప్పే విధంలో మాట్లాడి, వారిని తన వైపుకు, తన ఉద్యమము వైపుకు మళ్ళించుకొనేది.

ఆమె 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది. అంతే కాకుండా ఆమె ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నది. ఒక సన్నివేశంలో ఆంగ్లేయులు ఆమెను నిర్భంధించి, క్షమాపణ చెబితే విడిచి పెడతామనప్పుడు "నా కాలి గోరు కూడా అలా చేయదు" అని నిస్సంకోచంగా చెప్పిన ధైర్యవంతురాలు. ఒకసారి పెద్దాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మ అనే వ్యక్తి వన భోజనాల పేరుతో ఒక రాజకీయ సభ ఏర్పాటు చేసిందని అందులో సుబమ్మ పాల్గొటుంటున్నట్లు ఆంగ్లేయ పోలీసులు తెలుసుకొని అక్కడ దాడి చేశారు. దీనికి సుబమ్మ గారు ఆగ్రహించి వారిపై విరుచుకుపడింది, ఆమె ధైర్యానికి చూసి మిగిలిన వారు ధైర్యం తెచ్చుకొని మిగతా వారు కూడా బ్రిటిష్ రక్షక దళాలపై విరుచు పడ్డారు.

ప్రభుత్వమువారు స్వాతంత్ర వీరులను పట్టుకొనడానికి వచ్చినప్పుడు వారిని రహస్యముగా వంట ఇంటిలో పొగగూళ్లలో చాక చక్యముగా దాచేవారు. పైగా కాంగ్రెసు రహస్య దళములో చేరి, ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారి చర్యలను నాయకులకు తెలియ చెప్పేది. ఆమె అఖిలభారత కాంగ్రెసు సంఘములో పదు నాలుగు సంవత్సరములు సభ్యురాలుగా ఉండి, ఆంధ్రలోనేకాక భారతదేశములో గొప్ప వనితగా పేరు పొందినది.

సుబ్బమ్మ మహాత్మా గాంధీ గారి ఆదేశాలపై ఖద్దరు కట్టింది, ఖద్దరు చరఖా మీద నేసి ఊరూరా తిరిగి అమ్మింది. ఆమె సనాతన విద్యాలయమును స్థాపించినది. అందు బిడ్డలకు ఉచిత భోజన వసతులు కూడా కల్పించినది. కాకినాడలో 1923లో జరిగిన కాంగ్రేసు సభలో వీరికి 'దేశ బాంధవి' అనే గౌరవం ఇచ్చారు. ఈ విధముగా దువ్వూరి సుబ్బమ్మగారు ఆంధ్రదేశమునకే కాక భారతదేశమునకు చేసిన సేవ అమోఘము. 1964 సంవత్సరం మే 31 తేదీన ఈమె పరమపదించింది. ఎందరో మహిళలు దేశసేవలో‌ జీవితాలను త్యాగం చేశారు. ఎప్పుడైనా మీరు రాజమండ్రి వెళితే కోటిపల్లి బస్టాండు దగ్గరలోని స్వాతంత్ర సమరయోధుల పార్కులోని దువ్వూరి సుబ్బమ్మ విగ్రహం వుంది‌ చూడవచ్చు. -రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..