Type Here to Get Search Results !

పొణకా కనకమ్మ జీవిత విశేషాలు - About Ponaka Kanakamma in Telugu

పొణకా కనకమ్మ గారు నెల్లూరు వాస్తవ్యురాలు. ఈమె తండ్రి మరుపూరు కొండారెడ్డి. భర్త సుబ్బరామరెడ్డి. ఈమె గొప్ప దేశభక్తురాలు, భారత స్వాతంత్య్ర సమరములో ముఖ్య పాత్ర వహించింది. సంఘసంస్కర్త స్త్రీ విద్యకై ఎక్కువ పాటుపడింది. గాంధీగారి ఉప్పు సత్యాగ్రహ పిలుపు వినగానే దేశములో పురుషులు కన్నా స్త్రీలే ఎక్కువ ఉద్రేక పూరితులై ఈ ఉద్యమములో పాల్గొన్నారు.

అటువంటి మహిళలలో పొణకా కనకమ్మ గారు ఒకరు. ఆమె ఒకరేకాక, ఆమె కుటుంబమంతా కూడా కాంగ్రెసు ఉద్యమములో పాల్గొని, దేశ హితకార్యమును సాగించారు. ఈమె ఉప్పు సత్యాగ్రహ సందర్భములో రెండు పర్యాయములు కారాగార శిక్ష అనుభవించారు. ఈమె వహించిన పాత్రను మెచ్చి, ఈమెకు కాంగ్రెస్‌ కార్యవర్గ సంఘములో సభ్యత్వమిచ్చారు. ఈమె అఖిలభారత కాంగ్రెసు కమిటీ సభ్యురాలుగాను, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘ సభ్యురాలు గాను, ఉపాధ్యక్షురాలుగాను పని చేసినారు.

పొణకా కనకమ్మ ఆంగ్లభాషలో మాట్లాడగలిగేవారు పైన చెప్పినట్లు కనకమ్మ గారు రాజకీయరంగమున మాత్రమే పరిశ్రమించలేదు. ఆమె బాలికల కొరకు నెల్లూరులో ఒక పాఠశాలను స్థాపించారు. దానికి కస్తూరిబాగాంధీ పేరుతో కస్తూరిబా పాఠశాలయని నామకరణము చేశారు. ఈనాడు ఆ పాఠశాల జూనియర్ కళాశాలగా మారింది. కనకమ్మగారు సారస్వత క్షేత్రమున కూడా కృషి సలిపినారు. వీరు కొంతకాలము శ్రీ రమణమహర్షి యాశ్రమమున నివసించి శ్రీరమణ బ్రహ్మాంజలి యను తొమ్మిది సీసపద్యములు రచించి, తన ఆధ్యాత్మిక చింత ను విశదపరచింది. శ్రీరామయోగి, గురుదేవుడు అను రెండు జీవిత చరిత్రలను కూడ ప్రచురించారు.

ఈమె ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో చేరి కవయిత్రీ ద్వయ మని పేరు తెచ్చుకొని, కవిత్వము వ్రాశారు. కలిసి రాజకీయములలో పనిచేశారు. ఈ విధముగా జంటగా ప్రచురించిన వాటిలో 'ఆరాధన' అను గ్రంథము చక్కని కావ్యము. వారు 'గీత'ను కూడా కొంచెము వరకు తెలుగులో అనువదించారు. పురుషులు చాలామంది గీతను అనువాదము చేసిన వారున్నారు. కాని స్త్రీలలో ఇట్లు 'స్తుతిపాత్రముగ, సుకరముగ, సుసంగ్రహముగ, సులలితముగ గీతానువాదము చేసినవారు కనిపించరు. అందుకని వారిదే ప్రథమ స్థానమని ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు చెప్పారు.

కనకమ్మ భర్తగారైన పొణకా సుబ్బరామరెడ్డిగారు ఆగర్భశ్రీమంతులు. వీరికుటుంబము వారు అనాదిగా దానధర్మములు చేసేవారను పేరు, వీరికృషి ఫలితముగానెల్లూరులో జమీన్ రైతు పత్రిక స్థాపింపబడింది. ఇంతటి ధనవంతురాలయ్యి కూడా కనకమ్మ గారు నిరాడంబరజీవి. తెల్లటి ఖద్దరు వస్త్రములనే ధరించేది. ఎటు వంటి భూషణములు దాల్చక విశుద్ధమైన అంతరంగమే ఈమెకు భూషణముగా ప్రవర్తించినది. ఈ విధముగా వారన్ని విధముల ఆంధ్ర నారీలోకమునకు ఆదర్శ ప్రాయురాలుగా నిలబడిపోయారు.

మన ఆంధ్రదేశములో స్వాతంత్రోద్యమములో పాల్గొనిన మహిళ. ఈవిధముగా ఆంధ్రదేశ చరిత్రలో స్త్రీ ముఖ్య పాత్ర నాడు నేడు కూడ వహిస్తున్నది. ఇలా భారత స్వాతంత్ర్య సమరంలో మన తెలుగునాట నుండి అనేక మంది మహిళలు పాల్గొన్నారు...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.