Type Here to Get Search Results !

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నినాదాల పాత్ర - Famous Slogans of Indian Freedom Fighters


భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నినాదాల పాత్ర: 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంతో మొదలయిన మన స్వతంత్ర పోరాటం, భారతదేశం యొక్క స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాట ప్రయాణం చాలా శ్రమతో కూడుకున్నది మరియు సుదీర్ఘమైనది. ఒక శతాబ్దానికి పైగా (1857-1947) కష్టపడిన తరువాత, భారతీయులైన మన స్వేచ్ఛ స్వాతంత్ర్యంను తిరిగి పొందాము. వేలాది మంది అమాయక భారతీయులు ఆహుతి కాబడిన జలియన్ వాలా బాగ్ మారణహోమాన్ని మనం ఎలా మరచిపోగలం? వందలాది మంది ధైర్య సాహస సమరయోధులు స్వాతంత్ర్యం సాధించడానికి తమ రక్తాన్ని, ప్రాణాన్ని త్యాగం చేశారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు కావొస్తున్న సమయంలో, ఇంకా మనం మన స్వాతంత్ర్య సమరయోధుల శక్తివంతమైన మాటలు, నినాదాలు మనకు ప్రేరణ ఇవ్వడంలో ఎప్పుడూ విఫలం కావు. వారు అగ్నిని వెలిగించి సమర జ్వాలలయ్యారు మన మాతృభూమి కోసం.

ఈ నినాదాలలోకి వెళ్ళేముందు భారతదేశంలో రాజుల యుద్ధాలు చేసుకునే సమయంలోనే ఎన్నో రణనినాదాలు, అరుపులతో, డమరుక, శంఖ నాదాలతో ఉత్సాహాన్నిచ్చే ఎన్నో గోలలు చేస్తూ యుద్ధానికి బయలుదేరేవారు... అటువంటి వాటిలో ప్రముఖమైన రణనినాదం హరహర మహాదేవ్... శివాజీ సమయంలో జై భవాని - వీర శివాజీ.. ఝాన్సీ లక్ష్మి బాయి సమయంలో కూడా హరహర మహాదేవ్.. జై భవాని... జైజై రాణి ఝాన్సీ రాణి... ఇలా ఎన్నో నినాదాలు మన రాజులు పాలించే సమయంలోనే ఉత్సాహం కోసం రణ‌నినాదాలు చేసేవారు. అలాంటి నినాదాలే 1857 తరువాత ఎన్నో నినాదాలు ద్వనించారు మన స్వతంత్ర వీరులు... అలా ద్వనించి స్వాతంత్ర్య గర్జన చేస్తున్న సమయంలో చేసిన రణనినాదాలు మనం కొన్ని చూద్దాం ప్రేరణ పొందుదాం...

వందేమాతరం - బంకింబాబు: 1857 లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొత్తం అఖండ భారతదేశంతో పోలిస్తే బెంగాల్ చాలా ప్రశాంతంగా వుంది. అప్పటికే బెంగాల్ ప్రజలలో ఆంగ్లేయులు మనకన్న గొప్పవాళ్ళు అనే భావన ప్రజల్లో పెరిగిపోయింది. ఆ సమయంలో బంకింబాబు కవోష్ణరక్తం ప్రవహిస్తున్న యువకుడిగా ఉండేవాడు. అప్పుడు తన తాత చెప్పిన కథలు తనను మేల్కొల్పేవి. సన్యాసుల పోరాటాలు భారతమాత వైభవం ను బంకింబాబు దర్శించేవాడు. సందర్బంలోనే సన్యాసుల సింహనాద మైన వందేమాతరం ను ఆనందమఠంలో రచించడం జరిగింది. సన్యాసుల నినాదమైన వందేమాతరాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే ఈ దేశాన్ని పరపీడనం నుండి, మన మతృభూమిని ఈ విదేశీయుల దాస్యశృంఖలాల నుండి సంకెళ్ళ నుండి తొలగించడమే లక్ష్యంగా మఠాలలో, పీఠాలలో దేవీదేవతలతో పాటు మాతృభూమిని ఒక దుర్గలా, సరస్వతిలా, అపర కాళిలా ఈ సౌశీల్యమైన భారతదేశాన్ని సన్యాసులు భావించారు అందుకే ఆ సింహ నాదమైన వందేమాతరాన్ని జాతిలో జడత్వం నుండి జాగృతం వైపు మరల్చే ఒక నినాదంగా ఆనందమఠంలో తీసుకున్నారు సఫలీకృతులయ్యారు.  అలా ఆనందమఠం రచించిన ముప్పై సంవత్సరాల తరువాత అది జాతీయవీరులకు రణనినాదమై దేశ స్వాతంత్ర్ర్యానికి మూల నినాదంగా మారింది.

ఇంక్విలాబ్ జిందాబాద్ - షహీద్ భగత్ సింగ్: ఈ నినాదాన్ని ఉర్దూ కవి మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా హస్రత్ మోహనిబ్ రూపొందించారు, అయితే అత్యంత ప్రభావవంతమైన భారత విప్లవకారులలో ఒకరైన భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ దీనిని ప్రాచుర్యం లోకి తెచ్చారు. భగత్ సింగ్ 23 సంవత్సరాల వయస్సులో దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినవాడు. "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదానికి అర్థం "విప్లవం దీర్ఘకాలం వర్ధిల్లాలి". ఈ నినాదం స్వాతంత్ర్య పోరాటం యొక్క ణనినాదాలలో ఒకటిగా మారింది మరియు భారత యువతను స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనడానికి ప్రేరేపించింది. ఇది వారిలో దేశభక్తి భావనను మరియు స్వాతంత్ర్య అనుకూల భావనను మేల్కొల్పింది.

జై హింద్ - నేతాజీ: భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ‘జై హింద్’ నినాదం తరచూ ఉపయోగించబడింది. యువతలో జోష్‌ను పెంచడానికి 1907 లో షెన్‌బగరామన్ పిళ్లై చేత "జై హింద్" అనే పదం ఉపయోగించబడింది. ఆ తరువాత ఈ నినాదాన్ని 'నేతాజీ' సుభాస్ చంద్రబోస్ స్వీకరించారు. అనతి కాలంలోనే నేతాజీ ద్వారా ఈ నినాదం స్వాతంత్ర్య సమరయోధుల అధికారిక నినాదంగా మారింది. ఇప్పటికీ రాజకీయ నాయకులు దేశభక్తులు తరచూ ఈ నినాదాన్ని ఉపయోగిస్తారు.

సత్యమేవ జయతే - మదన్ మోహన్ మాలవీయ: ఈ నినాదం యొక్క మూలం మాండకో ఉపనిషత్తులోని ప్రసిద్ధ మంత్రంలో ఉంది. సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది అనేది ఈ పదబంధానికి అక్షరాలా అర్ధం. ఇది భారతదేశం యొక్క జాతీయ నినాదంగా స్వీకరించడమే కాక, మన జాతీయ చిహ్నం మీద కూడా వ్రాయబడింది. 1918 లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో తన అధ్యక్ష ప్రసంగంలో ఈ నినాదాన్ని ఉపయోగించిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ. మాలవీయ గారు బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు. ఈ నినాదం ప్రజల్లోకి అనతికాలంలో లోనే చేరింది దేశవాసులంతా సత్యాన్నే అంటిపెట్టుకుని స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు.

స్వరాజ్యం నా జన్మహక్కు - బాల గంగాధర్ తిలక్ : కాకా బాప్టిస్టా పలికిమ ఈ నినాదాన్ని బాల్ గంగాధర్ తిలక్ స్వీకరించి స్వాతంత్ర్య పోరాటంలో దేశప్రేమికుల గుండెల్లో స్వతంత్ర జ్వాలలురేపాడు.  ఈ నినాదం దేశ ప్రజలను స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ప్రేరేపించడమే కాక, వేలాది మంది ప్రజల హృదయాల్లో దేశంపై ప్రేమను రేకెత్తించింది.

మీరు రక్తాన్నివ్వండి నేను‌ మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను - నేతాజి:  భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భారత జాతీయ సైన్యంలో చేరాలని భారత యువతను కోరుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ నినాదాన్ని ఉపయోగించారు. ఇది మాతృభూమి కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి వేలాది యువ మనస్సులను ప్రేరేపించింది. ఎన్నో వేలమంది యువతీ యువకులు ఈ నినాదం రణనినాదమై ఒక లావాలా యువతను స్వతంత్ర కాంక్ష వైపు పరుగులుతీయించింది.

దుష్మాన్ కి గోలియోన్ కా హమ్ సామ్నా కరెంగే, ఆజాద్ హీ రహీన్ హైన్, ఆజాద్ హీ రహెంగే - చంద్ర శేఖర్ ఆజాద్ : మేము శత్రువు యొక్క బుల్లెట్లను ఎదుర్కొంటాము, స్వేచ్ఛా, స్వాతంత్ర్యలతో జీవిస్తాము అంటూ చంద్ర శేఖర్ ఆజాద్ నినదించాడు. వందలాది మంది నిరాయుధ అమాయక ప్రజలను చంపిన జలియన్ వాలా బాగ్ మారణకాండ జరగడం చూశాక ఆజాద్ పై తీవ్ర ప్రభావం చూపింది, ఈ నినాదాన్ని ఉపయోగించుకుని తన దేశం కోసం పోరాడటానికి తీవ్రమైన భావలతో, అనేకమంది విప్లవకారులకు మార్గదర్శనం చేస్తూ ఈ రణనినాదాన్ని పలికేవారు...

క్విట్ ఇండియా - సైమన్ గో బ్యాక్ - యుసఫ్ మెహరలి:  సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం దేశానికి అంతిమంగా ఇచ్చిన ఒక పిలుపు "క్విట్ ఇండియా". ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి) చేసిన బలమైన మరియు అత్యంత గంభీరమైన విజ్ఞప్తి, "క్విట్ ఇండియా" బ్రిటిష్ వారిని ఒక్కసారిగా మరియు స్పష్టంగా భారతదేశాన్ని విడిచిపెట్టమని దేశప్రజలందరిచేత పలికించింది.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంతటి ప్రజాదరణ పొందిన నినాదం. ఇది రూపొందించినది మహాత్మా గాంధీ కాదు. "క్విట్ ఇండియా" మరియు "సైమన్ గో బ్యాక్" నినాదాలు రెండూ భారతదేశ స్వేచ్ఛా, స్వాతంత్ర్య పోరాటంలో అంతగా మనకందరికి తెలియని స్వాతంత్ర్య సమరయోధుడు యూసుఫ్ మెహరల్లీ చేత ఈ రెండు నినాదాలు ముంబాయి లో‌ రూపొందించబడ్డాయి. ఈ రెండు ఉద్యమాలే కానీ‌ స్వతంత్ర సమరయోధులంతా నినాదాలుగా పలికేవారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమం లో వచ్చిందే డూ ఆర్ డై నినాదం కూడా.

డూ ఆర్ డై - గాంధీజీ : 1942 ఆగస్టు 9 న బొంబాయి సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించబడింది. ఇది భారీ నిరసనలతో భారతదేశంలో బ్రిటీష్ పాలనను తొలగించాలని మరియు అంతం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ సమైక్య ప్రసంగాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్ర్య పోరాటం చేస్తూ సమరయోధులందరూ ఉండగా గాంధీ‌ ఇచ్చిన‌ పిలుపు డూ ఆర్ డై... ఇది ఉద్యమ కారుల్లో స్పూర్తిని‌ నింపింది కాని ఈ‌‌ క్విట్ ఇండియా ఉద్యమం మద్యలోనే గాంధీజీ ‌నీరుగార్చేశారు... 

జల్ జంగిల్ జమీన్ - కొమురం భీం: హైదరాబాదు సంస్థానం లో 7 వ‌ నవాబు నిజాం అలిఖాన్ ఆగడాలకు, దాష్టికాలకు ఎదురునిలిచి.. నీటి కోసం అడవి కోసం భూమి కోసం నినదించిన వ్యక్తి కొమురం భీం.. ఈ నినాదం ఆదిలాబాదు అసీఫాబాద్ అడవుల్లో దావాళంలా వ్యాపించి స్వతంత్ర కాంక్ష రగిలించిన నినాదం... జల్ జంగిల్ జమీన్...

ఈ నినాదాలన్నిటితో పాటుగా ఈ దేశాన్ని తల్లిగా భావించి దేశ ప్రజలంతా నినదించిన ఒకే ఒక నినాదం భారత్ మాతా కీ జై. ఇలాంటి ఇంకా‌ఎన్నో నినాదల పాత్ర భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మన వీరులు చేసిన‌‌ నినాదాలు శతృహృదయంలో భీతిని కలిగించి మాతృభూమిని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేశాయి... జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.