Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యమ నియమాల గూర్చిన విశ్లేషణ - megaminds

అంతర్జాతీయ యోగా దినోత్సవం యమ నియమాల గూర్చిన విశ్లేషణ, జూన్ 21, ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా..: క్రీ.పూ. 500 సం॥ల కాలంలోనే పతంజలి మహర్...

అంతర్జాతీయ యోగా దినోత్సవం

యమ నియమాల గూర్చిన విశ్లేషణ, జూన్ 21, ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా..: క్రీ.పూ. 500 సం॥ల కాలంలోనే పతంజలి మహర్షి యోగ సూత్రములు వ్రాశాడు. యోగను అష్టాంగ యోగం అన్నాడు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాభ్యాసం చేయించే యోగ గురువులు ఆసనం నుంచి మొదలు పెడ్తారు. మొదటి రెండు సూత్రాలైన యమ నియమాలు కేవలం కొంత సమయం పాటు చేసేందుకు పరిమితమైనవి కావు. ఇవి జీవితకాలం పాటు సాధన చేయాలి. నియమం వ్యక్తి సంస్కారాలకు సంబంధించింది. అలా పొందిన సంస్కారాన్ని సమాజం కోసం వెచ్చించడం 'యమ' సూత్రం మనకు ప్రబోధిస్తుంది. 'యోగ' అంటే కలయిక అని అర్ధం. భారతీయ చింతన ప్రకారం వ్యక్తి, కుటుంబం, సమాజం వేరుకాదు. అన్ని వ్యవస్థలు ఏకకేంద్రీకృత వృత్తంతో సమన్వయింపబడి వుంటాయి. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం, సృష్టి, పరమేష్టిల మధ్య సమన్వయానికి ఉద్దేశించింది యోగ.


‘అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచర
తత్పదం దర్శితం యేన తస్మశ్రీ గురువేనమః'
(గురువు వద్ద విద్యనభ్యసించిన శిష్యుడు గురువుకు సమర్పించే గురుదక్షిణ పై శ్లోకం. వ్యష్టి నుంచి పరమేష్ఠిని దర్శింపచేసేవాడే గురువు. దీన్నే ఏకాత్మ జీవన దర్శనం అన్నారు).


నియమంలో ఐదు విషయాలున్నాయి:
1) శౌచం: శౌచం అంటే శుభ్రత, బాహ్యంగా కన్పడేది పరిశుభ్రత, అంతరంగికంగా కన్పడేది పవిత్రత, పరిశుభ్రత, పవిత్రత కలిస్తే శౌచం. పరిశుభ్రత దైవత్వంతో సమానమన్నారు. బయట నుంచి వచ్చినపుడు కాళ్ళు కడుక్కోవడం, బట్టలు మార్చుకోవడం, స్నానం చేసి అన్నం వండడం, వడ్డించడం, తినడం యివన్నీ మన సంస్కృతిలో భాగాలే. మన పెద్దలు వంట చేస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ వంట చేసేవారు. ఆ తరహా ఆహారంలో ఓ శుచి, శుభ్రత, పవిత్రత వుంటాయి. మనసును కూడా పవిత్రంగా వుంచుకోవాలి. చెడు భావనలను రానీయకూడదు. వీటితో బాటు అర్ధ శౌచం చాలా ముఖ్యమన్నాడు మనువు, మనం సంపాదిస్తున్న ధనం కూడా నీతి నిజాయితీలతో కూడినదై వుండాలి. సంపాదించిన ధనం అవినీతి సొమ్ము అయితే దాని విష పరిణామాలు ఆ ధనం చేరుకున్న చోటల్లా వుంటాయన్నాడు మనువు.

2) సంతోషం: సంతోషం అంటే తృప్తితో వుండడం. నాకున్న వనరులు యివి. నాకున్న సాధనాలు యివి. నేను దీనిని స్వీకరిస్తున్నాను. సుఖం వేరు, సంతోషం వేరు. కోరికలు పెంచుకునే కొద్దీ సంతోషం వస్తుందనుకోవడం తప్పు. చాలమంది తాము చాలా కష్టపడ్డామని, తమ పిల్లలు కష్ట పడడం తమకిష్టం లేదని, అందుకే వారికన్నీ అమరుస్తున్నామని అంటుంటారు. అది సరికాదు. కష్టపడడం తప్పు కాదు. నాకున్న దాంతో తృప్తి పడడం అంటే, యింక అభివృద్ధి చెందడం ఆపేస్తామని కాదు. ఉన్న స్థితి నుంచి వికాసం చెందేందుకు కష్ట పడడం, అందుకు సంకోచం లేకుండా ఉండడం. 11 రూ॥ల వేతనం తెచ్చుకునే స్థితి నుంచి బిర్లా ఓ గొప్ప పారిశ్రామిక వేత్తగా ఎదిగి అనేక పరిశ్రమల్లో వేలమందికి ఉద్యోగాలివ్వగలగడం వెనుక ఆయన మొదట్లో తన స్థితికి నిరాశ చెందకుండా తృప్తిపడి, అక్కడ నుంచి కష్టపడి విజయం సాధించడమే కారణమవుతుంది.

3) తపం: తపం అంటే వేడెక్కించడం. మనం శారీరకంగా, మానసికంగా కూడా తపించాలి. శారీరక శ్రమ ద్వారా శరీరాన్ని అనుకూలం చేసుకోవాలి. మన మాటల్లో ప్రసన్నత వుండాలి. కాఠిన్యం వుండకూడదు. మృదుత్వం వుండాలి. ఈ తరహా సాధన తపమవుతుంది. మనసులో ప్రసన్నత వుండాలి. రాగద్వేషాలొస్తూంటాయి. మాటలు ద్వంద్వంగా వుండకూడదు. మాట నిజాయితీగా వుండాలి. పెద్దల మాట వినాలి వారిని అనుసరించాలి. వాళ్ళు చూపిన మంచిపద్ధతులు అవలంభించాలి. ఓ బంగారం బిస్కట్ను కరిగించి పోత పోస్తే గాని ఓ ఆభరణం తయారవదు. అలాగే వ్యక్తి కూడా తన్నుతాను మలుచుకునేందుకు, సమాజానికి ఉపయోగపడేందుకు తపించాలి.

4) స్వాధ్యాయం: స్వాధ్యాయం అంటే స్వీయ అధ్యయనం. ఆత్మ సర్వేక్షణ, విషయ విశ్లేషణ చేయడం. పలు విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం. స్వాధ్యాయం లేకపోతే మనోవికాసం జరుగదు. పెద్దల నుంచి విషయాలను సంగ్రహించడం చేయాలి. స్వాధ్యాయ లేకపోతే ప్రగతి వుండదు. మనసులోని భావాలను సరిచేసుకుంటుండాలి. ధర్మాధర్మ విచక్షణ, సత్యాసత్య విచక్షణ, ఏది అశాశ్వతం, ఏది శాశ్వతం అన్న విచక్షణ అవసరం.

5) ఈశ్వర ప్రణిధానం: మనం చేసే పని వల్ల వచ్చే ఫలితం ఈశ్వరుడి కృపవల్లనే సాధ్యమవుతుందని భావించడం. ఏదైనా పనిలో జయం వస్తే అంతా నావల్లే జరిగింది అంటాం. అపజయం వస్తే కారణాలు వెతుకుతుంటాం. చేస్తున్న పనులన్నీ నా వల్ల జరుగుతున్నాయనుకోవడం కంటే అంతా శ్యామ ప్రేరకమే అనుకొని చేయడం వల్ల ఫలితం ఎలా వచ్చినా దాన్ని స్వీకరించే మానసిక సంసిద్ధత మనుకుంటుంది. మన పనిలో లోపం లేకపోవచ్చు. మనం చక్కగా పనిచేస్తుంటాం. మన ప్రయత్నలోపం లేకపోవచ్చు. అయినా అపుడపుడు అపజయం లభిస్తుంది. నావల్లనే జరిగింది, నేనే చేస్తున్నాను అనుకోవడంలో అందరితో కలిసి పనిచేసే గుణం కరువవుతుంది. ఒక టీమ్ లో పనిచేసే సంసిద్ధత సంస్కారం కొల్పోతాం.

నియమం ద్వారా వ్యక్తి నిర్మాణమవుతాడు. కాని వ్యక్తి నాకన్నీ వున్నాయి నాకు డబ్బువుంది, ఆస్తి వుంది సంపదలున్నాయి. సమాజంతో నాకేం పని అనుకోగలడా ? కాదు సమాజం లేకుండా మనం లేము. అందుకే యమం అవసరమవుతుంది, యమం అంటే Self Restraint స్వీయ సంయమనం. దీని ద్వారా వ్యక్తిలోని శక్తిని కుటుంబానికి సమాజానికి, దేశానికి, సృష్టికి, పరమేష్టికి ఉపయోగ పడేలా చేయడం.

యమంలో ఐదు విషయాలు చెప్పారు:
1) అహింస: అంటే హింస చేయకపోవడమనే అర్థం కాదు. ఒక చెంప కొడితే మరొక చెంప చూపడం కాదు. ఏకత్వ భావనకు ఆఘాతం, అవరోధం కలుగుతుంటే దాన్ని ఆపడం అహింస అన్నారు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని అర్జునుణ్ణి ప్రేరిపించడం హింసకాదు. మన సైన్యం సరిహద్దుల్లో శత్రువును తీవ్రవాదులను కాల్చి చంపడం హింసకాదు. అమ్మ సుద్దులు నేర్పే క్రమంలో పిల్లాణ్ణి కొట్టడం హింసకాదు. డాక్టరు శస్త్ర చికత్సలు చేయడం హింసకాదు. వ్యష్టి నుంచి పరమేష్టి వరకు వ్యక్తి సాగే క్రమంలో ఏదైనా అవరోధం కలిగితే దాన్ని తొలగించడమే అహింస అవుతుంది. ఇదో మానసిక పరమైన ఆలోచన. దీన్ని శారీరక దృష్టితో చూడకూడదు. రాముడు యజ్ఞరక్షణకై తాటకిని చంపడం అహింస అవుతుంది.

2) సత్యం: సత్యం అంటే ఆంగ్లంలో Truth అంటారు. కాని దాని అర్ధం శాశ్వతత్వం అన్నారు మనవాళ్ళు. సత్యం వొకటే శాశ్వతం. అనేకత్వంలో ఏకత్వాన్ని చూడడమే సత్యం. ఎవరినీ గాయపరిచేది సత్యం కాదు. సత్యం చెప్పాలి ప్రియంగా చెప్పాలి. అప్రియమనిపిస్తే సందర్భాన్ని బట్టే సత్యం చెప్పాలి. ప్రియంగా వుంటుందని అబద్ధం చెప్పకూడదు అని మన సనాతన ధర్మం చెబుతున్నది. సత్యం అనంతం బ్రహ్మ అన్నారు. ఏకం సత్ విప్రాబహధావదన్తి సత్యం వొకటే. విజ్ఞులు వివిధ తీరులుగా దాన్ని చెబుతారు. అసత్యం చెప్పడం శాశ్వతం కాదు. దాని ఫలితం కూడా విపరీతంగా వుంటుంది.

3) అస్తేయం: అంటే దొంగతనం చేయకుండా ఉండడం, అందరూ 'మేము దొంగతనం చేయం' అంటారు వాస్తవం. కాని దొంగతనం అంటే 'వస్తువు దొంగిలించడమే కాదు' మనకవసరమైన దానికంటే ఎక్కువ వాడుకోవడం 'అస్తేయ' మనబడుతుంది. ప్రకృతిలో మనకు అనేక వనరులున్నాయి, అవకాశాలున్నాయి వీటిలో మనకెంత కావాలో అంతే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం దొంగతనమవుతుంది. నేను పుట్టినప్పుడు తల్లి పాలు, ఆవు పాలు, రైతు పండించిన పంట, సమాజం నన్ను పెంచాయి. కనుక నేను కూడా సమాజానికి యివ్వాలి. సమాజం నుంచి తీసుకోవడం, సమాజానికివ్వడం యిదో ధర్మచక్రం. ఇవ్వడం - దీన్నే యజ్ఞ భావన అంటారు. పితృ యజ్ఞం అంటే తల్లి దండ్రులను బాగా చూసుకోవడం, వారు పోయిన తరువాత పితృకర్మలు నిర్వహించడం, దేవ యజ్ఞం అంటే విభిన్న దేవదేవతల గురించి మన తరువాతి తరాలకు తెలియజేయడం. బ్రహ్మ యజ్ఞం అంటే మన ప్రాచీన గ్రంధాల పరిచయం అందరికీ కలిగించాలి. సమాజ యజ్ఞం అంటే మన సమాజంలోని అనాధ బంధువులకు, నిరాశ్రిత బంధువులకు అన్నం రూపేణా. మరేదైనా రూపేణా సహాయమందించడం. చివరికి భూత యజ్ఞం - అంటే భోజనం తరువాత ఓ పక్షికోసం, ఓ కుక్క కోసం అన్నం వేయడం. ప్రకృతి సంరక్షణ మొ||నవి.

4) బ్రహ్మ చర్యం: బ్రహ్మ చర్య మంటే పెళ్ళి చేసుకోకపోవడమే కాదు ఆత్మ నిగ్రహం. పవిత్రతను పాటించడం. మన నిత్య జీవితంలో ఇంద్రియ నిగ్రహంతో జీవించడం. కామ క్రోధ లోభ మోహ మద మాత్యర్యాలు మనలోనే ఉన్నాయి. మనం వాటిని నిగ్రహించుకోవాలి. కుటుంబ వ్యవస్థను గౌరవించాలి. అమెరికా సమాజంలో విశృంఖలత్వం వల్ల సమాజం విచ్ఛిన్నం అయింది. Fatherless America అని ఒక రచయిత అమెరికాను వర్ణించాడు.

5) అపరిగ్రహం: ఈశ్వరుడు నాకోసం ఎంత ఇచ్చాడో అంతే తీసుకుంటాను. పెట్రోలు, బొగ్గు, నీరు యివన్నీ సహజవనరులు. అవన్నీ మనవన్నట్లుగా ఖర్చు చేస్తుంటాము. యివన్నీ ప్రకృతి యిచ్చింది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మనం బతకడానికి, రక్షణకు, వికాసానికి, పోషణకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఫర్లాంగు దూరంలో వున్న చోటికి వెళ్ళాలన్నా మనం ధూమ శకటాన్ని వాడతాము. నడచి వెళ్ళచ్చు. కాని మనం యింధన వనరుల్ని ఖర్చు చేస్తాం. కాబట్టి సహజవనరుల్ని ఎంతో పొదుపుగా వాడడం ఎంత అవసరమో అంతే వాడడం - దీన్ని అపరిగ్రహ భావన అంటాం.

ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మనమంతా యమ, నియమాల గురించి తెలుసుకున్నాం వీటన్నిటి సాధ్యమయినంతవరకు ఆచరిద్దాం.. ఆరోగ్యంగా జీవిద్దాం. -శ్రీ తాడేపల్లి హనుమత్ ప్రసాద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments