Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అస్పృశ్యతా నివారణకు పాటుపడిన రమాదేవి చౌదురి - About Ramadevi Choudhary in Telugu - megaminds

బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనను, అక్రమ ఉప్పు చట్టాలను వ్యతిరేకిస్తూ 1930లో సబర్మతి ఆశ్రమం నుంచి దక్షిణ గుజరాత్ లోని నౌసారి జిల్లా...


బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనను, అక్రమ ఉప్పు చట్టాలను వ్యతిరేకిస్తూ 1930లో సబర్మతి ఆశ్రమం నుంచి దక్షిణ గుజరాత్ లోని నౌసారి జిల్లా దండి తీరానికి మహత్మాగాంధీ ఉప్పుసత్యాగ్రహాన్ని ప్రారంభించిన చరిత్ర మనందరికీ తెలిసిందే.

కానీ అదే సమయంలో ఒడిశాలోని బాలాసోర్, జగత్ సింగ్ పూర్ జిల్లాల్లోనూ దండి తరహా ఉప్పుసత్యాగ్రహాలు జరిగాయన్న సంగతి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ఉద్యమాలన్నింటినీ గాంధీ మహాత్ముని సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన మహిళలే ముందుండి నడిపించారు. ఉప్పుచట్టాలకు వ్యతిరేకంగా మహాత్ముడు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో సాగిన దండి ఉప్పుసత్యాగ్రహం పాత్ర భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో ఓ కీలక మైలురాయి. దేశవ్యాప్తంగా ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొని, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తమగళాన్ని వినిపించారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించిన మరియు ఒడిశా ప్రజలు ప్రేమాభిమానాలతో అమ్మా అని పిలుచుకునే శ్రీమతి రమదేవి చౌదరి 1899 డిసెంబర్ 3న ధనిక జమీందారీ కుటుంబమైన శ్రీమతి బసంత కుమారీ దేవి, శ్రీ గోపాల్ వల్లభ్ దాస్ దంపతులకు జన్మించారు. ఆమెకు స్వయాన బాబాయి, నాటి ప్రముఖ న్యాయవాది, సంఘ సంస్కర్త, ఒడిశాలోని ప్రముఖుల్లో ఒకరైన శ్రీ ఉత్కళ్ గౌరవ్ మధుసూధన్ దాస్ గారి ప్రభావం చిన్నతనం నుంచే రమాదేవి గారి మీద అధికంగా ఉండేది. ప్రభుత్వ అధికారి అయిన శ్రీ గోపబంధు చౌధురీతో రమాదేవి గారికి 15 ఏళ్లవయసులోనే వివాహం జరిగింది.

1921లో ఆమె గాంధీజీ, కస్తూర్బా గాంధీ గారిని కటక్ లోని వినోద్ బిహారీ మందిరంలో కలిశారు. ఈ సందర్భంగా చేతితో నేసిన పత్తిని ఆమె గాంధీ మహాత్మునికి అందజేశారు. ఆనాడు గాంధీజీతో జరిగిన సంభాషణ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అన్ని సౌకర్యాలు, సర్వసుఖాలను వదిలేసి స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామురాలుగా కావాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. ఈ సమయంలోనే వారి భర్త గోపబందు చౌదరీ గారు కూడా తన ఉద్యోగాన్ని త్యజించారు. వీరిద్దరితోపాటు ఇతర కుటుంబసభ్యులు సహాయనిరాకరణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

1930లో ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉప్పుసత్యాగ్రహ ఉద్యమాల్లో శ్రీమతి రమాదేవి చౌధురీ గారు క్రియాశీలకంగా వ్యవహరించారు. బాలాసోర్ జిల్లాలోని ఇంచుది, శ్రీజంగ్ ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలో వందలాది మంది మహిళలను ఉద్యమంలో భాగస్వాములు చేయడమే గాక, వారందరికీ ఆమె స్వయంగా నేతృత్వం వహించారు. ఈ ఉద్యమం చరిత్రలో ‘ఇంచుది ఉప్పు సత్యాగ్రహం’గా వినుతికెక్కింది. ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ, ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు నడిపేందుకు శ్రీమతి రమాదేవి గ్రామగ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వేలాది మంది మహిళలను స్వాతంత్ర్య సంగ్రామం దిశగా చైతన్యపరిచారు.

భారతదేశానికి పశ్చిమతీరాన, అరేబియా సముద్రం ఒడ్డున బాపూజీ ప్రారంభించిన ఉప్పుసత్యాగ్రహం.. తూర్పున బంగాళాఖాతం ఒడ్డున కూడా ప్రకంపనలు సృష్టించింది. శ్రీమతి రమాదేవి, వారి అనుచరులు విస్తృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారితోపాటు వారి అనుచరులను ఆంగ్లేయులు అరెస్టు చేశారు. అనంతరం 1931లో జరిగిన గాంధీ-ఇర్విన్ ఒడంబడిక అనంతరం వీరిని జైళ్ల నుంచి విడుదల చేశారు. అస్పృశ్యతను నిర్మూలన దిశగా మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపునందుకున్న శ్రీమతి రమాదేవి 1932లో ‘అస్పృశ్యత నివారణ్ సమితి’ని స్థాపించారు.

హరిజనులంతా మన సోదరులే అంటూ ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఈ సమితి ‘హరిజన్ సేవా సంఘ్’గా పేరుమార్చుకుంది. 1934లో పూరిలో మహాత్ముడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు.. శ్రీమతి రమాదేవి గ్రామగ్రామాన పర్యటించి అస్పృశ్యత నివారణకు, మద్యపాన నిషేధానికి అనుకూలంగా భారీగా మద్దతు కూడగట్టారు. సమాజంలోని ఉన్నత వర్గాల నుంచి నిధులు సేకరిస్తూ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి సల్పారు. కస్తూర్బా గాంధీ పరమపదించిన అనంతరం ఒడిశా ‘కస్తూర్బా ట్రస్టు’కు ప్రాతినిధ్యం వహించాలని స్వయంగా గాంధీజీయే.. రమాదేవి గారిని అడిగారంటే, ఆమె కార్యదీక్ష పట్ల మహాత్మునికి ఉన్న విశ్వాసాన్ని మనం గమనించవచ్చు.

1942, ఆగస్టు 8న మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన మరుసటి రోజే.. శ్రీమతి రమాదేవితో పాటు వారి భర్త, పిల్లలు, అత్త గారు, మామ గారు సహా ఇతర కుటుంసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జైలునుంచి విడుదలైన తర్వాత వారు గాంధీజీ స్వయంగా నామకరణం చేసిన ‘సేవాఘర్’ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమంలో నూలు వడకటం, పాడి, తేనెటీగల పెంపకం వంటి గ్రామీణ సాధికారత కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడమే గాకుండా, ప్రాథమిక విద్యను అందించేవారు. అలాగే అస్పృశ్యత, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం, దీనజనోద్ధరణ వంటి వాటిపై చైతన్యం కలిగించేవారు. వడికిన నూలు, ఇతర గ్రామీణ ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంతోనే ‘సేవాఘర్’ సంస్థ నిర్వహణ సాగేది.

ఇలాంటి ధీరోదాత్తలెందరో భారత స్వరాజ్య సంగ్రామంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేశారు. స్వాతంత్ర్యానంతరం కూడా శ్రీమతి రమాదేవి గారు వివిధ వేదికల ద్వారా గాంధీజీ ఆదర్శాలను సమాజానికి బోధిస్తూనే జీవితాన్ని గడిపారు. ఉత్కళ్ ప్రాంతంలో ఖాదీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిలో వీరు కూడా ఒకరు. వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ రమాదేవిగారు వారి సహచరులతో కలిసి విస్తృతంగా సేవాకార్యక్రమాలు చేపట్టేవారు.

1952లో మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసులైన ఆచార్య వినోబా భావే గారి భూదానోద్యమం, సర్వోదయ ఉద్యమాల్లోనూ శ్రీమతి రమాదేవి చురుగ్గా పాల్గొన్నారు. భర్తతో కలిసి ఒడిశాలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. వేల ఎకరాలను పేదలకు పంచిపెట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1962లో భారత్-చైనా యుద్ధం సందర్భంగా కూడా సైనికులకు నిధులతోపాటు అవసరమైన ఇతర సామగ్రిని కూడా ఆమె సమకూర్చారు.

ఎమర్జెన్సీ సమయంలోనూ... ప్రజాస్వామ్య విలువలను కాలరాయడాన్ని ప్రతిఘటిస్తూ... అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ్ సేవక్ ప్రెస్ ద్వారా ఓ వార్తాపత్రికను తీసుకొచ్చి పత్రికల గొంతునొక్కే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. త్రికరణశుద్ధిగా గాంధీజీ సిద్ధాంతాల్ని నమ్మి, ఆచరించిన శ్రీమతి రమాదేవి దేశం కోసం, సమాజం కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. జూలై 22, 1985 న శివైక్యం అయ్యారు. వారు పరమపదించిన తర్వాత కూడా... నేటికీ కటక్ లోని శిశువిహార్, కేన్సర్ కేర్ సెంటర్ ల ద్వారా వారి ఆదర్శాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మహనీయురాళ్ల గురించి తెలుసుకుని వారి నిబద్ధత, దేశభక్తిని గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది. వీరి దైర్యం, త్యాగాలను గుర్తెరిగి జీవించాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. మునుపెన్నడూ వినని,చదవని విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. మునుపెన్నడూ వినని,చదవని విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete