Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ ధర్మరక్షకుడు సామ్రాట్ ఖుస్రూఖాన్ - Khusrau Khan Sultan of Delhi - MegaMinds

హిందూ దేశంలో విద్యార్థులను హిందూదృక్పథం, దృష్టి చిరస్మరణీయుడైన వ్యక్తి, ముస్లిం పాలనాకాలంలో సుల్తానులకే సుల్తానుగా నిలిచిన అలౌకి...

హిందూ దేశంలో విద్యార్థులను హిందూదృక్పథం, దృష్టి చిరస్మరణీయుడైన వ్యక్తి, ముస్లిం పాలనాకాలంలో సుల్తానులకే సుల్తానుగా నిలిచిన అలౌకిక వ్యక్తి ఖుస్రూఖాన్ గురించి మీకేమైనా తెలుసా? అని అడగండి. తొంభైతొమ్మిది శాతం విద్యార్థులు తెలియదు. ఆ పేరుగల వ్యక్తి గురించి మా స్కూలు చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావన లేదు అని చెబుతారు. విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు, సంపాదకులు తదితర విద్యాధిక వర్గాల్లో 75శాతం ఈ ఖుస్రూఖాన్ ఎక్కడ నుంచి వచ్చాడు? మేము కనీసం ఆయన పేరైనా వినలేదే? అని అంటారు.

అందుకే వీలైనంతవరకూ తథ్యాధారితమైన, సప్రామాణికమైన పద్ధతిలో ఖుస్రూ ఖాన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖుస్రూఖాన్ హిందూజాతికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా ముస్లిం సుల్తాన్ షాహీ ముక్కు తెగకోశాడు. అందుకే ముస్లిం చరిత్రకారులు స్కూలులో చెప్పే చరిత్రలో ఆయన పేరైనా లేకుండా చేశారు. అంతేకాదు ముస్లిం చరిత్రకారులు ఆయనను దొంగ, నీచుడు, నరకానికి వెళ్ళేవాడు వంటి విశేషణాలతో వర్ణించారు.

గుజరాత్ పై 1298లో ముస్లింలు దాడిచేసి, హిందూపాలనకి చరమగీతం పాడారు. ఆ సమయంలోనే పట్టుబడ్డ ఓ యువకుడు మాలిక్ కాఫుర్ అన్న పేరిట వీర యోధుడిగా, తరువాత కాలంలో 35 రోజుల సుల్తాన్ గా వినుతికెక్కాడు అలాగే మరో అందమైన, చురుకైన మరో యువకుడిని కూడా బంధించి తెచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ కి అప్పగించారు. ఆ యువకుడు మూలతః పరియా (భంగీ) అనే అంటరానికులస్తుడుగా పరిగణింపబడే కులస్తుడు. కొందరు ముస్లిం చరిత్రకారులు ఆయన్ని క్షత్రియుడిగా కూడా అభివర్ణించారు. ఏది ఏమైనా అలా పట్టుకుని తెచ్చిన యువకుడికి సున్తీ చేసి హసన్ అన్న పేరు పెట్టారు. అనతికాలంలోనే మొత్తం రాజదర్భారు అతని గుప్పిట్లోకి వచ్చేసింది. అతను ఏం చెబితే అది జరిగి తీరాలి. 1316 లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం మాలిక్ కాఫుర్ రాజయ్యాడు. హసన్ అంటే కాఫుర్ కి కూడా చాలా అభిమానం ఉండేది. అతని పౌరుషం పరాక్రమాలు మాలిక్ కాఫుల్ పై చెరగని ముద్రవేశాయి. కొద్దిరోజుల్లోనే హసన్ కి ఖుస్రూఖాన్ అన్న పదవి లభించింది. అతను సేనాపతి అయ్యాడు. అల్లావుద్దీన్ బ్రతికున్న కాలంలోనే అతను స్వతంత్రంగా పలు సైనిక దాడులకు నేతృత్వం వహించాడు. అల్లావుద్దీన్ కుమారుడైన ముబారక్ పైన కూడా ఖుస్రూఖాన్ ప్రభావం చాలా ఉండేది. మాలిక్ కాఫర్ మరణానంతరం ఖుస్రూ ఖాన్ సాయంతోటి ముబారక్ సింహాసనాన్ని అధిష్టించిన పర్యవసానంగా ముబారక్ హయంలో వాస్తవంగా అధికారపగ్గాలన్నీ ఖుస్రూఖాన్ చేతుల్లోనే ఉండేవి. తను కూడా తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ముబారక్ మొదటినుంచీ వ్యసనపరుడు, విలాస పురుషుడు. కాబట్టి అతడు ఖుస్రూ ఖాన్ ని దేవుడిచ్చిన వరంగా భావించేవాడు. రాచకార్యాల భారమంతా ఖుస్రూ ఖాన్ చూసుకునేవాడు.

ఖుస్రూఖాన్ గురించి తెలుసుకునేటప్పుడు ఇంకొక వీరవనిత గురించి తెలుసుకోకుండా ఖుస్రూఖాన్ గురించి తెలుపలేము ఆమే దేవలదేవి. ఢిల్లీలోని పాలకవర్గంలోకి మాలిక్ కాఫుర్, ఖుస్రూ ఖాన్ లాగానే పూర్వాశ్రమంలో హిందువు అయిన మరో అపార కర్తృత్వ సంపన్నురాలైన వ్యక్తి కూడా ప్రవేశించింది ఆమె తన కనుసైగలతో రాజకీయ లన్నిటినీ నిర్వహించేది. ఆమె గుజరాత్ రాచకన్య దేవలదేవి.

ఈ ముగ్గురిలోనూ మాలిక్ కాఫుర్ అనంతర కాలంలో పూర్తిగా ముస్లింగా మారిపోయాడు. ఆయనలో తన హిందూ తల్లిదండ్రులకు సంబంధించినవి లేదా తన హిందూ గతం గురించి ఎలాంటి స్మృతులు ఉన్నట్టు తెలియరాలేదు. కానీ ఖుస్రూ ఖాన్, దేవలదేవిల హృదయాల్లో హిందూత్వం, హిందూ రక్తం, హిందూ బీజాల స్మృతులు జాగృతమై ఉండేవి. అంతేకాదు హిందుత్వంపట్ల అద్భుతమైన ఆకర్షణ కూడా వారిలో ఉండేది. ఎలాగోలా కొద్ది సమయం మాత్రమే అయినా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆగ్రహజ్వాలలు నిత్యం రగులుతూనే ఉండేవి. అవి దేశమంతా విస్తరించిన సుల్తాన్ వ్యవస్థను సవాలు చేశాయి. ఢిల్లీలో ఖాండవవన దహనం నాటి వాతావరణం కనిపించింది.

దేవల దేవి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: అల్లావుద్దీన్ గుజరాత్ పై జరిపిన తొలిదాడిలో అక్కడి రాజు ఓడిపోయాడు, అతని భార్య కమలాదేవి పారిపోతుండగా ముస్లింల చేజిక్కింది. రాజు, ఆయన కుమార్తె దేవలదేవిలు మాత్రం తప్పించుకు పారిపోగలిగారు. వారు తమ ధర్మాన్ని, ప్రాణాలు కాపాడుకునేందుకు అడవుల్లో తిరుగాడుతూ బ్రతకవలసి వచ్చింది. ఈ బాల్యకాలపు చేదు అనుభవాలు, ఆప్తజనులు ఎదుర్కొన్న కష్టాలు కథనాలు విన్న దేవలదేవి మనస్సులో ముస్లిం ద్వేషం నాటుకుపోయింది. తల్లి కమలాదేవి అల్లావుద్దీన్ ప్రియ పట్టపురాణి అయిపోయింది. ఆమె సొంత కూతురినే పట్టి బంధించి, ముస్లింగా మార్చేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవలదేవి దుఃఖానికి అంతులేకుండా పోయింది. తన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తండ్రి అభీష్టాన్ని సైతం కాదని హిందూధర్మానురక్తుడైన రాజా రామదేవుని పుత్రుడు శంకరదేవుని పెళ్లాడింది.

కానీ ఆమె దురదృష్టాలు అక్కడితో ఆగలేదు. మాలిక్ కాఫుర్ హిందువులపై జరిపిన దాడిలో చివరికి ఆమె పట్టుపడింది. ఆమెను బందీగా చేసి ఢిల్లీకి తీసుకువచ్చారు. ఆమె కోమల హృదయం పై అవమానమనే కాలకూట విషనాగు పదేపదే కాటువేసి మూర్చితురాలిని చేసింది. ఢిల్లీ చేరగానే అల్లావుద్దీన్ పెద్ద కొడుకు భిజాఖాన్ తో ఆమెకి బలవంతంగా వివాహం జరిగింది. ఖిజ్ ఖాన్, దేవలదేవిల మధ్య చాలా ప్రేమ రాగాలుండేవని పలువురు ముస్లిం చరిత్రకారులు చెబుతారు. కానీ ఇవి రాజాశ్రితుల భట్రాజు పొగడ్తలు మాత్రమేనని అనంతరకాలంలోని పరిణామాలు ఋజువు చేశాయి. అయితే రాజకీయాల ఆనుపానుల్ని ఆకళింపు చేసుకున్న దేవలదేవి సరైన అవకాశం లభించేంత వరకూ ఇస్లామ్ మతాన్ని స్వీకరించినట్టు నటించింది. అనేక అత్యాచారం యాతనల్ని సహించి కూడా ఆమె తన మనోమందిరంలో హిందూదేవిదేవతల అఖండ పూజను కొనసాగించిందని తరువాత జరిగిన పరిణామాలు నిరూపించాయి.

అల్లావుద్దీన్ పెద్దకుమారుడితో వివాహం జరిగినా, ఆమె కష్టాలు తీరలేదు. అల్లావుద్దీన్ పతనానంతరం ఢిల్లీలో తిరుగుబాటు జరిగింది. అల్లావుద్దీన్ రెండవ కొడుకు ముబారక్ తన అన్నని, ఆయన అనుచరుల్ని కళ్లు పెరికించి, చంపివేయించాడు. అన్న దగ్గర్నుంచి ఆయన భార్య దేవలదేవిని బలవంతంగా లాక్కొని వెళ్ళి, తన భార్యగా చేసుకున్నాడు. చనిపోయిన సుల్తాన్ లేదా పాదుషాల భార్యల్ని తాము వివాహం చేసుకోవడమనే సత్సంప్రదాయం ఇస్లాంలో ఉందనిపిస్తుంది. ఈ విధంగా దేవలదేవి ఆనాటి అత్యుచ్చ స్థానాన్నైతే అధిరోహించగలిగింది. కానీ ఆమె మనస్సులో ముబారక్ ని తీవ్రంగా ద్వేషించేది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అతనితో శారీరక సంబంధం ఉంచుకోవలసి వచ్చింది. తన సుందరదేహం ఇలా మలినమై పోతున్నా. ఈ వివాహంవల్ల ఆమెకి అత్యంత అనుకూలమైన ఒక అవకాశం లభించింది. అదేమిటంటే ముబారక్ సుల్తాన్ కావడంలో ఖుస్రూ ఖాన్ కీలకపాత్ర. ఇప్పుడు ఖుస్రూఖాన్ సర్వసేనాధ్యక్షుడయ్యాడు. అందునా ముబారక్ స్వయంగా అధికార పగ్గాలు అతని చేతికి ఇచ్చాడు. ముబారక్ కి తన వ్యసనాల్లో మునిగితేలడానికే సమయం చాలేది కాదు. అతనికి ఓ జుగుస్సాకరమైన అలవాటు ఉండేది. అతను స్త్రీ వేషం వేసుకుని వేశ్యలతో కలిసి పెద్ద పెద్ద సర్దార్ల ఇళ్ళకు వెళ్లి నృత్యగానాదుల్లో మునిగితేలేవాడు. దీన్ని అతను మానలేక పోయేవాడు. దీనివల్ల హిందుత్వ పరంగా జరిగిన లాభం ఏమిటంటే హిందుత్వ స్మృతులను సదా జాగృతమొనరించుకునే సర్వసేనాని ఖుస్రూఖాన్, అవే భావాలున్న దేవలదేవి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ప్రతీరోజూ సుల్తాన్ని ఎలా పడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉండేవారు.

హిందుత్వం దృష్ట్యా ఒక పెద్ద వ్యూహాన్ని వారు పన్ని ఉంటారని నాలుగు కారణాలవల్ల స్పష్టమవుతుంది. మొదటిది - గుజరాత్ పాలకుడిగా ఖుస్రూఖాన్ పూర్వాశ్రమంలో తన సోదరుడైన ఒక పరియ జాతీయుడిని నియమించాడు. రెండవది - తన ఆధీనంలోని సైన్యంలో దాదాపు 30 వేల మంది. పూర్వాశ్రమంలో హిందువులను నియమించాడు. వీరు హిందూత్వాన్ని కాపాడాలని భావించేవారు. మూడవది- వీరి కార్యకలాపాలు ముస్లిం సర్దార్లకు నచ్చేవి కావు. కానీ వారిద్దరూ తమ అసలు ఉద్దేశ్యాల్ని అత్యంత గోప్యంగా ఉంచేవారు. నాలుగవది - ముబారక్ వంటి పనికిమాలిన వ్యక్తి దక్షిణాదిలో ఓడిపోయిన హిందువులు మళ్ళీ తలెత్తకుండా, వారిని అణచివేసేందుకు బయలుదేరదీశాడు. తాను స్వయంగా సైన్యంలో రాజుకి సరైన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ దాడుల్లో హిందువులకు నష్టం కలిగింది. ఈ సమయంలోనే దేవగిరిపై దాడిచేసి, శంకరదేవుని మరణానంతరం తిరుగుబాటుచేసి గద్దెనెక్కిన రాజా హరపాల దేవుడిని ఓడించాడు. అతను బ్రతికుండగానే చర్మాన్ని వొలిపించి, సుల్తాన్ చేత చంపించాడు. స్వధర్మ రక్షణ యుద్ధంలో ఈ క్రూరమైన శిక్ష హరపాలదేవుడు నవ్వుతూ నవ్వుతూ స్వీకరించాడు.

ఆ తరువాత సైన్యసమేతంగా ముబారక్ ఢిల్లీకి తిరిగి వచ్చాడు. ఖుస్రూ ఖాన్ ముస్లిం రాజు, ముస్లిం పాలన కోసం చేసిన ఈ మహత్తర వీరకృత్యాన్ని, జరిపిన హిందూ విధ్వంసాన్ని చూసి ఆయన వ్యతిరేకులెవరూ నోరు మొదపలేకపోయారు. ముబారక్ ని చంపి ఖుస్రూఖాన్ స్వయంగా రాజవుతాడేమోనని చెవులు కొరుక్కోవడం మినహా వారేమీ చేయలేక పోయారు. కానీ రాజైనాక ముస్లింగా ఉండబోడన్న విషయాన్ని లేశమాత్రంగా కూడా వారు ఊహించలేక పోయారు. అప్పటికే ఖుస్రూఖాన్, దేవలదేవిల మనస్సుల్లో అద్భుతమైన తిరుగుబాటుకు సంబంధించిన ఊహలేమైనా జనియించినా, వారు వాటిని అతి గోప్యంగా గుండెల్లో దాచుకున్నారు అనంతర కాలంలో ముబారక్ ఖుస్రూఖాన్ ను మళ్ళీ దక్షిణాది పై భారీ దండయాత్రకై పంపించాడు. ఖుస్రూ పై ముబారక్ కి ఎంత నమ్మకం కలిగిందంటే అతను ఈ సారి ఖుస్రూఖాన్ ని ఒక్కడినే పంపించాడు. ఈ దాడుల్లో ఖుస్రూఖాన్ మలబార్ని జయించి, అపార ధనసంపదలకి దోచుకుని వచ్చి ముబారక్ అర్పించాడు. ఈ దాడుల సమయంలోనే దక్షిణాదిలోని హిందువులు నలుదిక్కులా ముస్లిం సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. ప్రచ్ఛన్నంగా, ప్రత్యక్షంగా కుట్రలు మొదలయ్యాయి. వరంగల్ రాచకుటుంబం, గుజరాత్ ఓటమిపాలైన రాజులు, చిత్తోడ్ ని తిరిగి గెలుచుకున్న రాజా హమ్మీర్ వంటి వీరులు శంకరాచార్యులవంటి ధర్మప్రచారకులు, మామూలు హిందువులు - ఇలా అందరికీ ముస్లింల పట్ల వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితుల వెనుక ఖుస్రూఖాన్ హస్తం ఉందని ఆయన విరోధులు ముబారక్ కి చాడీలు చెప్పేవారు. కానీ నిజానికి చరిత్రలో తొలిసారి భారతదేశమంత ఏకచ్ఛత్ర విధర్మీయ విదేశీ సామ్రాజ్యానికి సహకరించి, దాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది జన్మతః హిందువైనప్పటికీ, బలవంతపు మతమార్పిడికి గురై, సుల్తాన్ ముబారక్ సేనాధిపతిగా ఎదిగిన ఖుస్రూఖాన్ ఒక్కడే. అలాంటి ముస్లిం సామ్రాజ్య స్థాపకుడు మంత్రదండం తిప్పినట్లు క్షణంలో దాన్ని హిందూ సామ్రాజ్యం గా మార్చగలడని అత్యంత కరడుగట్టిన ముస్లిం సైతం ఊహించలేకపోయాడు. తాము కరుడుగట్టిన ముస్లింలు, సుల్తాన్ పరమభక్తులమని చివరిదాకా ఖుస్రూ ఖాన్, దేవలదేవి లు నమ్మించారు. అందుకే హిందూ రాజులు లోలోపల వారు సంబంధాలు నెలకొల్పుకున్నారని చెబితే సుల్తాన్ వారిని పళ్ళూడగొట్టి పచ్చడి చేస్తాడని శత్రువులు భయపడేవారు. ఈ భయం వల్ల ముస్లిం సర్దారులందరూ కంపించిపోయేవారు. పర్యవసానంగా బజార్లో వినిపించే గుసగుసలు ఎప్పుడైనా సుల్తాన్ చెవులదాకా వెళ్ళినా, అవి గిట్టనివారు అసూయతో చెప్పే చాడీలుగానే భావించడం జరిగింది. ముస్లిం మతపెద్దలు ముభారక్ దగ్గర ఖుస్రూఖాన్ గురించి చెప్పే ప్రతిమాట దేవలదేవి వెంటనే ఖుస్రూకి సమాచారం అందించేది.

శతాబ్దాల తరబడి ఏ ముస్లిం రాచవ్యవస్థ పోరాడి హిందువులను పూర్తిగా ఓడించి, తన రాజ్యాన్ని ముస్లిం మయంగా చేసిందో, అదే రాచవ్యవస్థను ఒక్క ఉదుటున హిందూ ధర్మం పేరిట గెలుచుకున్నట్లయితే మళ్ళీ అంతా హిందూమయమైపోతుందని ఖుస్రూ ఖాన్ భావించాడు. ముస్లిం సుల్తాన్ హిందూ సామ్రాట్ గా మారిపోతాడు. చాలా సాహసంతో కూడుకున్నప్పటికీ ఈ పథకం అసంభవం కూడా కాదు. ఇదే ఖుస్రూ ఖాన్ కి ప్రేరణనిచ్చింది. మూలతః హిందూ రాచకన్య అయిన దేవలదేవి, హిందూ పరయ వంశంలో జన్మించిన ఖుస్రూఖాన్లు దేశచరిత్రలోనే కాదు, యావత్ప్రపంచ చరిత్రలోనే అత్యద్భుతాన్ని చేసి చూపించారు.

ఇలా ముందుస్తుగానే తిరుగుబాటుకై అన్ని ఏర్పాట్లు చేసుకొన్న ఖుస్రూఖాన్ రాజు ముభారక్ ను పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. ఒకరోజు అత్యంత వినమ్రుడై సుల్తాన్ దగ్గరకు వెళ్ళి గుజరాత్ లో నా జాతికి చెందిన చాలామంది హిందువులను నేను ఢిల్లీకి తీసుకువచ్చాను. వారు ఇప్పుడు ముస్లింలుగా మారదలచుకున్నారు. అయితే వారు నగరం నడిబొడ్డున, బహిరంగంగా మతం మారడానికి సంకోచిస్తున్నారు. కొందరైతే భయపడుతున్నారు కూడా! అందుకే నేను వారిలో ఎంపిక చేసిన కొందరిని రాజభవనం లోకి ఈ రాత్రి రప్పించి, నెమ్మదిగా వారిని మతం మారుస్తాను అని ఒప్పించాడు. 

ఇలా వేలాది మంది హిందువులు, సుల్తాన్ రాజమహల్ సైన్యాగారాంలో చేర్పించాడు చివరికి 1319 లో ఒక అర్ధరాత్రి రాజభవనంలో హఠాత్తుగా తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాటులో ముబారక్ చనిపోయాడు. ఢిల్లీ రాజప్రాసాదంలో ఇలాంటి తిరుగుబాట్లు ఇంతకు ముందుకూడా జరిగాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా ఇలాగే చనిపోయాడు. ముబారక్ మాలిక్ కాఫర్ ని అలానే చంపించాడు. కాబట్టి ఢిల్లీకి ఇలాంటి రక్తపాతాలు అలవాటే. తెల్లవారేసరికి రాజప్రాసాదంలో రాత్రి ఏం జరిగిందన్న చర్చ గుప్పుమంది.

కొద్ది సేపటికే ఒక రాజ ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి ఖుస్రూఖాన్ మనుషులు భారీ తిరుగుబాటు చేసి, సుల్తాన్ ముబారక్ ను చంపివేశారు ఆ తరువాత ఖుస్రూఖాన్ సుల్తాన్ పదవిని అధిష్టించారు అని రెండవ ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనతో ప్రజలు ఆశ్చర్య చకితులైపోయారు. అప్పుడే ఎలాంటి సంఘటితమైన తిరుగుబాటు జరగలేదు. సుల్తాన్ ముబారక్ చనిపోవడంతోటే సుల్తానా దేవలదేవిని ఖుస్రూఖాన్ వివాహం చేసుకున్నాడు. ప్రజలు ఈ విషయంలో కుతూహలాన్ని కనబరచినా, వారు పెద్దగా ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఢిల్లీ సుల్తానుల నడుమ ఈ ఆనవాయితీ ముందు నుంచీ వస్తున్నదే. గతంలో కుతుబుద్దీన్ భార్యని ఆయన తరువాతి పాలకుడు వివాహం చేసుకున్నాడు. కర్ణావతినుండి తీసుకురాబడిన కమలాదేవిని అల్లావుద్దీన్ తరువాత కమలాదేవి కుమార్తె దేవలదేవిని కుమారుడైన బీజా ఖాన్ పెళ్ళాడాడు. భిజాఖాన్ మరణానంతరం ఆమెను ముబారక్ వివాహం ఆడాడు. ఆ దేవలదేవినే ఇప్పుడు ఖుస్రూఖాన్ వివాహం చేసుకున్నాడు. సహజంగానే ఇది ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

కానీ దీని తరువాత వెలువడిన ప్రకటన మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ప్రకటన తిరుగుబాటును ఒక ధార్మిక విప్లవంగా మార్చేసింది. ఈ ప్రకటన దేవలదేవి ఖుస్రూ ఖాన్ నుంచి బాజాభజంత్రీల నడుమ వెలువడింది. ఇది దేశంలోని రాజులు మహారాజులు, సామంతులు, చక్రవర్తుల నుంచి పరయల వరకు, డోమ్ చమార్ జాతుల వరకూ, చివరికి ముస్లింలను సైతం ఆశ్చర్య చకితుల్ని చేసింది. మొదటి వర్గం వారికి ఈ ప్రకటన ఎంత ఆనందాన్ని కలిగించిందో రెండవ మార్గం వారిలో అంతగా భయోత్సాతాలు సృష్టించింది. 1320 ఏప్రిల్ 15న సుల్తాన్ నుంచి వెలువడిన ప్రకటన ఈ విధంగా ఉంది.

నేటి వరకూ నేను బలవంతంగా ముస్లింగా మారి, ధర్మభ్రష్తునిగా జీవిస్తూ వచ్చాను. కానీ నేను మూలతః హిందువుని, నా బీజం హిందూ బీజం. నా రక్తం హిందూ రక్తం. అందుకే నా కాలికి ఉన్న ధర్మభ్రష్టత్వపు సంకెళ్లను తెంచి నేను హిందువునని ప్రకటిస్తున్నాను. ఈ విశాల, అఖండ భారత ఖండం హిందూ సామ్రాట్ గా సింహాసనాన్ని అధిష్టిస్తున్నాను. అదేవిధంగా నిన్నటి వరకు సుల్తానాగా పరిచితురాలైన దేవలదేవికూడా హిందువే. తన తండ్రి, భర్త అయిన దేవగిరి రాజులతోపాటు అడవుల్లో దాగున్న దేవలదేవి భర్తను చంపి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చారు. ఆమెని భిజ్ ఖాన్ బేగంగా అంతఃపురంలో న్ భీజ్ ఖాన్ ను చంపి అతని తమ్ముడు ముబారక్ ఆమెని చేపట్టాడు. ఆమెని మతం మార్చి సుల్తానాగా చేశారు. ఆమె ఇప్పుడు నా భార్యగా ఉంటుంది. ఆమె బీజము, రక్తమూ హిందుత్వంతో నిండి ఉన్నాయి. ఇకనుంచి ఆమె హిందువుగానే జీవిస్తుంది. బలవంతంగా ధర్మభ్రష్టులమైన మేము ఈ పాపాన్ని కడిగివేసుకుంటున్నాము. ఈ ప్రకటనని హిందువుల సంగతి అటుంచి, ముస్లింలు సైతం వ్యతిరేకించ లేకపోయారు. ఇకనుంచి ఖుస్రూ ఖాన్ హిందూ  సామ్రాట్టుగా, దేవలదేవిని హిందూ సామ్రాజ్ఞి గానే సంబోధించుకుందాం.  ఈ హిందూ సామ్రాట్టు బాల్య కాలంనాటి తన హిందూ నామాన్ని బయటపెట్టలేదు. బహుశః దాన్ని ఆయన మరిచిపోయి ఉంటాడు. ఇప్పుడు అసలు పేరు పూర్తిగా మరుగున పడిపోయింది. సామ్రాట్టు అయ్యాక ఆయన నసీరుద్దీన్ అన్న ముస్లిం పేరునే స్వీకరించాడు నసీరుద్దీన్ అంటే ధర్మరక్షకుడు అన్న అర్థం వస్తుంది. అందుకే ఆయన నేను ఏ ధర్మానికి సంరక్షకుడినో ఆ ధర్మం ఇస్లాం కాదు అని స్పష్టంగా ప్రకటించాడు. అంటే అది హిందూధర్మమే అయివుంటుంది. అందుకే మనం ఆయనని హిందూధర్మరక్షకుడిగా సంబోధించుకుందాం.

ఈ ప్రకారంగా ఒకే రోజున భరత ఖండం లోని ముస్లిం సామ్రాజ్యాన్ని గెలుచుకొని హిందూ సామ్రాజ్యంగా మార్చివేసిన రాజకీయ ధార్మిక విప్లవం చరిత్రలో అపూర్వమైన విప్లవం అనంతరం ఆ హిందూ సామ్రాట్ దక్షిణాదిలోని హిందూరాజులనుంచి గెలుచుకు వచ్చిన సంపదనంతా తాను తయారు చేసిన స్వజాతీయ సైన్యంలోని వీరులకు పంచిపెట్టాడు. సుల్తాన్ సంపదల్లో కూడా చాలా భాగాన్ని పంచి పెట్టాడు. సైనికులను సంతృప్తి పరచడంతోనే సరిపుచ్చుకోక, రైతులకు, సాధారణ ప్రజానీకానికి గతంలోని సుల్తాన్లు కల్పించని పలు సదుపాయాల్ని కల్పించాడు. సుల్తాను కోపభాజనులై జైళ్ళలో మగ్గుతున్న హిందూ, ముస్లిం ఖైదీలు చెరనుంచి విముక్తిని ప్రసాదించాడు. ఈ చర్యలన్నిటి కారణంగా ఈ ధర్మరక్షక హిందూ సామ్రాట్ హిందువులు కాక, ముస్లింలకు కూడా కూడా ప్రీతి పాత్రుడయ్యాడు.

ఏ హిందూరాజ్యమైతే ఒకరోజు కూడా నడవదేమో అని అనిపించిందో, అదే రాజ్యం ముస్లిం సుల్తాన్ షాహీని కూకటివేళ్ళతో పెకలించి మొత్తం దేశమంతటా రెపరెపలాడిన ఆకుపచ్చని అర్ధచంద్ర ధ్వజాన్ని దింపి, హిందూ ధర్మ కాషాయ ద్వజాన్ని ఎగురవేసింది. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, కనీసం ఏడాదిపాటు తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది ఈ దేశం. సామ్రాజ్యంలోని లక్షలాది అమీరు, గరీబు ముస్లింలు హిందూ సామ్రాజ్య ఆధిపత్యాన్ని అంగీకరించారు. సామ్రాట్టు ఆజ్ఞను పెద్ద పెద్ద ముస్లిం సర్దార్ కూడా శిరసావహించడం తత్కాలీన హిందూ చరిత్రలో అతి ఆశ్చర్యజనకమైన ఘటన.

కానీ ఒక ఏడాది దాటీదాటకుండానే ఉన్నత స్థానాల్లో ఉన్న ఒకరిద్దరు ముస్లింలు తిరుగుబాటు చేయసాహసించారు. మతాంధులైన కొందరు మౌల్వీలు రహస్య పత్రాలు పంపిణీ చేసి, మసీదుల్లో గుసగుసలు ప్రారంభించి ఇస్లాం పై ముంచుకొచ్చిన ప్రమాదంపై జిహాద్ ప్రకటించారు. ముస్లిం సింహాసనంపై కూర్చున్న రాజు తనను తాను హిందువుగా ప్రకటించుకోవడం కన్నా ఇస్లామ్ కి అవమానం ఇంకేముంటుందని వారు చెప్పసాగారు అలాంటి వ్యక్తి ముందు సాగిలపడటం ఇస్లాం కి ఘోరపరాజయమని చెప్పారు. కానీ బహిరంగంగా తిరుగుబాటు చేసే సాహసం చేయలేకపోయారు. చివరికి పంజాబ్ ప్రాంతంలో పరిపాలన సాగించేందుకుగానూ నియుక్తుడైన గియాసుద్దీన్ ఈ సాహసం చేయబూనాడు.

గియాసుద్దీన్ నసీరుద్దీన్ కి చెందిన సైన్యంపై దాడి చేశాడు. ఈ యుద్ధంలో కీలక సమయంలో కొన్ని దళాలు వెన్నుపోటు పొడిచాయి. పర్యవసానంగా నసీరుద్దీన్ సైన్యాలు పూర్తిగా పరాజయం పాలయ్యాయి. దానితో నసీరుద్దీన్ యుద్దభూమి వదిలి డిల్లీ వైపు పరుగుతీశాడు. కానీ విజయోన్మత్తుడైన గియాసుద్దీన్ కూడా ఢిల్లీ పై దండెత్తాడు. చివరికి నిస్సహాయ అవస్థలో ధర్మరక్షక్ నసీరుద్దీన్ శత్రువు చేజిక్కాడు. బందీఅయిన నసీరుద్దీన్ ని గియాసుద్దీన్ అక్కడే చంపించివేశాడు. ఇలా హిందూ సామ్రాట్టు ధర్మరక్షణ లో నసీరుద్దీన్ జీవితం శోకాంతమైపోయింది.

నువ్వు ముస్లిం సుల్తాన్ గానే ఉండి ఉంటే కుతుబుద్దీన్, గియాసుద్దీన్ లా దేశమంతటా వంశపారంపర్యంగా నీ రాజ్యం కొనసాగి ఉండేది. కానీ హిందూ ధర్మం పట్ల హిందూ జాతి పట్ల అచంచలమైన శ్రద్ధ ఉంచి నీశక్తితో, యుక్తితో సింహాసనంగా మార్చి సుల్తాన్ పదవిపై ఉమ్మి వేసి, హిందూ సామ్రాట్టునని ప్రకటించుకున్నావు. సామ్రాట్ పృథ్వీరాజ్ అనంతరం ఢిల్లీ సింహాసనంపై హిందూ సామ్రాట్టు రూపంలో అధిష్ఠించే సాహసాన్ని నీవొక్కడివే చేశావు. అతి దీనహీన కుటుంబంలో జన్మించి బాల్యంలోనే ముస్లిం శత్రువుల చేతిలో ధర్మభ్రష్టుడివై, బానిసగా మారినా, నీ శౌర్యం కర్తృత్వం, సైనిక పరాక్రమం, దౌత్యపరమైన చాతుర్యాలతో సుల్తానులకే సుల్తాన్ వయ్యావు. భరతఖండంపై హిందూ దుందుభి మ్రోగించి కాషాయ ద్వజాన్ని రెపరెపలాడించావు‌. -స్వాతంత్ర్య వీర్ సావర్కర్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments