Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

జాషువా కవి జాతీయ కవితాస్ఫూర్తి - About Jashua in Telugu

జాషువా కవి జాతీయ కవితాస్ఫూర్తి:  జాషువా కవి యొక్క దేశభక్తి 'జాతీయాభిమానం, ఆంధ్ర దేశాభిమానం, అస్పృశ్యతా నిరసన, ఆర్థికదోపిడీ ఖ...

జాషువా కవి జాతీయ కవితాస్ఫూర్తి: జాషువా కవి యొక్క దేశభక్తి 'జాతీయాభిమానం, ఆంధ్ర దేశాభిమానం, అస్పృశ్యతా నిరసన, ఆర్థికదోపిడీ ఖండన, పాలక నియంతృత్వంపై పోరాటం, అచ్చమైన దేశనాయక ప్రశంస' అనే ఆరు సోపానాలను ఆశ్రయించింది.

ఆయన రచించిన ఖండికలలో పెక్కుచోట్ల 'నాదు జాతి, నాదేశము, నాదు భాష' అనే దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది.అఖండ గౌతమి, రచ్చగెలుపు, రాజ దర్శనం, తెలుగువెలుగు, తెలుగుగడ్డలు మున్నగు ఖండికలు స్వీయ రాష్ట్రాభిమానాన్ని చాటుతాయి. అన్నీ చివర జాతీయ భావనా స్రవంతిలో సంగ మిస్తాయి. ఈ ఔన్నత్యాలను చాటడానికి ఆయన మనస్సు ఎంతగా తపించిందో ఒకపద్యం చూడండి.

ఏనాడు మా కావ్యకర్తల జిహ్వ 
విశ్వ సత్యము నాలపింపగలదొ
ఏనాడు మా జాతి దృష్టిమాంద్యము నాపి
చుట్టుప్రక్కల  తేరిచూడగలదొ
ఏనాడు మా బుఱ్ఱ లీ జుట్టు తల లేని
పుక్కిటి కథలలో చిక్కుపడవొ
ఏనాడు మా విద్య లినుప సంఘమునందు
చిలుము పట్టక ప్రకాశింపగలదొ
తనువు దాచక సోమరితనము వీడి 
ఎన్నడీ మఠంబులు బిచ్చమెత్తుకొనవొ
అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలిచి
నలిగిపోవుచు నున్నది నా మనస్సు   (గబ్బిలము)

అనేక కారణాలవల్ల ఈ దేశంలోనికి విదేశీయులు చొరబడి స్థిరపడినారు. ఇక్కడి లక్షణా లేవీ వీరు ఒంటబట్టించు కొనలేదు. కాని వాళ్ల కట్టు, బొట్టు, జుట్టు వగైరాలు ఇక్కడివాళ్లు స్వీకరించారు. మంచి ఎక్కడున్నా స్వీకరించే మహనీయగుణానికి ఈ దేశీయులు ఎప్పుడూ సిద్ధమే. అట్టి సుహృద్వాతా వరణంలో బయటినుండి ఇక్కడికి వచ్చి కొందరు పాలలో నీళ్లలా కలిసిపోయారు. సంతోషమే! కాని మరికొందరేమో పాలను విరిచే ఉప్పులా తయారై నారు. విదేశీయమైన సులోచనాలు ఇక్కడ కొందరికి ఇష్టమౌతున్నాయి. వీరివల్ల సామాజిక విచ్ఛిత్తి ఏర్పడుతూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పాలను విరిచే ఉప్పును దూరంగా ఉంచవలసి వస్తోంది.

ఇప్పటికైనా మించింది లేదు. వీరంతా తమతమ అభిమతాల మేరకు దేనిని ఆహ్వానించినా, వారు ఏ గాలి పీలుస్తున్నారో, ఏమట్టినుండీ వచ్చిన నీరూ ఆహారం తీసుకొంటున్నారో, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి చిరకాల వ్యవస్థను విడనాడకుండా ఉండాలి. అప్పుడే జాషువా వంటి మహాకవులు కలలుగన్న జాతీయవికాసం ఏర్పడుతుంది. స్వాతంత్ర్య ఫలాలు ఈ దేశవాసులందరికీ అందుతాయి. (అవధానాచార్య డా౹౹ఆశావాది ప్రకాశరావు రచించిన  'దేశహితంకోసం సమైక్యతాస్వరం' నుండి).

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..