Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కలహప్రియుడు నారదుడు - narada maharshi story in telugu

నారదుడు: నారం దదాతీతి నారదః అని. నారము అంటే నీరు అర్దము. నీటిని ఇచ్చేవాడు కావున నారదుడైనాడు. విష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని మూడడుగ...

నారదుడు: నారం దదాతీతి నారదః అని. నారము అంటే నీరు అర్దము. నీటిని ఇచ్చేవాడు కావున నారదుడైనాడు. విష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని యాచించాడు. అప్పుడు వామనుడు ఒక అడుగులో ఆకాశాన్నంతటిని ఆక్రమించాడు. అప్పుడు బ్రహ్మ ఆ శ్రీహరి పాదాన్ని కడగడానికి సంకల్ప మాత్రం చేత పుత్రుని సృష్టించి నీటిని తీసుకురమ్మని ఆదేశించాడు. అప్పుడతడు జలమును తెచ్చి తండ్రికి ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా పుట్టిన ఆ బ్రహ్మ మానస పుత్రుడు నారదుడుగా లోకప్రసిద్ధి చెందాడు.
నారదుడు బ్రహ్మ కంఠం నుంచి జన్మించాడని కూడా చెప్తారు. ఇతడు పుట్టిన వెంటనే సరస్వతీ దగ్గరకు వెళ్ళి సంగీత విద్యను అభ్యసించాడు. వాయువు వద్దకు వెడితే అతడు వీణను ప్రసాదించాడు దానికే మహతి అని పేరు. నారదుడు తండ్రి సమక్షంలో తన గాన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే బ్రహ్మ ఎంతగానో సంతోషించి అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి హరిభక్తిని భోదించాడు. ఆనాటి నుండి హరినామ సంకీర్తనతో లోక సంచారియైనాడు.
అందరూ నారదుని కలహభోజనుడని, కలహాశనుడని, కలహప్రియుడని పిలుస్తుంటారు. కానీ ఆ కలహములన్నీ ఆనాటి ప్రముఖుల గర్వమును తొలగించి లోకకల్యాణము సాధించుటకుద్దేశించినవే. దక్ష ప్రజాపతి పుత్రులు నారాయణ సరస్సు వద్ద ప్రజా సృష్టి కొరకు తపస్సు చేస్తుండగా నారదుడు వారి దగ్గరకు వెళ్ళి మీరు మోక్షం కోసం ప్రయత్నించకుండా అశాశ్వతమైన సంసారాన్ని ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించి వారికి ఆత్మజ్ఞానాన్నిబోధించాడు. వాళ్ళు సృష్టి కార్య విముఖులైనారు.
అందుకు దక్షుడు కోపించి నా కుమారుల బుద్ధిని చలింపజేశావు కాబట్టి నీకు నిలకడ ఉండదు. మిత్రభేదంతో కలహాలను సృష్టించి కలహాశనుడవవుదువుగాక అని శపించాడు. అయితే కలహాల వల్ల అశాంతి కలగడం సహజం. కాని నారదుని వలన కలిగిన కలహాలు దుష్టశిక్షణకు కారణమై లోకకల్యాణాన్ని కలిగిస్తుంటాయి. మహిషాసురుడు, జలంధరులనే రాక్షసుల వధకు, కాలయవనుడనే రాజు వధకు నారదుడే ప్రోత్సాహకుడు. హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్బవతి అయినప్పుడు ఇంద్రుడు మరొక రాక్షసుడు జన్మించబోవుచున్నాడని దాడి చేసి లీలావతిని చంపబోగా స్త్రీ హత్య మహాపాపం అని, ఆమె గర్భాన విష్ణుభక్తుడున్నాడని చెప్పి నివారించాడు నారదుడు.
తపస్సు చేయడానికి తరలి వెడుతున్న ధ్రువుని నారదుడు సమీపించి. యమునా తీరాన ఉన్న మధువనం హరికి అత్యంత ప్రీతికరం. అక్కడ శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి అని చెప్పి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. నారదోపదేశ ఫలితంగా ధ్రువుడు నక్షత్రమండలంలో స్థానాన్ని సంపాదించాడు. ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీదేవి తుంబురుని ఆహ్వానించి అతని సంగీత విద్యా ప్రదర్శనకు ముగ్గురాలై ఘనంగా సత్కరించి పంపించింది. ఇది తెలిసి నారదుడు-తుంబురునిపై అసూయ చెంది సంగీత విద్యలో అతనిని మించిపోవాలనే పట్టుదలతో నానా అవస్థలు పడ్డాడు.
మానసోత్తర పర్వతముపై నివసించే గానబంధు అనే గూబ దగ్గర గానశిక్షను పొందాడు. ఒక సంవత్సరకాలం జాంబవతి వద్ద ఆ తరువాత శ్రీకృష్ణుని భార్యల వద్ద, తరువాత కృష్ణుని వద్ద కూడ గానవిద్యా శిక్షణను పొందినప్పటికీ తుంబురుని మించలేకపోయాడు. కాని గానవిద్యలో అధిక నైపుణ్యాన్ని సంపాదించి అసూయను విడిచి పెట్టి సుఖపడ్డాడు. నిరంతర నారాయణ స్మరణతో భక్తి భావానికి ప్రతీకయైన నారదుడు మహాతపస్వి,పరమజ్ఞానియైన వేదవ్యాసునకు గూడ భాగవతపురాణాన్ని రచించి మనశ్శాంతిని పొందమని సూచించాడు.
తరువాత వ్యాసుడు నారదుని సహకారంతో అష్టాదశ పురాణాలు వ్రాశాడు. వాల్మీకి రామాయణ రచనకు కూడా మార్గదర్శకుడు నారదుడే. ధర్మరాజునకు రాజధర్మాల నుపదేశించి రాజసూయయాగం చేయుమని ప్రోత్సహించాడు. నారదుడు అనంత జ్ఞాననిధి. నారం దదాతీతి నారదః అంటారు. నారం అంటే జ్ఞానమనీ కూడ అర్థం. జ్ఞానమిచ్చే వాడు నారదుడు. నారదుని భక్తితత్త్వానికి అనుభవజ్ఞానానికి అతడు చెప్పిన నారద భక్తిసూత్రాలు తార్కాణం. తాత్త్విక ప్రపంచంలో దానికి అత్యున్నత స్థానం వుంది.
నారదుడు జ్యోతిర్నారదం, నారదస్మృతి, బృహన్నారదం, లఘునారదం, నారద శిల్పశాస్త్రం మొదలైన గ్రంథాలు రచించాడు. విష్ణుమహిమను తెలుసుకొని తరించిన ఆ మహనీయుని జీవితం, పరోపకార పరాయణత సాధన మనకు ఆదర్శం కావాలి.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments