శివాజీ ని హిందూ సమాజంకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందా? - About Shivaji and Hinduism - MegaMind

శివాజీ హిందువు కాకుంటే?: శీర్షిక చూసి ఆశ్చర్య పడవద్దు, ఆవేశపడవద్దు. హిందువు విశ్వబంధువు, ఉన్నత విలువలు గల సింధువు. హిందువు పుట్టుకతోనే శాంతి సహనం కలవాడు. నరనరాన సమరసతా సద్భావం కలవాడు. హిందువు రక్తంలోనే అందరినీ ఆదరించే భావముంది, అందరినీ సేవించే ధర్మముంది. ఇలాంటి సుగుణాలు ఉన్న శివాజీ హిందువు కాక మరేమవుతాడు? హిందూజాతి మాన బిందువులైన  స్త్రీలని, గోవులని, ఆలయాలని, సాధుసజ్జనులని సంరక్షించిన శివాజీ మహరాజ్ హిందువు కాక మరేమవుతాడు. చరిత్రని వాళ్ళ కళ్లద్దాలతో చూసే మేధావులు సమాజాన్ని చీల్చేందుకు శివాజీని కూడా వదలట్లేదు. శివాజీని వేరుగా, హిందుత్వాన్ని వేరుగా చూపే ప్రయత్నాలు మొదలయ్యాయి.

శివాజీ హిందువు కాబట్టి  సర్వసత్తాక వాది అయ్యాడు. హిందువు కాబట్టి సామ్యవాది అయ్యాడు. హిందువు కాబట్టి లౌకికవాది అయ్యాడు, హిందువు కాబట్టి ప్రజాస్వామ్యవేత్త, గణతంత్రవేత్త.శివాజీ గొప్ప యోధుడేగాక అంతకుమించిన పాలనాధక్షుడు. శివాజీ జాతి నిర్మాత. అంతేగాక మధ్యయుగ భారతదేశ చరిత్రలోకెల్లా గొప్ప పరిపాలనాదక్షుడని జె.ఎన్‌ సర్కార్‌ ప్రశంశించాడు. పరిపాలనాదక్షతలో శివాజీని ఫ్రాన్సు రాజైన మొదటి నెపోలియన్‌తో పోల్చవచ్చని హెచ్‌.జి.రాప్సన్‌ వ్యాఖ్యానించాడు. ఎంతో మహోన్నత వ్యక్తిత్వం గల శివాజీ లేకుంటే ఏమయ్యెదో హిందీ భూషణ కవి చెప్పిన మాటలు సందర్భోచితం. అవి " కాశీ కళ తప్పేది,మధుర మసీదు అయ్యేది, అందరికి సున్తీ అయ్యి ఇస్లాం మతంలోకి మార్చబడేవాళ్ళం". మధ్యయుగం లో వచ్చిన పెద్ద విపత్తు ముస్లిం దురాక్రమణలు. వాటినుండి హిందూ సమాజాన్ని రక్షించి స్వతంత్ర రాజ్యనిర్మాణం చేసి ఛత్రపతిగా పట్టాభిషిక్తుడు అయినా సుదినం నేడు. సరిగ్గా 346 ఏళ్ల క్రితం జ్యేష్ఠ శుక్ల త్రయోదశి రోజున రాయఘడ్ కోటలో జయఘోషణ ల మధ్య శివాజీ మహరాజ్ సింహాసనాన్ని అధిష్టించాడు. దేశద్రోహ, విదేశీ శత్రువుల పాలిట సింహస్వప్నం అయ్యాడు. సాధారణ భోంస్లే  కుటుంబానికి చెందిన సామాన్య శివాజీ అసాధారణ కర్తృత్వంతో ఛత్రపతి శివాజీ గా అయ్యాడు.

ఇస్లాం వ్యాప్తం చేయటమే లక్ష్యంగా దండెెత్తి వచ్చిన విదేశీ మొగలు సామ్రాజ్యవాద దుశ్చర్యలను కళ్ళారా చూసిన మాతృమూర్తి జిజియా మాత. ఆ తల్లి బాల్యం నుండి నేర్పిన సంస్కారాలు శివాజీని హిందుధర్మసంరక్షకునిగా మలిచాయనటంలో సందేహం లేదు. మరోవైపు సమర్థ రామదాసస్వామి బోధనలు, దాదాజీ కొండదేవ్  సైనిక శిక్షణ శివాజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. శివాజీ జన్మించిన నాటికి హిందూధర్మం సంకటం లో ఉంది. కరకు కసాయి మూకలు స్త్రీమూర్తులని అపహరించేవారు, గోవులను వధించేవారు, ఆలయాలను ధ్వంసం చేసేవారు, సాధు సజ్జనులను పీడించే వారు. ఎన్నో కఠిన పరిస్థితులు తాండవిస్తున్న సమయంలో శివాజీ జన్మించాడు.

శివాజీ హిందువు కాకుంటే రాజ్యాంగంలో ఇప్పుడు మనం పొందుపర్చుకున్నట్లుగా మనదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర లక్షణాలు కలిగి ఉండేది కాదు.శివాజీ హిందువు కాకుంటే భారత్ సర్వసత్తాక దేశంగా ఉండకపోయేది. రాజ్యపరిపాలన వ్యవహారాలు స్వతంత్రంగా సమిష్టిగా వుండేవికావు. ఇతర దేశాల పెత్తనం ఇప్పటికీ చెలాయించ బడుతుండేది. శివాజీ హిందువు కాబట్టే  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా స్వతంత్ర్యపాలన చేశాడు. కేంద్రప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి "అష్ట ప్రధానులు''గా పిలువబడే మంత్రిమండలిని నిర్మాణం చేశాడు. ఇందులో పీష్వా, అమాత్య, మంత్రి, సచివ, సేనాపతి, పండిత, సుమంత, న్యాయధీశ మొదలైన వారు ఉండేవారు.      

శివాజీ హిందువు కాకుంటే భారత దేశం సామ్యవాదదేశంగా ఉండకపోయేది. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో మిగిలిపోయేది. భూములు పెట్టుబడులపై నియంత్రణ లేకుండా అరాచకత్వం రాజ్యమేలేది. దోపిడీలు పెరిగిపోయి,దాతృత్వము కొరవడేది. శివాజీ హిందూ కాబట్టే సామ్యవాది. శివాజీ రాజ్యంలో ఉన్న భూములను సమర్థవంతంగా వినియోగించే చర్యలు చేపట్టాడు. జాగిర్దార్ వ్యవస్థ రద్దు చేసి రైతువారి వ్యవస్థను ఏర్పాటుచేశాడు. రైతులనుండి ఐదు వంతుల పంటలో రెండువంతులు మాత్రమే శిస్తుగా వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. కరువు కాటకాల సమయంలో రైతులకు ధాన్యం మరియు రుణాలు ఇచ్చే వాడు. దేశీయ కుటీర పరిశ్రమలు,వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా శివాజీ ఎన్నో మార్పులు చేశాడు.

శివాజీ హిందువు కాకపోతే భారతదేశం లౌకిక దేశంగా ఉండకపోయేది. భారతదేశం ఇస్లాం పరిపాలన లోకి పోయి మతరాజ్యంగా అవతరించేది. మత సమానత్వం లేకుండా దురహంకారము రాజ్యమేలేది. అశాంతి అనునిత్యం దేశంలో ప్రజ్వరిల్లేది.శివాజీ హిందూ కాబట్టే లౌకికవాది. శివాజీ హిందూ ధర్మ రక్షకుడు,అయినా అందరినీ సమాదరించారు. మత వివక్షత లేకుండా ఎంతో మంది ముస్లిములను సైనికాధికారులుగ పెట్టుకున్నాడు. శివాజీ హిందూ కాబట్టి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకున్నాడు.
శివాజీ హిందూ కాకుంటే మన దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండకపోయేది. స్వతంత్ర భావాలు లేకుండా పోయేవి. రాచరికపు పరిపాలన లో ఇంకా బానిసలుగా బతికే వాళ్ళం. న్యాయం, స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం అనే వాటికి స్థానం లేకుండా పోయేది. శివాజీ హిందువు కాకుంటే ఈ దేశంలో ఏ మతస్తులు బ్రతికి బట్ట కట్టే వారు కాదు. శివాజీ హిందూ కాబట్టే ప్రజాస్వామ్యవాది. శివాజీ హిందూ కాబట్టి మహిళల సంరక్షణ చేశాడు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు, ప్రజాస్వామ్య విధానంలో తన రాజ్యంలో న్యాయానికి పెద్దపీట వేశాడు, సమానత్వ సాధనకు వెట్టిచాకిరి నిషేధించాడు. యోగ్యత,సమర్థత గల వ్యక్తులని ఉద్యోగాల్లో నియమించేవాడు.

శివాజీ హిందువు కాకుంటే గణతంత్ర దేశంగా భారతదేశం ఉండకపోయేది. ఏ  వారసత్వ రాజరికపు పరిపాలనలోనో, నియంతల నియంత్రణలోనో దేశం ఉండేది. ప్రజలు ఎన్నుకునే పాలకులు ఉండక పోయేవారు.ప్రజలభాగస్వామ్యం లేకుండా పోయేది.శివాజీ హిందువు కాబట్టే గణతంత్ర వాది. తాను వారసత్వ చక్రవర్తి గా కాకుండా ప్రజల చేతనే ఛత్రపతిగా పాలన చేపట్టాడు. నిస్వార్థమైన భావన, పనిపట్ల అంకితభావం,మచ్చలేని వ్యక్తిత్వం వల్ల ఆదర్శ పరిపాలకుడు అయ్యాడు. అందువల్ల నేటికీ గణతంత్ర విలువలు దేశంలో నెలకొల్పబడ్డాయి.

హిందుత్వం ఒక బూచీ పదంగా వాడుతూ, అభివృద్ధికి వ్యతిరేఖం అనే ముద్రని నేడు కొందరు కుహనామేధావులు వేస్తున్నారు. హిందుత్వం సంకుచితమతం కాదు. విశాల మానవ వికాసధర్మం. వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతీయులందరి జీవన విధానం హిందుత్వం. చరిత్రలో హిందుత్వానికి ప్రతినిధిగా నిలిచి జన సంక్షేమ కార్యక్రమాల్ని అందించిన శివాజీ పాలన నేటికీ అనుసరణీయం. -సామల కిరణ్, -9949394688.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

1 Comments

  1. ఇది ఖచ్చితంగా అలోచించవలసిన విషయం. ఎందుకంటే, మహారాష్త్రలోని సరద్ పవర్ లాంటి కొందరు నాయకులు కొందరు, ఇటువంటి భావం వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు.

    ReplyDelete

thank you