హిందూ పద పాదషాహి ఛత్రపతి శివాజీ - About hindu smrajya diwas - megaminds

megaminds
0
సాధారణ వ్యక్తులను అసాధారణ మనుషులుగా తీర్చిదిద్ది వారిలో పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపిన అసమాన స్వాభిమాన చక్రవర్తి శివాజీ. ఆయన పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుక్ల త్రయోదశిని ‘హిందూ సామ్రాజ్య దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. శివాజీని 44వ ఏట కాశీకి చెందిన గాగాభట్టు అనే కాశీ పండితుడు ఛత్రపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. పండితులు, పామరులు ఆయనను ‘హిందూ పద పాదషాహి’గా కీర్తించారు. శతాబ్దాలు గడిచినా కేవలం శివాజీ పేరు తలిస్తే చాలు గుండె గుండెలో స్వాభిమాన జ్వాల రగులుతోంది. పోరాట స్ఫూర్తి ఉప్పొంగుతోంది. దేశం ధర్మంపట్ల ఆరాధన భావం జాగృతమవుతోంది. ఛత్రపతి శివాజీ ఈ జాతికి జీవనాడిని అందించాడు. ప్రతీ హిందువు ఛాతిని చాచి ముందుకు ఉరికేలా, ముష్కరమూకలు వెన్ను చూపి పారిపోయేలా చేశాడు. భారతీయులకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చాడు. ఆయన అగ్రపథాన నడుస్తూ ఉంటే విదేశీ మతాల దాడులను, కుట్రలు కుతాంత్రాలను ఎదుర్కొని ‘హిందుత్వం’ నిలిచింది. నీలాకాశంలో ‘భగవాధ్వజం’ సగర్వంగా రెపరెపలాడింది. పర్యవసానంగా దక్షిణాదిన విశాల హిందూసామ్రాజ్యం సుస్థిరంగా నెలకొంది. ఉత్తర భారతీయులకు మనోధైర్యాన్ని కల్పించింది. మొత్తానికి దేశవ్యాప్తంగా హిందుత్వం తిరిగి ప్రాణం పోసుకొంది.ఆనాడు శివాజీ చేసిన పోరాటమే నేడు సనాతాన ధర్మం నిలదొక్కుకునేందుకు కారణమైంది. పోరాటపటిమను రగిల్చే ఆయన జీవితం ప్రతి భారతీయుడికీ ఆదర్శం. స్వభావరీత్యా శివాజీ విరాగి. దాదాజీ ఖోండదేవ్‌, ‌భక్త తుకారాం, సమర్థ రామదాసుల సాహచర్యం వల్ల ఆయనలో వైరాగ్య భావనలు మొలకెత్తాయి. కానీ ముక్తి మార్గ సాధనకంటే సమాజ రక్షణకు, తన కర్తవ్య నిర్వహణకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చాడు. అదే సమయంలో స్వార్థం, అహంకారం, అధికార గర్వం వంటి వికృతులకు, దుర్లక్షణాలకు అతీతంగా కేవలం ధర్మ రక్షకుడుగా, ధర్మకర్తగానే పాలన సాగించాడు. స్వామి సమర్థ రామదాసు ప్రతినిధిగా రాజ్య పాలనను కొనసాగించాడు. నేటి పాలకులకు శివాజీలోని ఈ సద్గుణం ఆదర్శనీయం. రాగ ద్వేషాలకు, అవినీతి, అధికార వ్యామోహాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులుగా, ధర్మకర్తలుగా ప్రస్తుత పాలకులు వ్యవహరించాల్సి ఉంది. అందుకు ఛత్రపతి శివాజీ జీవితం అందరికి ఆదర్శప్రాయం. మార్గదర్శకం.
ఛత్రపతి శివాజీ సమర్థరామదాసు మార్గదర్శనంలో ఒకవైపు తనకంటే బలీయమైన సైన్యమున్న ఢిల్లీలోని మొగలాయిలతోనూ, మరోవైపు బీజపూర్‌ ‌సుల్తానులతోనూ తనదైన రీతిలో పోరాటం చేసి విజయం సాధించాడు. శివాజీ ఎంచుకొన్న గెరిల్లా పోరాట మార్గాన్ని ప్రపంచమంతా ప్రశంసించింది. ఆర్థికంగా, ఆయుధపరంగా శ్త•మంతమైన అమెరికా సాగించిన దాడిని ఎదుర్కొని ఆ పోరాటంలో దక్షిణ వియాత్నాంపై ఉత్తర వియాత్నాం విజయం సాధించింది. ఇరవై ఏళ్ల పాటు జరిగిన సుదీర్ఘపోరాటం వియత్నాంను సమైక్యపరించిది. ఆ విజయానికి ప్రేరణ ఛత్రపతి శివాజీ. ఆయన దేశ, కాల పరిస్థితులను అర్థం చేసుకుని దేశాన్ని రక్షించాడు. సమాజానికి సరియైన దిశా నిర్దేశం చేశాడు. ఆ కాలంలోనే శివాజీ ‘హిందూ సామ్రాజ్యాన్ని’ నిర్మించాడు. అప్పటి హిందూ రాజులకు భిన్నంగా సరికొత్త వ్యూహాలతో పక్కా ప్రణాళికలు రచించాడు. పగడ్భంది సైనిక వ్యవస్థ నిర్మాణం చేసి శత్రువులకు ముచ్చమటలు పట్టించాడు.
సాధారణ జీవనం సాగించే గిరిజనులు, మావళీలను మహత్కార్య సాధకులగా తయారు చేశాడు. తానాజీ మాల్సురే, సూర్యాజీ, నేతాజీ ఫాల్కర్‌, ‌యశాజీ కంక్‌, ‌మురారి భాజీ, హీరాజీ ఫర్జంద్‌ ‌వంటి అసమాన వీరులందరూ శివాజీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న సామాన్య వ్యక్తులే. సమాజం బాగుపడాలంటే సాధారణ సమాజ క్రియాశీలత, గుణగణాల పైననే ఆధారపడి ఉంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. ‘సాధారణ సమాజ దృష్టికోణం, నడవడిపైనే ఆ సమాజ మనుగడ ఆధారపడి ఉంటుందన్న’ సత్యాన్ని శివాజీ అర్థం చేసుకున్నాడు. అందుకే మట్టిలోంచి మాణిక్యాలను వెలికి తీశాడు.
అలెగ్జాండర్‌, ‌ఘోరీ, గజనీ, మొఘలాయీల కుయుక్తులకు తగినట్లుగా వ్యూహాలు పన్నడంలో ఆనాటి హిందూ రాజులు అనేకమంది విఫలమ య్యారు. కొందరు రాజులు తమ మితిమీరిన ధర్మాచరణ, వ్యక్తిగత నియమాలు, కీర్తి ప్రతిష్టలు ఆశించి, ‘సద్గుణ వికృతి’ కారణంగా పరాజయం పాలైతే… జయచంద్రుడు, అంబి వంటి రాజులు వ్యక్తిగత లక్ష్యాల సాధన కోసం శత్రువులకు సహకరించి జాతికి తీరని ద్రోహం చేశారు. కానీ శివాజీ శత్రువులతో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అవసరమైన చోట అనవసరమైన భేషజాలకు పోకుండా ఒకింత తగ్గి ప్రవర్తించాడు. ‘అనువుగానిచోట అధికుల మనరాదు’ అన్న సూక్తిని అనుసరించి తన తండ్రిని కాపాడుకోవడం కోసం మొఘలాయీలకి లేఖ వ్రాశాడు. ధనం అవసరమైనప్పుడు సూరత్‌ను కొల్లగొట్టి స్వరాజ్య నిర్మాణానికి ఉపయోగించాడు. ఆగ్రా కోట నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. ఈ సమయంలో మొఘలాయీ సేనలను భోల్తా కొట్టించడంలో శివాజీ చేతిలో తయారైన మరో తురుపు ముక్క భాజీ ప్రభు దేశపాండే. ఆయన చూపిన నేర్పు, తెగువ శివాజీ వ్యక్తి నిర్మాణ కౌశలానికి ఓ తార్కాణం. ఇలా ప్రతి సందర్భంలోనూ సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి తాను ఆపదల నుంచి గట్టెక్కుతూ తన లక్ష్యం దిశగా సాగిపోయాడు.
అప్పటివరకూ భారతీయ రాజులందరూ అనుసరించిన యుద్ధ నియమాలను విడచి గెరిల్లా యుద్ధ నీతిని అనుసరించాడు. శత్రువులపై మెరుపు దాడులు చేసాడు. తన గూఢచారుల ద్వారానే తాను శత్రువుకు భయపడుతున్నట్లుగా ప్రచారం చేయించేవాడు. ఏమరుపాటుగా ఉన్నప్పుడు శివాజీ శత్రువుపై మెరుపు దాడిచేసి దెబ్బ తీసేవాడు. అఫ్జల్‌ ‌ఖాన్‌ని సంహరించినప్పుడు, షయస్త ఖాన్‌ ‌వ్రేళ్లు తెగ్గోట్టినపుడు, ఆగ్రా కోట నుంచి తప్పించుకున్నప్పుడు శివాజీ ఈ వ్యూహాన్నే అనుసరించాడు. ఊహకందని రీతిలో మెరుపు వేగంతో శత్రువుపై విరుచుకుపడేవాడు. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలలో మెరుపు వేగం (త్వర) ఒకటి. దాన్ని శివాజీ పక్కాగా అమలు పరచాడు.
శివాజీ కొలువులో మహమ్మదీయులు కూడా పనిచేశారు. ఆయనకు ఆంతరంగికుడిగా, అంగరక్షకుడిగా వ్యవహరించిన మదారీ మెహతార్‌, ‌శివాజీ ఆగ్రా కోట నుంచి తప్పించుకున్న రోమాంఛిత ఘట్టంలో ప్రధాన పాత్ర పోషించాడు. శివాజీ ఫిరంగి దళాలకు అధిపతి కూడా ఒక మహమ్మదీయుడే. మతం కంటే మానవత్వం గొప్పదని, వ్యక్తిగత ఆశయాలకంటే జాతీయ భావాలు ముఖ్యమని ముస్లింలకు అర్థమయ్యేలా చెప్పడమే కాదు నిరూపించడంలోనూ శివాజీ విజయం సాధించాడు. ఇలా ఎందరో మహమ్మదీయులను ఆయన జాతీయ జీవన స్రవంతిలో ఐక్యం చేశాడు. వారి నరనరాన ఈ దేశంపట్ల ఆరాధనా భావాలను నింపాడు. మతం మారిన అనేకమంది హిందువులను తిరిగి స్వధర్మంలోకి పునరాగమనం చేయించాడు. మహమ్మద్‌ ‌కులీ ఖాన్‌ అనే యువకుడితో బంధుత్వం కలుపుకోని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చాడు. అతనే శివాజీకి ప్రధాన అనుచరుడు నేతాజీ ఫాల్కర్‌.
‌ప్రస్తుతం ఐఏఎస్‌, ఐపీఎస్‌ ‌శిక్షణ పొందే వ్యక్తులు క్రింది స్థాయి నుండి అన్ని స్థాయిలలో పని చేసినట్లుగా శివాజీకి కూడా అన్నింటిలోనూ ప్రవేశం ఉంది. కొన్నింటిని అవసరానికి తగ్గట్లుగా నేర్చుకొని అతి తక్కువకాలంలోనే వాటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. అందువల్ల వివిధ విభాగాల లోటుపాట్లు, లోపాలు క్షుణ్ణంగా తెలుసు. ఆయా విభాగాలను సమర్థవంతంగా నిర్వహించడంవచ్చు. కనుకనే ఆయన తన పాలనలో అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించాడు. సమర్థవంతమైన రాజుగా ప్రజల చేత మెప్పును పొందాడు. ప్రతి విషయాన్ని సునిశిత దృష్టితో పరిశీలించడం శివాజీ ప్రత్యేకత. కొత్తగా కోటలు నిర్మించినప్పుడు కోట గోడలు దాటి వచ్చిన వారికి బహుమతులు ఇస్తామంటూ వివిధ పరీక్షలు నిర్వహించేవాడు. తద్వారా కోటలను మరింతగా దృఢపరిచేవాడు. శత్రుదుర్భేద్యంగా మలిచేవాడు. హీరాకానీ అనే మహిళ రాజదర్బారులో ఉద్యోగిని. రోజువారి పనులు ముగిసిన తర్వాత అంతఃపురంలో సమయం మించిపోయింది. తన చంటి బిడ్డ పాల కోసం ఏడుస్తుంటాడని తలచి. బయటకు వెళ్లడం వీలుకాక రహస్యంగా కోట దాటి వెళ్లింది. ఆమెను సత్కరించి ఆ బురుజును మరింత పటిష్ట పరచాడు. ఆ బురుజు ఇప్పటికీ ‘హీరాకానీ బురుజు’ పేరుతో పిలవబడుతోంది.
శివాజీ తన రాజ్యాన్ని తమిళనాడులోని తంజావూరు, కర్ణాటకలోని జింజి వరకు విస్తరించాడు. అద్భుత రీతిలో నౌకాదళాన్ని నిర్మించాడు. శివాజీ పోరాట స్ఫూర్తి, అంకితభావం అందించిన ప్రేరణ కారణంగా ఆ తర్వాతకాలంలో పీష్వాలు దేశమంతటినీ ఒకే ఛత్రం కిందకి తెచ్చారు. అంతేకాదు ఆ తదనంతరం కూడా సాధారణ సమాజమే ఐక్యంగా నిలిచి తమను తాము రక్షించుకొన్నారు. హిందూ ధర్మ రక్షణ, ముస్లిం పాలన నుండి దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన సిక్కుల పదవ గురువు గురుగోవింద్‌ ‌సింగ్‌, అస్సాం వీరుడు లాచిద్‌ ‌బఢ్‌ ‌ఫుకాన్‌, ‌బుందేల్‌ ‌ఖండ్‌కు చెందిన రాజపుత్ర వీరుడు రాజా ఛత్రసాల్‌, ‌రాజస్థాన్‌ ‌వీరుడు దుర్గాదాస్‌ ‌రాథోడ్‌ ‌శివాజీని స్ఫూర్తిగా తీసుకొని స్వధర్మ రక్షణ కోసం పోరాటం చేశారు.
శివాజీలోని స్వాభిమానం, దేశభక్తి, సాహస ప్రవృత్తి లక్షణాలతో పుట్టిన ఆజన్మ దేశభక్తులు డాక్టర్‌ ‌హెడ్గేవార్‌. ఆయన జీవితమే డాక్టర్జీ సంకల్పానికి ప్రేరణ. శివాజీ అతి చిన్న వయసులో తన స్నేహితులతో కలసి తోరణ దుర్గాన్ని జయించిన సంఘటన బాల కేశవునికి స్ఫూర్తి. ఆ గుణాలను పుణికిపుచ్చుకొని ‘హిందూ సంఘటన’ అనే మహాకార్యాన్ని జాతికి అందించి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించాలని డాక్టర్జీ తీసుకొన్న నిర్ణయం నేడు ప్రపంచంలోనే హిందుత్వాన్ని బలమైన శక్తిగా నిలిపింది. శివాజీ జీవితమే ప్రేరణగా, ఆయన చూపిన మార్గమే బాటగా, హిందూ సంఘటన తద్వారా భారతదేశ పునర్వైభవ సాధన అనేది డాక్టర్జీ స్వప్పం. అది సాకారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ దిశగా నేడు భారతావని అడుగులు వేస్తోంది. చారిత్రాత్మకమైన ఈ దివ్యదృశ్యాన్ని మన కళ్లతో చూసే అదృష్టం లభించడం, భారతదేశాన్ని తిరిగి విశ్వ గురువుగా దర్శించే భాగ్యం పొందడం ఆనంద దాయకం. ఈ పనిలో మనమంతా భాగస్వాము లయ్యేందుకు కావల్సిన శక్తి సామర్థ్యాలు పెంచుకునేందుకు కృషి చేద్దాం. – దువ్వూరు యుగంధర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌,ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రాంత సహకార్యవాహ. (జాగృతి సౌజన్యం తో).
Hindu Samrajya Divas 2025, Shivaji Maharaj Coronation Day, RSS Hindu Samrajya Divas 2025, Shivaji Maharaj Legacy 2025, హిందూ సామ్రాజ్య దినోత్సవం, శివాజీ జీవిత చరిత్ర
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top