కేరళ ధీమంతురాలు ఉన్నియర్చ - unniyarcha life history in telugu


కేరళలోని ఉత్తర మలబారు ప్రాంతంలోని పాతకాలపు జానపద వీరగాథల్లో ఒక ధైర్యవంతు రాలైన యువతి కథ కనిపిస్తుంది. ఆమె క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందిన ఉన్నియర్చ. తన గ్రామానికి చెందిన మహిళలు అపహరణకు గురి కాకుండా రక్షించిన ధీమంతురాలామె. చివరకు మత సామరస్యం నెలకొనేలా చేసింది.
అరొమల్‌ చేకవర్‌ అనే అజేయ యోధుడికి స్వయానా సోదరి ఉన్నియర్చ. సోదరుడైన అరొమల్‌ చేకవర్‌ కాకలు తీరిన ఖడ్గయోధుడు. అయితే ఉన్నియర్చ వివాహం కున్హిరామన్‌ అనే పిరికివాడితో జరిగింది.
ఒక రోజున ఉన్నియర్చ తన భర్తతో కలసి తమ గ్రామానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న అయ్యప్ప దేవాలయం సందర్శించి రావాలని భావించింది. కాని ఆమె అత్త అందుకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఉన్నియర్చ నిరుత్సాహ పడలేదు. భర్తతో కలసి ఆలయానికి వెళ్ళి రావడానికి బెదిరిపోలేదు. చేతిలో కత్తి పట్టుకొని భర్తతో కలసి ఆలయానికి పయనమైంది. ఇది ఇలా ఉండగా, చొణకులనే తెగకు నాయకుడు ఉన్నియర్చ అందం చూసి మోహవివశుడై పోయాడు. బలవంతాన అయినా సరే ఆమెను అపహరించుకు తీసుకు రావల్సిందిగా అతను తన మనుషులను పంపాడు.
అయితే, ఉన్నియర్చ లొంగలేదు. ధైర్యంగా కత్తి దూసి పోరాడి దుండగులలో కొంతమందిని హతమార్చింది. బతికుంటే బలుసాకు తినవచ్చని మిగిలిన వాళ్ళంతా పారిపోయారు. చివరకు ఆ చొణకుల తెగ నాయకుడే స్వయంగా వచ్చాడు. ఉన్నియర్చ వేరెవరో కాదు, కాకలు తీరిన ఖడ్గయోధుడూ, తన గురువూ అయిన అరొమల్‌ చేకవర్‌కు సోదరి అని గ్రహించాడు. వెంటనే అతను తన తప్పు తెలుసుకొని ఉన్నియర్చనూ, ఆమె సోదరుణ్ణి క్షమాభిక్ష కోరాడు. ఉన్నియర్చ మాత్రం పట్టు వదలలేదు. తనతో యుద్ధం చేయాల్సిందిగా అతన్ని, అతని మనుషులనూ సవాలు చేసింది. అయితే, ఆ ప్రాంతపు పాలకుడు వచ్చి, యుద్ధం విరమించాల్సిందిగా ఉన్నియర్చను కోరాల్సి వచ్చింది. చివరకు ఆ ధీమంతురాలు ఎత్తిన కత్తి దించింది. తాను కానీ, తన మనుషులు కానీ భవిష్యత్తులో మరి ఏ ఇతర స్త్రీ వంక కన్నెత్తి చూడమనీ, వారిని బలాత్కరించబోమనీ పాలకుడు వాగ్దానం చేశాడు.
పిరికివాణ్ణి భర్తగా పొందినప్పటికీ, ధైర్యంతో ఎంతోమందిని ఎదుర్కొని, ఆడది ఆదిశక్తి అని నిరూపించిన ఉన్నియర్చ గురించి ఇప్పటికీ కేరళలో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.
– భారతీయ ఆదర్శ నారీమణులు పుస్తకం నుంచి సేకరణ.

Post a Comment

0 Comments