చుండ్రు సమస్య నుండి పరిష్కారాలు - Solutions from dandruff problem - health tips in telugu

megaminds
0
సాధారణంగా మనలో చాలామంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. అందులోనూ ప్రస్తుత కాలుష్య వాతావరణం, వేడి వల్ల జట్టు రాలిపోవడం ఒకటైతే మరొక ప్రధాన సమస్య చుండ్రు. కాలం ఏదైనా సరే చుండ్రు సమస్య తలెత్తడం చాలా సహజం. దీనివల్ల చిరాకు కలగడమే కాదు జట్టు ఊడడానికి కూడా ప్రధాన కారణమవు తుంది.
చుండ్రు అనేక కారణాల వల్ల వస్తుంది. దీంతో తలపై ఉన్న చర్మం పొట్టుగా మారి జుట్టు రాలుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పోషణ లోపం వంటి అనేక కారణాలు చుండ్రు రావడానికి కారణమవుతాయి.
అలాంటప్పుడు చుండ్రును తగ్గించుకొని, జట్టుకి పోషణని ఇవ్వాలంటే హెయిర్‌ ప్యాక్‌లు వేసుకోవడం మంచి పరిష్కారం. ఇప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌ ప్యాకులు జుట్టుకు సహజత్వాన్ని ఇవ్వకపోగా మరింత పాడుచేస్తాయి. అలాంటప్పుడు ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో జట్టుకు అందాన్ని తీసుకురావచ్చు. మరి ఆ హెయిర్‌ ప్యాక్‌లు ఏవిధంగా తయారు చేసుకోవాలి. వాటితో చుండ్రు సమస్యకు ఎలా చెక్‌ పెట్టవచ్చో తెలుసుకుందాం.
మందారంతో..
మందార పూలు, ఆకులలో ఉండే గుణాలు జట్టు సమస్యలను తగ్గించడంలో ఎంత గానో ఉపయోగ పడతాయి. ఎండబెట్టి పొడిచేసిన మందార పువ్వులు, ఆకుల పొడిని హెన్నా పొడి (గోరింటాకు పొడి) లో కలిపాలి. ఇంకా, ఆ మిశ్రమానికి కొద్దిగా మెంతుల పొడి, ఉసిరి పొడిని కూడా కలపాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పుల్లటి పెరుగును వేసుకుంటూ ఆ మిశ్రమాన్ని చిక్కగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి మొదలు వరకు పట్టించాలి. ఒకగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే ఈ మిశ్రమం కేవలం చుండ్రు సమస్య తగ్గించడమే కాదు జట్టు రాలడం అరికట్టడం లోనూ దోహదం చేస్తుంది.
మెంతులతో..
మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు అందానికి కూడా దోహదపడతాయి. అందుకే వీటిని కొన్ని హెయిర్‌ ప్యాక్‌లలో ప్రత్యేకంగా ఉపయో గిస్తారు. మెంతులతో చుండ్రును ఎలా తగ్గించుకో వాలంటే.. ముందుగా హెన్నాపొడి (గోరింటాకు పొడి)లో రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం, రెండుటేబుల్‌ స్పూన్ల పెరుగుతో పాటు ఒక టీస్పూన్‌ వెనిగర్‌, ఆలివ్‌ నూనె, మెంతిపొడి కూడా వేసి బాగా కలుపుకొని ఒక రాత్రంతా ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి రెండు మూడు గంటల పాటు ఆరనివ్వాలి. తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.
మిరియాలతో కూడా..
దగ్గుకు మంచి మందు మిరియాలని మీకు తెలుసు. కానీ కేవలం దానికే కాదు చుండ్రుకు కూడా మిరియాలను ఉపయోగించి చెక్‌ పెట్టేయచ్చు. కుదుళ్లలోని ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు మిరియాలు చక్కటి పరిష్కారం.
మిరియాలతో ప్యాక్‌ చేయాలంటే హెన్నాపొడిలో కొంచెం మిరియాలపొడి కలిపి కొద్దిగా కొత్తిమీర పేస్ట్‌ వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే సరి. ఇలా తరుచూ చేయడం వల్ల చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.
పెరుగు, నిమ్మరసంతో..
హెన్నా పొడిలో ఒక రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసుకొని తగినంత పెరుగు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తల కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఎండిన తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో స్నానం చేయాలి. ఈ చిట్కాను వారం లేదా కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా చేయడం వల్ల చుండ్రు సమస్య చాలా త్వరగా తగ్గిపోతుంది.
నూనెతో కూడా..
కొబ్బరినూనె, ఆముదంలను కొద్దిగా సమపాళ్లలో తీసుకుని సన్నని మంటపై వేడి చేయాలి. అనంతరం చల్లారాక ఆ నూనెను వెంట్రుకలకు రాయాలి. ఇలా వారంలో 3, 4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అదేవిధంగా కొబ్బరినూనె, వేప నూనెలను ఉపయోగించి తయారు చేసిన హెయిర్‌ ఆయిల్‌ను వాడితే మంచిది. దీంతో చుండ్రు పోవడమే కాదు, జుట్టుకు పోషణ అందుతుంది. తద్వారా శిరోజాలు దఢంగా, ఒత్తుగా పెరుగుతాయి కూడా. వెంట్రుకలు కాంతివంతంగా మారుతాయి.
ఇంకా ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో టీ ట్రీ ఆయిల్‌ ఒక టీస్పూన్‌ కలపాలి. బాగా కలిపాక ఈ నీటితో జుట్టుకి మర్దన చేయాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధించదు.
ఆవనూనె కూడా చుండ్రును పోగొట్టడంలో ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఆవనూనె తీసుకొని వేడిచేయాలి. ఆ నూనె బాగా కాగి దాని నుంచి పొగ వెలువడుతున్న సమయానికి స్టౌ కట్టేసి అందులో కొన్ని గోరింటాకు ఆకులు, మెంతులు వేయాలి. ఆ నూనె పూర్తిగా చల్లారాక వడకట్టుకొని భద్రపరుచు కోవాలి. తలస్నానం చేసే గంటముందు ఆ నూనెను కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసుకొని గాఢత తక్కువగా ఉండే షాంపూతో స్నానం చేయాలి. ఇలా తరుచూ చేస్తే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.
సేకరణ: జాగృతి పాత వారపత్రిక నుండి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia




Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top