పరమ శివభక్తురాలు రాణీ రుద్రమదేవి - About rani rudrama devi in telugu


కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు తెలుగునాట ప్రసిద్ధుడు. ఆయనకు రుద్రాంబ, గణపాంబ అని ఇద్దరు కుమార్తెలు. రుద్రాంబ రుద్రమదేవిగా సుపరిచితురాలు. గణపతి దేవుడు పెద్ద కూతురైన రుద్రమదేవిని తన వారసు రాలుగా గుర్తించాడు. ఆమెకు విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా, రాజ్య పాలనకు సంబంధించిన అన్ని అంశాల్లోను శిక్షణ ఇప్పించాడు.
తండ్రి మరణించడంతో క్రీ.శ.1262లో రుద్రమదేవి సింహాసనాన్ని అధిష్ఠించింది. రాజ్యం లోని దక్షిణ ప్రాంతంలోని కొందరు రుద్రమదేవిపై తిరుగుబాటు చేశారు. అయితే ఆ తిరుగుబాటు దారులను ఆమె విజయవంతంగా అణచివేసింది. దాంతో ఆమె పరిపాలనలోని మిగిలిన కాలంలో రాజ్యమంతటా శాంతి భద్రతలు నెలకొన్నాయి.
వీరభద్రుడనే క్షత్రియ రాకుమారుడిని రుద్రమ దేవి వివాహం చేసుకొంది. తన పాలనలో ప్రజల అభివృద్ధి కోసం ఆమె ఎంతో తీవ్రంగా కృషి చేసింది. రైతులు సంతోషంగా ఉండాలని కాలువలు, చెరువులు, బావులు తవ్వించింది. పరిశ్రమలను, వాణిజ్యాన్ని బాగా ప్రోత్సహించింది. వైద్యశాలలు నిర్మించింది. ధార్మిక పీఠాలకు భూములను దానం చేసింది. విద్యాధ్యయనాన్ని ప్రోత్సహించడం కోసం పండితులకు నివాసాలు ఏర్పాటు చేసింది. ప్రముఖ వెనీస్‌ యాత్రికుడు మార్కోపోలో రుద్రమదేవి పరిపాలనా కాలంలో ఆ రాజ్యం మీదుగా ప్రయాణిం చాడు. రుద్రమదేవి కాలంలో వాణిజ్యం, వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాయని మార్కోపోలో తన రచనలలో పేర్కొన్నాడు. ఆమె పరిపాలన, ధైర్య సాహసాలను కొనియాడాడు. రుద్రమదేవి పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా, సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పోలో పేర్కొన్నాడు.
రుద్రమదేవి పరమ శివభక్తురాలు. పాశుపత వర్గానికి ఆమె రాజ్యం సజీవ కేంద్రంగా నిలిచింది. రుద్రమదేవికి ఇతర మతాలు, వర్గాల పట్ల అపార మైన సహనం ఉండేది. మతపరమైన కార్యక్రమాల కోసం ఆమె ఎన్నో దానధర్మాలు చేసేది. కృష్ణానది ఒడ్డున ఉన్న మందడం అనే గ్రామంలో రుద్రమదేవి శివాలయాన్ని నిర్మించింది. ఆ ఆలయం చుట్టూ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కుల, మత విచక్షణ లేకుండా అందరినీ ఆదరించి అన్నం పెట్టే ధర్మసత్రాలు వెలిశాయి.
రుద్రమదేవి తన శక్తిసామర్థ్యాలతో రాజ్యంలోని ప్రతి ఒక్కరిని మెప్పించి, పాలన వ్యవహారాలను దిగ్విజయంగా నిర్వహించింది. సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలనను ప్రజలకు అందించింది. మన దేశంలో మహిళా పాలకులు చాలా అరుదు. ఆ రోజుల్లో ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించింది. అయితే ప్రభువర్గాలకు చెందిన వారు అక్కడ స్త్రీ పరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుద ముట్టిం చారు. ఆ ప్రమాదాన్ని పసిగట్టి నాటి శాసనాలలో రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా కీర్తించారు. రుద్రమదేవి, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకుంది.
రాణి రుద్రమదేవిని ప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ఇలా అభివర్ణించారు. ‘తెలుగు వారిని పాలించిన దేశ పరిపాలకులలో రుద్రమదేవి నిస్సందేహంగా మహాఘనత చెందిన వ్యక్తి. రాజధర్మ విధులను ఆమె నిర్వహించిన తీరుకు ఆమె తండ్రి రుద్రమదేవిని రుద్రదేవుడుగా పేర్కొన్నాడు. ఆ రోజుల్లో ప్రజలు రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని పిలుచుకునేవారు. దేశ పరిపాలనలో ఆమె చైతన్యవంతమైన పాత్ర వహించింది. ఆమె పాలనలో తరుచూ యుద్ధాల అలజడి కలిగినా ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. దానికి కారణం రుద్రమదేవే’ అన్నారు.
రుద్రమదేవి మరణ శాసనం: ఉస్మానియా యూనివర్శిటీలో తెలుగు రీసెర్చ్‌ స్కాలర్‌గా పనిచేస్తున్న సైదులు కాకతీయ రుద్రమదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించాడు. ఇందులో భాగంగానే మునుగోడులో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖ అధికారుల సహాయంతో వెలికి తీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తిం చాడు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే 1289వ సంవత్సరం, నవంబరు 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా ఆ శాసనంపై లిఖించి ఉన్నట్లు వెల్లడైంది.

Post a Comment

0 Comments