నర్సిమెహతా - about Narsinh Mehta

నర్సిమెహతా : వీరు 15 వ శతాబ్దానికి చెందిన వారు. కఠియవాడ ప్రాంతంలోని జునాగఢ్ రాజ్యంలో వారు జన్మించారు. వీరి బాల్యంలోనే తల్లిదండ్రుల దివంగతులైనారు. ఇతని పిన తండ్రి కుమారుడు ఈయనను పెంచి పెద్ద చేశాడు. కృష్ణభక్తి కలిగి ఉండటమే ఈయన జీవన ధ్యేయం. ఆదర్శం కూడా, రాజస్థాన్ ప్రాంతంలోని భక్త మీరాబాయి వీరికి సమకాలికుడు. పరస్పర పరిచయం కూడా ఉంది. నర్సిమెహతా రాసిన కవిత్వం ఎంతో రసభరితంగా ఉంటుంది. విష్ణు భక్తులకుఅత్యంత ప్రీతిపాత్రమైన
గుజరాతీయులు నర్సీ మెహతాను తమ భాషలో ‘ఆదికవి’గా భావిస్తారు. ఆయన భగవచ్ఛింతన, తన స్వామి గుణగానం జీవితంగా గడిపిన నిరాడంబర భక్తాగ్రణ్యుడు. ఆయన కీర్తనలు వివిధ భాషల్లోకి అనువాదమై భక్తజనుల్ని అలరిస్తున్నాయి. అవి భక్త వాఙ్మయంలో మణిపూసలు.
నర్సీ భగత్‌ అనే నామాంతరం గల నర్సీ మెహతా 1414లో నేటి గుజరాత్‌లోని జునాగఢ్‌ రాజ్యంలో జన్మించాడు. అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన నర్సీ నాన్నమ్మ దగ్గర పెరిగాడు. ఎనిమిదేళ్ల వరకు మాటలు రాలేదు. వారి గ్రామానికి వచ్చిన ఒక సాధువు వద్దకు తీసుకువెళ్తే ‘రాధాగోవింద’ అనమన్నాడు. ఆ సాధువు నర్సీ శిరస్సును స్పృశించగానే ఆ మాటల్ని పలికాడు. అన్న బన్సీధర్‌ పోషణలో ఉండే నర్సీ మెహతా వదిన దురితగౌరి వల్ల చాలా కష్టాలు అనుభవించాడు.
భార్యాపిల్లల్ని పోషించడానికి కాపలాదారుగా పనిచేసేవాడు. ఒకనాడు సంకీర్తనలో ధర్మనిర్వహణను మరచిపోతే, కృష్ణుడు భక్తుడి స్థానంలో విధి నిర్వహించాడట. నర్సీ ఏ ఉద్యోగమూ సరిగ్గా చేయలేకపోయాడు. సంకీర్తనే అతడి జీవితం.
నర్సీ మెహతా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెబుతారు. అన్నావదినల తిరస్కారం భరించలేక అడవికి వెళ్తే అక్కడ ధ్యానంలో ఉండగా శివుడు ప్రత్యక్షమై అతణ్ని గోకుల ధామానికి తీసుకువెళ్లి రాధాకృష్ణుల రాసలీలా వైభవం చూపించాడట. కూతురికి వివాహం జరిపించాక సారె పెట్టలేదని వియ్యాలవారు పరిహసిస్తుంటే భగవంతుణ్ని కీర్తించాడట. సాక్షాత్తు పాండురంగడే బండి నిండా సరకులు వేసుకువచ్చి వియ్యాలవారికి అందజేశాడంటారు.
నర్సీ మెహతా అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చే గీతం ‘వైష్ణవ జనతో తెనె కహియె...’ ఆ సంకీర్తన సందేశాత్మకమైనది. నిజమైన వైష్ణవుడు ఎలా ఉండాలో ఈ పాటలో నర్సీ మెహతా బోధించాడు. ‘పరుల దుఃఖాన్ని చూసి వ్యధ చెందేవాడు నిజమైన వైష్ణవుడు. తాను చేస్తున్నాననే భావన లేకుండా పరుల దుఃఖాన్ని నివారించడానికి ప్రయత్నించేవాడే విష్ణుభక్తుడు. అతడు అందరిలోనూ పరమాత్మను సందర్శిస్తాడు. ఎవరినీ నిందించడు. నిరాకరించడు. మనసు, మాట, చేత పరిశుద్ధంగా ఉంటాయి. అతణ్ని కన్న తల్లి ధన్యురాలు. నిజమైన వైష్ణవుడిది సమదృష్టి, వాంఛారహితుడు. పరస్త్రీలలో తల్లిని దర్శిస్తాడు. అసత్యం పలకడు. ఇతరుల ధనానికి ఆశపడడు. మాయామోహాలు అతడి దరిచేరవు. దృఢవైరాగ్యం అతణ్ని ఆవహించి ఉంటుంది. మనసులో సదా రామనామమే కదులుతుంటుంది. దేహంలో సకలతీర్థాలూ వెలసి ఉంటాయి. లోభికాడు. కపటి కానేకాదు. కామక్రోధాదులకు అందడు. అటువంటి భాగవతోత్తముడి దర్శనం పొందిన వ్యక్తే కర్మవలయం నుంచి విడివడి తరిస్తాడు!
వీరి జీవనంలో భగవత్ కృప మరియు భగవత్భక్తి సంబంధించిన ఆశ్చర్య జనకమైన సంఘటనలు, మహిమలు ఎన్నో. ఇతడు రాసిన భజన పదాలలో మూఢభక్తి ఎంతో భావాత్మకంగా అభివ్యక్తీకరింపబడింది. గుజరాత్ ప్రాంతం లో నర్సిమెహతా భక్తి కవిత్వపు ప్రభావం గాఢంగా ఉంది. నర్సిమెహతా భారత దేశపు భక్త కవులలో అమూల్య రత్నం వంటి వాడు.


జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

0 Comments