ఆదర్శహిందూ సమాజానికి నాంది గురుపూజోత్సవం - guru purnima telugu speech

megaminds
0
గురుపూజోత్సవం

గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు.. ఈ పర్వదినం విశిష్ఠత ఏమిటి

గురువును భగవంతునికన్నా ఉన్నతంగా భావించే దేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే అది హిందూదేశం మాత్రమే. ప్రపంచ దేశాలలో ఎక్కడా గురువు అనే భావనే ఉండదు. గురువు మనలోని మాలిన్యాలను తొలగించి వ్యక్తిగా తయారుచేస్తారు. గురువు అంటే చీకటిలో నుండి వెలుతురులోకి తీసుకువచ్చేవాడని నిర్వచిస్తూ ఉంటారు. అజ్ఞానులను జ్ఞానమార్గం వైపు నడిపించి, మార్చగలిగేది గురువు మాత్రమే. అందుకే గురువును ”గురుబ్రహ్మః-గురువిష్ణుః-గురుర్దేవో మహేశ్వరః” అంటూ కీర్తిస్తుంటారు. గురువు కొరకు పరితపిస్తూ అన్వేషిస్తేనే సద్గురువు లభిస్తాడు. గురువును భక్తితో పూజించాలి. మనలో మనకు తెలియకుండా నిద్రాణమై ఉన్న అహాన్ని తొలగించేది గురువు మాత్రమే.
జ్ఞానమార్గం చూపించే గురువు
ఒకరోజు ఒక మహారాజు సాయం సంధ్యా సమయంలో నదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ తన గురుదేవులు కౌపీనమునకు పడిన చిల్లులను సూదీదారంతో కుట్టుకొనుట చూసాడు. గురువును సమీపించి, గురుదేవా ”మీరు నా గురువులు, మీరు ఇలా కౌపీనము కుట్టుకొనుట బాగులేదు. కౌపీనము అంతా చిల్లులమయంగా ఉంది” అన్నాడు. గురువుగారు ”అయితే?” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ”నేను మహా రాజును, మీకు ఏమి కావాలన్నా ఇస్తాను” అని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ గురువుగారు రాజులో ఉన్న అహాన్ని మాటల ద్వారా గ్రహించారు. ఆయన ”రాజా నువ్వు ఏమైనా ఇవ్వ గలవా!” అని ప్రశ్నించారు. ”ఓ! ఇస్తాను” అని గర్వంగా అన్నాడు రాజు. గురువు తన చేతిలో ఉన్న సూదిని నదిలోకి విసిరి దానిని తీసుకురమ్మన్నాడు. రాజు నివ్వెరపోయాడు. రాజుకు తనలోని అజ్ఞానం అర్థమైంది. గురువు పాదాలకు సవినయంగా నమస్కరించి అక్కడ నుండి నిష్క్రమించాడు.
గురువు భగవంతునికన్నా శక్తిమంతుడు. గురువు కోరికలను తీర్చడు. శిష్యునికి ఏది అవసరమో దానిని ఇస్తాడు. ఒక మహానుభావుడు గురువును గూర్చి చెబుతూ ”గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కాని వర్షంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. గురువు గొడుగులాంటి వాడు” అని అన్నాడు. కబీరు తన దోహాలో ”గురువు, గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు గురువుకు నమస్కారం చేస్తా”నని వ్రాసాడు. కారణం గోవిందుని వర్ణించి చెప్పినది గురువే కాబట్టి. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు తదితరు లందరూ గురువులవద్ద విద్యనభ్యసించినవారే.
మన గురు పరంపర
ఆషాఢ పూర్ణిమను గురుపూజా ఉత్సవంగా నిర్వహిస్తుంటాము. ఆ రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. మన సమాజం వ్యాసమహర్షిని గురువుగా స్వీకరించింది. అంతకుముందు నుండి ఎంతోమంది గురుశ్రేష్ఠులుండగా వ్యాసమహర్షినే గురువుగా ఎందుకు స్వీకరించారనే అనుమానం రాక తప్పదు. ఋక్కులు, యజస్సులన్నిటిని కలిపి యజుస్సంహితగా, సామాలన్ని కలిపి సామ సంహితగా, అధర్వం మంత్రాలన్ని కలిపి అధర్వ సంహితగా తయారు చేశారు. వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించి వేదాధ్యయనం సులభతరం చేసి వ్యాసమహర్షి వేదవ్యాసుడిగా కీర్తింపబడ్డాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా 18 పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత, భాగవతాది గ్రంథాలు తదితరాలు వ్రాసిన వ్యాసభగవానుని గురువుగా స్వీకరించింది ఈ సమాజం. గీతాకారుని ”కృష్ణం వందే జగద్గురుం” అని కీర్తిస్తున్నది మన సమాజం. అనంతరం అనేకమంది గురువులుద్భవించారు. వేదాలకు భాష్యం వ్రాసి, అస్పృశ్యుడిలో భగవద్దర్శనం పొందిన ఆదిశంకరులను, ”న జాతిః కారణంలోకే గుణాః హేతవః (లోకకళ్యాణానికి కులం కారణం కారాదు, గుణమే ప్రధానమని)” అని ప్రవచించి ఆచరించిన శ్రీ రామానుజులను గురువుగా స్వీకరించింది.
”సదాచార సంపన్న వ్యాస శంకర మధ్యమాం, అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరమ్‌” అని గురువును నిత్యం స్మరిస్తూ ఉంటాము. గతంలోనే కాదు నేటికి గురువులు మన కళ్ళముందే ఉన్నారు. పూజ్య రమణమహర్షిని సాక్షాత్తు అరుణాచలేశ్వరుని అవతారంగా భావిస్తారు. వారు భౌతికంగా లేకపోయినా నేటికీ జ్ఞానమార్గాన్ని చూపిస్తూనే ఉన్నారు. సద్గురు శివానందమూర్తిగారి ఆశ్రమానికి వెళ్ళి వారి సమక్షంలో కూర్చుంటే చాలట సందేహాలన్ని తీరుతా యంటారు వారి శిష్యులు. తెనాలి గురువుగారు ”నిన్ను ఎవరైన ముట్టుకుంటే నువ్వు మైలపడటం కాదు, నిన్ను ముట్టుకొన్నవారు పునీతులు కావాలని” చెబుతుంటారు. ఈ విధంగా ఎందరో గురువులు, వ్యక్తులకు, సమాజానికి మార్గదర్శకులుగా నేటికీ ఉన్నారు.
కాషాయవర్ణం త్యాగానికి, సమర్పణకు ప్రతీక. సమాజహితమే తమ హితంగా భావించిన సన్యాసులు ధరించేది కాషాయాంబరాలే. అగ్ని తనను తాను దహించుకొంటూ లోకానికి కళ్యాణకారకు డవుతున్నాడు. యాగాగ్ని కాషాయవర్ణంలోనే ఉంటుంది. సూర్యభగవానుడు ఉదాయస్తమయాలలో కాషాయవర్ణంలోనే దర్శనమిస్తాడు.
మన దేశ చరిత్రకు సాక్షి కాషాయ ధ్వజమే. దీనిని భగవాధ్వజం అని కూడా అంటారు. కోట్లాది మంది ప్రజలు అనేక సందర్భాలలో ప్రాణాలను తృణప్రాయాలుగా భావించి ఆత్మార్పణ చేశారు. భగవాధ్వజాన్ని చూస్తే వారి బలిదానాలు గుర్తుకు వస్తాయి. ఈ దేశాన్ని ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమించిన శిల్పులు గుర్తుకు వస్తారు. భగవాధ్వజాన్ని చూడగానే మన ప్రాచీన ఋషిపరంపరతోపాటు చరకుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు వంటి మహానుభావులు; సమర్థ రామదాసు, చాణుక్యుడు, రామకృష్ణ పరమహంస తదితర గురుపరంపర గుర్తుకు వస్తుంది. భగవాధ్వ జాన్ని దర్శిస్తే ఇటువంటి ఎందరో మహానుభావులు గుర్తుకు వస్తారు. అందుకే అన్నారు ”భగవాధ్వజం ఈ దేశపు చరిత్ర, ఇతిహాసాలకు సాక్షి” అని.
సంస్కృతి ఆరాధన ద్వారా సమాజం సర్వాంగీణ వికాసం సాధించాలనేది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆకాంక్ష. మన ధర్మం, సంస్కృతి నలుదిశలా విస్తరించాలి. భారతమాత జగద్గురు స్థానంలో ప్రతిష్టితమవ్వాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి భగవాధ్వజ ఛాయలలోనే లభిస్తుంది. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం భగవాధ్వజమైన కాషాయ ధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. ప్రతి గురుపూర్ణిమ నాడు గురువైన భగవాధ్వజాన్ని పూజించడం తమ ధర్మంగా భావిస్తారు సంఘ స్వయంసేవకులు. గురుపూజోత్సవం ఆదర్శ హిందూ సమాజ నిర్మాణానికి నాంది కావాలని కోరుకుంటారు. – తులసి సూర్యప్రకాశ్‌
Guru Purnima (గురుపౌర్ణమి) (గురు పౌర్ణమి)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

megaminds

Guru Purnima Significance in Telugu, గురు పౌర్ణమి విశిష్టత, గురు పౌర్ణమి శుభాకాంక్షలు, Guru Purnima Telugu, Guru Purnima 2025 quotes Telugu, megaminds, గురు పౌర్ణమి 2025, Vyasa Purnima 2025, Ashada Purnima 2025


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top